వ్యావహారిక భాషోద్యమానికి రాజమహేంద్రవరం వేదికగా నిలిచింది. ఇందుకు ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి పంతులుకు గొడుగులా అండగా నిలబడింది ఈ నేలే. రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న పర్లాకిమిడి పట్టణాన్ని ఒడిశాలో కలపేయడంతో ఆంధ్రపై ఉండే అభిమానంతో 1936వ సంవత్సరంలో ఏకంగా రాజమండ్రికి తన నివాసం మార్చుకున్నారు. తుది శ్వాస విడిచే వరకూ ఈ గడ్డనే ఆయన గుడిగా మలచుకున్నారు. సంస్కృతాభిమానుల ఛీత్కారాల మధ్య పోరాటం చేస్తూ సభలు, సమావేశాలను నిర్వహిస్తూ... తన వ్యాసాల ద్వారా వాడుక భాష ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 1897లో వెలువడిన గురజాడ ‘కన్యాశుల్కం’ పుస్తకం పీఠికలో ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ గా అభివర్ణించే మాతృ భాషంటేనే నాకు అభిమానం. ఆ సంకెళ్ల నుంచి బయటపడని వారు ఉండొచ్చుగాక ... వారంతా తమ సుఖాల్ని, కష్టాల్ని వెల్లడించడానికి వాడుకభాష కావాలి...కాగితం మీద పెట్టడానికి మాత్రం ముందుకురారంటూ చురకలంటించడంతో ఉద్యమానికి ఊపిరిలూదినట్టయింది. రాజమండ్రివాసైన కందుకూరి వారు కూడా వాడుక మాటలవైపే అడుగులేయకతప్పలేదు. ‘శ్మశానాల వంటి నిఘంటువులుదాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి ఇలా మన ముందుకు వచ్చి వాడుక భాష జీవం పోసుకోడానికి రాజమహేంద్రవరమే ఓ పెద్ద వరంగా మారడం విశేషం.
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్: ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షరి’.. ఇదో పుస్తకం పేరు. నేటి యువత ఈ పుస్తకం పేరు వింటేనే కంగారు పడొచ్చు. రాజమహేంద్రిని తన సాహితీసేద్యానికి ప్రధాన క్షేత్రం చేసుకున్న కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి రాసిన సుమారు రెండు వందల పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. నాడు గ్రాంథిక భాషకు ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఒక శతాబ్దం వెనుకకు వెళితే.. గ్రాంథిక భాష స్థానంలో వ్యావహారిక భాష ఆవిర్భవిస్తున్న రోజులు కనపడతాయి. సహజంగా, ఏ మార్పుకైనా తప్పని ప్రతిఘటనలు ఈ పరిణామక్రమానికి తప్పలేదు.
వ్యావహారిక భాష కోసం గిడుగు ఉద్యమం..
1936లో పర్లాకిమిడి పట్టణాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన ఒడిశా రాష్ట్రంలో విలీనం చేసినందుకు నిరసనగా గిడుగు రామ్మూర్తి తన నివాసం రాజమండ్రికి మార్చి, తుదిశ్వాస వదిలేవరకు ఈ నగరంలోనే గడిపారు. నేటి ఇన్నీసుపేట ప్రాంతంలోని ఏనుగుగుమ్మాలవారివీధిలో నివసించేవారని చెబుతారు. అప్పటికే వ్యావహారిక భాష ప్రజల్లో ప్రాచుర్యం పొందుతున్నా, కొక్కొండ వెంకటరత్నం వంటి సంస్కృతాంధ్ర విద్వాంసులు ఈ ప్రక్రియను నిరసించసాగారు. కొక్కొండ వెంకటరత్నం పేరిట టి.నగరులో ఒక వీధి నేటికీ ఉంది. నాటి తాలూకా కార్యాలయం ఉత్తరం వైపు వీధిలో ఆయన నివసించేవారు. వ్యావహారిక భాషను రచనల్లో ప్రయోగించడాన్ని సమర్థ్ధిస్తూ, వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో సైతం సభలు, సమావేశాలు, పత్రికల్లో వ్యాసాలు చోటు చేసుకునేవి. 1897లో గురజాడ కన్యాశుల్కం మొదటి ముద్రణ, కొన్ని మార్పులు, చేర్పులతో 1909లో వెలువడిన కన్యాశుల్కం మలి ముద్రణ తెలుగునాట ప్రభంజనాన్ని సృష్టించాయి. కన్యాశుల్కానికి పీఠికలో గురజాడ అన్న మాటలను మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి..
‘సంకెళ్లను ప్రేమించే వాళ్లు దాన్ని–అనగా గ్రాంథిక భాషను–ఆరాధిస్తారు గాక, నా మట్టుకు నా మాతృభాష సజీవమైన తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాల్ని, మన దుఃఖాల్ని వెల్లడించుకోవడానికి మనం యవరమూ సిగ్గు పడలేదు కాని, కాగితం మీద పెట్టుకోవడానికి మాత్రం కొందరు బిడియపడుతున్నారు!
‘గ్రామ్యం అని పొరపాటు పేరుపెట్టి పిలిచే వాడుక భాషను కావ్యరచనలలో ప్రవేశపెడితే ఉత్తమ కావ్యాలకు ఉండవలసిన గౌరవం దిగజారిపోతుందనే విమర్శనను మనం లెక్క చేయనక్కరలేదు. ఎందుచేతనంటే, కావ్య ప్రశస్తి, కావ్య ప్రయోజనము నిర్ణయించేవి పాతకాలపు వైయాకరణుల ఛాందసాలు
కావు. భాషాశాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అంతకన్నా మంచి గీటురాళ్లే మనకందుబాటులోకొచ్చాయి.’ తరువాత కాలంలో వచ్చిన శ్రీశ్రీ ‘శ్మశానాల వంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి’ కవితలు రాశానని పేర్కొన్నాడు.
కాంచవోయి నేటి దుస్థితి...
తెలుగు భాషాదినోత్సవం జరుపుకోవడానికి ఏముంది గర్వకారణం? భాషను కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయవలసిన పాడు రోజులు దాపురించాయి. రాజమహేంద్రవరాన్ని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రధాన కేంద్రంగా చేస్తానని 2015 పుష్కరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. అయిదారు నెలలకు రెండు నెలల జీతం రాళ్ల ఇస్తున్నారు. సంస్థ మనుగడపై సందేహాలు సృష్టించడంతో కొత్తగా చేరే విద్యార్థులు కరువైపోతున్నారు. అతివలకు సంస్కృతాంధ్రాలు నేర్పుతున్న, అతి ప్రాచీనమైన ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల 8 జిల్లాలలో ఏకైక కళాశాల.. శతావధానాలు చేస్తున్న మహిళలు చదువుకున్న కళాశాల.. గోదావరీ తీరాన, మన నగరంలో ఉంది. ఎయిడెడ్ హోదా కోల్పోయి, దాతల విరాళాలతో మనుగడ సాగిస్తోంది.. కళాశాలను ఆదుకోవాలని ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా, అన్నీ బుట్టదాఖలయ్యాయి. ఎందరో మహామహోపాధ్యాయులు పాఠాలు చెప్పిన ప్రతిష్టాత్మకమైన గౌతమీ విద్యాపీఠం కనుమరుగైపోతే, రెండు కన్నీటిబొట్లు రాల్చడం మినహాయించి, ఏమి చేయగలిగామని భాషాభిమానులు వాపోతున్నారు.
అమ్మ భాషకు పట్టాభిషేకం
బిక్కవోలు: అక్షరం ఆకాశంలో విహరిస్తున్నపుడు.. కావ్యాలు సామాన్యుల నోటికి అందనంత దూరంలో ఉన్నప్పుడు వచనాలు వినడానికి కూడా అవకాశం లేనప్పుడు ఓ అక్షర సైనికుడు ఉదయించాడు. సామాన్యుడి కోసం రచన అన్న సూత్రాన్నిప్రవేశపెట్టాడు. ఆకాశ మార్గంలో ఉన్న అక్షరాలను నిచ్చెన వేసి కిందకు దించాడు. మన ఊరిలో, మన వీధిలో, మన ఇంటి ముందు నిలిపే తులసికోటలా అందమైన అక్షర శిల్పాలను తీర్చిదిద్దాడు. గ్రాంథికం నుంచి తెలుగును వ్యవహారికంలోకి మార్చి అతి పెద్ద సాహితీ మార్చునకు ఆద్యుడయ్యాడు. తెలుగుజాతి గొప్పదనాన్ని ఖండాతరాలకు చాటి చెప్పిన ఆ సైనికుడి పేరు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన జయంతిని బుధవారం మాతృభాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పంచదార కన్నా, పాలమీగడ కన్నా, చెరకు రసం కన్నా మధురమైనది మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగులెస్స అని కృష్ణదేవరాయులు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా నికోలో డీ కోంటి పేర్కొని మన తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు.
క్రీస్తు శకం 200 సంవత్సరంలో లిఖించిన అమరావతి శాసనంలో నాగబు అనే తెలుగు పదం కనిపిస్తుంది. తెలుగు భాష ప్రాచీనత్వానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. దేశంలోని అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఒకటి. ఇతర భాషలకు ప్రాచీన హోదా ఎప్పుడో లభించినా తెలుగుభాష మాత్రం వివక్షకు గురవుతూనే వచ్చింది. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. ఆయన హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా వచ్చేందుకు ఏబీకే ప్రసాద్‌ను తెలుగు భాషా సంఘానికి అధ్యక్షుడిగా నియమించి ఆయన ద్వారా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. అయినా కోర్టు తెలుగు ప్రాచీన హోదా నిర్ణయానికి మద్దతుగా తీర్పునివ్వడం ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగ్గ విషయం. మన భాష సంస్కృతి, సంప్రదాయాలు సమోన్నతమైనవి. మానవీయ కోణంలోనూ, భారతీయ దార్శనికతలోనూ తెలుగు సంప్రదాయాల పాత్ర అమోఘం.
తెలుగుదనం పదిలం కావాలంటే..
⇔ ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, అధికార సమాచార వినిమయం తెలుగులోనే అమలు చేయాలి
⇔ తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువను పెంచే పాఠ్యాంశాలను సిలబస్‌లో చేర్చాలి
⇔ తెలుగు వారి ప్రధాన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిధులలేమి లేకుండా చక్కగా నిర్వర్తించాలి
⇔ కవులు, కళాకారుల ప్రతిభను గుర్తించడం రాగద్వేషాలకు అతీతంగా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా జరగాలి.
⇔ అంతర్జాతీయ స్థాయికి తెలుగు ఘనతను చేర్చిన ప్రతిభావంతులకు, అందుకు మార్గదర్శకులుగా ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి
⇔ ముఖ్యంగా క్రీడారంగంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
⇔ తెలుగు రుచులు, అభిరుచులను వృద్ధి చేసేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిపి కార్యక్రమాలు నిర్వహించాలి
⇔ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలి
⇔ ప్రభుత్వం తెలుగు శతక పద్యాలపై రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి, ప్రతిభను ప్రోత్సహించాలి.
⇔ నూతన రచనలు వెలుగులోకి తెచ్చేందుకు చేయూతనివ్వాలి
⇔ ప్రతి జిల్లా కేంద్రలోనూ తెలుగు వికాస భవనాలు నిర్మించి తెలుగు భాషాసేవా కార్యక్రమాలు నిర్వహించాలి
వ్యావహారిక భాషాక్రమంలో తప్పుడు పదప్రయోగాలు
వ్యావహారిక భాషను ప్రోత్సహించడమంటే, తప్పుడు, కృత్రిమ పదాలను ఉపయోగించడమని అర్ధం కాదు. ‘జయంతోత్సవము’, ‘పాలాభిషేకము’ వంటి తప్పుడు పదాలను వాడడం సరికాదు. మనం ఒక విషయాన్ని విస్మరించరాదు. ఆధునిక కవులు శ్రీశ్రీ వంటివారికి సైతం ప్రాచీన సాహిత్యంపై గట్టి పట్టు ఉంది. సాహిత్యం కాలాన్ని బట్టి ఎన్ని మార్పులకు లోనైనా, మంచి సాహిత్యమనేది సార్వజనీనము, సార్వ కాలీనము అనే రెండు లక్షణాలను సంతరించుకుని ఉంటుందనే సత్యాన్ని మనం విస్మరించకూడదు.– డాక్టర్ అరిపిరాల నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment