telugu language day
-
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష తనదైన ముద్ర
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష గొప్పదని.. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన భాష అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తెలుగు ప్రజలందరికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదని.. యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం అని పేర్కొన్నారు. తెలుగు ప్రాముఖ్యతను, విశిష్టతను మరింతగా ఇనుమడింపజేయడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నానని అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే తెలుగు వారందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. -
గిడుగు వెంకట రామమూర్తి కృషి మరిచిపోలేనిది: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరిచిపోలేనిది. గిడుగు గారి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారాయన.వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరిచిపోలేనిది. నేడు గిడుగు గారి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/uT6XUpKmqQ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2024 -
అంగరంగవైభవంగా సౌదీలో సాటా తెలుగు దినోత్సవం
రియాధ్: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో అంగరంగ వైభవంగా తెలుగు దినోత్సవం నిర్వహించారు. సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) అధ్వర్యంలో తెలుగు దినోత్సవం, సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారతీయ ఎంబసీ డిచార్జి (ఉప రాయబారి) అబూ మాథన్ జార్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉంటూ తెలుగు ప్రజలు తమ సంస్కృతిక పరిరక్షణ కోసం తెలుగు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని భారతీయ ఎంబసీ సెకండ్ సెక్రటరీ మోయిన్ అఖ్తర్ అన్నారు. ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఎడారిలో ఆపద సమయంలో ఆపన్న హస్తంగా సాటా పనిచేస్తుందని ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రవాసీయులకు సేవలందించె ప్రముఖ మలయాళీ సామాజిక సేవకులైన నాస్, షిహాబ్, సిద్ధీఖ్ తువూర్లతో పాటు మరికొందరిని అభినందిస్తూ ప్రత్యేకంగా వారికి శాలువాలు కప్పి సన్మానించారు. -
వేడుకగా హంస పురస్కారాల ప్రదానం
రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్.అబ్దుల్ అజీజ్ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్ జడా సుబ్బారావు (అసిస్టెంట్ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్ హెచ్ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు. వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కె. సుధాకర్ ప్రసంగించారు. -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి.. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. గిడుగు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’’ అని సీఎం ట్వీటర్లో పేర్కొన్నారు. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 చదవండి: సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం -
23 నుంచి తెలుగు భాషా వారోత్సవాలు: విజయబాబు
సాక్షి, అమరావతి: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తాం. వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహిసామని పేర్కొన్నారు. సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి సముచిత స్థాయిలో సత్కరిస్తాం. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ వారోత్సవాలు ప్రారంభమౌతాయి. 29 వ తేదీ మద్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయి. 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో, 25వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్‌లో, సాయంత్రం 4.00 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో, 27 వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విజయవాడ ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలో, 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని విజయబాబు పేర్కొన్నారు. -
నిఘంటు నిర్మాణంలో కొత్త పోకడలు
మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. పాల పాకెట్టు, పాల వ్యాను– ఇలా వాడమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ఇక పత్రికల్లో సరేసరి. ఆంబులెన్స్ సేవలు, అకౌంట్ బదిలీ, కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు– ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న మిశ్రమ పదాలను వివరిస్తుంది సరికొత్త ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’. ‘‘నిఘంటు రచన మతి చెడిన వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ‘నా బొందో’ అంటూ కేంద్రీకరించి మరీ జరగాల్సిన పని. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కానీ, ఒకటి మాత్రం నిజం. అప్పుడప్పుడూ ఈ వృత్తి, నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది’’. – ఫ్రాన్స్ సాహిత్య చరిత్రను, ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘంటువును ఎలా నిర్మించాను’ అన్న అత్యుత్తమ గ్రంథాన్ని రచించిన ఎమిలీ లిత్రే. ఇప్పుడు మనం చర్చించుకునేది ఒక్కో అక్షరానికే కాదు, ఒక్కో పదానికి ఉన్న భిన్నార్థాలను గురించే కాదు, బహుశా ఇతర భాషా నిఘంటువులలో కూడా రాని, ఒక్క తెలుగులో మాత్రమే ఇటీవల వెలువడిన తొలి ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’ గురించి. పత్రికా భాషా నిఘంటువులు అనేక భాషల్లో ఎన్నో ఉండవచ్చు. కానీ, రెండు భాషలతో కూడుకున్న మిశ్ర సమాస నిఘంటువులు మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రత్యేక నిఘంటువును విద్యారంగంలో, బోధనా రంగంలో ఉస్మానియా, హైదరాబాద్, ద్రవిడియన్ విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా గడించిన అనుభవంతో ఆచార్య పులికొండ సుబ్బాచారి రూపొందించారు. పత్రికలు నిత్యం వాడుతూ పాఠకులకు అందించే కొత్త కొత్త మిశ్ర సమాసాల లోగుట్టును బయట పెట్టారు. ఆఫీసరమ్మ ఏ భాష? పదాల వాడకంలో మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. ఉదాహరణకు ‘ఆంబులెన్స్ సేవలు’, ‘అకౌంట్ బదిలీ’, ‘ఈడీ లేఖ’, ‘ఈ’ పుస్తకం (ఎలక్ట్రానిక్ పుస్తకం), కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, ఆఫీసరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు, పెళ్లి వీడియోలు, పేపరు ప్రకటన, ప్లాస్టిక్ చెత్త, పాల పాకెట్టు, కోళ్ల ఫారం, యూనియన్ ఎన్నికలు, సమ్మె హారన్, సీల్డు కవర్ ముఖ్యమంత్రి, స్పీకర్ నిర్ణయం – ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న తెలుగాంగ్ల మిశ్రమ సమాసాలకు ఆధారాలు, అర్థ వివరణలను సుబ్బాచారి ఎంతో శ్రమపడి అందు బాటులోకి తెచ్చారు. ఇందులో 1,600 సమా సాలకు పొందికైన వివరణలున్నాయి. సంప్ర దాయ వ్యాకరణాలు చూపించని సంధి సమాసాల నియమాలను రచయిత ప్రత్యేకించి చూపారు. ఇంతకు ముందు తెలుగు భాషలో ఉన్న అందమైన పదాలకు ‘ఒక్క పదం – అర్థాలెన్నో’ మకుటంతో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి తెలుగు పదాల అందచందాలను, ప్రత్యే కతను తెల్పడానికి విశిష్టమైన తొలి ప్రయత్నం చేశారు. నిఘంటు చరిత్ర ప్రాచీనం ఇలా ఒక్కో పదానికే కాదు, ఒక్కో ‘వర్ణా’నికి (అక్షరానికి) కూడా భిన్నార్థాలుంటాయన్నాడు క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. ప్రపంచంలో తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్ల నాటి సుమేరియన్, అక్కాడియన్ ప్రతి. ప్రపంచంలో తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్ – బాబిలోనియన్ – హిట్డయిట్ భాషల్లో వెలువడింది. అలాగే ఔషధ శాస్త్రానికి సంబంధించిన ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) తొలిసారిగా మెసపటోమియా మట్టి ఫలకలపై వెలుగు చూసిందంటారు. ఎటు తిరిగీ మానవాళి విజ్ఞాన, వికాస దశల్లోకి కాలిడిన తర్వాతనే శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగునాట వైద్య భాషకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని వెల్లడించారు. మన చరకుడి ఆయుర్వేద వైద్య శాస్త్రం, శుశ్రుత కృషినీ మరవలేం. వన మూలికల ప్రాశస్త్యం తెలిపిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుపరాతి యుగం) నాటిది. అనారోగ్యం అనేది ‘విధి నిర్ణయం కాద’ని చెబుతూ, మానవ ప్రయత్నం ద్వారా, సంకల్ప బలం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని చరకుడు తన వైద్య సంపుటం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. వ్యవహార నిఘంటువు ఆధునిక యుగంలో అలాంటి గొప్ప ప్రయత్నంలో భాగమే, సరికొత్త ప్రత్యేక మిశ్ర సమాస నిఘంటు నిర్మాణం అనీ, ఇది ‘ఆహ్వానించదగిన’ పరిణామమనీ అన్న భాషా శాస్త్రజ్ఞులు, మిత్రులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వర్రావు అభిభాషణతో ఏకీభవించని వారుండరు. తెలుగు వినియోగంలోకి వచ్చేసిన ‘పాల క్యాను, పాల మీటరు, పాల పాకెట్టు, పాల వ్యాను, పాల ట్యాంకరు’ లాంటి కొత్త సమాసాలు చేయమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. లేదా ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ‘ఇలా వాడొద్దు, ఇంగ్లిష్ పదాన్ని తెలుగు చేసుకొని వాడుకోమని ఎవరైనా పండితుడు చెప్పినా లేదా ప్రభుత్వం వారు నిర్దేశించినా ఫలితం ఉండదు. జన వ్యవహారాన్ని ఎవరూ మార్చలేరు. ఇది అనివార్యంగా జరుగుతూ ఉన్న భాషా పరిణామం అని అర్థం చేసుకోవా’లన్న సుబ్బాచారి వ్యవహార పరిజ్ఞానం మెచ్చుకోదగింది. భాషా పరిణామం అనేది ‘సమాజ సహజ పరిణామంలో భాగంగా’ జరుగుతున్నది కాబట్టే, ఇలా తెలుగాంగ్ల పదాల కలయికతో మిశ్రమ సమాసాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి భాషావేత్తలు ఈ పరిణామాన్ని విధిగా అధ్యయనం చేయవలసి ఉందన్న రచయిత భావన ప్రశంసనీయమైనది. ముందు పదాల విదేశీకరణం, దేశీయ పదాలు క్రమంగా ఉనికిలోకి వచ్చిన తరువాత దేశీకరణ, అవసరాన్ని బట్టి మిశ్ర భాషా సమాసాలూ భాషా పరిణామంలో అనివార్యమని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే – సకల భాషా, సంస్కృతుల సమ్మేళనమే ఒక మిశ్ర సమాస నిఘంటువు! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇక తెలుగులోనే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇకపై తెలుగులో లేకపోతే నేటి నుంచి శిక్షలు అమలు చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సృజనాత్మక–సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, తెలుగు ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గతంలో అధికార భాషా సంఘానికి.. సలహాలు, సూచనలివ్వడం తప్ప శిక్షలు అమలుచేసే అధికారం లేదన్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం తెలుగును పాలనా భాషగా అమలు చేయకపోతే శిక్షలు విధించే అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రక నిర్ణయమని తెలిపారు. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే.. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలున్నంత కాలం తెలుగు భాష ఉంటుందన్నారు. తెలుగుని మరుగున పడేస్తున్నారంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఇక దేశంలో హిందీ తర్వాత చరిత్ర కలిగిన భాష తెలుగేనని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం.. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, భాషా పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ పురస్కారాలు ప్రదానంచేసి సత్కరించింది. ఈ వేడుకల్లో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ మల్లికార్జునతో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
Telugu Language Day: భాషా భేషజాలపై పిడుగు!
మహనీయులు ఈ లోకంలో గొప్ప కార్యాన్ని సాధించడం కోసమే పుడతారు. అలాంటి వారినే ‘కారణ జన్ములు’ అంటారు. గిడుగు ఆ కోవలోకే వస్తారు. తన జీవితాన్ని భాషా ఉద్యమాల కోసం వెచ్చించిన కార్యశూరుడు గిడుగు. ఆయన తొలి తెలుగు ఆధునిక భాషావేత్త, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త కూడా. 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేట గ్రామంలో గిడుగు జన్మించారు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో లోయర్ ఫోర్తు ఫారంలో చేరారు. అదే తరగతిలో గురజాడ అప్పారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే జీవితాంతం మంచి స్నేహితులుగా ఇద్దరూ కలసి మెలిగారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1889లో సవరజాతి వారితో గిడుగుకు పరిచయం ఏర్పడింది. సవరుల చరిత్ర, సంస్కృతి, భాష మీద గిడుగుకు అమితమైన ఆసక్తి కలిగింది. అందువల్ల సవరల భాషపై ప్రత్యేకంగా విశేషమైన కృషి చేశారు. 1893 జనవరి 15వ తేదీన గిడుగు శ్రీముఖలింగ క్షేత్రానికి వెళ్ళారు. 22 శాసనాల్ని నిశితంగా పరిశోధించారు. ప్రభుత్వం కూడా గిడుగు శాసన పరిశోధనలను గుర్తించింది. 1894లో గిడుగు ‘వయోజన విద్య’ను ప్రారంభించారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎక్కువగా భాషా సాహిత్యాల పరిశోధన వైపు మళ్లారు. గిడుగు పెద్ద కొడుకు సీతాపతి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. గిడుగు వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. తాపీ ధర్మారావు, చిలుకూరి నారాయణరావు లాంటివారు ఆయన శిష్యులే. 1910 తర్వాత గిడుగు పూర్తిగా భాషాపరిశోధనలో నిమగ్నమయ్యారు. 1911లో సవర భాషపై అనితర సాధ్యమైన, విశేషమైన కృషిచేసినందుకుగాను ఆయనకు ప్రభుత్వం ‘మెరిట్ సర్టిఫికెట్’ బహూకరించింది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు సారథ్యం వహించారు. ఊరూరా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం కలుగజేశారు. అందరి తోనూ చర్చలు జరిపారు. 1916లో కొవ్వూరులో గిడుగు ఉపన్యాసాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు విని ప్రభావితులయ్యారు. గిడుగు ఆ విషయం తెలుసుకొని కందు కూరిని కలిశారు. ఇద్దరూ 1919లో ‘తెలుగు’ పేరుతో పత్రికను స్థాపించారు. తన భావాలను, ఆలోచనలను, ఈ పత్రికలో ముద్రిం చారు గిడుగు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలన్నింటినీ, ఈ పత్రిక తూర్పారబట్టింది. ‘ఆంధ్ర పండిత, భిషక్కుల భాషా భేషజం’, ‘బాలకవి శరణ్యం’ వంటి గ్రంథాలను మొదటిసారిగా ఈ పత్రిక ద్వారానే వెలువరించారు. గిడుగు మొత్తం పరిశోధన అంతా భాషాతత్త్వంపైనే జరిగింది. ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో లోతుగా చర్చించారు. గిడుగు చేసిన భాషాసేవకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావించిన ‘‘కైజర్–ఇ– హింద్’’ అనే బంగారు పతకాన్ని 1933 జనవరిలో ప్రభుత్వం బహూకరించింది. గిడుగు వ్యావహారిక భాషోద్యమం ఫలితంగా 1933లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ ఏర్పడింది. వ్యావహారిక భాషలో అన్ని రకాల రచనలూ రావాలని ఈ పరిషత్తు అభిప్రాయపడింది. 1935 మే 6వ తేదీన గిడుగుకు ఐదవ జార్జి చక్రవర్తి రజతోత్సవ సువర్ణ పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది. గద్య చింతామణి, వ్యాసావళి వంటి గ్రంథాల్ని గిడుగు రాశారు. పీఠికా విమర్శ, గ్రంథ పరిష్కార విమర్శ, లక్ష్మణ గ్రంథ విమర్శ, నిఘంటు విమర్శ వంటి అంశాల్లో కూడా ఎవ్వరూ చెయ్యని, చెయ్యలేని లోతైన పరిశోధన చేశారు. గ్రాంధిక భాషావాదుల డాంబి కాల్ని గిడుగు బట్టబయలు చేశారు. కొమ్ములు తిరిగిన మహామహా పండితులకే సంస్కృతం సరిగా రాదని ఉదాహరణ పూర్వకంగా విడమర్చి మరీ తెలియజేశారు. ఆయన వ్యాకరణాల్లోనూ నిఘంటువుల్లోనూ సమాన ప్రతిభ కలిగినవారు. సవర–తెలుగు, తెలుగు – సవర, ఇంగ్లిష్ – సవర, సవర – ఇంగ్లిష్ నిఘం టువుల్ని తయారుచేశారు. నిఘంటువుల నిర్మాణానికి పండిత ప్రతిభతో పాటు, భాషాశాస్త్ర జ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కూడా తప్పనిసరిగా ఉండాలని వారి అభిప్రాయం. భాష ఎప్పుడూ పరిణామం చెందుతుందని గిడుగు వారి వాదన. అదే చివరకు విజయం సాధించింది. 1938 డిసెంబర్ 1వ తేదీన ఆంధ్ర విశ్వకళా పరిషత్ గిడుగుకు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి ఘనంగా సన్మానించింది. సవరభాష కోసం, వ్యావహారిక భాష కోసం, గిడుగు చేసిన కృషి అనన్య సామాన్యమైంది. అనితర సాధ్యమైంది. అక్షర జ్ఞానం లేని సవరలకు జ్ఞానం కలుగ చేయడం కోసం ‘సవర భాషోద్యమం’ చేపట్టారు. మహా మహా పండి తులను, మేధావులను వ్యావహారిక భాషావాదాన్ని ఒప్పించడం కోసం ‘వ్యావహారిక భాషోద్యమం’ చేపట్టారు. అజ్ఞానంతో ఉన్నవారికి జ్ఞానభిక్ష పెట్టేది ‘సవర భాషోద్యమం’. జ్ఞానం ఉన్నవారిలోని అజ్ఞానాన్ని తొలగించేది ‘వ్యావహారిక భాషోద్యమం’. రెండూ గొప్ప ఉద్యమాలే. రెండూ మంచి పనులే. అసలు విషయం ఏమంటే – ఈ రెండు ఉద్యమాలూ నూటికి నూరుపాళ్లు ప్రజలకు సంబంధించినవే. ఈ ఉద్యమాల్లో రవ్వంతయినా స్వార్థం లేదు. ఆయన గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు. వీరు 1940 జనవరి 22వ తేదీన మద్రాసులో తుదిశ్వాస విడిచారు. గిడుగును ‘తెలుగు సరస్వతి నోముల పంట’ అని విశ్వనాథ సత్యనారాయణ కీర్తించారు. ‘తెలుగుదేశంలో అవతరించి తెలుగు భాషను ఉద్ధరించిన పుంభావ సరస్వతి గిడుగు వెంకట రామమూర్తి పంతులు’ అని చింతా దీక్షితులు కీర్తించారు. ఇటువంటి ఉద్దండుల మన్ననలను పొందగలిగిన గిడుగు ‘పిడుగు’గా ప్రసిద్ధి పొందారు. (క్లిక్: ఈ తెలుగు మాట్లాడుతున్నామా?) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు (ఆగస్టు 29న గిడుగు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఏపీ ప్రభుత్వం జరుపుతున్న సందర్భంగా) -
గవర్నర్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశభాషలందు తెలుగు లెస్స.. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని తెలుగు భాష గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు చెప్పారని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే ఐదు భాషల్లో తెలుగు ఒకటని తెలిపారు. తమిళనాడులో పుట్టిన తాను తమిళ భాషకు సమానంగా తెలుగును గౌరవిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడుతు న్నానని వెల్లడించారు. మన తెలుగు భాషను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఆదివారం తెలుగులో మాట్లాడిన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. -
తానా ఆధ్వర్యంలో ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు'
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు' జరిగాయి. ఆగస్ట్ 30న అట్లాంటా, జార్జియా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో శ్రీ గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” ఆగస్ట్ 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయి వర్చువల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య తన ప్రసంగంలో గిడుగు వేంకట రామమూర్తి కృషిని, ఆయనకు ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్రముఖులకు సాదరంగా ఆహ్వానం పలికారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య మాధవపెద్ది సీతాదేవి దంపతుల కుమార్తె,ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి- సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా. శశి పంజాను సభకు పరిచయం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వారే అయినా కలకత్తాలో స్థిరపడి రాజకీయాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ఓ వైపు డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా డా. శశి పంజా మాట్లాడుతూ..ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తాలో స్థిరపడడం వల్ల తెలుగు నేలకు దూరమే అయినా...ఇంట్లో కుటుంబసభ్యులు తెలుగులోనే మాట్లాడుకుంటామని అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని పునరుద్ఘాటించారు. తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేసారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను, వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు. ఈ సభలో అతిధిగా పాల్గొన్న ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన చెందారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెనుంచి ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందిస్తున్న సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తి గా పుట్టడం తన అదృష్టం అని, మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి గారితో సహా మొత్తం 17 మంది సాహితీవేత్తలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని, పాల్గొన్నవారందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. పాల్గొన్న ప్రముఖులు తుమ్మల శ్రీనివాసమూర్తి, మనోరమ (రాయప్రోలు) కానూరి, డా. కొండవీటి విజయలక్ష్మి, వర ముళ్ళపూడి, గొల్లపూడి రామకృష్ణ, డా. ఉమర్ ఆలీ షా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా మునిమనవడు గుర్రం పవన్ కుమార్, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు శ్రీమతి రేవతి అదితం, గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న సతీమణి హైమవతీ భీమన్న, గురజాడ అప్పారావు మునిమనవరాలు అరుణ గురజాడ, గుంటూరు శేషేంద్రశర్మ కుమారుడు గుంటూరు సాత్యకి, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని,పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ మనవడు విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు కోడలు లక్ష్మి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
సాక్షి, ఢిల్లీ: తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న రెండు రాష్ట్రాల సోదరీ సోదరులకు శుభాకాంక్షలు అంటూ లోకసభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్ చేశారు. ‘తెలుగు మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా సుమాంజలి. భాషలు మన సమృద్ధికి.. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు దోహదపడతాయని’ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిసిన ఏపీ గవర్నర్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ వేడుక తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు దోహదపడుతుంది. ఎన్నో యుగాలుగా ఇక్కడి ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుతున్న తెలుగుభాషా గొప్పదనాన్ని చాటేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని’’ గవర్నర్ ట్వీట్ చేశారు. తెలుగు మహా కవి, రచయిత శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్బంగా సుమాంజలి. ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కూడా జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల సోదర,సోదరిమణులకు నా శుభాకాంక్షలు. భాషలు మన సమృద్ధికి, సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించేందుకు దోహదపడతాయి. — Om Birla (@ombirlakota) August 29, 2021 This #TeluguLanguageDay is observed to cherish pride of Telugu language that preserved the culture and heritage of this state from ages. The #Telugu Language Day is celebrated to mark the birth anniversary of eminent Telugu poet Gidugu Venkata Ramamurthy. pic.twitter.com/uZA2zUvE8S — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) August 29, 2021 -
ప్రజల భాషను ప్రజలకు చేర్చిన గిడుగు
సాహిత్యం సామాన్యులకు చేరువ కావాలన్నా, పాలనా ఫలాలు ప్రజలందరికీ దక్కాలన్నా, పత్రికలు పది కాలాల పాటు మనుగడ సాగించాలన్నా ప్రజల భాషకే పెద్దపీట వేయాలని గట్టిగా నమ్మి, ఆ దిశగా ఉద్యమించి, తర్వాతి తరాలకు స్ఫూర్తినిచ్చిన భాషోద్యమ నేత గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు. సాహితీ లోకానికి, భాషా రంగానికి, రచనా రంగానికి, పత్రికా వ్యవస్థకు గిడుగు చేసిన సేవ కళింగాంధ్ర విశిష్టతను, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాల పేట(తెనుగుపెంట)లో జన్మించిన గిడుగు ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసి (జైపూర్ రాజాగా ఖ్యాతిగాంచిన రాజా విక్రమదేవ్ కూడా ఈ గ్రామవాసే), హైస్కూల్ విద్యను విజయ నగరంలో పూర్తి చేశారు. 1880లో పర్లాకిమిడి (నేడది గజపతి జిల్లా కేంద్రం) రాజా సంస్థానంలో మిడిల్ స్కూల్ ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరకడంతో తన మకాం అక్కడికి మార్చారు. పనిచేస్తూ 1886లో ఎఫ్ఏ, 1895లో బీఏ పూర్తి చేశారు. పర్లాకిమిడి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో చరిత్ర లెక్చరర్‌గా పనిచేశారు. ఆ కాలంలోనే వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారు. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను, రచయితలను చైతన్య పరిచారు. వ్యవహారిక భాష ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికల్లో రచనలు చేయడం మొదలుపెట్టారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, పురిపండా అప్పలస్వామి, తాపీ ధర్మారావువంటి సాహితీ మిత్రుల సహకారంతో గ్రాం«థిక వాదులను ఎదురించి సంచలనాత్మక రచనలు, సంచలనాత్మక ప్రసంగాలు చేశారు. ప్రజల భాషే పత్రికల భాష రాజాస్థానాలు, జమీందారుల కొలువుల్లో వుండే భాష కాకుండా ప్రజల నాలుకల్లో నలిగే భాషనే ప్రోత్సహించాలని గట్టిగా ఆకాంక్షించి పాత్రికేయునిగా మారారు గిడుగు. స్వీయ సంపాదకత్వంలో 1919 సెప్టెంబర్‌లో పర్లాకిమిడి నుంచి ‘తెలుగు’ మాసపత్రికను ప్రారంభించారు. దీనిలో గిడుగు రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు తీవ్రచర్చకు, భాషా, పత్రికా రంగాలపరంగా తీవ్ర మార్పులకు కారణమయ్యాయి. తెలుగుభాషలో వ్యవహారి కంగా వచ్చిన మొట్టమొదటి పత్రిక, కళింగాంధ్ర చరిత్రకు ఖ్యాతి తెచ్చిన పత్రిక ఈ ‘తెలుగు’. విశ్వవిద్యాలయాల్లో బోధన, వాడుక భాషల్లో జరిగేలా చేసిన సంస్కరణవాదిగా గిడుగును పేర్కొనవచ్చు. పాఠ్యాంశా ల ముద్రణ, నిర్వహణ, పరిశోధనలు, పాలనా వ్యవహారాలు వ్యవహారికం లోనే జరగాలని ఉద్యమించారు. తర్వాతి కాలం లో చరిత్రకారునిగా, శాసన పరిశోధ కునిగా ఖ్యాతి గాంచారు. సవర భాషకు లిపి సృష్టికర్తగా మారారు. పర్లాకిమిడి రాజా పద్మనాభదేవు కోరికపై ప్రసిద్ధి శైవక్షేత్రం అయినటు వంటి శ్రీముఖ లింగక్షేత్రంలో 9, 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రాచీన శాసనాలను పరిశోధించి గ్రంథస్థం చేశారు. భాషే శ్వాసగా... భాష, పత్రిక, పరిశోధన రంగాలకు చేసిన సేవకుగానూ ఎన్నో పురస్కారాలు, సత్కారాలు గిడుగు ముంగిట వాలాయి. మద్రాస్ ప్రభుత్వం ‘రావు బహుద్దూర్’(1913), బ్రిటిష్ ప్రభుత్వం ‘కైజర్– ఇ–హిందూ’ (1933), ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘కళాప్రపూర్ణ’ (1938) బిరుదులతో గౌర వించాయి. జీవించిన 77 ఏళ్లలో 60 ఏళ్ల పాటు తెలుగు భాషా వికాసానికి పాటుపడిన గిడుగు చిరస్మణీయులు. భాషాపాలిత రాష్ట్రాల విభజన కారణంగా 50 సంవత్సరాల పాటు నివసించిన పర్లాకిమిడి ఒరిస్సా రాష్ట్రంలో చేరిపోవడంతో బాధాతప్త హృదయంతో రాజమండ్రి చేరి అక్కడే స్థిరపడ్డారు. భాషాభిమానులు శ్రీకాకుళంలో నాగావళి వంతెన వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన భాషా అధ్యయన కేంద్రానికి గిడుగు పేరును పెట్టి నివాళులు అర్పించింది. ఆయన పుట్టిన పర్వతాలపేటలో గిడుగు విగ్రహాన్ని భాషా భిమానులు, గ్రామస్తులు ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్ శాసససభ స్పీకర్ వారం రోజుల క్రితం ఆవిష్కరించారు. భాషలోని మాండలికాలు సజీవంగా వుండాలని, ప్రజల భాషలోనే పత్రికలు పయనించాలని పథనిర్దేశం చేసిన గిడుగు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం కళింగాంధ్రకు ఎంతో గర్వకారణం. తెలుగు జాతి ఉన్నంత వరకు గిడుగు జాడ కనిపిస్తూనే వుంటుంది. 1940 జనవరి 22న తుదిశ్వాస విడిచిన గిడుగు అందించిన వ్యవహారభాషా స్ఫూర్తిని కాపాడుకుంటేనే నిజమైన భాషా వారసులం కాగలం. – డా. జి.లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం పీజీ శాఖ, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం -
Telugu Language Day: నేడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్వాకం, నిబద్ధత లేని కారణంగా ప్రస్తుతం అమ్మ భాష రోజురోజుకూ ప్రాధాన్యత కోల్పోతూ నిరాదరణకు గురవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరభాషా వ్యామోహం పెంచుకుంటున్నారు. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మా రాయి. ఫలితంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదైపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు ఊతమిచ్చిన తెలంగాణ భాష ప్రత్యేకమైనది. ఆ భాషకు న్న శక్తితోనే కవులు, రచయితలు అందించిన సాహిత్యం ఉద్యమానికి చైతన్యం తీసుకువచ్చింది. తెలంగాణ భాష పదజాలం పౌరుషాన్ని, రోషాన్ని నింపి రాష్ట్ర సాధన వరకు వెన్నుదన్నుగా నిలిచిన మన అమ్మ భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. సదాస్మరణీయుడు.. తెలుగుభాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు సదాస్మరణీయం. తెలుగు భాషలో గ్రాంథిక వాదానికి స్వస్తి చెప్పి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన భాషోద్యమకారుడాయన. గిడుగు జయంతినే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. 1913లో వ్యవహారిక భాషలోనే విద్యాబోధన జరగా లని ఆనాటి మద్రాస్ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. తెలుగు–సవర, ఇంగ్లిష్–సవర నిఘంటువులను, గద్య చింతామణి, వ్యాసావళి, నిజమైన సంప్రదాయం మొదలగు గ్రంథాలు ఆయన కీర్తిని ప్రకాశమానం చేశాయి. తెలుగు భాషలోని సొబగులను సామాన్య ప్రజలకు అందించడంలో గిడుగు ప్రయత్నం ప్రశంసనీయం. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అ ప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రాభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. సామాన్యుల పట్ల మనకు శ్రద్ధ ఉండాలని, పేదవారి ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే భాషాసంస్కరణ ఒక్కటే మార్గమని గట్టిగా విశ్వసించిన ఆయన 1940 జనవరి 22న స్వర్గస్తులయ్యారు. తెలుగును పరిరక్షించాలి ఉన్నత తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృ భాషలో బోధన కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు తల్లి భాషలో సాగితేనే జ్ఞానార్జన, ఆలోచనాశక్తిని, ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. ప్రభుత్వం కూడా తెలుగు చదివిన వారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తే తెలుగు నిత్యనూతనమై విరాజిల్లుతుంది. – దాస్యం సేనాధిపతి, కవి, రచయిత, సాహితీ విమర్శకులు మాతృభాష వైపు మళ్లాలి ప్రపంచీకరణ ప్రభావంతో మన భాషా సంస్కృతులను పరిరక్షంచుకునే ఆత్మరక్షణలో పడ్డాం. ఇది ఆత్మగౌరవ సమస్య. ఆంగ్ల భాష వ్యామోహంలో నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరం తెలుగు భాషను కాపాడున్నవారం అవుతాం. ఆ దిశగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. – కేఎస్.అనంతాచార్య, కవి, రచయిత చదవండి: మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె -
తెలుగు అభివృద్ధికి సాంకేతికతను వాడుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిం చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఏ సమాజంలో నైనా భాష, సంస్కృతి, ఒకదానినొకటి పెన వేసుకుని ఉంటాయని, సమాజం మార్పు కోరుతు న్నప్పుడు, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే, సమాజంతో పాటు భాషకూ, సంస్కృతికి తిప్పలు తప్పవన్నారు. కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే, ఆ భాష, ఆ సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. శని వారం దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు– నార్వేలు ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా తెలుగు సంఘాలతో కలసి చేపట్టిన అంతర్జాతీయ సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేస్తున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ లందరికీ వందనాలు అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 400 సంవత్సరం నుంచి ఉనికిలో ఉన్న తెలుగు భాష ఒక ఉద్యమ రూపం దాల్చడానికి ఒకానొక కారణం మహాభార తాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు తెనుగించ డమేనని వివరించారు. ‘‘ముందుచూపుతో, తగు మార్పులతో ప్రగతి శీలంగా భాషను మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు అగ్రగణ్యులు. దాదాపు సమకాలికులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిల త్రయం, సాహితీ సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు. వాడుక భాష అవసరం గురించి ఆ మహానుభావులు ముందు చూపుతో హెచ్చరించి, విప్లవాత్మక చర్యలు చేపట్టక పోతే, మన తెలుగు భాష నేడు ఈ స్థితిలో ఉండేది కాదు’’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కూడా మాతృభాష ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగలించిందని చెప్పారు. అగ్రశ్రేణి సినీనటుడు కావడం వల్లనే ఎన్టీ రామా రావు ముఖ్యమంత్రి కాలేదని, ఊరూరా చైతన్య రథంపై తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో మాట్లాడడమే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు భాషను వధించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నా యన్నారు. తెలుగు సినిమాలు కూడా ఆంగ్ల సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని చెప్పారు. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. పోటీని తట్టుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి అని అలాగని తెలుగును విస్మరించ రాదన్నారు. ‘‘ప్రతి ఒక్కరిలో తెలుగంటే గౌరవం పెరగాలి. సగర్వంగా నేను తెలుగువాడినని, నా మాతృ భాష తెలుగని ఎక్కడికెళ్లినా, ఏ పీఠమెక్కినా చెప్పుకోగలగాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతి సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మండలి బుద్ధ ప్రసాద్, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్, గిడుగు స్నేహలత, పెట్లూరు విక్రమ్, తరిగోపుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మన ఇంట్లో భాష ఎలా ఉంది?
అమ్మ కడుపు నుంచి శిశువు మాతృభాషను వింటుంది. బడిలో చదువుతుంది. కాని ఆ భాషను తన భాషగా ఎప్పుడు చేసుకుంటుంది? ఎలా ఆస్వాదిస్తుంది? ఇంట్లో అమ్మమ్మలు సామెతలు చెబుతారు చలోక్తులు విసురుతారు. నానమ్మలు కథలు చెబుతారు. కథల పుస్తకాలు భాష ద్వారా ఊహను పంచుతాయి. సాహిత్యం మెల్లగా సంస్కారం అలవరుస్తుంది. బతకడానికి ఇంగ్లిష్. జీవించడానికి తెలుగు. పిల్లల తెలుగు కోసం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసి, కేబుల్ కనెక్షన్... ఇవి అవసరమే. కాని పిల్లల కళ్లకు రోజూ తెలుగును కనిపించేలా చేసే ఒక దినపత్రిక అవసరం అని చాలామందిమి అనుకోము. ఇంటి అల్మారాలో ఒక తెలుగు పుస్తకం అన్నా ఉంటే వారికి తెలుగు భాష పట్ల ఆసక్తి ఏర్పడుతుందని అనుకోము. ఇంగ్లిష్ మీడియంలో చేర్పించడం, ఇంగ్లిష్ భాష ప్రావీణ్యం ఎలా ఉందో గమనించడం... ఇవి అవసరమే. భవిష్యత్తులో ఉపాధి వేదికలను పెంచుకోవడానికి ఆ పని చేయాల్సిందే. కాని అలాగని ఇంటి భాషను, తల్లిభాషను ఇంటి వేదికగా పిల్లల్లో పాదుకునేలా ఏ మాత్రం చేయగలుగుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు తప్పక ప్రశ్నించుకోవాలి. అమ్మ అన్న పిలుపు ప్రతి తెలుగు శిశువు పలికే తొలి తెలుగు శబ్దం ‘అమ్మ’. అక్షర మాలలో అ అంటే అమ్మ అనే కదా నేర్పిస్తారు. శిశువుకు అమ్మ ద్వారా తెలుగును నేర్చుకునే హక్కు ఉంది. తల్లికి తన ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన బాధ్యత ఉంది. పిల్లలకు ఏ భాష అయినా నాలుగు విధాలుగా వస్తుంది. 1.మాట్లాడటం 2.వినడం 3. చదవడం 4.రాయడం... ఈ నాలుగింటిలో పిల్లలు ఏవి ఎంత బాగా అభ్యాసం చేస్తున్నారో గమనించుకోవాలి. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి చేయకపోయినా భాష పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఈ నాలుగు జరగడంలో ఇంటి బాధ్యత విస్మరించి ‘మా పిల్లలకు తెలుగే రావడం లేదని’ అనుకోవడం నింద ఎవరో ఒకరి మీద వేయాలనుకోవడం సరి కాదు. ‘సబ్జెక్ట్స్’ స్కూల్లో నేర్పిస్తారు. తెలుగు కూడా ఒక ‘సబ్జెక్ట్’గా స్కూల్లో నేర్పుతారు. కాని భాష దాని జీవంతో అనుభూతితో అందంతో పిల్లలకు రావాలంటే ఇంటి మనుషులు, ఇంటి పరిసరాల వల్లే ఎక్కువగా సాధ్యం. పదం... పద్యం.. తెలుగు పదం.. తెలుగు పద్యం పిల్లలకు ఇంట్లో అలవాటు చేయడం గతంలో ఉండేది. వేమన పద్యాలు, సుమతి శతకం, పెద్దబాలశిక్ష చదివించడం, దేశభక్తి గేయాలు నేర్పించడం, పొడుపు కతలు, సామెతలు, పిల్లల పాటలు... ఇవి భాషను వారిలో గాఢంగా పాదుకునేలా చేసి ‘మన తెలుగు’ అనిపిస్తాయి. ఇవాళ్టి పిల్లలు ‘చందమామ రావే’ వినడం లేదు... ‘వీరి వీరి గుమ్మడిపండు’ ఆడటం లేదు. ప్లేస్కూల్లో ‘జానీ జానీ ఎస్ పాపా’ నేరుస్తున్నారు కాని ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ చెవిన వేసుకోవడం లేదు. చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టిందో లేదోగానీ తెలుగు భాష మీద పిల్లలకు ఉండాల్సిన ఇచ్ఛను అమ్మ (నాన్న) కొట్టకుండా చూసుకోవాలి. పత్రికలను పట్టించుకోని నిర్లక్ష్యం గతంలో నాన్నలు పిల్లల కోసం మిఠాయి కొనుక్కుని దాంతో పాటు మార్కెట్లోకి తాజాగా వచ్చిన ‘చందమామ’ సంచికను కొనుక్కొని వచ్చేవారు. ఆ స్తోమత లేకపోతే పక్కనే ఉన్న అద్దె పుస్తకాల షాపు నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటివి తెచ్చి పిల్లలకు ఇచ్చేది అమ్మ . ‘రాకుమారుడు’, ‘మాంత్రికుడు’, ‘ముసలవ్వ’, ‘యోజనం’, ‘క్రోసు’, ‘పురం’, ‘బాటసారి’, ‘సత్రం’... ఇలాంటి పదాలతో కథలు చదువుతూ పిల్లలు భాషలోకి అడుగుపెట్టేవారు. భాష అంటే ఏమిటి? అది ఒక విలువను పాదుకునేలా చేసే మాధ్యమం. కథ చదివితే భాష వస్తుంది. బోనస్‌గా ఆ భాషతో పాటు జీవన విలువ, పాటించాల్సిన నీతి అలవడుతుంది. కాని తెలుగు సమాజం పిల్లల పత్రికల పట్ల చాలా నిర్లక్ష్యం వహించి నేడు అవి దాదాపుగా లేకుండా చేసే స్థితికి తెచ్చింది. పిల్లలు కథ ‘వింటే’ కథ ‘చెప్తారు’. కథ ‘చదివితే’ కథ ‘రాస్తారు’. ఈ విని, చెప్పి, చదివి, రాసే విధానాలను అలవర్చే పత్రికలు నేడు లేవు. దినపత్రికలు కొంతలో కొంత ఆ లోటును పూడుస్తున్నాయి. పిల్లలకు అందుకోసమని పత్రికలను చదవడం అలవాటు చేయాలి. కొన్ని తెలుగు భాషకు సంబంధించిన వెబ్సైట్లు బాల సాహిత్యాన్ని ఇస్తున్నాయి. అవి చదివించాలి. ఏ భాష చెవిన పడుతోంది? ఇంట్లో పిల్లలు వింటున్నది టీవీ భాష, సినిమా భాష మాత్రమే. తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటల నుంచి నేర్చే పద సంపద పెద్దగా ఉండదు. ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటే భాషకు ఉండే ధ్వని, రుచి పిల్లలకు తెలుస్తుంది కాని ఇవాళ చాలా ఇళ్లల్లో పెద్దలు ఉండటం లేదు. కనుక సీరియల్స్ భాష, వెకిలి కామెడీ షోల భాష పిల్లలకు వస్తోంది. ఈ భాష వ్యక్తిత్వ పతనానికి తప్ప నిర్మాణానికి పనికి రాదు. భాషా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే మాతృభాష సరిగా వచ్చినవారికే అన్య భాషలు సరిగా వస్తాయి అని. మాతృభాషను బాగా నేర్చుకున్న పిల్లలు ఇంగ్లిష్ కూడా బాగా నేర్చుకోగలుగుతారు. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. ఆ గొప్పదనం ఇచ్చే ఆత్మవిశ్వాసం వేరు. మాతృభాష నుంచి అందే గొప్ప బలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం లేదా దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. -
ప్రవాస తెలుగు పురస్కారాలు.. ఎంట్రీలకు ఆహ్వానం
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ మరియు వీధి అరుగు ఆధ్వర్యంలో 2021 ఆగష్టు 𝟐𝟖, 𝟐𝟗లలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విదేశాలలో నివసిస్తూ తెలుగు భాషా , సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారికి ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందిస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే ఈ పురస్కారాన్ని అందిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి మీరు చేసిన వివరాలను ఈ కింది లింకు ద్వారా లేక ఈ-మెయిల్ ద్వారా పంపాలని సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగులు కోరాయి. https://tinyurl.com/pravasa , pravasatelugupuraskaralu2021@gmail.com -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. ‘తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణ దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. -
కాళోజీ యాదిలో ...
కవిగా కాళోజీకి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన పుస్తకం ‘నా గొడవ’. ఇది 1953లో విడుదలయింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన మహాకవి శ్రీశ్రీ ఆ సందర్భంగా అన్న మాటలు చిరస్మరణీయాలు. ‘ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన ప్రతి ఒక్కరికీ ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది విషాలజగత్తు ప్రజలందరి గొడవ’ అన్నారు. ఆనాటినుండి కాళోజీ ప్రచురించిన ప్రతి కవితాసంకలనానికి నా గొడవ అనే పేరు పెట్టాడు. ప్రపంచబాధంతా శ్రీశ్రీ బాధ అయినట్లే ప్రజల గొడవంతా తన గొడవగా భావించి కవితా ప్రస్థానం సాగించిన వ్యక్తి కాళోజీ. కాళోజీ తన పోరాటాలన్నింటికి కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఆయన చెప్పదలుచుకున్న దానిని సూటిగా సరళమైన ప్రజల భాషలో చెప్పేవాడు. ఆయనది బడిపలుకుల భాషకాదు, పలుకుబడుల భాష. అందుకే ఆయన రచనలు ప్రజలకు చేరువయ్యింది. ఒకప్పుడు భాషకోసం సమైక్య రాష్ట్రాన్ని ఆహ్వానించిన కాళోజీ, అవమానాల పాలవుతున్న ఆ భాషకోసమే మళ్లీ తెలంగాణ రాష్ట్రం అడగడానికి వెనకాడలేదు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుకభాషలోనే రాయాలనేది అతని ప్రగాఢవిశ్వాసం. తెలంగాణ భాష అన్నా, యాస అన్నా అపారమైన అభిమానం. తెలంగాణ భాష, యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. పరభాష మనల్ని మనం మనంగా బ్రతకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం. ఈ వైఖరిని మనం ఎండగట్టాలనేవారు కాళోజీ. కొన్నాళ్లు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ మాండలిక భాషాదినోత్సవంగా ఆయన అభిమానులు జరి పిండ్రు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప కాళోజీ జన్మదినాన్ని తెలం గాణ భాషాదినోత్సవంగా, అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం, అభినందనీయం. తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషిచేశారు. తెలంగాణ ప్రజాసంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన గొంతు వినిపించేవారు. మనభాష, మన పలుకుబళ్లు ఇప్పుడు మన సొంత రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగింది. వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగం, ఓయూ ‘ మొబైల్: 98491 36104 -
తొలి తెలుగు పద్యానికి పుట్టినిల్లు ప్రకాశం
సాక్షి, ఒంగోలు : తొలి తెలుగు పద్యం ‘తరువోజ’కు పుట్టినిల్లు మన అద్దంకే. మహాభారత ఇతిహాసాన్ని పరిపూర్తి చేసి ప్రపంచ సాహిత్యంలో భారత విశిష్టతకు పాదులు తవ్విన ఎర్రన కవి మనవాడే. సంగీత సామ్రాజ్యాన్ని మేలి మలుపు తిప్పిన మధుర వాగ్గేయకారుడు మన త్యాగరాజే. ఆధునిక కాలాన పద్యానికి బువ్వపెట్టి ఘనకీర్తిని చాటిన మధుర కవి మల్లవరపు జాన్ మనలో ఒకరే. మధురమైన వచన కవిత ద్వారా మానవీయత చాటిన జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డడే. ఆధునిక భాషా శాస్త్రానికి ఊపిరులూది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ఒంగోలు వాసి. ఆధునిక వ్యవహార భాషకు ప్రామాణిక పత్రికా భాషతో లంకె కుదిర్చిన శ్రుత భాషా పండితుడు బూదరాజు మన చీరాలకు చెందిన వ్యక్తి. పద్యంలో వ్యంగ్యతకు పట్టం కట్టి ఊరేగించిన గాడేపల్లి సీతారామమూర్తి మన అద్దంకి వాసే. తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వికాస చరిత్రకు జీవం పోసిన అరుదైన సాహితీ విమర్శకుడు జి.వి.సుబ్రహ్మణ్యంది పర్చూరు. రంగస్థల కళ ద్వారా ప్రాచీన పద్యానికి పునరావాసంగా నిలిచిన బండారు రామారావు, డీవీ సుబ్బారావు, అద్దంకి మాణిక్యాలరావు లాంటి అరుదైన కళాకారులూ ఈ జిల్లా వారే. అంతేకాదు.. తెలుగు కవిత్వాన్ని ఓ మేలి మలుపు తిప్పిన దిగంబర కవుల్లో పదునైన అభివ్యక్తీ స్వరం కలిగిన ‘మహాస్వప్న’ పుట్టింది లింగసముద్రంలోనే.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆధునిక నవలకు, కథకు, సాహిత్య విమర్శకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎందరో సాహితీమూర్తులు ప్రకాశం జిల్లా వాసులే. ఆధునిక నాటకానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నాటక ప్రయోగ శిల్పులూ ఇక్కడి వారే. ఆదరణే నాస్తి తొలి తెలుగు పద్యం తరువోజ కొలువైన అద్దంకి శాసనం రోడ్డు విస్తరణలో శిథిలమైంది. 200 సంవత్సరాలు ఎవరూ పట్టించుకోనప్పుడు మహాభారత ఇతిహాసంలో ఆదికవి విడిచిపెట్టిన అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేసిన కవితా వీరుడు ఎర్రన సాహితీ ఉద్ధరణకు ఇక్కడ కార్యాచరణ లేదు. అంతేకాదు.. ఇన్ని విశేషాలున్న జిల్లాలో ఏర్పాటు చేసిన నాగార్జున వర్సిటీ పీజీ సెంటర్లో ఎంఏ తెలుగు లేకపోవడం భాషాభిమానులను కలచివేస్తోంది. కర్ణాటక సంగీతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన త్యాగరాజ కీర్తనలను పదిలం చేసుకోగల సంగీత విద్యాలయం లేదిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజును, పత్రికా ప్రామాణిక భాషకు పట్టుగొమ్మగా నిలిచిన బూధరాజు రాధాకృష్ణను, తెలుగు సాహిత్య విమర్శలో ప్రక్రియా వికాస చరిత్రకు ఆద్యుడైన ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యంను తలచుకునే సాహితీ జిజ్ఞాసులూ లేకపోవడం బాధాకరం. భాషోద్ధరణకు నడుం బిగించాలి గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకలోకి తెచ్చి, నిత్య వ్యవహార భాషలోని అందాన్ని చాటిచెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు 156వ జయంతి నేడు. ఆయన పుట్టిన రోజును మాతృ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వ్యావహారిక భాషా కోసం ఆజన్మాంతం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో మన ప్రాంత భాషా, సాహిత్య విశిష్టతల ఉద్ధరణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని భాషా సాహిత్యవేత్తలు పేర్కొంటున్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు భాషా ఉద్ధరణ కోసం ప్రత్యేకంగా భాషా ఉత్సవాలు నిర్వహిస్తూ ఊతం ఇస్తున్నది. ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో కూడా తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించింది. ఇంకోవైపు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా భాషోత్సవాలు నిర్వహిస్తున్నది. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక సాహిత్య సేవా సంస్థలు భాషా, సాహిత్యాల ఉద్ధరణకు పాటుపడుతున్నాయి. -
ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో ఉండాలి: వెంకయ్య
సాక్షి, విశాఖపట్నం: తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులోనే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. గురువారం విశాఖలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరిచిపోకూడదు అని సూచించారు. మాతృభాషను కాపాడుకోడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అందుకు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడం తప్పనిసరి చేయాలన్నారు. ఇందుకోసం నిబంధనలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఏపీలోని ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చిన్న చిన్న దుకాణాల నుంచి సంస్థల పేర్ల వరకు కూడా తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంటే తెలుగు భాష మనుగడలో ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతీ దేశం తమ సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభాషలను కాపాడుకోకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని, మాతృభాషకు మళ్లీ మంచి రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు. తాను చైర్మన్ హోదాలో ఉన్నపుడు రాజ్యసభలో ఎంపీలు మాతృభాషలో మాట్లాడుకునేలా నిబంధనలు మార్చానని గుర్తు చేశారు. సమీర్ దినదానిభివృద్ధి చెందుతుండటం అభినందనీయం అని ప్రశంసించారు. సమీర్ పరిశోధనలు దేశానికి దిక్సూచిగా మారాలి అని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో జరుగుతున్న పరిశోధనలకు సమీర్ ప్రధాన కేంద్రంగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. -
తెలుగు ఔన్నత్యాన్ని చాటుదాం: సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈరోజు(గురువారం) తెలుగు భాషా దినోత్సవం జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు భాషాభివృద్ధికై గిడుగు రామమూర్తి చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహనీయుడి స్మరణలో.. గ్రాంథిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ రామమూర్తి ప్రాథమిక విద్య స్వస్థలంలోనే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. అనంతరం రామమూర్తి మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి. భాషను అమితంగా ప్రేమించే గిడుగు రామమూర్తి అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లిష్ కోశాన్ని నిర్మించారు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం ఆయనకు కైజర్-ఇ-హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు: సీఎం జగన్ జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు సాధించిన హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్.. దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అటువంటి గొప్ప క్రీడాకారుడిని స్మరించుకుంటూ నేడు ఆయన జన్మదినం సందర్భంగా క్రీడల దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. A memorable hockey legend, who led our country three times to golden glory at the Olympics. Marking Dhyan Chand's birth anniversary today, India fondly remembers him & celebrates #NationalSportsDay. My Greetings to all from the sports fraternity. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2019 -
తేనెకన్నా తీయనిది తెలుగు భాష
వేమన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు. వేడుక మాత్రమే కాదు ఈ రోజు వేదిక కావాలి. పవర్ రేంజర్స్ బదులు పంచతంత్ర కథలు పిల్లలకు కంఠతా రావడానికి ఈ రోజు వేదిక కావాలి. మన పద్యం మళ్లీ గత వైభవం సంతరించుకునేందుకు ఇదే రోజు అంకురార్పణ జరగాలి. సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : అమ్మతో కష్టసుఖాలు చెప్పుకునే భాష నోటికి బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్న భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు చేరదీసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వేడుకలు బాగానే ఉన్నాయి గానీ ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. వెన్న కన్నా మెత్తనైన తెలుగు భాష వర్తమానంలో పతనావస్థ అంచులపై వేలాడుతోంది. తెలుగు వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసి వైభవ ప్రాభావాలతో కళకళలాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థులు–ఉపాధ్యాయులు సంయుక్తంగా వైభవంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. తెలుగు కోసం ప్రభుత్వం ముందడుగు తెలుగు భాష మృత భాషగా మారుతోంది అన్న మాట వచ్చినప్పటి నుంచి పాఠశాలల్లోనూ తెలుగు భాషను సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండలం లో ఉన్న ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసికట్టుగా మం డల విద్యాశాఖాధికారి ఎంపిక చేసిన పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యధారణ, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్యపోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అం దించి, విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయించింది. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకా>కుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న జన్మించిన రామమూర్తి తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ ప్రాథమిక విద్య అక్కడే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. గిడుగు మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి. సవర భాష రూపశిల్పి అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది గిడుకు రామమూర్తికి. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర – ఇంగ్లిష్ కోశాన్ని నిర్మించాడు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి కైజర్ –ఇ– హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు. బోధన భాషగా తెలుగు తెలుగు భాష వ్యవహారంలో మాత్రం దూరమైపోతోంది. కనీసం పదో తరగతి వరకూ బోధన జరపాలని కృషి చేశాం. కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు లేకపోవడం దురదృష్టకరం. తెలుగు నేర్చుకుంటే అన్ని భాషలు వస్తాయి. మాతృభాషలో ప్రవేశం తప్పనిసరిగా ఉండాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి మాతృభాషను బోధన భాషగా చేయాలి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘాధ్యక్షునిగా పదవీ స్వీకరించిన నేపధ్యంలో ఇకపై తెలుగు బాగా వెలుగుతుందని ఆశిద్దాం. – డాక్టర్ ఎ.గోపాలరావు, అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు అమ్మభాషను పరిరక్షించుకుందాం తెలుగు లోగిళ్లలో అమ్మభాషను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. మాతృభాషను తృణీకరించడమంటే మన కళ్లను మనమే పొడుచుకోవడం వంటిది. భవిష్యత్ తరాల నోట మకరందాల తేనె ఊట ఊరాలి. తెలుగును నిలబెట్టుకోవడమంటే మన జాతి ఘన వారసత్వ సంస్కృతి, మూలధనాన్ని పరిరక్షించుకోవడమేనని నా ఉద్దేశం. తెలుగు వెలుగులు విరజిమ్మాలి. మనమంతా ఆ దిశగా కృషి చేయాలి. – సముద్రాల గురుప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ సమితి దేశ భాషలందు తెలుగు లెస్స ఏ భాషలోనూ లేనన్ని అక్షరాలు, మరే భాషలోను లేనట్టి అవధాన ప్రక్రియలు కలిగిన మధురమైన భాష తెలుగు. ఆంగ్ల మాధ్యమంపై వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయకూడదు. కన్నతల్లి మాతృభూమి, మాతృభాష ఎల్లప్పుడూ పూజలందుకోవాలి. అలా జరగాలంటే బాల్యం నుంచే పిల్లలకు తెలుగు పద్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు చెప్పి మాతృభాష మీద మమకారం పెంచాలి. అమ్మ భాషలోని కమ్మదనం అలవాటు చేస్తే మధురమైన తెలుగు భాషపై ఇష్టం పెంచుకుని తరువాతి కాలానికి వాళ్లే తీసుకెళ్తారు. రాష్ట్రంలో తెలుగు అమలుకు కొన్ని చర్యలు చేపట్టాలి. అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల తీర్పులు, వ్యాపార, వాణిజ్య సంస్థల పేర్లు, చలన చిత్రాల పేర్లు, వీధులు, కూడళ్ల పేర్లను తెలుగులోనే రాయాలని పొరుగు రాష్ట్రమైన తమిళనాడులా నిర్బంధ ఉత్వర్వులు జారీ చేయాలి. జారీ చేసిన ఉత్వర్వుల అమలుకు సరైన పర్యవేక్షణ చేయిస్తూ లోపాలు సరిదిద్దితే భాష మనుగుడ సులభతరం అవుతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత, పార్వతీపురం -
పరభాష వద్దు.. తెలుగే ముద్దు
కోడుమూరు రూరల్ (కర్నూలు): పరభాషల వ్యామోహంలో పడి అమ్మలాంటి తెలుగు భాషకు విద్యార్థులు దూరమవుతున్నారని తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్, తెలుగు భాషాకోవిదుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్ర పటాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఠాగూర్ విద్యానికేతన్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులంతా తెలుగుభాష, సంస్కృతి సంప్రదాయలపై విద్యార్థులు అవగాహన ఉండాలని, కేవలం జీవించడానికి మాత్రమే పరభాషలు సరిపోతాయన్నారు. అనంతరం తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థినీలు సాంస్కృతిక కార్యక్రమాలు, భువన విజయం నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ అనంతయ్య, ఎస్ఐ రామాంజులు, రిటైర్డ్ ఎంఈఓ నాగరత్నం శెట్టి, పాఠశాల కరస్పాడెంట్ కృష్ణయ్య, హెచ్ఎం మధు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశ్వవాణి హైస్కూల్లో.. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విశ్వవాణి హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుగుతల్లి చిత్ర పటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు ఆలపించిన గేయాలు, పద్యాలు ఏకపాత్రాభినయ సంభాషణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ ఖలీల్‌బాషా, డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎం గిడ్డయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలికల హైస్కూల్లో.. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా బాలికల హైస్కూల్లో హెచ్ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్, గిడుగు వెంకటరామమూర్తి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మభాష బతికించాలి సి.బెళగల్: ప్రతిఒక్కరూ మాతృభాషను బతికించాలని మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, రచయిత రేవుల శ్రీనివాసులు అన్నారు. బుధవారం గిడుగు వెంకటరామూర్తి జయంతిని పురస్కరించుకొని హెచ్ఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కిష్టన్న, హరిబాబు, దుగ్గెమ్మలు అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి, విద్యార్థులతో కవి, కవితా సమ్మేళనం నిర్వహించారు. హెచ్ఎం రేవుల శ్రీనివాసులును పాఠశాల సిబ్బంది, విద్యార్థులలు శాలువ కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు. అదేవిధంగా జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షతన తెలుగు ఉపాధ్యాయురాలు శ్యామల తెలుగ భాష దినోత్సవం సందర్ఢఃగా తెలుగు గొప్పతనాన్ని వివరిస్తూ కవిత్వాలు వినిపించారు. గూడూరు రూరల్: జూలకల్లోని ఆదర్శ పాఠశాలలో బుధవారం తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. గిడుగు వెంకటరామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషి, తెలుగు ప్రాధాన్యతపై విద్యార్థులకు ప్రిన్సిపాల్ నిర్మలకుమారి వివరించారు. అనంతరం విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు తెలుగుతల్లి వేషధారణతో పాటు తెలుగు సంప్రదాయాలు ప్రతిబిందించేలా వస్త్రాధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
తెలుగుదనం పదిలం కావాలంటే..
వ్యావహారిక భాషోద్యమానికి రాజమహేంద్రవరం వేదికగా నిలిచింది. ఇందుకు ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి పంతులుకు గొడుగులా అండగా నిలబడింది ఈ నేలే. రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న పర్లాకిమిడి పట్టణాన్ని ఒడిశాలో కలపేయడంతో ఆంధ్రపై ఉండే అభిమానంతో 1936వ సంవత్సరంలో ఏకంగా రాజమండ్రికి తన నివాసం మార్చుకున్నారు. తుది శ్వాస విడిచే వరకూ ఈ గడ్డనే ఆయన గుడిగా మలచుకున్నారు. సంస్కృతాభిమానుల ఛీత్కారాల మధ్య పోరాటం చేస్తూ సభలు, సమావేశాలను నిర్వహిస్తూ... తన వ్యాసాల ద్వారా వాడుక భాష ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 1897లో వెలువడిన గురజాడ ‘కన్యాశుల్కం’ పుస్తకం పీఠికలో ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ గా అభివర్ణించే మాతృ భాషంటేనే నాకు అభిమానం. ఆ సంకెళ్ల నుంచి బయటపడని వారు ఉండొచ్చుగాక ... వారంతా తమ సుఖాల్ని, కష్టాల్ని వెల్లడించడానికి వాడుకభాష కావాలి...కాగితం మీద పెట్టడానికి మాత్రం ముందుకురారంటూ చురకలంటించడంతో ఉద్యమానికి ఊపిరిలూదినట్టయింది. రాజమండ్రివాసైన కందుకూరి వారు కూడా వాడుక మాటలవైపే అడుగులేయకతప్పలేదు. ‘శ్మశానాల వంటి నిఘంటువులుదాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి ఇలా మన ముందుకు వచ్చి వాడుక భాష జీవం పోసుకోడానికి రాజమహేంద్రవరమే ఓ పెద్ద వరంగా మారడం విశేషం. తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్: ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షరి’.. ఇదో పుస్తకం పేరు. నేటి యువత ఈ పుస్తకం పేరు వింటేనే కంగారు పడొచ్చు. రాజమహేంద్రిని తన సాహితీసేద్యానికి ప్రధాన క్షేత్రం చేసుకున్న కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి రాసిన సుమారు రెండు వందల పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. నాడు గ్రాంథిక భాషకు ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఒక శతాబ్దం వెనుకకు వెళితే.. గ్రాంథిక భాష స్థానంలో వ్యావహారిక భాష ఆవిర్భవిస్తున్న రోజులు కనపడతాయి. సహజంగా, ఏ మార్పుకైనా తప్పని ప్రతిఘటనలు ఈ పరిణామక్రమానికి తప్పలేదు. వ్యావహారిక భాష కోసం గిడుగు ఉద్యమం.. 1936లో పర్లాకిమిడి పట్టణాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన ఒడిశా రాష్ట్రంలో విలీనం చేసినందుకు నిరసనగా గిడుగు రామ్మూర్తి తన నివాసం రాజమండ్రికి మార్చి, తుదిశ్వాస వదిలేవరకు ఈ నగరంలోనే గడిపారు. నేటి ఇన్నీసుపేట ప్రాంతంలోని ఏనుగుగుమ్మాలవారివీధిలో నివసించేవారని చెబుతారు. అప్పటికే వ్యావహారిక భాష ప్రజల్లో ప్రాచుర్యం పొందుతున్నా, కొక్కొండ వెంకటరత్నం వంటి సంస్కృతాంధ్ర విద్వాంసులు ఈ ప్రక్రియను నిరసించసాగారు. కొక్కొండ వెంకటరత్నం పేరిట టి.నగరులో ఒక వీధి నేటికీ ఉంది. నాటి తాలూకా కార్యాలయం ఉత్తరం వైపు వీధిలో ఆయన నివసించేవారు. వ్యావహారిక భాషను రచనల్లో ప్రయోగించడాన్ని సమర్థ్ధిస్తూ, వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో సైతం సభలు, సమావేశాలు, పత్రికల్లో వ్యాసాలు చోటు చేసుకునేవి. 1897లో గురజాడ కన్యాశుల్కం మొదటి ముద్రణ, కొన్ని మార్పులు, చేర్పులతో 1909లో వెలువడిన కన్యాశుల్కం మలి ముద్రణ తెలుగునాట ప్రభంజనాన్ని సృష్టించాయి. కన్యాశుల్కానికి పీఠికలో గురజాడ అన్న మాటలను మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.. ‘సంకెళ్లను ప్రేమించే వాళ్లు దాన్ని–అనగా గ్రాంథిక భాషను–ఆరాధిస్తారు గాక, నా మట్టుకు నా మాతృభాష సజీవమైన తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాల్ని, మన దుఃఖాల్ని వెల్లడించుకోవడానికి మనం యవరమూ సిగ్గు పడలేదు కాని, కాగితం మీద పెట్టుకోవడానికి మాత్రం కొందరు బిడియపడుతున్నారు! ‘గ్రామ్యం అని పొరపాటు పేరుపెట్టి పిలిచే వాడుక భాషను కావ్యరచనలలో ప్రవేశపెడితే ఉత్తమ కావ్యాలకు ఉండవలసిన గౌరవం దిగజారిపోతుందనే విమర్శనను మనం లెక్క చేయనక్కరలేదు. ఎందుచేతనంటే, కావ్య ప్రశస్తి, కావ్య ప్రయోజనము నిర్ణయించేవి పాతకాలపు వైయాకరణుల ఛాందసాలు కావు. భాషాశాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అంతకన్నా మంచి గీటురాళ్లే మనకందుబాటులోకొచ్చాయి.’ తరువాత కాలంలో వచ్చిన శ్రీశ్రీ ‘శ్మశానాల వంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి’ కవితలు రాశానని పేర్కొన్నాడు. కాంచవోయి నేటి దుస్థితి... తెలుగు భాషాదినోత్సవం జరుపుకోవడానికి ఏముంది గర్వకారణం? భాషను కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయవలసిన పాడు రోజులు దాపురించాయి. రాజమహేంద్రవరాన్ని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రధాన కేంద్రంగా చేస్తానని 2015 పుష్కరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. అయిదారు నెలలకు రెండు నెలల జీతం రాళ్ల ఇస్తున్నారు. సంస్థ మనుగడపై సందేహాలు సృష్టించడంతో కొత్తగా చేరే విద్యార్థులు కరువైపోతున్నారు. అతివలకు సంస్కృతాంధ్రాలు నేర్పుతున్న, అతి ప్రాచీనమైన ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల 8 జిల్లాలలో ఏకైక కళాశాల.. శతావధానాలు చేస్తున్న మహిళలు చదువుకున్న కళాశాల.. గోదావరీ తీరాన, మన నగరంలో ఉంది. ఎయిడెడ్ హోదా కోల్పోయి, దాతల విరాళాలతో మనుగడ సాగిస్తోంది.. కళాశాలను ఆదుకోవాలని ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా, అన్నీ బుట్టదాఖలయ్యాయి. ఎందరో మహామహోపాధ్యాయులు పాఠాలు చెప్పిన ప్రతిష్టాత్మకమైన గౌతమీ విద్యాపీఠం కనుమరుగైపోతే, రెండు కన్నీటిబొట్లు రాల్చడం మినహాయించి, ఏమి చేయగలిగామని భాషాభిమానులు వాపోతున్నారు. అమ్మ భాషకు పట్టాభిషేకం బిక్కవోలు: అక్షరం ఆకాశంలో విహరిస్తున్నపుడు.. కావ్యాలు సామాన్యుల నోటికి అందనంత దూరంలో ఉన్నప్పుడు వచనాలు వినడానికి కూడా అవకాశం లేనప్పుడు ఓ అక్షర సైనికుడు ఉదయించాడు. సామాన్యుడి కోసం రచన అన్న సూత్రాన్నిప్రవేశపెట్టాడు. ఆకాశ మార్గంలో ఉన్న అక్షరాలను నిచ్చెన వేసి కిందకు దించాడు. మన ఊరిలో, మన వీధిలో, మన ఇంటి ముందు నిలిపే తులసికోటలా అందమైన అక్షర శిల్పాలను తీర్చిదిద్దాడు. గ్రాంథికం నుంచి తెలుగును వ్యవహారికంలోకి మార్చి అతి పెద్ద సాహితీ మార్చునకు ఆద్యుడయ్యాడు. తెలుగుజాతి గొప్పదనాన్ని ఖండాతరాలకు చాటి చెప్పిన ఆ సైనికుడి పేరు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన జయంతిని బుధవారం మాతృభాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పంచదార కన్నా, పాలమీగడ కన్నా, చెరకు రసం కన్నా మధురమైనది మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగులెస్స అని కృష్ణదేవరాయులు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా నికోలో డీ కోంటి పేర్కొని మన తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. క్రీస్తు శకం 200 సంవత్సరంలో లిఖించిన అమరావతి శాసనంలో నాగబు అనే తెలుగు పదం కనిపిస్తుంది. తెలుగు భాష ప్రాచీనత్వానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. దేశంలోని అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఒకటి. ఇతర భాషలకు ప్రాచీన హోదా ఎప్పుడో లభించినా తెలుగుభాష మాత్రం వివక్షకు గురవుతూనే వచ్చింది. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. ఆయన హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా వచ్చేందుకు ఏబీకే ప్రసాద్‌ను తెలుగు భాషా సంఘానికి అధ్యక్షుడిగా నియమించి ఆయన ద్వారా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. అయినా కోర్టు తెలుగు ప్రాచీన హోదా నిర్ణయానికి మద్దతుగా తీర్పునివ్వడం ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగ్గ విషయం. మన భాష సంస్కృతి, సంప్రదాయాలు సమోన్నతమైనవి. మానవీయ కోణంలోనూ, భారతీయ దార్శనికతలోనూ తెలుగు సంప్రదాయాల పాత్ర అమోఘం. తెలుగుదనం పదిలం కావాలంటే.. ⇔ ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, అధికార సమాచార వినిమయం తెలుగులోనే అమలు చేయాలి ⇔ తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువను పెంచే పాఠ్యాంశాలను సిలబస్‌లో చేర్చాలి ⇔ తెలుగు వారి ప్రధాన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిధులలేమి లేకుండా చక్కగా నిర్వర్తించాలి ⇔ కవులు, కళాకారుల ప్రతిభను గుర్తించడం రాగద్వేషాలకు అతీతంగా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా జరగాలి. ⇔ అంతర్జాతీయ స్థాయికి తెలుగు ఘనతను చేర్చిన ప్రతిభావంతులకు, అందుకు మార్గదర్శకులుగా ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ⇔ ముఖ్యంగా క్రీడారంగంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ⇔ తెలుగు రుచులు, అభిరుచులను వృద్ధి చేసేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిపి కార్యక్రమాలు నిర్వహించాలి ⇔ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలి ⇔ ప్రభుత్వం తెలుగు శతక పద్యాలపై రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి, ప్రతిభను ప్రోత్సహించాలి. ⇔ నూతన రచనలు వెలుగులోకి తెచ్చేందుకు చేయూతనివ్వాలి ⇔ ప్రతి జిల్లా కేంద్రలోనూ తెలుగు వికాస భవనాలు నిర్మించి తెలుగు భాషాసేవా కార్యక్రమాలు నిర్వహించాలి వ్యావహారిక భాషాక్రమంలో తప్పుడు పదప్రయోగాలు వ్యావహారిక భాషను ప్రోత్సహించడమంటే, తప్పుడు, కృత్రిమ పదాలను ఉపయోగించడమని అర్ధం కాదు. ‘జయంతోత్సవము’, ‘పాలాభిషేకము’ వంటి తప్పుడు పదాలను వాడడం సరికాదు. మనం ఒక విషయాన్ని విస్మరించరాదు. ఆధునిక కవులు శ్రీశ్రీ వంటివారికి సైతం ప్రాచీన సాహిత్యంపై గట్టి పట్టు ఉంది. సాహిత్యం కాలాన్ని బట్టి ఎన్ని మార్పులకు లోనైనా, మంచి సాహిత్యమనేది సార్వజనీనము, సార్వ కాలీనము అనే రెండు లక్షణాలను సంతరించుకుని ఉంటుందనే సత్యాన్ని మనం విస్మరించకూడదు.– డాక్టర్ అరిపిరాల నారాయణరావు -
తెలుగు భాషా దినోత్సవం నాడే..
సాక్షి, హైదరాబాద్ : మాతృభాషపై మమకారం అధికంగా ఉండే నందమూరి హరికృష్ణ వేదిక ఏదైనా అచ్చ తెలుగులో మాట్లాడటాన్ని ఆస్వాదించేవారు.రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని హరికృష్ణ ధ్వజమెత్తిన సంగతిని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలనే కాంక్షతో సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేశారు. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు భాషను అమితంగా ప్రేమించే హరికృష్ణ మరణించడం బాధాకరమని భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
తాజ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న తెలుగు ప్రవాసీయులను అభినందిస్తూ పురస్కరించారు. తెలుగు భాష వ్యాప్తి కొరకు ప్రవాసీయులకు సాఫ్ట్‌వేర్‌ను ఉచింతగా అందించిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ సయీదోద్దీన్ను ఈ కార్యక్రమంలో సన్మానించారు. అక్కడి పాఠశాలలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల కొరకు తెలుగు భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన వారిని కూడ ఈ సందర్భంగా తాజ్ సత్కరించింది. సౌదీ అరేబియాలో తెలుగు భాష వ్యాప్తి కొరకు తాజ్ చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ వివరించారు. కుల, మత మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తెలుగు ప్రవాసీయుల కొరకు తాజ్ కృషి చేస్తున్నదని ప్రధాన కార్యదర్శి మేడికొండు భాస్కర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వహీద్, శ్రీ లక్ష్మిలు పాడిన గేయాలు అలరించాయి. చిన్నారి సాయి దీక్షిత సాంప్రదాయ నృత్యం, తెలుగు ప్రముఖులను అనుకరిస్తూ చిన్నారుల వేషధారణలు సభికులను ఆకట్టుకున్నాయి. -
తీరికలేదు తల్లీ..!
మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. అని కీర్తిస్తున్నాం.. కానీ ఆ తల్లి మెడలో వాడిన పూలదండ..గ్రాంధిక చెరలో మగ్గిపోయిన తెలుగును సామాన్యులకు చేరువ చేశారంటూ గిడుగు రామ్మూర్తికి నీరాజనాల గొడుగు పడుతున్నాం..ఆయన జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా కొన్నేళ్ల నుంచీ జరుపుకొంటున్నాం.. కానీ దురదృష్టం.. తెలుగును బతికించాల్సిన పాలకులకే తెలుగుతల్లి గానీ.. గిడుగువారు గానీ గుర్తురాలేదు..తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిందని ఘనంగా చెప్పుకొంటున్న తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ దురవస్థ పట్టడం నిజంగా విచారకరం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఉత్సాహంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించగా.. మంత్రులు, అధికార పార్టీ ప్రముఖులు అసలు వాటి చాయలకే పోకపోవడం సిగ్గుచేటు..సాధారణంగా సాంస్కతిక శాఖ ప్రభుత్వపరంగా అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. కానీ ఈసారి ఎందుకో అధికారులు సైతం శీతకన్ను వేశారు. ఫలితంగా మద్దిలపాలెం జంక్షన్లో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహం ఒక్క పూలదండ కాదు కదా.. కనీసం శుభ్రతకైనా నోచుకోకుండా ఇదిగో ఇలా.. దీనంగా మిగిలిపోయింది. -
భారత్‌లో రెండో పెద్ద భాష తెలుగు
విజయవాడ కల్చరల్: భారత్‌లో రెండడో పెద్దభాష తెలుగు అని సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు తెలిపారు. తెలుగు కళావాహిని, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీలు సంయుక్తంగా గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రెండో అధికార భాషగా తెలుగును గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ఆర్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు భాష అంధకారంలో పడిందని, దాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. కళాభారతి అధ్యక్షుడు శింగంశెట్టి పెదబ్రహ్మం ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాష అమలు అంశంగా ప్రసంగించారు. భాషావేత్తలు కొండపల్లి మాధవరావు, కోనాడ అశోక్సూర్య. భాస్కరశర్మ, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ బాలకృష్ణ, పరిశోధకుడు డాక్టర్ జయంతి చక్రవర్తి తదితరులను సత్కరించారు. కార్యక్రమాన్ని తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు నిర్వహించారు. -
తెలుగును కాపాడుకుందాం: వైఎస్ జగన్
హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష మన ప్రాచీన సంపద అని, దానిని కాపాడుకుందాం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స. మాతృ భాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం, పెంపొందిద్దాం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2016 -
తెలుగు భాషను కాపాడుకోవాలి
నెల్లూరు(బృందావనం): మధురమైన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పెన్నా రచయితల సంఘం కార్యదర్శి గోవిందరాజు సుభద్రాదేవి పేర్కొన్నారు. తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కస్తూర్బా కళాక్షేత్రం ప్రాంగణంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. భాగవతాలు, యక్షగానాలు, హరిక«థలు, పద్యాలు, బుర్రకథలు తెలుగుభాష పూలమాలలోని పుష్పాలన్నారు. పుష్పాలు రాలిపోతుండడం బాధాకరమన్నారు. తెలుగుభాష, సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ నడుంభిగించాలన్నారు. తొలుత తెలుగుభాషకు విశిష్ట సేవలందించిన గిడుగు రామ్మూర్తికి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో మోపూరు పెంచలనరసింహం, ఇంద్రగంటి మధుసూదన్‌రావు, అచ్యుత మణి, అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం, గుండాల నరేంద్రబాబు, కవితా కృష్ణమూర్తి , వెంకట్రావ్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
మన పిల్లల తలరాతలో తెలుగు రాత లేదా?
కవర్ స్టోరీ ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా... దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన తెలుగువాడు కాదు. మాతృభాష తుళు. అయినా తెలుగును ఎంతగానో ప్రోత్సహించాడు. తన ఆస్థానంలో అష్టదిగ్గజాలను పోషించి ఆంధ్రభోజుడిగా ఖ్యాతిగాంచాడు. అంతేనా? తానే స్వయంగా ‘ఆముక్త మాల్యద’ కావ్యాన్ని రాశాడు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు ఉజ్వలంగా వెలిగింది. తర్వాత కొన్ని శతాబ్దాలకు దేశంలో బ్రిటిష్ పాలన మొదలైంది. దేశంలో ఇంగ్లిష్ ప్రభావం పెరిగింది. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెనుమార్పులే వచ్చిపడ్డాయి. అలాంటి గడ్డు కాలంలో కూడా తెలుగు భాష మనుగడకు ముప్పేమీ ఏర్పడలేదు. ఇప్పుడిక తెలుగు భాషకు ప్రాచీన హోదాను కూడా సాధించేసుకున్నాం. ఏముందిలే! ఇక తెలుగు దివ్యంగా వెలిగిపోతుందనే భరోసా మాత్రం కనిపించడం లేదు. పరిస్థితులను గమనిస్తుంటే తెలుగు వెలుగులు కొడిగట్టేసే కాలం దాపురిస్తోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుగు భాష అభివృద్ధికి ఒరగబెడుతున్నదేమీ కనిపించడం లేదు. రకరకాల కుంటి సాకులతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతుంటే, విత్తాపేక్షతో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును తోసిరాజని ఇంగ్లిష్ చదువులు రాజ్యమేలుతున్నాయి. తెలుగు రాత మన పిల్లల నుదిటిరాత కాలేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రాచీన నేపథ్యం రాజరాజ నరేంద్రుడి ఆస్థానకవి నన్నయ పదకొండో శతాబ్దిలో ఆంధ్ర మహాభారత రచనకు పూనుకున్నా, అప్పటికి శతాబ్దాల ముందు నుంచే తెలుగు భాష, ఛందస్సు, సాహిత్యం ఉనికిలో ఉండేది. భట్టిప్రోలు వద్ద లభించిన క్రీస్తుపూర్వం 400-100 సంవత్సరాల నాటి శాసనాల్లో తెలుగు పదాలు కనిపించాయి. నన్నయ కంటే ముందే తెలుగులో పద్యరచన జరిగిందనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాశి గ్రామ శివార్లలో శిథిలావస్థలో ఉన్న శిలాశాసనంపై సీసపద్యం నన్నయ కాలానికి మునుపటిదేనని పరిశోధకులు చెబుతున్నారు. కన్నడ ఆదికవి పంపన తెలుగులోనూ కవిత్వం రాశాడు. నన్నయకు మునుపటి వాడైన పంపన తెలంగాణలోని వేములవాడ ప్రాంతానికి చెందినవాడేనని తెలంగాణ ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు ఆధారాలు సమర్పించింది. నన్నయ తర్వాత తిక్కన, ఎర్రనలు వేర్వేరు కాలాల్లో ఆంధ్ర మహాభారత రచనలో పాలు పంచుకున్నారు. పాల్కురికి సోమనాథుడు జాను తెలుగులో కావ్యరచన చేశాడు. తర్వాతి కాలంలో శ్రీనాథుడు కవిసార్వభౌముడిగా వెలుగొందితే, పోతన భాగవతాన్ని తెలుగుజాతికి కానుకగా అందించాడు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయల కాలం తెలుగు భాషా సాహిత్యాలకు స్వర్ణయుగమే. ఆయన ఆస్థానంలో ఆశ్రయం పొందిన అష్టదిగ్గజ కవులు రచించిన ప్రబంధాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు అజంత భాష. పాశ్చాత్య ప్రపంచంలో ఇటాలియన్ కూడా అజంత భాషే. విజయనగర సామ్రాజ్య కాలంలోనే 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటి అజంత పదాలతో కూడిన తెలుగు భాష సొగసుకు అబ్బురపడ్డాడు. ఆయన తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’గా అభివర్ణించాడు. తెలుగు ఘనతను చెప్పుకోవడానికి చాలామంది ఇప్పటికీ నికోలో మాటలను ఉటంకిస్తూ ఉంటారు. తొలినాళ్లలో తెలుగుపై సంస్కృత, ప్రాకృతాలు మినహా ఇతర భాషల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. పద్యరచన పరిఢవిల్లిన కాలం అది. ఎందరో కవులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. శతకాలు రాశారు. అన్నమాచార్యుడు, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు సంకీర్తనలను, పదాలను రాశారు. వారు సృష్టించిన సాహిత్యమంతా తెలుగువారి జాతి సంపద. సుల్తానుల పాలనలో... తుగ్లక్ వంశీయుల కాలం నుంచి తెలుగునేలపై సుల్తానుల ప్రభావం పడింది. 14వ శతాబ్దిలో తుగ్లక్ హయాంలో దక్కను పీఠభూమిలోని ఉత్తర ప్రాంతం సుల్తానుల పాలన కిందకు వచ్చింది. మొఘల్ వంశీయుల హయాంలో 17వ శతాబ్ది నాటికి దక్షిణాదిన సుల్తానుల ప్రాబల్యం మరింత విస్తరించింది. సుల్తానుల హయాంలో తెలుగు భాష అరబ్బీ, పారశీ భాషల ప్రభావానికి లోనైంది. హైదరాబాద్‌లో అసఫ్ జాహీ వంశీయుల పాలన 1724 నుంచి మొదలవడంతో తెలుగుపై అరబ్బీ, పారశీ భాషల ప్రభావం మరింత పెరిగింది. క్రమంగా ఉర్దూ వాడుక కూడా పెరిగింది. సుల్తానుల పరిపాలన కొనసాగిన తెలుగు ప్రాంతాల్లో విలక్షణ మాండలికాలు ఏర్పడ్డాయి. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ అధికార భాషగా ఉండేది. అయినా అప్పట్లో సైతం తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు సాహిత్యం బలంగానే వెలువడింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి వారు ఈ ప్రాంతంలో తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికి, తెలుగు గ్రంథాలయాల స్థాపనకు చిరస్మరణీయమైన కృషి చేశారు. బ్రిటిష్ పాలనలో... బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రభావం పెరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. నిజాంల హయాంలోని హైదరాబాద్ ప్రాంతం మినహా మిగిలిన తెలుగు ప్రాంతమంతా మద్రాసు ప్రావిన్స్ పరిధిలోకి చేరింది. ఇంగ్లిష్ చదువుల ప్రభావంతో తెలుగు సాహిత్యం ఆధునికతను సంతరించుకుంది. అప్పట్లోనే పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక వంటి రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు వంటివారు ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు. తెలుగు భాషను పామరులకు చేరువ చేయాలనే సంకల్పంతో గిడుగు వెంకటరామమూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమానికి నాంది పలికారు. గిడుగు వారి ప్రభావంతోనే గురజాడ తన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని వాడుక భాషలో రాశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకం ఒక మైలురాయి. తర్వాతి రచయితల్లో చాలామంది గురజాడ అడుగుజాడలనే అనుసరించారు. ఒకప్పుడు తెలుగు సాహిత్యంలో పద్యరచన మాత్రమే ప్రధానంగా ఉండేది. బ్రిటిష్ పాలన మొదలయ్యాక పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంతో తెలుగు సాహిత్యంలోనూ కొత్త కొత్త ప్రక్రియలు మొదలయ్యాయి. కథానిక, నవల వంటి ఆధునిక ప్రక్రియలు అప్పట్లో మొదలైనవే. ఇక గిడుగు వారి శిష్యుడైన తాపీ ధర్మారావు పత్రికా రచనలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇంగ్లిష్ చదువుల ప్రభావం గణనీయంగానే ఉన్నా, తెలుగు భాషా సాహిత్యాలకు పెద్ద ఇబ్బందులేవీ కలగలేదు. పైగా ఆ కాలంలో కొందరు కవులు విరివిగా పద్య కావ్యాలను విరచించారు. ఇంకొందరు కవులు అష్టావధానాలు, శతావధానాలు వంటి సాహితీ విన్యాసాలతో తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. తెలుగు భాషా సేవకుడు బ్రౌన్ బ్రిటిష్ రాజ్యంలో తెలుగు ప్రాంతాల్లో పనిచేసిన బ్రిటిష్ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మమకారం పెంచుకుని, తెలుగు భాషకు ఎనలేని సేవ చేశాడు. మరుగునపడ్డ వేమన పద్యాలను, పలు ప్రాచీన కావ్యాల లిఖిత ప్రతులను వెలికితీసి, వాటిని పండితుల చేత పరిష్కరింపజేశాడు. పండితులకు తన సొంత డబ్బుతోనే ఆయన జీతాలు చెల్లించేవాడు. రాజమండ్రి, మచిలీపట్నం, కడప ప్రాంతాల్లో పనిచేసిన బ్రౌన్ తెలుగు విద్యావ్యాప్తికి ఎంతగానో దోహదపడ్డాడు. తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువును రూపొందించాడు. రిటైర్మెంట్ తర్వాత బ్రిటన్‌కు వెళ్లిన బ్రౌన్ కొంతకాలం లండన్ వర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రాచీన హోదాకు తెలంగాణ కృషి తెలుగు భాషకు ప్రాచీన హోదాలపై తలెత్తిన చట్టపరమైన చిక్కులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో కృషి చేసింది. మద్రాసు హైకోర్టుకు తగిన ఆధారాలను సమర్పించడంతో పాటు తన వాదనలను బలంగా వినిపించింది. ఇదే వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం ఉదాసీనతను ప్రదర్శించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని ముందుకు తీసుకుపోయేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. కనీసం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వమైనా ప్రయత్నించడంతో తీర్పు అనుకూలంగా వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక... స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు సాహిత్యంపై శ్రీశ్రీ చెరగని ముద్రవేశారు. ‘ఈ యుగం నాది’ అని సగర్వంగా ప్రకటించుకున్న శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహితీ జగత్తును ఓ కుదుపు కుదిపింది. నిజానికి ఆయన ‘మహాప్రస్థానం’ స్వాతంత్య్రానికి ముందే రాసినా, స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకు పుస్తకరూపంలో వెలువడింది. శ్రీశ్రీ కవిత్వంతో తెలుగు సాహిత్యంలో సామ్యవాద భావజాలం ఒక ప్రధాన స్రవంతిగా అవతరించింది. అంతేకాదు, శ్రీశ్రీ ప్రభావంతో తెలుగు కవిత్వంపై ఛందోబంధాల పట్టు సడలింది. మరోవైపు విశ్వనాథ సత్యనారాయణ వివిధ సాహితీ ప్రక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ‘రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి రచనలు చేసిన విశ్వనాథ జ్ఞానపీఠ అవార్డును అందుకున్న తొలి తెలుగు రచయితగా ఖ్యాతి పొందారు. ఆయన తర్వాత డాక్టర్ సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ ఈ అవార్డును పొందారు. విశ్వనాథ వారికి సమకాలికుడైన గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో దళిత వాణిని వినిపించారు. అప్పట్లోనే చలం స్త్రీల పక్షాన నిలిచి చేసిన రచనలు ఓ కుదుపు కుదిపాయి. స్వాతంత్య్రానంతర కాలంలో వివిధ భావజాలాలు, సిద్ధాంతాల ప్రభావంతో వివిధ ప్రక్రియల్లో విరివిగా వెలువడిన సాహిత్యం తెలుగు భాషను మరింత సుసంపన్నం చేసింది. గ్రాంథిక భాష నుంచి వ్యావహారానికి మళ్లిన సాహిత్యం అక్కడికే పరిమితం కాకుండా ప్రాంతీయ మాండలికాలకూ విస్తరించింది. అత్యాధునిక కాలంలో సైతం తెలుగు సాహిత్యంలో అవధాన కళ ఇంకా కొనసాగుతూ ఉండటం విశేషం. మరోవైపు దిగంబర కవిత్వం తెలుగు సాహిత్యంలో కొన్నాళ్లు కలకలం రేపింది. ఇక అభ్యుదయవాదం, విప్లవవాదం, స్త్రీవాదం, దళితవాదం వంటి అస్తిత్వవాదాలు కూడా తెలుగు సాహిత్యంపై తమదైన ముద్ర వేశాయి. చదువుల్లో సన్నగిల్లిన ప్రోత్సాహం భాషాపరమైన అస్తిత్వం కోసమే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత నిజాం అధీనంలోని ప్రాంతాన్ని కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు చదువుల్లో ప్రోత్సాహమే సన్నగిల్లింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాభవం కొనసాగిన కొద్ది దశాబ్దాల కాలం మాత్రమే చదువుల్లో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం లభించింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఊరూరా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకు రావడం మొదలైనప్పటి నుంచి చదువుల్లో తెలుగు భాషకు గడ్డుకాలం దాపురించింది. ఇంగ్లిష్ మీడియం చదువులు అనివార్యమనే దుస్థితి వాటిల్లింది. పట్టుమని పది తెలుగు పద్యాలు నోటికొచ్చిన పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తెలుగు నేల మీద తెలుగు చదువుకోకుండానే ఉన్నత చదువులకు ఎగబాకగల సౌలభ్యం అందుబాటులోకి వచ్చాక ఉన్నత, మధ్యతరగతి వర్గాల్లో తెలుగుపై తృణీకార భావం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి దుస్థితి ఉంటే, ఇక సరిహద్దు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటోందో ఊహించుకోవాల్సిందే! ఇలాంటి గడ్డుకాలంలో తెలుగు భాషకు ప్రాచీనహోదా దక్కడం కొంత ఊరట. అయితే, తెలుగు భాష పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యమస్ఫూర్తితో చర్యలు చేపట్టక తప్పదు. ప్రాచీన హోదా దక్కింది కదా అని సంబరపడిపోయి, అంతటితో సరిపెట్టేసుకుంటే తెలుగు భాష మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తడానికి ఎంతోకాలం పట్టదు. మన పిల్లల తలరాతలో తెలుగురాత చెరిగిపోకుండా ఉండాలంటే అందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇప్పటికైనా మెలకువ తెచ్చుకుని చిత్తశుద్ధితో తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలి. ఇందుకు తమ తమ స్థానిక భాషలపై శ్రద్ధ చూపుతున్న పొరుగు రాష్ట్రాల విధానాల నుంచి స్ఫూర్తి పొందాలి. తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో అక్కడి స్థానిక భాషలను నేర్చుకోవడం తప్పనిసరి. త్రిభాషా సూత్రంలో భాగంగా ఏ స్థాయి విద్యార్థులైన అక్కడి స్థానిక భాషలను నేర్చుకోవడం ఆ రాష్ట్రాలలో తప్పనిసరి. ప్రాచీనహోదాకు వైఎస్ కృషి మన దేశంలో ప్రాచీన హోదా లభించిన భాషలు ఇప్పటికి నాలుగే ఉన్నాయి. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ భాషలకు మాత్రమే ప్రాచీన హోదా దక్కింది. ఉత్తరాది భాషల్లో దేనికీ ఈ హోదా దక్కకపోవడం గమనార్హం. మన దేశంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. హిందీ, బెంగాలీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలుగువారు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై లేరు. మన దేశంలోని పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాలలో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగానే ఉంది. క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉనికిలో ఉన్న తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలనే డిమాండు ఎప్పటి నుంచో ఉన్నా, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ దిశగా గణనీయమైన కృషి జరిగింది. వైఎస్ హయాంలో ఎంతో చరిత్ర కలిగిన తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ శాసనసభలోను, శాసనమండలిలోనూ తీర్మానాలను ఆమోదించారు. ఈ రెండు తీర్మానాలనూ వైఎస్ స్వయంగా ప్రతిపాదించారు. తెలుగుకు ప్రాచీన హోదా సాధించడం కోసం ఆయన ఢిల్లీ స్థాయిలోనూ చర్చలు జరిపారు. -
అమ్మ ఒడి కమ్మదనం
నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం సుసంపన్నమైన తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని తమ అమూల్యమైన రచనలతో పరిపుష్టం చేసిన మహానుభావులెందరో...ప్రాచీన సాహిత్యంలో నాటి నన్నయ్య, తిక్కనల నుంచి ఆధునిక సాహిత్యంలో విశ్వనాథ, జాషువా, గురజాడ, శ్రీశ్రీ వరకు ఎందరో కవులు తెలుగు భాషామతల్లికి సేవలందించి, కన్నతల్లి రుణం తీర్చుకున్నారు. తెలుగుభాష మాట్లాడడమంటేనే చిన్నచూపుగా భావిస్తున్న నేటి సమాజంలో తెలుగు టెంగ్లిష్‌గా మారిపోతోంది. రానురాను అంతర్ధాన మైపోయే ప్రమాదం ముంచుకొస్తోందని తెలుగు భాషాభిమానులు పడుతున్న ఆందోళనలో నిజం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి జాతి తమతమ మాతృభాషలకు పెద్దపీట వేసి గౌరవిస్తుంటే మనం మాత్రం ఇలా...మన భాషను మనమే చంపుకోవడం బాధాకరం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నైనా మాతృభాషా పరిరక్షణకు కంకణబద్ధులమవుదాం... గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ అమ్మ మనసంత కమ్మనౌ మాతృభాష ... స్నేహపుష్ఫంకంబౌచును చెలగుబాష మాతృభాష అని కొనియాడారు కవులు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని తెగలు, వర్గాలు ఉన్నాయో అన్ని భాషలు పుట్టాయి.విదేశాల్లో పుట్టి పెరిగినా జన్మభూమి మాతృభాష, కన్న తల్లిదండ్రులు పూజ్యనీయులే. మాతృభాషను తప్పక ఎందుకు మాట్లాడాలి అనే విషయమై పరిశోధన చేసిన భాషా శాస్త్రజ్ఞులు కొన్ని కారణాలు నిర్ధారించారు. మనిషిలో జన్యుపరంగా వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు ప్రభావితం చేస్తాయి. మాతృభాష చిన్నప్పటి నుంచి చదవడం, వినడం వల్ల మనోవికాసం కలుగుతుంది. మాతృభాషలో పిల్లలు మాట్లాడితే పరిసరాల పరిజ్ఞానం త్వరగా పొందగలరు. మనస్సులో భావాలను సులభంగా పిల్లలు మాతృభాషలో వ్యక్తం చేయగలుగుతారు. పిల్లలు సాంఘికంగా కొన్ని ప్రత్యేక అంశాలను సులభంగా మాతృభాషలో నేర్చుకుని సృజనాత్మక రచనలు చేయడానికి ఉద్యుక్తులవుతారు. సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలు తెలుగు భాష అనగానే కొందరు పౌరాణిక పద్యాలు, పాటలు, గేయాలు గ్రాంథిక భాష వరకే పరిమితం అనుకుంటారు. వాటివలన మనకు ఉపయోగం ఏమిటంటూ విమర్శిస్తుంటారు. ప్రాచీన కాలం నుంచి తెలుగులో ఎన్నో భాషోద్యమాలు, సాహిత్యోద్యమాలు జరిగాయి. సమాజాన్ని కదిలించాయి. గురజాడ, శ్రీశ్రీ వంటి వారి రచనలు సాంఘిక దురాచారాలపై దండెత్తాయి. పాఠకుడికి జీవితం పట్ల నూతన విశ్వాసం కలిగించేలా వేలాది రచనలు సాగాయి. సాంఘిక దురాచారాలు, దురలవాట్లు పారదోలేలా ఉద్యమాలకు మన తెలుగు సాహిత్యం స్ఫూర్తినిచ్చింది. సమకాలీన ప్రజల జీవితాన్ని వస్తువుగా తీసుకుని నాటకం, కథ, సామెతలు వంటి ఎన్నో ప్రక్రియలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. మాతృభాషను స్వచ్ఛంగా భావితరాలకు అందించాలి తేనెలొలుకు తెలుగు భాష టెంగ్లిష్‌గా మారడం భవిష్యత్తులో ప్రపంచంలో అంతరించే భాషల వరుసలోకి ఎక్కడం తెలుగు జాతివారమని గర్వపడే అందరి మనసులను కలిచివేస్తోంది. దీనివల్ల నేటి యువత హావభావాలు, సామాజిక నడవడికలోనూ ఎన్నో వింత పోకడలు పెరిగాయని పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఈ పరిణామాలు నేటి తరం, భవిష్యత్తు తరాలకు నష్టం తెస్తుందనడంలో సందేహం లేదు. మన తెలుగు భాషను కాపాడుకోవడంతో పాటు స్వచ్ఛత నిలుపుకొని భావితరాలకు అందిస్తేనే మన జాతి మనుగడకు శుభదాయకమంటున్నారు సాహితీవేత్తలు, సామాజిక స్పృహ ఉన్న విద్యావేత్తలు. అవి వారి మాటల్లోనే... -
ప్రజలే సాగనంపుతారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రజల అభీ ష్టం మేరకు ప్రభుత్వాలు, పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే వాటిని ప్రజలే సాగనంపుతారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి. ‘‘గతంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఎన్నో ప్రభుత్వాలను ప్రజలు సాగనంపారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సున్నిత అంశంపై తెలుగువారి మనస్సులో ఆశిస్తున్న నిర్ణయమే తాము తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులు ఇష్టమైనా, కష్టమైనా సహనం కోల్పోకుండా క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకునే శక్తిని ప్రసాదించాలని తెలుగుతల్లిని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చాలా సున్నిత వాతావరణం ఉందని, ఇరు ప్రాం తాల్లో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సమ్మెలు, ఉద్యమాలు చట్టపరిధికి లోబడి, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని, ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల మేలు కోసమే కృషి చేయాలని, వారి మనసులోని ఆలోచనలను అనుసరించి నిర్ణయాలు ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారని, పార్టీలు, ప్రభుత్వాలు కాదని స్పష్టంచేశారు. పార్టీలు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనన్నారు. ప్రజల మనస్సులోని ఆకాంక్షలను అనుసరించి, వారు మనస్సులో ఎలాంటి నిర్ణయం ఆశిస్తున్నారో అలాంటి నిర్ణయమే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి: సీఎం పిల్లలకు బాల్యదశ నుంచే తెలుగు నేర్పించాలని, ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడి పిల్లలకు తెలుగు భాషపై ఆసక్తి కలిగించాలని తల్లిదండ్రులను సీఎం కోరారు. ఇంగ్లిష్ భాష మాత్రమే ముఖ్యమనే భావన తొలగాలన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువల్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో సీఎం మాట్లాడారు.