Gidugu Ramamurthy
-
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
ధీరజ అప్పాజీకి ‘గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం’
సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. ‘వాడుక భాషా ఉద్యమ పితామహుడు’ గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని... ‘శంకరం వేదిక’తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య - కళ - సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు ‘గిడుగు కాంతికృష్ణ’, ప్రముఖ పాత్రికేయులు - కవి - కళారత్న డా.బిక్కిన కృష్ణ, ‘శంకరం వేదిక’ అధ్యక్షురాలు యలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
Telugu Language Day: భాషా భేషజాలపై పిడుగు!
మహనీయులు ఈ లోకంలో గొప్ప కార్యాన్ని సాధించడం కోసమే పుడతారు. అలాంటి వారినే ‘కారణ జన్ములు’ అంటారు. గిడుగు ఆ కోవలోకే వస్తారు. తన జీవితాన్ని భాషా ఉద్యమాల కోసం వెచ్చించిన కార్యశూరుడు గిడుగు. ఆయన తొలి తెలుగు ఆధునిక భాషావేత్త, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త కూడా. 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేట గ్రామంలో గిడుగు జన్మించారు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో లోయర్ ఫోర్తు ఫారంలో చేరారు. అదే తరగతిలో గురజాడ అప్పారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే జీవితాంతం మంచి స్నేహితులుగా ఇద్దరూ కలసి మెలిగారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1889లో సవరజాతి వారితో గిడుగుకు పరిచయం ఏర్పడింది. సవరుల చరిత్ర, సంస్కృతి, భాష మీద గిడుగుకు అమితమైన ఆసక్తి కలిగింది. అందువల్ల సవరల భాషపై ప్రత్యేకంగా విశేషమైన కృషి చేశారు. 1893 జనవరి 15వ తేదీన గిడుగు శ్రీముఖలింగ క్షేత్రానికి వెళ్ళారు. 22 శాసనాల్ని నిశితంగా పరిశోధించారు. ప్రభుత్వం కూడా గిడుగు శాసన పరిశోధనలను గుర్తించింది. 1894లో గిడుగు ‘వయోజన విద్య’ను ప్రారంభించారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎక్కువగా భాషా సాహిత్యాల పరిశోధన వైపు మళ్లారు. గిడుగు పెద్ద కొడుకు సీతాపతి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. గిడుగు వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. తాపీ ధర్మారావు, చిలుకూరి నారాయణరావు లాంటివారు ఆయన శిష్యులే. 1910 తర్వాత గిడుగు పూర్తిగా భాషాపరిశోధనలో నిమగ్నమయ్యారు. 1911లో సవర భాషపై అనితర సాధ్యమైన, విశేషమైన కృషిచేసినందుకుగాను ఆయనకు ప్రభుత్వం ‘మెరిట్ సర్టిఫికెట్’ బహూకరించింది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు సారథ్యం వహించారు. ఊరూరా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం కలుగజేశారు. అందరి తోనూ చర్చలు జరిపారు. 1916లో కొవ్వూరులో గిడుగు ఉపన్యాసాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు విని ప్రభావితులయ్యారు. గిడుగు ఆ విషయం తెలుసుకొని కందు కూరిని కలిశారు. ఇద్దరూ 1919లో ‘తెలుగు’ పేరుతో పత్రికను స్థాపించారు. తన భావాలను, ఆలోచనలను, ఈ పత్రికలో ముద్రిం చారు గిడుగు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలన్నింటినీ, ఈ పత్రిక తూర్పారబట్టింది. ‘ఆంధ్ర పండిత, భిషక్కుల భాషా భేషజం’, ‘బాలకవి శరణ్యం’ వంటి గ్రంథాలను మొదటిసారిగా ఈ పత్రిక ద్వారానే వెలువరించారు. గిడుగు మొత్తం పరిశోధన అంతా భాషాతత్త్వంపైనే జరిగింది. ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో లోతుగా చర్చించారు. గిడుగు చేసిన భాషాసేవకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావించిన ‘‘కైజర్–ఇ– హింద్’’ అనే బంగారు పతకాన్ని 1933 జనవరిలో ప్రభుత్వం బహూకరించింది. గిడుగు వ్యావహారిక భాషోద్యమం ఫలితంగా 1933లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ ఏర్పడింది. వ్యావహారిక భాషలో అన్ని రకాల రచనలూ రావాలని ఈ పరిషత్తు అభిప్రాయపడింది. 1935 మే 6వ తేదీన గిడుగుకు ఐదవ జార్జి చక్రవర్తి రజతోత్సవ సువర్ణ పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది. గద్య చింతామణి, వ్యాసావళి వంటి గ్రంథాల్ని గిడుగు రాశారు. పీఠికా విమర్శ, గ్రంథ పరిష్కార విమర్శ, లక్ష్మణ గ్రంథ విమర్శ, నిఘంటు విమర్శ వంటి అంశాల్లో కూడా ఎవ్వరూ చెయ్యని, చెయ్యలేని లోతైన పరిశోధన చేశారు. గ్రాంధిక భాషావాదుల డాంబి కాల్ని గిడుగు బట్టబయలు చేశారు. కొమ్ములు తిరిగిన మహామహా పండితులకే సంస్కృతం సరిగా రాదని ఉదాహరణ పూర్వకంగా విడమర్చి మరీ తెలియజేశారు. ఆయన వ్యాకరణాల్లోనూ నిఘంటువుల్లోనూ సమాన ప్రతిభ కలిగినవారు. సవర–తెలుగు, తెలుగు – సవర, ఇంగ్లిష్ – సవర, సవర – ఇంగ్లిష్ నిఘం టువుల్ని తయారుచేశారు. నిఘంటువుల నిర్మాణానికి పండిత ప్రతిభతో పాటు, భాషాశాస్త్ర జ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కూడా తప్పనిసరిగా ఉండాలని వారి అభిప్రాయం. భాష ఎప్పుడూ పరిణామం చెందుతుందని గిడుగు వారి వాదన. అదే చివరకు విజయం సాధించింది. 1938 డిసెంబర్ 1వ తేదీన ఆంధ్ర విశ్వకళా పరిషత్ గిడుగుకు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి ఘనంగా సన్మానించింది. సవరభాష కోసం, వ్యావహారిక భాష కోసం, గిడుగు చేసిన కృషి అనన్య సామాన్యమైంది. అనితర సాధ్యమైంది. అక్షర జ్ఞానం లేని సవరలకు జ్ఞానం కలుగ చేయడం కోసం ‘సవర భాషోద్యమం’ చేపట్టారు. మహా మహా పండి తులను, మేధావులను వ్యావహారిక భాషావాదాన్ని ఒప్పించడం కోసం ‘వ్యావహారిక భాషోద్యమం’ చేపట్టారు. అజ్ఞానంతో ఉన్నవారికి జ్ఞానభిక్ష పెట్టేది ‘సవర భాషోద్యమం’. జ్ఞానం ఉన్నవారిలోని అజ్ఞానాన్ని తొలగించేది ‘వ్యావహారిక భాషోద్యమం’. రెండూ గొప్ప ఉద్యమాలే. రెండూ మంచి పనులే. అసలు విషయం ఏమంటే – ఈ రెండు ఉద్యమాలూ నూటికి నూరుపాళ్లు ప్రజలకు సంబంధించినవే. ఈ ఉద్యమాల్లో రవ్వంతయినా స్వార్థం లేదు. ఆయన గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు. వీరు 1940 జనవరి 22వ తేదీన మద్రాసులో తుదిశ్వాస విడిచారు. గిడుగును ‘తెలుగు సరస్వతి నోముల పంట’ అని విశ్వనాథ సత్యనారాయణ కీర్తించారు. ‘తెలుగుదేశంలో అవతరించి తెలుగు భాషను ఉద్ధరించిన పుంభావ సరస్వతి గిడుగు వెంకట రామమూర్తి పంతులు’ అని చింతా దీక్షితులు కీర్తించారు. ఇటువంటి ఉద్దండుల మన్ననలను పొందగలిగిన గిడుగు ‘పిడుగు’గా ప్రసిద్ధి పొందారు. (క్లిక్: ఈ తెలుగు మాట్లాడుతున్నామా?) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు (ఆగస్టు 29న గిడుగు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఏపీ ప్రభుత్వం జరుపుతున్న సందర్భంగా) -
తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. 'వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2022 చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం) -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు
బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాత్లావత్ పురందాస్ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు ప్రముఖ కవి గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఆగస్టు 21 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించారు. జూమ్ ఆప్ ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పురందాస్ పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నిర్వాహకులు విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించారు. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ విషయమై పాఠశాల తెలుగు అధ్యాపకురాలు చైతన్య భారతిని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డితో పాటు సర్పంచ్ ఖలీల్, గోపి, ఎంఎంసీ చైర్మన్ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శారదాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
భాష వెలగాలి... సంస్కృతి గెలవాలి!
వ్యావహారిక భాషోద్యమ పితామహులలో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు, తెలుగు భాషకు చేసిన సేవల వల్లనే భాష సామాన్య తెలుగువాడికి అందుబాటులోకి వచ్చింది. మనం ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అలా అని తెలుగు సంస్కృతీ మహార్ణవంలో భాగమైన సొంతభాష ప్రత్యేక ప్రతిపత్తిని తగ్గించుకోకూడదు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటి నుంచి ఏదైనా భాషను నేర్చుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పకూడదు! మాతృభాషకు సంబంధించి ధనిక, పేద బహుజన వర్గాల భేదం ఉండరాదు. వివక్షను పాటించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పేదసాదలు సంపన్న వర్గాల నుంచి నానా దుర్భర స్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అదే అక్షరాస్యతలోనూ, విద్యారంగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ అసమాన సామాజిక, ఆర్థిక నీతిని కూకటివేళ్లతో పెకిలించగల పటిçష్ఠమైన రాజకీయ వ్యవస్థకు దేశంలో సరైన అంకురార్పణ జరగాల్సి ఉంది. ‘ఇంతకూ మన ఇంట్లో భాష ఎలా ఉంది? బతకడానికి ఇంగ్లిషు కాని, చిరకాలం జీవించడానికి తెలుగుకోసం, పిల్లల తెలుగు కోసం ఇంతకూ మనం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? కాని ఇంటి భాషను, తల్లి భాషను, ఇల్లు వేదికగా పిల్లల్లో పాడుకునేలా మనం ఏ మాత్రం చేయగల్గుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు ప్రశ్నించు కోవలసిన సమయం వచ్చింది. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోదిచేసిన సారస్వతం వారికి అందకపోవడం, దూరం కావడం, నన్నయ, తిక్కనలనుంచి శ్రీశ్రీ వరకూ తమజాతి సాహితీ ఔన్నత్యం, తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. అది ఇచ్చే ఆత్మవిశ్వాసమే వేరు. మాతృభాషనుంచి అందే గొప్పబలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది.’ సాక్షి పత్రికలో సాధికారికంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా (28.08.2021) వెలువడిన ప్రత్యేక వ్యాసంలోని భాగమిది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి ఆదిమూలం సురేష్ తెలుగు భాషను, దాని ప్రాచీన హోదా ప్రతిపత్తిని రాష్ట్రప్రభుత్వం పరిరక్షిస్తుందని, పాఠశాల స్థాయిలో తెలుగు విధిగా నేర్చుకోవలసిన భాషగా చేస్తామనీ, వచ్చే ఏడాది నుంచీ, తెలుగు భాషోత్సవాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నామనీ ప్రకటించారు. అదే సంద ర్భంగా మహాభాషావేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహు లలో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు, తెలుగు భాషకు చేసిన సేవల వల్లనే భాష సామాన్య తెలుగువాడికి అందుబాటులోకి వచ్చిందనీ మంత్రి పేర్కొన్నారు. గిడుగు వారి జయంతిని ప్రతియేటా తెలుగు భాషా పరిరక్షణ దినోత్సవంగా కూడా తెలుగు భాషా ప్రియులు జరుపుకోవడం ఆనవాయితీ. విద్యార్థులకు కేవలం మార్కులకోసం ప్రత్యేకభాషగా ఉన్న ‘సంస్కృతం’ ప్రతిష్ఠను దిగజార్చడం తప్పు. మార్కుల స్కోర్ కోసం ఆ భాష అక్షరాలు తెలియకపోయినా వాటిని ఆన్సర్షీట్లలో చేర్చుకునే సంకర సంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మొట్ట మొదటి ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగింది. ఈ ‘సంకర న్యాయాన్ని’ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తీవ్రంగా ఎదుర్కొంది. ఇంటర్లో కేవలం మార్కుల స్కోర్ కోసం సంస్కృతం అక్షరాలను విద్యార్థులు చేరుకునే సంప్రదాయాన్ని తీవ్రంగా నిరసించి, మాన్పించవలసి వచ్చింది. మనం ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అలా అని తెలుగు సంస్కృతీ మహార్ణవంలో భాగమైన సొంతభాష ప్రత్యేక ప్రతిపత్తిని చేజేతులా తగ్గించుకోకూడదు. జాతికి జీవగర్రలు ప్రజాహృదయాలే అయినప్పుడు ఆ హృదయాల్ని గెలుచుకోవలసింది ఆ జాతి మాతృభాషలోనే. కనుకనే ‘తెలుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి ‘డుము వులు’ నేర్చినంతనే పుటుక్కున ముక్కులు గిల్లినంతనే/ సమకూరునా తెనుంగుసిరి సంస్కృత వాణికిన్’ అని ఎద్దేవా చేయవలసి వచ్చింది! అలాగే ‘‘మూడేండ్ల కుర్రాడు ‘ఏబీసీడీ’లను దిద్దు తెల్గుసీమలో అయ్యారే/ వీడు తన నేలనే పెరవాడై’’ పోవడం ‘జాతికెంత ప్రమా దమో సుమా’ అన్నాడాయన! మాతృభాషకు సంబంధించి ధనిక, పేద బహుజన వర్గాల భేదం ఉండరాదు. వివక్షను పాటించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పేదసాదలు ఆరోజు నుంచి ఈ రోజుదాకా సంపన్న వర్గాల నుంచి నానా దుర్భర స్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అదే అక్షరాస్యతలోనూ, విద్యారంగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ దుర్మార్గపు సామాజిక, ఆర్థిక నీతిని కూకటి వేళ్లతో పెకిలించగల పటిçష్ఠమైన రాజకీయ వ్యవస్థకు ఇంకా దేశంలో సరైన అంకురార్పణ జరగలేదు. కనుకనే విద్యారంగంలో పేద సాదల, బహుజనుల పురోగతికి ఈ రోజుకీ పెక్కు ఆటంకాలు ఎదురవుతూ, వారి అభ్యున్నతి అక్కడే ఉండిపోయింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యంతా మాతృభాషా పునాదులుగా సాగుతూ ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా మాత్రమే కొనసాగించడమే విద్యార్థుల విద్యాభివృద్ధికి మార్గమని, ఇంగ్లిషువాడే అయిన ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ వలస భారత దేశ గవర్నర్ జనరల్‌గా పట్టుబట్టాడు. ఎందుకంటే పరాయిభాష అయిన ఇంగ్లిషు, విద్యార్థికి ఒంటబట్టాలన్నా ముందు ప్రాథమిక విద్యాదశ అంతా మాతృభాషలోనే కొనసాగాలన్నవాడు బెంటిక్! కానీ, ప్రభు త్వానికి విద్యాబోధనా మాధ్యమం పాఠశాల విద్యనుంచే పూర్తిగా తమ ఇంగ్లిషు భాషలోనే కొనసాగాలని హఠం వేసి కూర్చున్నవాడు, విద్యారంగంపై ప్రత్యేక పత్రాన్ని (ది మినిట్) పోటీగా సమర్పించి నెగ్గించుకోడానికి ప్రయత్నించినవాడు– లార్డ్ బాబింగ్టన్ మెకాలే! ఈ ‘మినిట్’ (ప్రత్యేక పత్రం)లో తన అసలు లక్ష్యాన్ని మెకాలే ఇలా నిర్వ చించాడు. ‘మన భాషకు, ఇంగ్లిషువాళ్ల తిండికి, మన దుస్తులకు, మన రుచులకు, మన ప్రవర్తనకు, మన వేషధారణకు అలవాటుపడిన భార తీయులు మనకు శాశ్వతంగా బానిసలై పడి ఉంటారు’ అని చాటు మాటున కాకుండా ముక్కుమీద గుద్దినట్టుగా ముక్కుసూటిగానే చెప్పే శాడు. కాని విలియం బెంటిక్ మాటే (ప్రాథమిక విద్యాదశ– నాటి స్కూల్ ఫైనల్ దాకా స్థానిక మాతృభాషల్లోనే కొనసాగుతూ ఇంగ్లిషు ఒక సబ్జెక్టుగా మాత్రం ఉంచుకోవాలి) నెగ్గింది. కానీ, దీర్ఘకాలంలో మెకాలే లక్ష్యమైన ‘ఇంగ్లిషు అలవాట్లకు మనసావాచా అలవాటు పడిన భారతీయులు మనకు బానిసలయిపోతారు’ అన్న తెల్లవాడి అహంకారపు మాటలు మరపురానివిగా మిగిలిపోయాయి. ఒక్కభాష కాదు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటి నుంచి ఏది కావాల నుకుంటే ఆ భాషను నేర్చుకోవడానికి ఎవరూ అడ్డుచెప్పరు. చెప్పకూ డదు! కాని దేవనాగరి లిపిలో కేవలం మార్కుల కోసం గిలికే అక్షరాలుగా ‘సంస్కృతాన్ని’ దిగజార్చారు. అంతేగాదు, హాల చక్రవర్తి ప్రాకృతానికి అంటే ప్రకృతులయిన ప్రజలు నిత్యవ్యవహారంలో నేడు మాట్లాడుకున్న పునాది భాష ప్రాకృతం. అందుకనే మహా పండిత మ్మన్యులు అంతా ‘ప్రాచీన భారతంబు ప్రాకృతంబు’ అన్నారే గాని ‘సంస్కృతం’ అనలేదు! సంస్కృతం, ఇండోయూరోపియన్ భాషల కలగాపులగం అన్నారందుకే! పలు భాషలు తెలిసిన మహా పండితుడు తిరుమల రామచంద్ర, తెలుగు సహా ద్రావిడ భాషా పునాదులన్నీ ‘బ్రాహ్మీ’ నుంచే ఎదిగాయని ఆంధ్రప్రదేశ్‌లో ఐ.ఎ.ఎస్. హోదాలో కలెక్టర్‌గా పనిచేసిన ప్రసిద్ధ భాషాశాస్త్ర పరిశోధకుడు తమిళుడైన కాశ్యపాండ్యన్ అయితే ‘బ్రాహ్మీ’కి మూలం తెలుగేనని కూడా సిద్ధాంతీకరించేంతవరకు వెళ్ళాడు! ఆ మాటకొస్తే ఆదివాసీల (సవర, జాతాపు వగైరా) భాషలన్నీ సంస్కృతానికి లొంగిరాని, లిపి ఏర్పడని భాషలేనని ఏనాడో తేల్చిచెప్పి ‘సవర’ భాషకు లిపిని, తేలిక వ్యాకరణాన్ని సమకూర్చిపెట్టిన మహనీయుడు ‘గిడుగు’. అందుకే వివేకానందుడు– మన ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని క్రీ.శ. 500 నాటికే అందించిన ఆర్యభట్ట, భాస్కరలను పక్కన పెట్టేసి, మన ఖగోళ శాస్త్రాన్ని (అసస్టా్రనమీ) గ్రీకులకు ధారాదత్తం చేసి, గ్రీకుల పురాణ కల్పనలను మనం అరువు తెచ్చుకోడంతోనే భారతీయ వైజ్ఞానిక శాస్త్ర దృక్ప«థానికి మనం దూరమయ్యామని చెప్పాడు! తెలుగు వెలగాలనే ఆశయం నిండుగా నెరవేరడానికి ముందు, కనీసం ఒక్క సంవత్సరం పాటైనా తల్లిదండ్రులను మమ్మీ, డాడీ అని పిలువకుండా ‘అమ్మా నాన్నా’ అని పిల్లలకు అలవాటు చేయాలి. వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విశాఖలో ఘనంగా గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి
-
ప్రజల భాషను ప్రజలకు చేర్చిన గిడుగు
సాహిత్యం సామాన్యులకు చేరువ కావాలన్నా, పాలనా ఫలాలు ప్రజలందరికీ దక్కాలన్నా, పత్రికలు పది కాలాల పాటు మనుగడ సాగించాలన్నా ప్రజల భాషకే పెద్దపీట వేయాలని గట్టిగా నమ్మి, ఆ దిశగా ఉద్యమించి, తర్వాతి తరాలకు స్ఫూర్తినిచ్చిన భాషోద్యమ నేత గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు. సాహితీ లోకానికి, భాషా రంగానికి, రచనా రంగానికి, పత్రికా వ్యవస్థకు గిడుగు చేసిన సేవ కళింగాంధ్ర విశిష్టతను, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాల పేట(తెనుగుపెంట)లో జన్మించిన గిడుగు ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసి (జైపూర్ రాజాగా ఖ్యాతిగాంచిన రాజా విక్రమదేవ్ కూడా ఈ గ్రామవాసే), హైస్కూల్ విద్యను విజయ నగరంలో పూర్తి చేశారు. 1880లో పర్లాకిమిడి (నేడది గజపతి జిల్లా కేంద్రం) రాజా సంస్థానంలో మిడిల్ స్కూల్ ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరకడంతో తన మకాం అక్కడికి మార్చారు. పనిచేస్తూ 1886లో ఎఫ్ఏ, 1895లో బీఏ పూర్తి చేశారు. పర్లాకిమిడి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో చరిత్ర లెక్చరర్‌గా పనిచేశారు. ఆ కాలంలోనే వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారు. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను, రచయితలను చైతన్య పరిచారు. వ్యవహారిక భాష ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికల్లో రచనలు చేయడం మొదలుపెట్టారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, పురిపండా అప్పలస్వామి, తాపీ ధర్మారావువంటి సాహితీ మిత్రుల సహకారంతో గ్రాం«థిక వాదులను ఎదురించి సంచలనాత్మక రచనలు, సంచలనాత్మక ప్రసంగాలు చేశారు. ప్రజల భాషే పత్రికల భాష రాజాస్థానాలు, జమీందారుల కొలువుల్లో వుండే భాష కాకుండా ప్రజల నాలుకల్లో నలిగే భాషనే ప్రోత్సహించాలని గట్టిగా ఆకాంక్షించి పాత్రికేయునిగా మారారు గిడుగు. స్వీయ సంపాదకత్వంలో 1919 సెప్టెంబర్‌లో పర్లాకిమిడి నుంచి ‘తెలుగు’ మాసపత్రికను ప్రారంభించారు. దీనిలో గిడుగు రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు తీవ్రచర్చకు, భాషా, పత్రికా రంగాలపరంగా తీవ్ర మార్పులకు కారణమయ్యాయి. తెలుగుభాషలో వ్యవహారి కంగా వచ్చిన మొట్టమొదటి పత్రిక, కళింగాంధ్ర చరిత్రకు ఖ్యాతి తెచ్చిన పత్రిక ఈ ‘తెలుగు’. విశ్వవిద్యాలయాల్లో బోధన, వాడుక భాషల్లో జరిగేలా చేసిన సంస్కరణవాదిగా గిడుగును పేర్కొనవచ్చు. పాఠ్యాంశా ల ముద్రణ, నిర్వహణ, పరిశోధనలు, పాలనా వ్యవహారాలు వ్యవహారికం లోనే జరగాలని ఉద్యమించారు. తర్వాతి కాలం లో చరిత్రకారునిగా, శాసన పరిశోధ కునిగా ఖ్యాతి గాంచారు. సవర భాషకు లిపి సృష్టికర్తగా మారారు. పర్లాకిమిడి రాజా పద్మనాభదేవు కోరికపై ప్రసిద్ధి శైవక్షేత్రం అయినటు వంటి శ్రీముఖ లింగక్షేత్రంలో 9, 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రాచీన శాసనాలను పరిశోధించి గ్రంథస్థం చేశారు. భాషే శ్వాసగా... భాష, పత్రిక, పరిశోధన రంగాలకు చేసిన సేవకుగానూ ఎన్నో పురస్కారాలు, సత్కారాలు గిడుగు ముంగిట వాలాయి. మద్రాస్ ప్రభుత్వం ‘రావు బహుద్దూర్’(1913), బ్రిటిష్ ప్రభుత్వం ‘కైజర్– ఇ–హిందూ’ (1933), ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘కళాప్రపూర్ణ’ (1938) బిరుదులతో గౌర వించాయి. జీవించిన 77 ఏళ్లలో 60 ఏళ్ల పాటు తెలుగు భాషా వికాసానికి పాటుపడిన గిడుగు చిరస్మణీయులు. భాషాపాలిత రాష్ట్రాల విభజన కారణంగా 50 సంవత్సరాల పాటు నివసించిన పర్లాకిమిడి ఒరిస్సా రాష్ట్రంలో చేరిపోవడంతో బాధాతప్త హృదయంతో రాజమండ్రి చేరి అక్కడే స్థిరపడ్డారు. భాషాభిమానులు శ్రీకాకుళంలో నాగావళి వంతెన వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన భాషా అధ్యయన కేంద్రానికి గిడుగు పేరును పెట్టి నివాళులు అర్పించింది. ఆయన పుట్టిన పర్వతాలపేటలో గిడుగు విగ్రహాన్ని భాషా భిమానులు, గ్రామస్తులు ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్ శాసససభ స్పీకర్ వారం రోజుల క్రితం ఆవిష్కరించారు. భాషలోని మాండలికాలు సజీవంగా వుండాలని, ప్రజల భాషలోనే పత్రికలు పయనించాలని పథనిర్దేశం చేసిన గిడుగు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం కళింగాంధ్రకు ఎంతో గర్వకారణం. తెలుగు జాతి ఉన్నంత వరకు గిడుగు జాడ కనిపిస్తూనే వుంటుంది. 1940 జనవరి 22న తుదిశ్వాస విడిచిన గిడుగు అందించిన వ్యవహారభాషా స్ఫూర్తిని కాపాడుకుంటేనే నిజమైన భాషా వారసులం కాగలం. – డా. జి.లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం పీజీ శాఖ, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం -
తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం
సాక్షి, ఏఎన్‌యూ: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుకు ఆ పాలకులు ఎందుకు చొరవ తీసుకోలేదో చెప్పాలన్నారు. మాతృభాషా వికాసానికి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. చదవండి: సీఎం జగన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్ ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదే తరుణంలో తెలుగు సబ్జెక్టును కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తెలుగు భాషపై లోతైన అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. తెలుగు కవుల గొప్పతనాన్ని తెలియజేస్తూ నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీకి తిక్కన విక్రమ సింహపురి యూనివర్సిటీగా పేరు మార్చుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నామని తెలిపారు. గిడుగు రామ్మూర్తి జీవిత చరిత్ర చిత్రాలతో పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలుగు, సంస్కృత భాష వికాసానికి కృషి చేస్తున్న 13 మందికి మంత్రి చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్ -
28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం
సాక్షి, అమరావతి: ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు సుందరరావు, వెలమల సిమ్మన, డా.కంపల్లె రవిచంద్రన్, డా.ఉపద్రష్ట వేంకట రమణమూర్తి, ఎస్ సుధారాణి, జిఎస్ చలం, కెంగార మోహన్, షహనాజ్ బేగం, మల్లిపురం జగదీష్, పచ్చా పెంచలయ్య ఈ పురస్కారాలు అందుకోనున్నారు. -
గిడుగు బాటలో విశిష్ట పదకోశం
మన తెలుగునాట కూడా వైద్య భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలుగువచనానికి నిండైన, మెండైన కండను, గుండెను దండిగా అందించిన మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నిరూపించారు. తెలుగులో వైద్య నిఘంటువులు చాలా తక్కువ. చాలాకాలంగా వినియోగంలోకి వచ్చి, అలవాటై స్థిరపడిన వైద్య భాషా పదాలను యథాతథంగా వాడుకుంటూనే, తెలుగులో నూతన పద సృష్టికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాంటి విశిష్ట ప్రయత్నానికి పూనుకున్న ఈ సరికొత్త వైద్య నిఘంటువు కర్త మరెవరో కాదు, సాక్షాత్తు తెలుగువారి తొలిభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు పిడుగు’ (గిడుగు వేంకట రామమూర్తి) వారి మనుమడైన రామమూర్తి. అర్థం కాని చదువు వ్యర్థం కాబట్టి అర్థ వివరణతో కూడిన శబ్దం లేదా పదమే ఏ పుస్తకాని కయినా వన్నె తెస్తుంది. వాసికెక్కిస్తుంది. అగణిత సంఖ్యలో మానవజాతి విజ్ఞానానికి, వికాసానికి ఆరోగ్య భాగ్యానికి దోహదం చేస్తున్న సకల శాస్త్రాలను వాటిలో క్షణానికొక తీరుగా అనుక్షణం ముమ్మరిస్తున్న శబ్దజాలానికి అర్థ గౌరవం కల్గించే నిఘంటువులు ఎన్నో శరవేగాన వెలువడుతున్న రోజులివి. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క నిఘంటువు మాత్రమేకాదు, ఒక్కొక్క శాస్త్రంలో పలు విభా గాలకు సహితం ప్రత్యేక నిఘంటువులు వస్తున్నాయి. అందులోనూ ఈ వింగడింపు శాస్త్ర, సాంకేతిక విషయాలకు మరింత అవసరమవు తోంది. అలాంటి వాటిలో వైద్య, విజ్ఞాన, శాస్త్ర నిఘంటువు ఒకటి, కణ విభజనలా పెరిగిపోతున్న ఒకే శాస్త్రంలోని పలు విభాగాలలో నిత్యనూతనంగా దూసుకువస్తున్న పద సంపదకు అర్థ గౌరవం కల్పిం చాల్సి ఉంది. ఆయా శాస్త్రాలలోని సాంకేతిక పరమైన పదాలకు అవసరాలు గ్రీకు, లాటిన్ సంస్కృత భాషలలో ఉండగా, క్రమంగా వాటిని ఆంగ్ల భాషా శాస్త్ర నిపుణుల సాయంతో ఇంగ్లిష్ వైద్య నిఘంటువులను ఆంగ్లేయులు రూపొందించుకోగా ఈ మూడు భాషల పద సంపద ఆధారంగా ప్రపంచంలోని ఇతర వైద్య విజ్ఞాన నిఘంటువులూ వెలిశాయి. భాషావేత్త, కవి మోలియర్ అంటూండే వాడట. ‘ప్రతీ అంశం మీద ఎంతో కొంత జ్ఞానకాంతి ప్రసరిస్తుండా లని. ఆ పనిని నిఘంటువులు, ప్రత్యేక శాస్త్ర నిఘంటువులూ చేస్తూం టాయి. అందులోనూ ఒక భాషా నిఘంటువులోని పదజాలాన్ని మరో భాషలోకి బట్వాడా చేయడం క్లిష్టతరమైన పని. ఒక్కో పదానికే కాదు, ఒక్కొక్క వర్ణానికి (అక్షరానికి) సహితం భిన్న వర్ణాలు ఉంటాయి. ఇలాంటి బృహత్కార్యాన్ని ప్రపంచంలో తొలి ప్రయత్నంగా భుజాల కెత్తుకున్న వాడు క్రీ.శ. ఒకటవ శతాబ్దినాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. దాని విశేషమేమంటే, ఆ చైనీస్ నిఘంటువు రూపుదిద్దు కున్న ఆనాటి నుంచి ఈ క్షణం దాకా చెక్కు చెదరకుండా ప్రాచుర్యం లోనూ, వినియోగంలోనూ ఉండడం! తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్లనాటి సమేరియన్ అక్కాడియన్ ప్రతి, తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్– బాబిలోనియన్– హిట్టయిట్ భాషల్లో వెలువడింది. స్థానిక మాండలికాలలో ప్రపంచంలో తొలి సారిగా క్రీ.పూ. 15వ సంవత్సరంలో తొలి ప్రతి వెలువడిందట! ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) మొదటిసారిగా మెసపటోమి యన్ మట్టి పలకలపై అవతరించిందంటారు! మానవాళి విజ్ఞానం వికాస దశలలో కాలిడిన తరువాత శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మన తెలుగునాట కూడా వైద్య భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలుగువచనానికి నిండైన, మెండైన కండను, గుండెను దండిగా అందించిన మహా కథకులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నిరూ పించారు. తెలుగులో వైద్య నిఘంటువులు చాలా తక్కువ. ఆ తక్కువ లోనే వెలువడిన మిక్కిలిగా ఎన్నదగినవి ఒకటి రెండు కన్నా ఎక్కువ లేవనే చెప్పాలి. తెలుగు అకాడమీ వారు ఒక చిన్న పొత్తంగా వైద్య నిఘంటువు వెలువరించగా, డాక్టర్. పి.హెచ్.బి.ఎస్. శర్మ ‘మెడికల్ డిక్షనరీ’ మకుటంతో ఒక ఇంగ్లిష్– తెలుగు వైద్య నిఘంటువును వైద్య విద్యార్థులకోసమని ‘స్టూడెంట్ ఎడిషన్’ గా సంకలనం చేసారు. కాగా, విద్యార్థులకు పండితులకు, సాహితీవేత్తలకు వినియోగపడే విధంగా శ్రీపాదవారు తెలుగులో ఒక వైద్య నిఘంటువును 1948లో తొలి ముద్రణగా తీసుకొచ్చారు. పదాన్ని, విషయాన్ని శీఘ్రంగా అర్థం చేసుకోలేని సమయాల్లో ‘పండితులకున్నూ ఈ నిఘంటువు ఆవశ్యకం ఏర్పడుతుంద’ని తెలుపుతూ ఆయన ‘ఇది సమగ్రం కావు, ఇందులో చేరవలసినవే ఎక్కువ. అవి సేకరిస్తూనే ఉండాలి అని చెప్పడం. నిఘంటు నిర్మాణం ‘ఇదే ఆఖరిది, ఇదే ప్రమాణం, ఇదే పరసీమ’ అని మనం చెప్పలేమని చెప్పక చెప్పడమే! చాలాకాలంగా వినియోగంలోకి వచ్చి, అలవాటై స్థిరపడిన వైద్య భాషా పదాలను యథాత«థంగా వాడుకుంటూనే, తెలుగులో నూతన పద సృష్టికి నిరంతరం ప్రయత్ని స్తూనే ఉండాలి. అలాంటి విశిష్ట ప్రయత్నంలోనికి ఇటీవల పూనుకున్న ఈ సరికొత్త వైద్య నిఘంటువు కర్త మరెవరో కాదు, సాక్షాత్తు తెలు గువారి తొలిభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహు డైన గిడుగు పిడుగు’ (గిడుగు వేంకట రామమూర్తి) వారి మనుమడైన రామమూర్తి. తాతపేరే మనవడి పేరు అయితే ఈ మనవడి తండ్రి సుప్రసిద్ధ సాహితీవేత్త డా. గిడుగు సీతాపతి కావడం మరో విశేషం. తాత, తండ్రులనుంచి సాహిత్యస్ఫూర్తిని పుణికి పుచ్చుకున్న చిన్న రామ్మూర్తి చిన్నప్పటి నుండి కడుపులో పుండుతో ఏళ్లతరబడి బాధ పడుతూ రావడం వల్ల వైద్య విజ్ఞానంపై ఆసక్తి కలిగి, చివరికి ఈ వైద్య నిఘంటు నిర్మాణానికి పూనిక వహించడం విశేషం! సులభ గ్రాహ్యంగా చిన రామమూర్తి ఈ వైద్య నిఘంటువును కమ్మని తెలుగు లోకి (ఇంగ్లిష్–తెలుగు) తీసుకొచ్చినందుకు బహుధా ప్రశంసనీ యులు. వేల ఏళ్లుగా, తరాల తరబడి దేశవాళీ వైద్యులూ, ఆధునిక వైద్యులూ పెంచి పోషించుతూ వచ్చిన వైద్య విజ్ఞానం మీద ఆధా రపడిన పదసంపద ఎంతో రామమూర్తి– నిఘంటువులో ఉంది. అందరికీ అర్థమయ్యే పదాలూ, వివరణలూ ఈ అనువాద రచనలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యాధికి చెందిన ఎన్నో రకాల పద సంపద ఉంది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన దేశాలలో ఈజిప్టు, భారత, చైనా దేశాలు ప్రాచీన వైద్య విధానాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘ఎడ్మిన్స్మిత్ పాపిరస్’ గ్రంథం ప్రకారం మన ఆయుర్వేదం ఎంత ప్రాచీన వైద్య విధానమో క్రీ.పూ. 3000 ఏళ్ళనాడే వెల్లడైంది. ఆయుర్వేద వైద్యం, వనమూలికల ప్రాశస్త్యం తెలిసిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుప రాతియుగం). క్రీస్తుపూర్వం తొలి వైదికానం తర కాలంలో ఈ వైద్యం ప్రజారోగ్యంలోకి దూసుకువచ్చింది. ఆనాటి వైద్య శిఖామణులు పెక్కుమంది భౌతికవాదులుగా ఉన్నందుననే మనిషి ఆరోగ్యం, అనారోగ్యం ‘విధి నిర్ణయం’ కాదనీ ముందే రాసి పెట్టిన తంతు కాదనీ చెబుతూ ‘మానవ ప్రయత్నం ద్వారా సంకల్పం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని’ చరకుడు తన వైద్య సంపుణం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. అలాగే శుశ్రుతుడు కూడా తన ‘శుశ్రుత సంహిత’ లో వైద్యం లక్ష్యమే ‘రోగుల రోగ లక్ష ణాల్ని’ కనిపెట్టి నయం చేయటం. అనారోగ్యవంతుల్ని కనిపెట్టి నయం చేయటం ఆరోగ్యవంతుల్ని కాపాడటం, జీవితాన్ని పొడిగించ డమని చెప్పాడు. ఆయుర్వేద గ్రంథాలు ప్రస్తావించిన ఏడు రకాల వైద్య చికిత్సలూ ఈనాటికీ అమలులో ఉన్నాయి. వీటిలోని పద జాలానికి శ్రీపాదవారు అర్థవివరణ ఇచ్చారు. ఆయుర్వేద వైద్య శాస్త్రం లోని ఎనిమిది శాఖలూ ఆధునిక వైద్యంలో కూడా ఉన్నాయి. ‘ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు’గా పేర్కొంటున్న గ్రీక్ వైద్య శిఖామణి హిప్పోక్రటెస్ క్రీ.పూ. 4–3 శతాబ్దులనాటివాడు. ఈయన వైద్యులకు ప్రవచించి, నిర్దేశించిన నైతిక సూత్రాలనూ, బాధ్యతలనూ, ‘హిప్పోక్రాటిక్ వోత్’ అంటారు. ఇవి ఈ రోజుకీ వైద్యులకు శిరో ధార్యాలే. నిజానికి ఈ ఆదేశాలను పాటించే వైద్యులు నిజమైన ప్రజా సేవకులుగా మారి ప్రజల గౌరవాభినందనలు పొందగలుగుతారు. అలాగే ఒక రోగం భవిష్యత్ స్వరూపాన్ని నిర్ధారించగలదాన్ని ‘ప్రొగ్నా సిస్’ అంటారు. అందానికి సంబంధించిన తన గ్రంథానికి హిప్పో క్రటిస్ అదే పేరు పెట్టుకున్నాడు. ఆధునిక కాలంలో జన్యు లక్షణాలను వంశపారపర్యంగా ‘జల్లెడ’ పట్టినట్టు వివరించే ‘డీఎన్ఏ’ నిర్మాణ రహస్యం కాస్తా బద్దలయిన తర్వాత జీవశాస్త్రాన్ని జాంబవంతుడి అంగలపైన వేగవంతం చేసే మోలిక్యూలర్ (పరమాణువుల సము దాయం) బయోలజీకి తలుపులు తెరచుకున్నాయి! లూయీపాశ్చర్, రాబర్డ్ కో, కాడి బెర్నార్డ్ వైద్య శాస్త్రంలో నవీన శాస్త్రీయ పద్ధతులకు అంకురార్పణ చేశారు. ఇలా వైద్యవృత్తికి చెందిన విభిన్న శాఖలు, ఉప శాఖల నుంచి నిరంతరం నవీన ప్రయోగాల ద్వారా కుప్పలు తెప్ప లుగా ఊడిపడే వైద్యశాస్త్ర, సాంకేతిక పదాలకు అకారాదిగానూ, ఆరో పాల పరంగానూ అర్థాలు, అర్థవివరణలూ ముంచుకొస్తున్న తరు ణంలో చిన గిడుగు రామమూర్తి సిద్ధపరిచిన ఈ అభినవ వైద్య నిఘం టువు చాలా విలువైనదిగా భావించాలి. అనేక వైద్య పదాలకు ఇంతకు ముందు వైద్య నిఘంటువులలో లేని సరళ సుబోధకమైన వివరణలు ఎన్నో ఉన్నాయి. బహుశా తెలుగు ప్రతికి సంబంధించినంత వరకు రామమూర్తి నిఘంటువు ఔషధ పరిశ్రమకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెర్క్ కంపెనీ ఆధ్వర్యంలో వెలువడిన ‘ది మెర్క్ మాన్యువల్ ఆఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ గ్రంథానికి (2003 ప్రచురణ), ఆక్స్ఫర్డ్– హెచ్.బి. సంస్థ సంయుక్త ప్రచురణగా వెలువడిన ‘న్యూ మెడికల్ డిక్షనరీ’కి (2010 ప్రచురణ)గానీ తీసిపోదని అనిపిస్తోంది. మెర్క్ మాన్యువల్ 163 సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. చివరగా, నిఘంటు నిర్మాణం కత్తిమీద సాములాంటిది. ఇది వైద్యశాస్త్ర, సాంకే తిక పద నిఘంటువే అయితే దాని నిర్మాణం మరింత అసిధారా వ్రతమే. అందుకే 19వ శతాబ్దపు ఫ్రెంచి మేధావులలో ఒకరు. ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘం టువును ఎలా నిర్మించాను’ అన్న ఉత్తమ గ్రం«థాన్ని రచించిన ఎమిలీ లిత్రే అన్న మాటల్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. ‘‘నిఘంటు రచన మతి చెడిన వాడి వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కాని ఒకటి మాత్రం నిజం, అప్పుడ ప్పుడూ ఈ వృత్తి నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది. (a profession which drives one mad) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. ‘తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణ దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. -
గిడుగు జయంతిని జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే
సాక్షి, అమరావతి: తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘గ్రాంథికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని, పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యులకందించిన గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే’ అని పేర్కొన్నారు. నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు సినీ హీరో అక్కినేని నాగార్జునకు సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యంత ప్రశంసనీయమైన నటుల్లో ఒకరైన నాగార్జునకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నర్రేంద మోదీ.. ‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. (గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్) మన్ కీ బాత్: అదే విధంగా రేపు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11గంటలకు జరనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రేడియోలో మాట్లాడనున్నారు. జాతని ఉద్దేశించి ఆయన పలు అంశాలపై ప్రసంగించనున్నారు. -
గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వాడుక భాషాద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘గ్రాంధికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని.. పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యుల చేతికందించిన.. గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగుని సన్మానించుకోవడమే’ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి పంతులకు ఇవే నా (జయంతి ) నివాళులు. భాషా సాహితీ రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఈనాటి పత్రికా భాషకు దిక్చూచి గిరిజన భాషలకూ లిపి సృష్టించిన మహానుభావుడాయన’అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
తొలి తెలుగు పద్యానికి పుట్టినిల్లు ప్రకాశం
సాక్షి, ఒంగోలు : తొలి తెలుగు పద్యం ‘తరువోజ’కు పుట్టినిల్లు మన అద్దంకే. మహాభారత ఇతిహాసాన్ని పరిపూర్తి చేసి ప్రపంచ సాహిత్యంలో భారత విశిష్టతకు పాదులు తవ్విన ఎర్రన కవి మనవాడే. సంగీత సామ్రాజ్యాన్ని మేలి మలుపు తిప్పిన మధుర వాగ్గేయకారుడు మన త్యాగరాజే. ఆధునిక కాలాన పద్యానికి బువ్వపెట్టి ఘనకీర్తిని చాటిన మధుర కవి మల్లవరపు జాన్ మనలో ఒకరే. మధురమైన వచన కవిత ద్వారా మానవీయత చాటిన జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డడే. ఆధునిక భాషా శాస్త్రానికి ఊపిరులూది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ఒంగోలు వాసి. ఆధునిక వ్యవహార భాషకు ప్రామాణిక పత్రికా భాషతో లంకె కుదిర్చిన శ్రుత భాషా పండితుడు బూదరాజు మన చీరాలకు చెందిన వ్యక్తి. పద్యంలో వ్యంగ్యతకు పట్టం కట్టి ఊరేగించిన గాడేపల్లి సీతారామమూర్తి మన అద్దంకి వాసే. తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వికాస చరిత్రకు జీవం పోసిన అరుదైన సాహితీ విమర్శకుడు జి.వి.సుబ్రహ్మణ్యంది పర్చూరు. రంగస్థల కళ ద్వారా ప్రాచీన పద్యానికి పునరావాసంగా నిలిచిన బండారు రామారావు, డీవీ సుబ్బారావు, అద్దంకి మాణిక్యాలరావు లాంటి అరుదైన కళాకారులూ ఈ జిల్లా వారే. అంతేకాదు.. తెలుగు కవిత్వాన్ని ఓ మేలి మలుపు తిప్పిన దిగంబర కవుల్లో పదునైన అభివ్యక్తీ స్వరం కలిగిన ‘మహాస్వప్న’ పుట్టింది లింగసముద్రంలోనే.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆధునిక నవలకు, కథకు, సాహిత్య విమర్శకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎందరో సాహితీమూర్తులు ప్రకాశం జిల్లా వాసులే. ఆధునిక నాటకానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నాటక ప్రయోగ శిల్పులూ ఇక్కడి వారే. ఆదరణే నాస్తి తొలి తెలుగు పద్యం తరువోజ కొలువైన అద్దంకి శాసనం రోడ్డు విస్తరణలో శిథిలమైంది. 200 సంవత్సరాలు ఎవరూ పట్టించుకోనప్పుడు మహాభారత ఇతిహాసంలో ఆదికవి విడిచిపెట్టిన అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేసిన కవితా వీరుడు ఎర్రన సాహితీ ఉద్ధరణకు ఇక్కడ కార్యాచరణ లేదు. అంతేకాదు.. ఇన్ని విశేషాలున్న జిల్లాలో ఏర్పాటు చేసిన నాగార్జున వర్సిటీ పీజీ సెంటర్లో ఎంఏ తెలుగు లేకపోవడం భాషాభిమానులను కలచివేస్తోంది. కర్ణాటక సంగీతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన త్యాగరాజ కీర్తనలను పదిలం చేసుకోగల సంగీత విద్యాలయం లేదిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజును, పత్రికా ప్రామాణిక భాషకు పట్టుగొమ్మగా నిలిచిన బూధరాజు రాధాకృష్ణను, తెలుగు సాహిత్య విమర్శలో ప్రక్రియా వికాస చరిత్రకు ఆద్యుడైన ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యంను తలచుకునే సాహితీ జిజ్ఞాసులూ లేకపోవడం బాధాకరం. భాషోద్ధరణకు నడుం బిగించాలి గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకలోకి తెచ్చి, నిత్య వ్యవహార భాషలోని అందాన్ని చాటిచెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు 156వ జయంతి నేడు. ఆయన పుట్టిన రోజును మాతృ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వ్యావహారిక భాషా కోసం ఆజన్మాంతం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో మన ప్రాంత భాషా, సాహిత్య విశిష్టతల ఉద్ధరణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని భాషా సాహిత్యవేత్తలు పేర్కొంటున్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు భాషా ఉద్ధరణ కోసం ప్రత్యేకంగా భాషా ఉత్సవాలు నిర్వహిస్తూ ఊతం ఇస్తున్నది. ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో కూడా తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించింది. ఇంకోవైపు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా భాషోత్సవాలు నిర్వహిస్తున్నది. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక సాహిత్య సేవా సంస్థలు భాషా, సాహిత్యాల ఉద్ధరణకు పాటుపడుతున్నాయి. -
తేనెకన్నా తీయనిది తెలుగు భాష
వేమన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు. వేడుక మాత్రమే కాదు ఈ రోజు వేదిక కావాలి. పవర్ రేంజర్స్ బదులు పంచతంత్ర కథలు పిల్లలకు కంఠతా రావడానికి ఈ రోజు వేదిక కావాలి. మన పద్యం మళ్లీ గత వైభవం సంతరించుకునేందుకు ఇదే రోజు అంకురార్పణ జరగాలి. సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : అమ్మతో కష్టసుఖాలు చెప్పుకునే భాష నోటికి బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్న భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు చేరదీసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వేడుకలు బాగానే ఉన్నాయి గానీ ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. వెన్న కన్నా మెత్తనైన తెలుగు భాష వర్తమానంలో పతనావస్థ అంచులపై వేలాడుతోంది. తెలుగు వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసి వైభవ ప్రాభావాలతో కళకళలాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థులు–ఉపాధ్యాయులు సంయుక్తంగా వైభవంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. తెలుగు కోసం ప్రభుత్వం ముందడుగు తెలుగు భాష మృత భాషగా మారుతోంది అన్న మాట వచ్చినప్పటి నుంచి పాఠశాలల్లోనూ తెలుగు భాషను సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండలం లో ఉన్న ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసికట్టుగా మం డల విద్యాశాఖాధికారి ఎంపిక చేసిన పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యధారణ, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్యపోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అం దించి, విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయించింది. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకా>కుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న జన్మించిన రామమూర్తి తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ ప్రాథమిక విద్య అక్కడే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. గిడుగు మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి. సవర భాష రూపశిల్పి అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది గిడుకు రామమూర్తికి. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర – ఇంగ్లిష్ కోశాన్ని నిర్మించాడు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి కైజర్ –ఇ– హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు. బోధన భాషగా తెలుగు తెలుగు భాష వ్యవహారంలో మాత్రం దూరమైపోతోంది. కనీసం పదో తరగతి వరకూ బోధన జరపాలని కృషి చేశాం. కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు లేకపోవడం దురదృష్టకరం. తెలుగు నేర్చుకుంటే అన్ని భాషలు వస్తాయి. మాతృభాషలో ప్రవేశం తప్పనిసరిగా ఉండాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి మాతృభాషను బోధన భాషగా చేయాలి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘాధ్యక్షునిగా పదవీ స్వీకరించిన నేపధ్యంలో ఇకపై తెలుగు బాగా వెలుగుతుందని ఆశిద్దాం. – డాక్టర్ ఎ.గోపాలరావు, అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు అమ్మభాషను పరిరక్షించుకుందాం తెలుగు లోగిళ్లలో అమ్మభాషను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. మాతృభాషను తృణీకరించడమంటే మన కళ్లను మనమే పొడుచుకోవడం వంటిది. భవిష్యత్ తరాల నోట మకరందాల తేనె ఊట ఊరాలి. తెలుగును నిలబెట్టుకోవడమంటే మన జాతి ఘన వారసత్వ సంస్కృతి, మూలధనాన్ని పరిరక్షించుకోవడమేనని నా ఉద్దేశం. తెలుగు వెలుగులు విరజిమ్మాలి. మనమంతా ఆ దిశగా కృషి చేయాలి. – సముద్రాల గురుప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ సమితి దేశ భాషలందు తెలుగు లెస్స ఏ భాషలోనూ లేనన్ని అక్షరాలు, మరే భాషలోను లేనట్టి అవధాన ప్రక్రియలు కలిగిన మధురమైన భాష తెలుగు. ఆంగ్ల మాధ్యమంపై వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయకూడదు. కన్నతల్లి మాతృభూమి, మాతృభాష ఎల్లప్పుడూ పూజలందుకోవాలి. అలా జరగాలంటే బాల్యం నుంచే పిల్లలకు తెలుగు పద్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు చెప్పి మాతృభాష మీద మమకారం పెంచాలి. అమ్మ భాషలోని కమ్మదనం అలవాటు చేస్తే మధురమైన తెలుగు భాషపై ఇష్టం పెంచుకుని తరువాతి కాలానికి వాళ్లే తీసుకెళ్తారు. రాష్ట్రంలో తెలుగు అమలుకు కొన్ని చర్యలు చేపట్టాలి. అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల తీర్పులు, వ్యాపార, వాణిజ్య సంస్థల పేర్లు, చలన చిత్రాల పేర్లు, వీధులు, కూడళ్ల పేర్లను తెలుగులోనే రాయాలని పొరుగు రాష్ట్రమైన తమిళనాడులా నిర్బంధ ఉత్వర్వులు జారీ చేయాలి. జారీ చేసిన ఉత్వర్వుల అమలుకు సరైన పర్యవేక్షణ చేయిస్తూ లోపాలు సరిదిద్దితే భాష మనుగుడ సులభతరం అవుతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత, పార్వతీపురం -
తెలుగుదనం పదిలం కావాలంటే..
వ్యావహారిక భాషోద్యమానికి రాజమహేంద్రవరం వేదికగా నిలిచింది. ఇందుకు ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి పంతులుకు గొడుగులా అండగా నిలబడింది ఈ నేలే. రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న పర్లాకిమిడి పట్టణాన్ని ఒడిశాలో కలపేయడంతో ఆంధ్రపై ఉండే అభిమానంతో 1936వ సంవత్సరంలో ఏకంగా రాజమండ్రికి తన నివాసం మార్చుకున్నారు. తుది శ్వాస విడిచే వరకూ ఈ గడ్డనే ఆయన గుడిగా మలచుకున్నారు. సంస్కృతాభిమానుల ఛీత్కారాల మధ్య పోరాటం చేస్తూ సభలు, సమావేశాలను నిర్వహిస్తూ... తన వ్యాసాల ద్వారా వాడుక భాష ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 1897లో వెలువడిన గురజాడ ‘కన్యాశుల్కం’ పుస్తకం పీఠికలో ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ గా అభివర్ణించే మాతృ భాషంటేనే నాకు అభిమానం. ఆ సంకెళ్ల నుంచి బయటపడని వారు ఉండొచ్చుగాక ... వారంతా తమ సుఖాల్ని, కష్టాల్ని వెల్లడించడానికి వాడుకభాష కావాలి...కాగితం మీద పెట్టడానికి మాత్రం ముందుకురారంటూ చురకలంటించడంతో ఉద్యమానికి ఊపిరిలూదినట్టయింది. రాజమండ్రివాసైన కందుకూరి వారు కూడా వాడుక మాటలవైపే అడుగులేయకతప్పలేదు. ‘శ్మశానాల వంటి నిఘంటువులుదాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి ఇలా మన ముందుకు వచ్చి వాడుక భాష జీవం పోసుకోడానికి రాజమహేంద్రవరమే ఓ పెద్ద వరంగా మారడం విశేషం. తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్: ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షరి’.. ఇదో పుస్తకం పేరు. నేటి యువత ఈ పుస్తకం పేరు వింటేనే కంగారు పడొచ్చు. రాజమహేంద్రిని తన సాహితీసేద్యానికి ప్రధాన క్షేత్రం చేసుకున్న కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి రాసిన సుమారు రెండు వందల పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. నాడు గ్రాంథిక భాషకు ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఒక శతాబ్దం వెనుకకు వెళితే.. గ్రాంథిక భాష స్థానంలో వ్యావహారిక భాష ఆవిర్భవిస్తున్న రోజులు కనపడతాయి. సహజంగా, ఏ మార్పుకైనా తప్పని ప్రతిఘటనలు ఈ పరిణామక్రమానికి తప్పలేదు. వ్యావహారిక భాష కోసం గిడుగు ఉద్యమం.. 1936లో పర్లాకిమిడి పట్టణాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన ఒడిశా రాష్ట్రంలో విలీనం చేసినందుకు నిరసనగా గిడుగు రామ్మూర్తి తన నివాసం రాజమండ్రికి మార్చి, తుదిశ్వాస వదిలేవరకు ఈ నగరంలోనే గడిపారు. నేటి ఇన్నీసుపేట ప్రాంతంలోని ఏనుగుగుమ్మాలవారివీధిలో నివసించేవారని చెబుతారు. అప్పటికే వ్యావహారిక భాష ప్రజల్లో ప్రాచుర్యం పొందుతున్నా, కొక్కొండ వెంకటరత్నం వంటి సంస్కృతాంధ్ర విద్వాంసులు ఈ ప్రక్రియను నిరసించసాగారు. కొక్కొండ వెంకటరత్నం పేరిట టి.నగరులో ఒక వీధి నేటికీ ఉంది. నాటి తాలూకా కార్యాలయం ఉత్తరం వైపు వీధిలో ఆయన నివసించేవారు. వ్యావహారిక భాషను రచనల్లో ప్రయోగించడాన్ని సమర్థ్ధిస్తూ, వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో సైతం సభలు, సమావేశాలు, పత్రికల్లో వ్యాసాలు చోటు చేసుకునేవి. 1897లో గురజాడ కన్యాశుల్కం మొదటి ముద్రణ, కొన్ని మార్పులు, చేర్పులతో 1909లో వెలువడిన కన్యాశుల్కం మలి ముద్రణ తెలుగునాట ప్రభంజనాన్ని సృష్టించాయి. కన్యాశుల్కానికి పీఠికలో గురజాడ అన్న మాటలను మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.. ‘సంకెళ్లను ప్రేమించే వాళ్లు దాన్ని–అనగా గ్రాంథిక భాషను–ఆరాధిస్తారు గాక, నా మట్టుకు నా మాతృభాష సజీవమైన తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాల్ని, మన దుఃఖాల్ని వెల్లడించుకోవడానికి మనం యవరమూ సిగ్గు పడలేదు కాని, కాగితం మీద పెట్టుకోవడానికి మాత్రం కొందరు బిడియపడుతున్నారు! ‘గ్రామ్యం అని పొరపాటు పేరుపెట్టి పిలిచే వాడుక భాషను కావ్యరచనలలో ప్రవేశపెడితే ఉత్తమ కావ్యాలకు ఉండవలసిన గౌరవం దిగజారిపోతుందనే విమర్శనను మనం లెక్క చేయనక్కరలేదు. ఎందుచేతనంటే, కావ్య ప్రశస్తి, కావ్య ప్రయోజనము నిర్ణయించేవి పాతకాలపు వైయాకరణుల ఛాందసాలు కావు. భాషాశాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అంతకన్నా మంచి గీటురాళ్లే మనకందుబాటులోకొచ్చాయి.’ తరువాత కాలంలో వచ్చిన శ్రీశ్రీ ‘శ్మశానాల వంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి’ కవితలు రాశానని పేర్కొన్నాడు. కాంచవోయి నేటి దుస్థితి... తెలుగు భాషాదినోత్సవం జరుపుకోవడానికి ఏముంది గర్వకారణం? భాషను కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయవలసిన పాడు రోజులు దాపురించాయి. రాజమహేంద్రవరాన్ని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రధాన కేంద్రంగా చేస్తానని 2015 పుష్కరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. అయిదారు నెలలకు రెండు నెలల జీతం రాళ్ల ఇస్తున్నారు. సంస్థ మనుగడపై సందేహాలు సృష్టించడంతో కొత్తగా చేరే విద్యార్థులు కరువైపోతున్నారు. అతివలకు సంస్కృతాంధ్రాలు నేర్పుతున్న, అతి ప్రాచీనమైన ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల 8 జిల్లాలలో ఏకైక కళాశాల.. శతావధానాలు చేస్తున్న మహిళలు చదువుకున్న కళాశాల.. గోదావరీ తీరాన, మన నగరంలో ఉంది. ఎయిడెడ్ హోదా కోల్పోయి, దాతల విరాళాలతో మనుగడ సాగిస్తోంది.. కళాశాలను ఆదుకోవాలని ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా, అన్నీ బుట్టదాఖలయ్యాయి. ఎందరో మహామహోపాధ్యాయులు పాఠాలు చెప్పిన ప్రతిష్టాత్మకమైన గౌతమీ విద్యాపీఠం కనుమరుగైపోతే, రెండు కన్నీటిబొట్లు రాల్చడం మినహాయించి, ఏమి చేయగలిగామని భాషాభిమానులు వాపోతున్నారు. అమ్మ భాషకు పట్టాభిషేకం బిక్కవోలు: అక్షరం ఆకాశంలో విహరిస్తున్నపుడు.. కావ్యాలు సామాన్యుల నోటికి అందనంత దూరంలో ఉన్నప్పుడు వచనాలు వినడానికి కూడా అవకాశం లేనప్పుడు ఓ అక్షర సైనికుడు ఉదయించాడు. సామాన్యుడి కోసం రచన అన్న సూత్రాన్నిప్రవేశపెట్టాడు. ఆకాశ మార్గంలో ఉన్న అక్షరాలను నిచ్చెన వేసి కిందకు దించాడు. మన ఊరిలో, మన వీధిలో, మన ఇంటి ముందు నిలిపే తులసికోటలా అందమైన అక్షర శిల్పాలను తీర్చిదిద్దాడు. గ్రాంథికం నుంచి తెలుగును వ్యవహారికంలోకి మార్చి అతి పెద్ద సాహితీ మార్చునకు ఆద్యుడయ్యాడు. తెలుగుజాతి గొప్పదనాన్ని ఖండాతరాలకు చాటి చెప్పిన ఆ సైనికుడి పేరు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన జయంతిని బుధవారం మాతృభాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పంచదార కన్నా, పాలమీగడ కన్నా, చెరకు రసం కన్నా మధురమైనది మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగులెస్స అని కృష్ణదేవరాయులు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా నికోలో డీ కోంటి పేర్కొని మన తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. క్రీస్తు శకం 200 సంవత్సరంలో లిఖించిన అమరావతి శాసనంలో నాగబు అనే తెలుగు పదం కనిపిస్తుంది. తెలుగు భాష ప్రాచీనత్వానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. దేశంలోని అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఒకటి. ఇతర భాషలకు ప్రాచీన హోదా ఎప్పుడో లభించినా తెలుగుభాష మాత్రం వివక్షకు గురవుతూనే వచ్చింది. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. ఆయన హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా వచ్చేందుకు ఏబీకే ప్రసాద్‌ను తెలుగు భాషా సంఘానికి అధ్యక్షుడిగా నియమించి ఆయన ద్వారా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. అయినా కోర్టు తెలుగు ప్రాచీన హోదా నిర్ణయానికి మద్దతుగా తీర్పునివ్వడం ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగ్గ విషయం. మన భాష సంస్కృతి, సంప్రదాయాలు సమోన్నతమైనవి. మానవీయ కోణంలోనూ, భారతీయ దార్శనికతలోనూ తెలుగు సంప్రదాయాల పాత్ర అమోఘం. తెలుగుదనం పదిలం కావాలంటే.. ⇔ ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, అధికార సమాచార వినిమయం తెలుగులోనే అమలు చేయాలి ⇔ తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువను పెంచే పాఠ్యాంశాలను సిలబస్‌లో చేర్చాలి ⇔ తెలుగు వారి ప్రధాన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిధులలేమి లేకుండా చక్కగా నిర్వర్తించాలి ⇔ కవులు, కళాకారుల ప్రతిభను గుర్తించడం రాగద్వేషాలకు అతీతంగా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా జరగాలి. ⇔ అంతర్జాతీయ స్థాయికి తెలుగు ఘనతను చేర్చిన ప్రతిభావంతులకు, అందుకు మార్గదర్శకులుగా ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ⇔ ముఖ్యంగా క్రీడారంగంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ⇔ తెలుగు రుచులు, అభిరుచులను వృద్ధి చేసేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిపి కార్యక్రమాలు నిర్వహించాలి ⇔ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలి ⇔ ప్రభుత్వం తెలుగు శతక పద్యాలపై రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి, ప్రతిభను ప్రోత్సహించాలి. ⇔ నూతన రచనలు వెలుగులోకి తెచ్చేందుకు చేయూతనివ్వాలి ⇔ ప్రతి జిల్లా కేంద్రలోనూ తెలుగు వికాస భవనాలు నిర్మించి తెలుగు భాషాసేవా కార్యక్రమాలు నిర్వహించాలి వ్యావహారిక భాషాక్రమంలో తప్పుడు పదప్రయోగాలు వ్యావహారిక భాషను ప్రోత్సహించడమంటే, తప్పుడు, కృత్రిమ పదాలను ఉపయోగించడమని అర్ధం కాదు. ‘జయంతోత్సవము’, ‘పాలాభిషేకము’ వంటి తప్పుడు పదాలను వాడడం సరికాదు. మనం ఒక విషయాన్ని విస్మరించరాదు. ఆధునిక కవులు శ్రీశ్రీ వంటివారికి సైతం ప్రాచీన సాహిత్యంపై గట్టి పట్టు ఉంది. సాహిత్యం కాలాన్ని బట్టి ఎన్ని మార్పులకు లోనైనా, మంచి సాహిత్యమనేది సార్వజనీనము, సార్వ కాలీనము అనే రెండు లక్షణాలను సంతరించుకుని ఉంటుందనే సత్యాన్ని మనం విస్మరించకూడదు.– డాక్టర్ అరిపిరాల నారాయణరావు -
ఫలించిన ‘గిడుగు’ కల
నేడు తెలుగు ప్రజలు, విద్యార్థి లోకం సృజనాత్మక సాహిత్యాన్ని, వార్తా పత్రికలను, పాఠ్య పుస్తకాలను జీవకళలొలుకు జీవద్భాషలో హాయిగా చదువుకుం టున్నారంటే, విద్యార్థులు మాట్లాడే భాషలో పరీక్షలు సులభంగా రాస్తున్నారంటే.. దీనివెనుక గిడుగు రామమూర్తిగారి ఎన్నో ఏళ్ల కృషి, ఎంతో శ్రమ, పట్టు దల, తపన ఉన్నాయి. అందుకే గిడుగువారి పుట్టిన రోజు తెలుగు భాషా దినోత్సవమయింది. వ్యావహారిక భాషావాదం పుట్టి 118 ఏళ్లపైన అవుతోంది. ఇప్పుడు రచయితలందరూ సజీవ భాష లోనే రచనలు చేస్తున్నారు. మహా కావ్యాలకు సైతం వ్యాఖ్యానాలు వాడుక భాషలోనే వస్తున్నాయి. విశ్వ విద్యాలయాలలోని పరిశోధనా పత్రాలను జీవద్భాష లోనే రాస్తూ, డాక్టరేట్లు అవుతున్నారు. ‘కొమ్ములు తిరిగిన ఉద్దండ పండితులే నిర్దు ష్టంగా రాయలేని గ్రాంథిక భాషా శైలిలో బడిపిల్లలు, సామాన్యులు రాయాలనటం అశాస్త్రీయమనీ, అలా ఆదేశించటం అన్యాయమనీ గిడుగువారు పత్రికా ముఖంగా చెప్పారు. తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి సభాముఖంగా, విజ్ఞప్తుల రూపంలో వాడుక భాషలో సౌలభ్యాన్ని ప్రచారం చేశారు. ఇంటాబైటా నూటికి 90 శాతం వ్యవహారంలో వాడే జీవద్భాషను వదిలి, పాఠ్యగ్రంథాలలో శైలిని బట్టీపట్టి కృతక శైలిలో పరీ క్షలు రాయాలని పిల్లలను నిర్బంధించటం సబబా అని ప్రశ్నించారు. గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమం ఒక చారి త్రక ఘటన. దేశభాషలు అభివృద్ధి చెందాలంటే, భాషలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాస్త్ర విజ్ఞా నాన్ని దేశ భాషలలో బోధించటానికి తగిన పుస్తకా లను రాయటానికి రచయితలను ప్రోత్సహించాలని 1905లో విద్యాశాఖ భావించింది. ఉన్నత పాఠశాల, కళాశాల తరగతులలో మాతృభాషలో వ్యాస రచ నను నిర్బంధ పాఠ్యాంశంగా పెట్టాలని విద్యాశాఖ భావించింది. ఈ వ్యాస రచన, అనువాదాల శైలి విషయంలో వ్యావహారిక భాషా ప్రసక్తి వచ్చింది. ఆధునిక భావాలున్న విద్యావేత్తలు వ్యావహారిక భాష లోనే ఈ వ్యాస రచన, అనువాదం ఉండాలన్నారు. గ్రాంథిక భాషాభిమానులకు ఇది నచ్చలేదు. భాష విషయంలో రెండు వర్గాలేర్పడ్డాయి. 1906 సంవత్సరంలో అప్పటి గంజాం, విశాఖ, గోదావరి జిల్లాల స్కూళ్లు పరీక్షాధికారి ఉ.ఎ. ఏట్సు తెలుగులో గ్రంథశైలికి, మాట్లాడే భాషకు ఉన్న పెద్ద అంతరాన్ని గుర్తించి, ఆశ్చర్యపోయి, గురజాడ, గిడు గులతో చర్చించారు. ఆ తరువాత రెండేళ్లపాటు గిడు గువారు తెలుగు కావ్యాలను, వ్యాకరణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గ్రాంథిక, వ్యావహా రిక భాషల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించిన దగ్గర నుంచీ గిడుగు వారి దృష్టి అంతా ఈ విషయంపైనే. విషయ ప్రధానమైన గ్రంథాలన్నీ మన పూర్వులు వాడుక భాషలోనే రాశారనీ, మన సంప్రదాయం అదేనని నిదర్శనలు చూపిస్తూ పలు చోట్ల ఉపన్యసిం చారు. ఏట్సు కోరికపై ఉపాధ్యాయ వార్షిక సభలో తెలుగు భాషా పరిణామక్రమాన్ని, జీవద్భాషా ప్రాశ స్త్యాన్ని వివరించారు. పండితులు వీరిని వ్యతిరేకిం చారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ వ్యాసర చన, అనువాదాల శైలి విషయంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో గ్రాంథిక భాషా ప్రతినిధులుగా జయంతి రామయ్య, వేదం వేంకట రాయ శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు మొదలైన వారు.. వ్యావహారిక భాషా వాద ప్రతినిధులుగా గిడుగు, గురజాడ, బుర్రా శేష గిరిరావు, శ్రీనివాస య్యంగార్ వంటి వారున్నారు. వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగి నాయి. వీటన్నిం టికీ నాటి ‘హిందూ’ పత్రిక వేదికయింది. అయిదారు పుష్కరాలపాటు ఈ భాషోద్యమం కొనసాగింది. చివ రికి వాడుక భాషకు విజయం లభించింది. గురజాడ సృజనాత్మక సాహిత్యం ద్వారా గిడుగు సిద్ధాంతా లకు దోహదం చేశారు. వ్యావహారిక భాషోద్యమం సాంఘిక ప్రయో జనాన్ని ఆశించి పుట్టింది. నూటికి 90 మంది విద్యా వంతులైనప్పుడు తప్ప సమాజానికి మేలు కలగదని, అది సాధించాలంటే శాస్త్ర విషయాలన్నీ వాడుక భాషలో రచించినప్పుడే అనుకున్న ప్రయోజనం సాధించగలమని గిడుగు చెప్పారు. ఇప్పటి సమా జంలో గ్రాంథిక భాష లేదు. అంతటా, అన్నిటా, జీవ ద్భాషే. రచయితలు తమదైన భాషలో చక్కగా భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే గిడుగు వారి కల నెరవేరినట్లే. కానీ, నేడు విద్యా రంగంలో తెలుగు భాషకున్న పరిస్థితేమిటి? విద్యార్థులు తెలు గులో తమ భావాలను చక్కగా వ్యక్తం చేయలేకపోతు న్నారు. అక్షరదోషాలు లేకుండా నాలుగు వాక్యాలు గట్టిగా రాయలేకపోతున్నారు. గిడుగు వారి కృషి ఫలి తాన్ని మనం కలకాలం నిలుపుకోవాలంటే, ఇప్పుడు కూడా విద్యా రంగంలో తెలుగు ఉనికిని కాపాడుకోవ టానికి మరో ఉద్యమం రావలసి ఉంది. (నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా) చెంగల్వ రామలక్ష్మి, లెక్చరర్, విజయవాడ మొబైల్ : 94906 96950 -
గిడుగు నిజంగా పిడుగే!
జీవితమంటే చాలా మందికి ఆరాటం. చాలా కొద్ది మందికే పోరాటం! ఆ పోరాటం కూడా బతుకుదె రువు కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో కానే కాదు - పుట్టి పెరిగిన సమాజానికి ఏ మేలు ఎలా చేయాల న్నదే ఆ పోరాటం వెనుక ఆరాటం! ఆయన ఆరాట మంతా ఆంధ్ర ప్రజల కోసం, వాళ్ల భాష ఎలా ఉం డాలన్న ఆలోచనతో వాడుక భాషకు పట్టం కట్టడం కోసమే! అందుకే జీవితాంతం గిడుగు పిడుగులా విజృంభించాడు. 1863, ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో శ్రీము ఖలింగ క్షేత్రానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న పర్వ తాలపేట గ్రామంలో వీరరాజు, వెంకాయమ్మ దంప తులకు జన్మించారు గిడుగు వేంకటరామమూర్తి. విజయనగరం మహారాజా కళాశాలలో లోయర్ ఫోర్త్‌లో చేరారు. లోయర్ ఫోర్త్, అప్పర్ ఫిఫ్త్ మెట్రి క్యులేషన్ వరకు అక్కడే చదివారు. తండ్రి చనిపోవ డంతో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణుడు కాగానే సంపా దన కోసం ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. పెళ్లయి ఉద్యోగం చేస్తున్నా, కష్టపడి ప్రైవేటుగా చదివి, ఇం టర్ పాసయ్యారు. తర్వాత 1890లో గిడుగు బీఏ చరిత్ర విభాగంలో మొత్తం యూనివర్సిటీలో రెండో రాంక్‌తో పాసై ఉపాధ్యాయుడు కాస్తా లెక్చరయ్యా రు. పర్లాకిమిడి రాజా వారి పాఠశాల కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేసుకుని లెక్చ రర్ అయ్యారు. జీవన పర్యంతం ఆయ న మూఢనమ్మకాలను, దురాచారాల్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. ఎవరూ వెళ్లకపోతే హరిజన పాఠశాలలకు స్వ యంగా పాఠాలు చెప్పేవారు. గిరిజన సాహిత్యాన్ని మొదటిసారిగా సేకరిం చిన ఘనత గిడుగుదే. సవరలకు నిఘంటువులను, మాన్యువల్‌ని రాశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిడుగు మొట్టమొదటి భాషా శాస్త్రవేత్త. మొదట్లో వ్యావహారిక భాషావా దాన్ని గురజాడ, ఏట్స్, శ్రీనివాసయ్యంగార్ లాంటి వాళ్లతో కలసి చేశారు. గురజాడ మరణించిన తర్వా త దాదాపు పాతికేళ్లు ఒంటరి పోరాటం చేశారు. ఆ రోజుల్లో ఆయన కుమారుడు సీతాపతే ఆయనకి అం డగా నిలిచాడు. వ్యావహారిక భాషలోనే గ్రంథ రచ న, బోధనా భాషగా కూడా వ్యావహారిక భాషే ఉం డాలని ఉద్యమ రీతిలో ఆయన సాగిపోతున్నప్పుడు రాజమండ్రిలో ఓ సభలో గ్రాంథికవాదు లు బాగా గొడవచేశారట. ‘‘మీరెంతగా గోల చేసినా నాకు వినిపించదు. నేను చెప్పదలచుకున్నది చెప్పకమానను’’ అన్నారట కరాఖండిగా. తొలినుంచీ పర్లాకిమిడి రాజాతో సత్సంబంధాలు న్న గిడుగు- పర్లాకిమిడితోబాటు మరో వంద గ్రామాల్ని కొత్తగా ఏర్పడే ఒడిశా రాష్ట్రంలో కలపాలని ప్రయత్నిస్తున్న రాజా చర్యలను వ్యతిరేకించారు. దీంతో గిడుగు ఆయనకు శత్రువ య్యారు. గిడుగును రాజా నానా విధాలా హింసించ సాగాడు. అయినా గిడుగు పట్టువిడవలేదు. న్యాయ పరంగా కూడా రాజాతో పోరాడాడు. ఆఖరికి పర్లా కిమిడి ఒడిశాలో కలవకుండా కాపాడలేకపోయాడు. మహేంద్ర తనయ నదికి ఇవతలున్న గ్రామాలు కొన్నింటిని మాత్రం కొత్త రాష్ట్రంలో కలవకుండా కాపాడగలిగాడు. అంతకుముందు కంబైన్డ్ మద్రాస్ స్టేట్‌లో రెండో పౌరులుగా ఉన్న ఆంధ్రులు, మళ్లీ ఒడిశాలో కలసి ద్వితీయస్థాయి పౌరులుగానే ఉం డాలా? అన్నది ఆయన బాధ. పర్లాకిమిడి ఒడిశాలో కలిసే రోజు ఉదయమే ఆయన నదిలో తర్పణాలు విడిచి ‘పర రాష్ట్రంలో ఉన్న ఆ ప్రాంతానికి మళ్లీ రానని’’ రాజమండ్రి వచ్చేశారు. గిడుగు అక్కడ నుంచే వ్యావహారిక భాషా వా దాన్ని ప్రచారం చేయసాగారు. ఒంట్లో బాగుండక పోవడంతో చెన్నై తీసుకువెళ్లారు పిల్లలు. అక్కడే ఆయన క్యాన్సర్‌తో 1940 జనవరి 22వ తేదీన మద్రాస్‌లో కుమారుడు సీతాపతి గారింట్లో కన్ను మూశారు. సవరలకు గిడుగు చేసిన సేవల్ని ప్రభు త్వం గుర్తించి కైజర్-ఇ-హింద్ బంగారు పతకంతో సత్కరించింది. 1919లో రావు సాహెబ్ బిరుదు నిచ్చి గౌరవించింది. ఇటీవల ఆయన సాహిత్య సర్వ స్వ ప్రచురణ జరిగింది. సవర డిక్షనరీలు, మాన్యు వల్ సంపుటి రావాలి. లేకపోతే అవి జీర్ణమై కాలగ ర్భంలో కలసిపోయే ప్రమాదముంది. మెమోరియల్ స్టాంప్‌ని ప్రభుత్వం తేవాలి. అప్పుడే ఆయనకు పూర్తి నివాళులర్పించినట్టు! (ఆగస్టు 29న గిడుగు రామమూర్తి 152వ జయంతి సందర్భంగా) డా॥వేదగిరి రాంబాబు, రచయిత మొబైల్: 93913 43916. -
ఆదివాసీల అక్షరశిల్పి గిడుగు రామమూర్తి
సందర్భం (నేడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 75వ వర్ధంతి) ఆదిమ సవర జాతి గిరి జనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొం దించి, తెలుగు వాడుక భాషా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గిడుగు రామమూర్తి (ఆగస్టు 29, 1863 -జనవరి 22,1940)తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేక మంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షరజ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. సరైన తిండి, బట్ట లేకు న్నా ప్రత్యేక జీవనసంస్కృతి కలిగిన ప్రపంచం వారిది. గతంలో ఎంతో ఉన్నత విలువలతో జీవిం చిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. బాహ్య ప్రపంచానికి సుదూరంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని కొండజాతి సవర తెగ గిరిజనుల ఆర్థిక, జీవన స్థితిగతులను గమనించిన గిడుగు, వారికి సవర భాషలోనే విద్యను అందించాలని భావించడానికి కార ణం వారి వెనుకబాటుతనమే కాదు, వారికున్నచారిత్రక నేపథ్యం కూడా. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతు లను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని భావించిన గిడు గు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథల, పాటల పుస్తకాలు, తెలుగు-సవర, సవర- తెలుగు నిఘంటువులను తయారు చేశారు. వాటిని 1911లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రచు రించింది. ఇందుకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వ బోతే, ‘ఆ డబ్బుతో మంచి బడి పెట్టండి, నేను పెట్టిన బడులకు నిధులు ఇవ్వండి!’ అని కోరారు. ఆ ప్రకారమే ప్రభుత్వం శిక్షణా పాఠ శాలలను ప్రారంభించింది. వాడుకభాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తిచూపుతూ 1911-12 మధ్య ఆంధ్ర పండిత భిష క్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రాశారు. సవర భాషలో ఎ మాన్యు వల్ ఆఫ్ సవర లాంగ్వేజ్ అనే వర్ణనా త్మక వ్యాకరణాన్ని 1930లో రాశారు. సవర జాతికి సంబంధించిన అంశా లను చేర్చి క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియాను రచించిన మానవ శాస్త్రవేత్త ధరస్టన్తో రామమూర్తి చర్చించారు. ఆదివాసీల అక్షర శిల్పి గా, సవర లిపి నిర్మాతగా పేరొందిన గిడుగు కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కైజర్- ఇ- హింద్ బిరుదుతోపాటు బంగారు పతకాన్ని బహూ కరించింది. మద్రాసు గవర్నర్ చిత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బారులో ఈ అవార్డును రామమూర్తికి స్వయంగా అందజేశారు. తెలుగు వారు అధికంగా ఉన్న పర్లాకిమిడిని, 200 గ్రామాలను 1935లో అన్యాయంగా ఒడిశా రాష్ట్రంలో చేర్చడాన్ని నిరసించిన గిడుగు.. 22 ఏళ్లుగా పర్లాకిమిడిలో నివసిస్తూ వచ్చిన ఇంటిని వదిలి రాజమండ్రిలో ఉంటున్న తన నాలుగవ కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బహూకరించిన కళా ప్రపూర్ణ బిరుదును వ్యవహారిక భాషావాదులందరికీ అంకి తమిస్తున్నట్లు ప్రకటించడం గిడుగువారికే సాధ్య మైంది. గిడుగు ప్రేరణతో అయినా, ప్రభుత్వాలు అంతరించిపోతున్న ఆదివాసీ భాషల్ని, సంస్కృ తుల్ని పరిరక్షించాలి. గుమ్మడి లక్ష్మీనారాయణ, (వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం నేత, వరంగల్. మొబైల్: 9491318409)