తొలి తెలుగు పద్యానికి పుట్టినిల్లు ప్రకాశం | Telugu Literature In Prakasam | Sakshi
Sakshi News home page

తొలి తెలుగు పద్యానికి పుట్టినిల్లు ప్రకాశం

Published Thu, Aug 29 2019 11:14 AM | Last Updated on Thu, Aug 29 2019 11:17 AM

Telugu Literature In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు : తొలి తెలుగు పద్యం ‘తరువోజ’కు పుట్టినిల్లు మన అద్దంకే. మహాభారత ఇతిహాసాన్ని పరిపూర్తి చేసి ప్రపంచ సాహిత్యంలో భారత విశిష్టతకు పాదులు తవ్విన ఎర్రన కవి మనవాడే. సంగీత సామ్రాజ్యాన్ని మేలి మలుపు తిప్పిన మధుర వాగ్గేయకారుడు మన త్యాగరాజే. ఆధునిక కాలాన పద్యానికి బువ్వపెట్టి ఘనకీర్తిని చాటిన మధుర కవి మల్లవరపు జాన్‌ మనలో ఒకరే. మధురమైన వచన కవిత ద్వారా మానవీయత చాటిన జాతీయ కవి డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డడే. ఆధునిక భాషా శాస్త్రానికి ఊపిరులూది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ఒంగోలు వాసి. ఆధునిక వ్యవహార భాషకు ప్రామాణిక పత్రికా భాషతో లంకె కుదిర్చిన శ్రుత భాషా పండితుడు బూదరాజు మన చీరాలకు చెందిన వ్యక్తి.

పద్యంలో వ్యంగ్యతకు పట్టం కట్టి ఊరేగించిన గాడేపల్లి సీతారామమూర్తి మన అద్దంకి వాసే. తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వికాస చరిత్రకు జీవం పోసిన అరుదైన సాహితీ విమర్శకుడు జి.వి.సుబ్రహ్మణ్యంది పర్చూరు. రంగస్థల కళ ద్వారా ప్రాచీన పద్యానికి పునరావాసంగా నిలిచిన బండారు రామారావు, డీవీ సుబ్బారావు, అద్దంకి మాణిక్యాలరావు లాంటి అరుదైన కళాకారులూ ఈ జిల్లా వారే. అంతేకాదు.. తెలుగు కవిత్వాన్ని ఓ మేలి మలుపు తిప్పిన దిగంబర కవుల్లో పదునైన అభివ్యక్తీ స్వరం కలిగిన ‘మహాస్వప్న’ పుట్టింది లింగసముద్రంలోనే.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆధునిక నవలకు, కథకు, సాహిత్య విమర్శకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎందరో సాహితీమూర్తులు ప్రకాశం జిల్లా వాసులే. ఆధునిక నాటకానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నాటక ప్రయోగ శిల్పులూ ఇక్కడి వారే.  

ఆదరణే నాస్తి
తొలి తెలుగు పద్యం తరువోజ కొలువైన అద్దంకి శాసనం రోడ్డు విస్తరణలో శిథిలమైంది. 200 సంవత్సరాలు ఎవరూ పట్టించుకోనప్పుడు మహాభారత ఇతిహాసంలో ఆదికవి విడిచిపెట్టిన అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేసిన కవితా వీరుడు ఎర్రన సాహితీ ఉద్ధరణకు ఇక్కడ కార్యాచరణ లేదు. అంతేకాదు.. ఇన్ని విశేషాలున్న జిల్లాలో ఏర్పాటు చేసిన నాగార్జున వర్సిటీ పీజీ సెంటర్‌లో ఎంఏ తెలుగు లేకపోవడం భాషాభిమానులను కలచివేస్తోంది. కర్ణాటక సంగీతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన త్యాగరాజ కీర్తనలను పదిలం చేసుకోగల సంగీత విద్యాలయం లేదిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజును, పత్రికా ప్రామాణిక భాషకు పట్టుగొమ్మగా నిలిచిన బూధరాజు రాధాకృష్ణను, తెలుగు సాహిత్య విమర్శలో ప్రక్రియా వికాస చరిత్రకు ఆద్యుడైన ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యంను తలచుకునే సాహితీ జిజ్ఞాసులూ లేకపోవడం బాధాకరం. 

భాషోద్ధరణకు నడుం బిగించాలి
గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకలోకి తెచ్చి, నిత్య వ్యవహార భాషలోని అందాన్ని చాటిచెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు 156వ జయంతి నేడు. ఆయన పుట్టిన రోజును మాతృ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వ్యావహారిక భాషా కోసం ఆజన్మాంతం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో మన ప్రాంత భాషా, సాహిత్య విశిష్టతల ఉద్ధరణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని భాషా సాహిత్యవేత్తలు పేర్కొంటున్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు భాషా ఉద్ధరణ కోసం ప్రత్యేకంగా భాషా ఉత్సవాలు నిర్వహిస్తూ ఊతం ఇస్తున్నది. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో కూడా తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించింది. ఇంకోవైపు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా భాషోత్సవాలు నిర్వహిస్తున్నది. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక సాహిత్య సేవా సంస్థలు భాషా, సాహిత్యాల ఉద్ధరణకు పాటుపడుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement