నేడు తెలుగు ప్రజలు, విద్యార్థి లోకం సృజనాత్మక సాహిత్యాన్ని, వార్తా పత్రికలను, పాఠ్య పుస్తకాలను జీవకళలొలుకు జీవద్భాషలో హాయిగా చదువుకుం టున్నారంటే, విద్యార్థులు మాట్లాడే భాషలో పరీక్షలు సులభంగా రాస్తున్నారంటే.. దీనివెనుక గిడుగు రామమూర్తిగారి ఎన్నో ఏళ్ల కృషి, ఎంతో శ్రమ, పట్టు దల, తపన ఉన్నాయి. అందుకే గిడుగువారి పుట్టిన రోజు తెలుగు భాషా దినోత్సవమయింది. వ్యావహారిక భాషావాదం పుట్టి 118 ఏళ్లపైన అవుతోంది. ఇప్పుడు రచయితలందరూ సజీవ భాష లోనే రచనలు చేస్తున్నారు. మహా కావ్యాలకు సైతం వ్యాఖ్యానాలు వాడుక భాషలోనే వస్తున్నాయి. విశ్వ విద్యాలయాలలోని పరిశోధనా పత్రాలను జీవద్భాష లోనే రాస్తూ, డాక్టరేట్లు అవుతున్నారు.
‘కొమ్ములు తిరిగిన ఉద్దండ పండితులే నిర్దు ష్టంగా రాయలేని గ్రాంథిక భాషా శైలిలో బడిపిల్లలు, సామాన్యులు రాయాలనటం అశాస్త్రీయమనీ, అలా ఆదేశించటం అన్యాయమనీ గిడుగువారు పత్రికా ముఖంగా చెప్పారు. తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి సభాముఖంగా, విజ్ఞప్తుల రూపంలో వాడుక భాషలో సౌలభ్యాన్ని ప్రచారం చేశారు. ఇంటాబైటా నూటికి 90 శాతం వ్యవహారంలో వాడే జీవద్భాషను వదిలి, పాఠ్యగ్రంథాలలో శైలిని బట్టీపట్టి కృతక శైలిలో పరీ క్షలు రాయాలని పిల్లలను నిర్బంధించటం సబబా అని ప్రశ్నించారు.
గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమం ఒక చారి త్రక ఘటన. దేశభాషలు అభివృద్ధి చెందాలంటే, భాషలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాస్త్ర విజ్ఞా నాన్ని దేశ భాషలలో బోధించటానికి తగిన పుస్తకా లను రాయటానికి రచయితలను ప్రోత్సహించాలని 1905లో విద్యాశాఖ భావించింది. ఉన్నత పాఠశాల, కళాశాల తరగతులలో మాతృభాషలో వ్యాస రచ నను నిర్బంధ పాఠ్యాంశంగా పెట్టాలని విద్యాశాఖ భావించింది. ఈ వ్యాస రచన, అనువాదాల శైలి విషయంలో వ్యావహారిక భాషా ప్రసక్తి వచ్చింది. ఆధునిక భావాలున్న విద్యావేత్తలు వ్యావహారిక భాష లోనే ఈ వ్యాస రచన, అనువాదం ఉండాలన్నారు. గ్రాంథిక భాషాభిమానులకు ఇది నచ్చలేదు. భాష విషయంలో రెండు వర్గాలేర్పడ్డాయి.
1906 సంవత్సరంలో అప్పటి గంజాం, విశాఖ, గోదావరి జిల్లాల స్కూళ్లు పరీక్షాధికారి ఉ.ఎ. ఏట్సు తెలుగులో గ్రంథశైలికి, మాట్లాడే భాషకు ఉన్న పెద్ద అంతరాన్ని గుర్తించి, ఆశ్చర్యపోయి, గురజాడ, గిడు గులతో చర్చించారు. ఆ తరువాత రెండేళ్లపాటు గిడు గువారు తెలుగు కావ్యాలను, వ్యాకరణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గ్రాంథిక, వ్యావహా రిక భాషల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించిన దగ్గర నుంచీ గిడుగు వారి దృష్టి అంతా ఈ విషయంపైనే. విషయ ప్రధానమైన గ్రంథాలన్నీ మన పూర్వులు వాడుక భాషలోనే రాశారనీ, మన సంప్రదాయం అదేనని నిదర్శనలు చూపిస్తూ పలు చోట్ల ఉపన్యసిం చారు. ఏట్సు కోరికపై ఉపాధ్యాయ వార్షిక సభలో తెలుగు భాషా పరిణామక్రమాన్ని, జీవద్భాషా ప్రాశ స్త్యాన్ని వివరించారు. పండితులు వీరిని వ్యతిరేకిం చారు.
1911లో మద్రాసు యూనివర్సిటీ వ్యాసర చన, అనువాదాల శైలి విషయంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో గ్రాంథిక భాషా ప్రతినిధులుగా జయంతి రామయ్య, వేదం వేంకట రాయ శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు మొదలైన వారు.. వ్యావహారిక భాషా వాద ప్రతినిధులుగా గిడుగు, గురజాడ, బుర్రా శేష గిరిరావు, శ్రీనివాస య్యంగార్ వంటి వారున్నారు. వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగి నాయి. వీటన్నిం టికీ నాటి ‘హిందూ’ పత్రిక వేదికయింది. అయిదారు పుష్కరాలపాటు ఈ భాషోద్యమం కొనసాగింది. చివ రికి వాడుక భాషకు విజయం లభించింది. గురజాడ సృజనాత్మక సాహిత్యం ద్వారా గిడుగు సిద్ధాంతా లకు దోహదం చేశారు.
వ్యావహారిక భాషోద్యమం సాంఘిక ప్రయో జనాన్ని ఆశించి పుట్టింది. నూటికి 90 మంది విద్యా వంతులైనప్పుడు తప్ప సమాజానికి మేలు కలగదని, అది సాధించాలంటే శాస్త్ర విషయాలన్నీ వాడుక భాషలో రచించినప్పుడే అనుకున్న ప్రయోజనం సాధించగలమని గిడుగు చెప్పారు. ఇప్పటి సమా జంలో గ్రాంథిక భాష లేదు. అంతటా, అన్నిటా, జీవ ద్భాషే. రచయితలు తమదైన భాషలో చక్కగా భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే గిడుగు వారి కల నెరవేరినట్లే. కానీ, నేడు విద్యా రంగంలో తెలుగు భాషకున్న పరిస్థితేమిటి? విద్యార్థులు తెలు గులో తమ భావాలను చక్కగా వ్యక్తం చేయలేకపోతు న్నారు. అక్షరదోషాలు లేకుండా నాలుగు వాక్యాలు గట్టిగా రాయలేకపోతున్నారు. గిడుగు వారి కృషి ఫలి తాన్ని మనం కలకాలం నిలుపుకోవాలంటే, ఇప్పుడు కూడా విద్యా రంగంలో తెలుగు ఉనికిని కాపాడుకోవ టానికి మరో ఉద్యమం రావలసి ఉంది.
(నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా)
చెంగల్వ రామలక్ష్మి, లెక్చరర్, విజయవాడ
మొబైల్ : 94906 96950
Comments
Please login to add a commentAdd a comment