గిడుగు వెంకట రామమూర్తి పంతులు
మహనీయులు ఈ లోకంలో గొప్ప కార్యాన్ని సాధించడం కోసమే పుడతారు. అలాంటి వారినే ‘కారణ జన్ములు’ అంటారు. గిడుగు ఆ కోవలోకే వస్తారు. తన జీవితాన్ని భాషా ఉద్యమాల కోసం వెచ్చించిన కార్యశూరుడు గిడుగు. ఆయన తొలి తెలుగు ఆధునిక భాషావేత్త, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త కూడా. 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేట గ్రామంలో గిడుగు జన్మించారు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో లోయర్ ఫోర్తు ఫారంలో చేరారు. అదే తరగతిలో గురజాడ అప్పారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే జీవితాంతం మంచి స్నేహితులుగా ఇద్దరూ కలసి మెలిగారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
1889లో సవరజాతి వారితో గిడుగుకు పరిచయం ఏర్పడింది. సవరుల చరిత్ర, సంస్కృతి, భాష మీద గిడుగుకు అమితమైన ఆసక్తి కలిగింది. అందువల్ల సవరల భాషపై ప్రత్యేకంగా విశేషమైన కృషి చేశారు. 1893 జనవరి 15వ తేదీన గిడుగు శ్రీముఖలింగ క్షేత్రానికి వెళ్ళారు. 22 శాసనాల్ని నిశితంగా పరిశోధించారు. ప్రభుత్వం కూడా గిడుగు శాసన పరిశోధనలను గుర్తించింది. 1894లో గిడుగు ‘వయోజన విద్య’ను ప్రారంభించారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎక్కువగా భాషా సాహిత్యాల పరిశోధన వైపు మళ్లారు. గిడుగు పెద్ద కొడుకు సీతాపతి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. గిడుగు వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. తాపీ ధర్మారావు, చిలుకూరి నారాయణరావు లాంటివారు ఆయన శిష్యులే. 1910 తర్వాత గిడుగు పూర్తిగా భాషాపరిశోధనలో నిమగ్నమయ్యారు. 1911లో సవర భాషపై అనితర సాధ్యమైన, విశేషమైన కృషిచేసినందుకుగాను ఆయనకు ప్రభుత్వం ‘మెరిట్ సర్టిఫికెట్’ బహూకరించింది.
వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు సారథ్యం వహించారు. ఊరూరా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం కలుగజేశారు. అందరి తోనూ చర్చలు జరిపారు. 1916లో కొవ్వూరులో గిడుగు ఉపన్యాసాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు విని ప్రభావితులయ్యారు. గిడుగు ఆ విషయం తెలుసుకొని కందు కూరిని కలిశారు. ఇద్దరూ 1919లో ‘తెలుగు’ పేరుతో పత్రికను స్థాపించారు. తన భావాలను, ఆలోచనలను, ఈ పత్రికలో ముద్రిం చారు గిడుగు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలన్నింటినీ, ఈ పత్రిక తూర్పారబట్టింది. ‘ఆంధ్ర పండిత, భిషక్కుల భాషా భేషజం’, ‘బాలకవి శరణ్యం’ వంటి గ్రంథాలను మొదటిసారిగా ఈ పత్రిక ద్వారానే వెలువరించారు. గిడుగు మొత్తం పరిశోధన అంతా భాషాతత్త్వంపైనే జరిగింది. ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో లోతుగా చర్చించారు. గిడుగు చేసిన భాషాసేవకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావించిన ‘‘కైజర్–ఇ– హింద్’’ అనే బంగారు పతకాన్ని 1933 జనవరిలో ప్రభుత్వం బహూకరించింది. గిడుగు వ్యావహారిక భాషోద్యమం ఫలితంగా 1933లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ ఏర్పడింది. వ్యావహారిక భాషలో అన్ని రకాల రచనలూ రావాలని ఈ పరిషత్తు అభిప్రాయపడింది. 1935 మే 6వ తేదీన గిడుగుకు ఐదవ జార్జి చక్రవర్తి రజతోత్సవ సువర్ణ పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది.
గద్య చింతామణి, వ్యాసావళి వంటి గ్రంథాల్ని గిడుగు రాశారు. పీఠికా విమర్శ, గ్రంథ పరిష్కార విమర్శ, లక్ష్మణ గ్రంథ విమర్శ, నిఘంటు విమర్శ వంటి అంశాల్లో కూడా ఎవ్వరూ చెయ్యని, చెయ్యలేని లోతైన పరిశోధన చేశారు. గ్రాంధిక భాషావాదుల డాంబి కాల్ని గిడుగు బట్టబయలు చేశారు. కొమ్ములు తిరిగిన మహామహా పండితులకే సంస్కృతం సరిగా రాదని ఉదాహరణ పూర్వకంగా విడమర్చి మరీ తెలియజేశారు. ఆయన వ్యాకరణాల్లోనూ నిఘంటువుల్లోనూ సమాన ప్రతిభ కలిగినవారు. సవర–తెలుగు, తెలుగు – సవర, ఇంగ్లిష్ – సవర, సవర – ఇంగ్లిష్ నిఘం టువుల్ని తయారుచేశారు. నిఘంటువుల నిర్మాణానికి పండిత ప్రతిభతో పాటు, భాషాశాస్త్ర జ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కూడా తప్పనిసరిగా ఉండాలని వారి అభిప్రాయం. భాష ఎప్పుడూ పరిణామం చెందుతుందని గిడుగు వారి వాదన. అదే చివరకు విజయం సాధించింది. 1938 డిసెంబర్ 1వ తేదీన ఆంధ్ర విశ్వకళా పరిషత్ గిడుగుకు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి ఘనంగా సన్మానించింది.
సవరభాష కోసం, వ్యావహారిక భాష కోసం, గిడుగు చేసిన కృషి అనన్య సామాన్యమైంది. అనితర సాధ్యమైంది. అక్షర జ్ఞానం లేని సవరలకు జ్ఞానం కలుగ చేయడం కోసం ‘సవర భాషోద్యమం’ చేపట్టారు. మహా మహా పండి తులను, మేధావులను వ్యావహారిక భాషావాదాన్ని ఒప్పించడం కోసం ‘వ్యావహారిక భాషోద్యమం’ చేపట్టారు. అజ్ఞానంతో ఉన్నవారికి జ్ఞానభిక్ష పెట్టేది ‘సవర భాషోద్యమం’. జ్ఞానం ఉన్నవారిలోని అజ్ఞానాన్ని తొలగించేది ‘వ్యావహారిక భాషోద్యమం’. రెండూ గొప్ప ఉద్యమాలే. రెండూ మంచి పనులే. అసలు విషయం ఏమంటే – ఈ రెండు ఉద్యమాలూ నూటికి నూరుపాళ్లు ప్రజలకు సంబంధించినవే. ఈ ఉద్యమాల్లో రవ్వంతయినా స్వార్థం లేదు.
ఆయన గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు. వీరు 1940 జనవరి 22వ తేదీన మద్రాసులో తుదిశ్వాస విడిచారు. గిడుగును ‘తెలుగు సరస్వతి నోముల పంట’ అని విశ్వనాథ సత్యనారాయణ కీర్తించారు. ‘తెలుగుదేశంలో అవతరించి తెలుగు భాషను ఉద్ధరించిన పుంభావ సరస్వతి గిడుగు వెంకట రామమూర్తి పంతులు’ అని చింతా దీక్షితులు కీర్తించారు. ఇటువంటి ఉద్దండుల మన్ననలను పొందగలిగిన గిడుగు ‘పిడుగు’గా ప్రసిద్ధి పొందారు. (క్లిక్: ఈ తెలుగు మాట్లాడుతున్నామా?)
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు
(ఆగస్టు 29న గిడుగు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఏపీ ప్రభుత్వం జరుపుతున్న సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment