digambara
-
తొలి తెలుగు పద్యానికి పుట్టినిల్లు ప్రకాశం
సాక్షి, ఒంగోలు : తొలి తెలుగు పద్యం ‘తరువోజ’కు పుట్టినిల్లు మన అద్దంకే. మహాభారత ఇతిహాసాన్ని పరిపూర్తి చేసి ప్రపంచ సాహిత్యంలో భారత విశిష్టతకు పాదులు తవ్విన ఎర్రన కవి మనవాడే. సంగీత సామ్రాజ్యాన్ని మేలి మలుపు తిప్పిన మధుర వాగ్గేయకారుడు మన త్యాగరాజే. ఆధునిక కాలాన పద్యానికి బువ్వపెట్టి ఘనకీర్తిని చాటిన మధుర కవి మల్లవరపు జాన్ మనలో ఒకరే. మధురమైన వచన కవిత ద్వారా మానవీయత చాటిన జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డడే. ఆధునిక భాషా శాస్త్రానికి ఊపిరులూది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ఒంగోలు వాసి. ఆధునిక వ్యవహార భాషకు ప్రామాణిక పత్రికా భాషతో లంకె కుదిర్చిన శ్రుత భాషా పండితుడు బూదరాజు మన చీరాలకు చెందిన వ్యక్తి. పద్యంలో వ్యంగ్యతకు పట్టం కట్టి ఊరేగించిన గాడేపల్లి సీతారామమూర్తి మన అద్దంకి వాసే. తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వికాస చరిత్రకు జీవం పోసిన అరుదైన సాహితీ విమర్శకుడు జి.వి.సుబ్రహ్మణ్యంది పర్చూరు. రంగస్థల కళ ద్వారా ప్రాచీన పద్యానికి పునరావాసంగా నిలిచిన బండారు రామారావు, డీవీ సుబ్బారావు, అద్దంకి మాణిక్యాలరావు లాంటి అరుదైన కళాకారులూ ఈ జిల్లా వారే. అంతేకాదు.. తెలుగు కవిత్వాన్ని ఓ మేలి మలుపు తిప్పిన దిగంబర కవుల్లో పదునైన అభివ్యక్తీ స్వరం కలిగిన ‘మహాస్వప్న’ పుట్టింది లింగసముద్రంలోనే.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆధునిక నవలకు, కథకు, సాహిత్య విమర్శకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎందరో సాహితీమూర్తులు ప్రకాశం జిల్లా వాసులే. ఆధునిక నాటకానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నాటక ప్రయోగ శిల్పులూ ఇక్కడి వారే. ఆదరణే నాస్తి తొలి తెలుగు పద్యం తరువోజ కొలువైన అద్దంకి శాసనం రోడ్డు విస్తరణలో శిథిలమైంది. 200 సంవత్సరాలు ఎవరూ పట్టించుకోనప్పుడు మహాభారత ఇతిహాసంలో ఆదికవి విడిచిపెట్టిన అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేసిన కవితా వీరుడు ఎర్రన సాహితీ ఉద్ధరణకు ఇక్కడ కార్యాచరణ లేదు. అంతేకాదు.. ఇన్ని విశేషాలున్న జిల్లాలో ఏర్పాటు చేసిన నాగార్జున వర్సిటీ పీజీ సెంటర్లో ఎంఏ తెలుగు లేకపోవడం భాషాభిమానులను కలచివేస్తోంది. కర్ణాటక సంగీతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన త్యాగరాజ కీర్తనలను పదిలం చేసుకోగల సంగీత విద్యాలయం లేదిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజును, పత్రికా ప్రామాణిక భాషకు పట్టుగొమ్మగా నిలిచిన బూధరాజు రాధాకృష్ణను, తెలుగు సాహిత్య విమర్శలో ప్రక్రియా వికాస చరిత్రకు ఆద్యుడైన ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యంను తలచుకునే సాహితీ జిజ్ఞాసులూ లేకపోవడం బాధాకరం. భాషోద్ధరణకు నడుం బిగించాలి గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకలోకి తెచ్చి, నిత్య వ్యవహార భాషలోని అందాన్ని చాటిచెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు 156వ జయంతి నేడు. ఆయన పుట్టిన రోజును మాతృ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వ్యావహారిక భాషా కోసం ఆజన్మాంతం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో మన ప్రాంత భాషా, సాహిత్య విశిష్టతల ఉద్ధరణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని భాషా సాహిత్యవేత్తలు పేర్కొంటున్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు భాషా ఉద్ధరణ కోసం ప్రత్యేకంగా భాషా ఉత్సవాలు నిర్వహిస్తూ ఊతం ఇస్తున్నది. ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో కూడా తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించింది. ఇంకోవైపు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా భాషోత్సవాలు నిర్వహిస్తున్నది. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక సాహిత్య సేవా సంస్థలు భాషా, సాహిత్యాల ఉద్ధరణకు పాటుపడుతున్నాయి. -
కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు: మహాస్వప్న
దిగంబరులారా, అజ్ఞానం మీ కవచం, అహంకారం మీ ఆయుధం, ఆత్మవంచన, పరవంచన మీకు కొత్తగా మొలిగచిన కొమ్ములు. దౌర్జన్యం మీ పంథా. మీకు ఎదురు లేదు. దిగ్విజయం మీదే. ఎందుకంటే చరిత్ర నిండా కనిపించే విజేతలంతా మీలాంటి వాళ్లే. మీకు ఎక్కడా, ఎప్పుడూ సందేహాలు లేవు. సమస్యలు లేవు. మీకు ప్రశ్నలు లేవు. ఉన్నా వాటికి సమాధానాలక్కరలేదు. మీరు ప్రపంచ ఏకైక సత్యాన్ని దర్శించిన ద్రష్టలు. కేవలం జ్ఞాన స్వరూపులు. మీ జ్ఞానాధిక్యత పట్ల మీకున్న ప్రగాఢ విశ్వాసం ప్రశస్తం. నిజంగా మీరు గొప్పవారు. మీ ‘ప్రజలు’ గొప్పవారు. మీ జెండాలు గొప్పవి. మీ నినాదాలు గొప్పవి.మీ విశ్వాసాలు గొప్పవి. మీరు కనుక్కున్న సత్యం గొప్పది. మీరు తొడుక్కున్న పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా కోటు (చిరిగి, మాసి, అంతులేని గబ్బు కొడుతున్నా సరే) గొప్పది. ఎదుటి వాడిని చిత్తు చేయడం కోసం వేసిన ఎత్తుగడలు గొప్పవి. పన్నిన వ్యూహాలు గొప్పవి. అందుకే మీరు నిజంగా గొప్ప వారు. నేను జీవితంలోకీ, సాహిత్యంలోకీ దిగంబరంగానే వచ్చాను. ఆయుధాలు సిద్ధం చేసుకోలేదు. యుద్ధానికి రాలేదు కాబట్టి. నేను చిన్నవాణ్ణి, కొద్దివాణ్ణి. నాకు అన్నీ సమస్యలే. అన్నీ సందేహాలే. నాకెదురుగా అన్నీ చౌరస్తాలే. అన్నీ క్రాస్ రోడ్లే. ముఖ్యంగా ఈ దేశంలో ఎవరు ఎవరో తెలుసుకోవడం కష్టం. ఎవరు ఏ పనిచెయ్యాలో ఆ పని చేయరు. ఎవరు ఏ పని చెయ్య కూడదో ఆ పని చేస్తారు. ఇక్కడ కుక్కలు ఓండ్రపెడతాయి. గాడిదలు మొరుగుతాయి. గొర్రెలు గర్జిస్తాయి. సింహాలు ఇకిలిస్తాయి. అందుకే ఒక క్యాపిటలిస్టు మార్క్సిజాన్ని గురించి మహోపన్యాసం ఇచ్చినా, ఒక నపుంసకుడు బండ్ల కొద్దీ సెక్స్ సాహిత్యాన్ని సృష్టించినా, ఒక పరమ దుర్మార్గుడు పరమ శివుడి ఫోజు పెట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు. ‘వర్గపోరాటం–వర్గ సంఘర్షణ’ అంటున్న మీరూ, మీ ప్రజలూ ఏ వర్గానికి చెందుతారో మీకు తెలీదు. మావో మ్యాజిక్కుకి వొళ్లు మరిచి కదం తొక్కతూ కదనకుతూహలంతో సాయుధ విప్లవం పదం పాడుతున్న మీకు, అర్జెం టుగా శత్రువులు కావలసిన మాట నిజమే. ఉన్న పిడికెడు మంది శత్రువులు మీ పిడికెళ్ల కెట్లాగూ అందరు. ఈ చీకటి తిర్నాళ్ల సంతలో మిగతా నిజమైన శత్రువుల అడ్రసేదో మీకు అంతుపట్టదు. అజ్ఞానంతో, ఆవేశంతో ‘సాయుధ విప్లవం జిందాబాద్’ అని మీరంటే లక్ష దోపిడీ కంఠాలు మీ వెనుక నుంచి ‘జిందా బాద్’ అని ప్రతిధ్వనిస్తున్నాయి. ‘నక్సలైట్ తత్వం వర్థిల్లాలి’అని మీరంటే ‘వర్థిల్లాలి’ అని లక్ష దోపిడీ హస్తాలు పైకి లేస్తున్నాయి. మీ అజ్ఞానాన్ని మీ ప్రజలూ, మీ ప్రజల అజ్ఞానాన్ని మీరూ దోపిడీ చేసుకుంటున్నారు. నిజం తెలుసుకోవాలనుకుంటే నిశ్శబ్దంగా సమాజ జీవనాడుల్లోకి ప్రవహించండి. కవిత్వం కావాలనుకుంటే సిద్ధాంతాల్ని, సూత్రాల్ని తెగదెంచి, ముందు మిమ్మల్ని మీరు బంధ విముక్తుల్ని చేసుకోండి. కవిగా నేనెప్పుడూ సర్వస్వతంత్రుడినే. వ్యక్తి స్వేచ్ఛను అంటే భావస్వాతంత్య్రాన్ని అరికట్టే ఏ వ్యవస్థనయినా, ఏ ఉద్యమాన్నయినా ద్వేషిస్తాను, దూషిస్తాను. శాసించే ప్రతి దౌర్జన్య హస్తాన్నీ నిలబెట్టి నరుకుతాను. ‘కట్టుబడు’ అంటే తంతాను. ఆత్మహననం కానంతవరకే సమష్టి బాధ్యతకు విలువ. మార్క్సిజం మీ సొంతమైనట్లు వాదిస్తున్న మీ అజ్ఞానానికి, ఇతర ఇజాలనూ, ఇతర కవులనూ సహృదయతతో, సానుభూతితో చూడలేని మీ బుద్ధి జాఢ్యజనితోన్మాదానికీ విచారిస్తున్నాను. మీరు నటిస్తున్న మాట యథార్థం. మీ సిన్సియారిటీని నేను శంకిస్తున్నాను. నక్సల్బరిలో ఏనాడో మొదలైన రైతు పోరాటం ఆంధ్రప్రదేశ్‌కు వ్యాపించి శ్రీకాకుళంలో మంటలు మిన్ను ముట్టాకనే మీరు కళ్లు విప్పారు. ఉన్నట్టుండి అవసరవాదాన్నీ, నక్సలైట్ విధానాన్ని అమాంతం కావిలించుకుంటున్నారు. దోపిడీ వ్యవస్థకి కారణమైన ఏ అవినీతి ప్రభుత్వాన్ని మీరు దుయ్యబడుతున్నారో, అదే అవినీతి ప్రభుత్వానికీ, దాని ఆశ్రిత సంస్థలకీ కడుగుతూ నగరాల్లో విలాస జీవితాలు గడుపుతున్న మీకు, ఎండల్లో, వానల్లో, కొండల్లో, అడవుల్లో తుపాకీ గుండ్లకు రొమ్ములొడ్డి తాము నమ్మిన దాని కోసం ఆవేశంతో పోరాడుతున్న నక్సలైట్లను సమర్థించే అధికారమూ అర్హతా లేవు. కృత్రిమమైన మోరల్ సపోర్ట్ ఎవరికీ అక్కరలేదు. మీ వందిమాగధ స్తోత్రాలూ, కైవారాలూ ఎవరికీ అక్కరలేదు. విప్లవాగ్ని జ్వాలలకు మీరేం కిరసనాయిల డబ్బాలు సరఫరా చెయ్యనక్కర్లేదు. దమ్ముంటే, నిజాయతీ ఉంటే దేశీయ సమస్యలకు నక్సలైట్ విధానం పరిష్కార మార్గమనే గట్టి నమ్మకం మీకుంటే పెళ్లాం బిడ్డల్ని వొదిలి ఉద్యోగాల్నీ విలాస జీవితాల్నీ వొదిలి కార్యరంగం మీదికి వెళ్లండి. వీరోచితంగా పోరాడండి. ఎండిన తాటాకులకు మంట పెట్టడం, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటం, దూరంగా నిలబడి బావిలో నాలుగు రాళ్లు రువ్వి జలావర్తాలు సృష్టించడం, సమయం వస్తే తెరచాటుకు తప్పుకుని ప్రజలతో దోబూచులాడటం కాదు దిగంబర కవులు చేయవలసింది. సాయుధ పోరాటాన్ని నేను వొప్పుకున్న మాట నిజమే. సాయుధ పోరాటమంటే నక్సలైట్ విధానమని కాదు నా అర్థం. దేశ వ్యాప్తంగా ప్రజా సానుభూతితో రావలసిన ధర్మబద్ధమైన ప్రజా పోరాటం. నాలుగైదు కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడ్డంత మాత్రాన సముద్రంలో తుపాను రాదు. రాజకీయాలకు, మతతత్వాలకు, సంకుచితత్వాలకు అతీతంగా గిరుల్ని గీతల్ని, అవధుల్ని దాటి సర్నోన్నత స్థాయిలో స్వచ్ఛందంగా పలకవలసిన కవిత, సంకుచిత వలయాల్లోకి, రాజకీయాల బురద గుంటల్లోకి ఎందుకు ప్రవేశించవలసి వచ్చింది? సముద్రాన్ని నదిలోకి మళ్లించాలనుకుం టున్న మీరు సముద్రాన్ని ఎప్పుడూ చూసిన పాపాన పోలేదు. రాజకీయాలు కవిత్వంలోకి ప్రవహిస్తాయి. కానీ కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు. దిగంబర కవితోద్యమ ప్రారంభ దశలో మీలో ఒక్కడైనా మార్క్స్, మావోల పేరెత్తలేదే. వారిని చదివాక ఇప్పుడే జ్ఞానోదయమైందా? మార్క్సిజం పుట్టిన ఒక శతాబ్దం తరువాత, ఆ సిద్ధాంతాల్ని అత్యధునాతనమైనవిగా ప్రచారం చేయడానికి కవులుగా మీకు సిగ్గెందుకు లేకుండా పోయింది? పోనీ మార్క్సిజాన్ని దృఢంగా విశ్వసించినప్పుడు, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే మీ ధ్యేయమైనప్పుడు, స్పష్టంగా ‘మేము మార్క్సిస్టు కవులమనో, మావోయిస్టు కవులమనో, సోషలిస్టు కవులమనో’ చెప్పుకోవడానికి సంకోచమెందుకు? దిగంబర కవులు అనే ముసుగెందుకు? శుద్ధ నాస్తికవాదులం అంటూనే పెళ్లాం సాకుతో తిరు పతి తీర్థయాత్రలు సేవించడం, శాస్త్ర సమ్మతంగా పెళ్లాడటం, ఆధునిక వివాహాలకు అత్యాధునిక పౌరోహిత్యాలు నెరపడం, పెళ్లిళ్లకు దిక్ పఠనాలు చెయ్యడం, రాజకీయోపన్యాసాలకు తయారు కావడం–ఇవన్నీ దిగంబర కవితా లక్షణాలని నేను ముందనుకోలేదు. నా దృష్టిలో దిగంబర కవిత్వ నిర్వచనమేదో కొత్తగా ఇవాళ చెప్పవలసిందేమీ లేదు. ఏ ఇజానికో తాకట్టు పడివుంటే నేను దిగంబర కవిని కానక్కర్లేదు. ఏ చెప్పులూ నా కాళ్లకి పట్టలేదు. ఏ దుస్తులూ నా ఒంటికి అతక లేదు. ఏ ఫ్రేములోనూ నా ఫొటో ఇమడలేదు. అందుకే నేను దిగంబర కవినయ్యాను. ఒక ఇజానికీ, ఒక విశ్వాసానికీ కట్టుబడిపోయి, దిగంబర కవులుగా మిమ్మల్ని మీరు నరుక్కున్నారు. మీరు నమ్మినదాన్నే ప్రపంచమంతా విశ్వసించాలని దౌర్జన్యంగా శాసిస్తూ మీ అల్పబుద్ధిని బయట పెట్టుకున్నారు. కట్టుబడిపోయిన మీకూ, దేనికీ కట్టుబడని నాకూ సంధి కుదరదు. పరిణామాల్ని ఊహించి మొహం చాటు చేసుకోవల్సిన గతి మీకు పడుతుంది. నాకు కాదు. తాటాకు చప్పుళ్లతో, కాగితప్పులి గర్జనలతో భయపెట్టలేరు. (1970లో దిగంబర కవులు ఇచ్చిన చార్జిషీట్‌కు మహాస్వప్న ఇచ్చిన సమాధానం సంక్షిప్త రూపం. మంగళవారం కన్నుమూసిన మహాస్వప్న స్మరణలో.) -
ఐడియాలజీల మూస నుంచి విముక్తి
దిగంబర కవిత్వోద్యమానికి 50 ఏళ్లు ఆధునిక తెలుగు సాహిత్యంలోని వ్యాక్యూమ్‌ని మొట్టమొదటిసారిగా గుర్తించినది దిగంబర కవిత్వం. ఒక విస్ఫోటాన్ని సృష్టించడం ద్వారా మనం శూన్యంలో ఉన్నామన్న సంగతిని అది చాటిచెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే వ్యవస్థలలో, నిర్మాణాలలో కుదురుకొని కులాసాగా కాలక్షేపం చేస్తున్నవారికి అది విశ్రాంతి భంగంగా పరిణమించి అమితమైన చికాకు కలిగించింది. 'దిగంబర కవిత్వం' అన్న పేరే, వ్యవస్థను కప్పిన పాత కొత్త ఆచ్ఛాదనలన్నింటినీ ఉత్తరించి కొత్తగా దర్శించవలసిన అవసరాన్ని సూచిస్తుంది. అందుకు తగ్గట్టే అందులోని వస్తువు, డిక్షన్ల వెనుక పైకి అనేకత్వంగా కనిపించే అంతర్లీన వస్వైక్యత, నిర్మాణంగా కనిపించని ఒక నిర్మాణం కనిపిస్తాయి. అప్పటికి ఇరవై ఏళ్ళకే పాతముఖాలను కొత్తగా చూపించడానికి వేసిన మేకప్ చెరిగిపోయి పాలకుల అసలు ముఖాలు బయటపడిపోయాయి. నూతన రాజ్యంగా చెబుతున్నది పీడన, దోపిడి, అజ్ఞానం, అహంకారం మూర్తీభవించిన పాత రాజ్యానికి కొనసాగింపేనన్న సంగతి స్పష్టమైపోయింది. ఆ విధంగా ఒక స్వప్నభంగం నుంచి పుట్టిన ఆక్రోశం దిగంబర కవిత్వం. ఆ ఆక్రోశం ఉద్దేశపూర్వకంగా తనకు అనుగుణమైన వస్తురూపాలను ఎంచుకొంది. అది మనకు అరాచకత్వంగా కనిపించింది. అంతకుముందు సాయుధోద్యమం సాగించి ప్రత్యామ్నాయ వ్యవస్థపై ఆశలు పెంచిన వామపక్ష భావాలను కూడా పార్లమెంటరీ ఆభాస ప్రజాస్వామ్యంలో చోటుచేసుకోవడం ఐడియాలజీల చివరి ఆశను కూడా శవపేటికలోకి చేర్చింది. ఐడియాలజీల నిరర్థకతను తేటతెల్లం చేసిన ఆ పరిణామం దిగంబర కవిత్వాన్ని సైద్ధాంతిక ప్రాతిపదికను తృణీకరించే ఒక ధిక్కార స్వరంగా మలచింది. ఆ విధంగా ఐడియాలజీల భ్రమల నుంచి బయటపడి ప్రజాస్వామ్యతాత్వికత అనే గీటురాయి మీద వ్యవస్థను నిలబెట్టే వెసులుబాటును దిగంబర కవిత్వం మొదటిసారిగా సాహిత్యంలో ప్రతిష్టించింది. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలకు చోటులేని నూతన ప్రజాస్వామ్యం అవతరించిన సంగతిని గుర్తించే దిగంబర కవిత ప్రజాస్వామికంగా విస్మృత (మార్జినలైజ్డ్) అయిన వర్గాలను వస్తువు చేసుకొంది. పాతనీ, కొత్తనీ కూడా సమానంగా కబళించి వ్యవస్థ కదలని కొండచిలువలా, బండరాయిలా పడి ఉండడాన్ని పోల్చుకొన్నది కనుకనే కసినీ, క్రోధాన్ని, ౠతును, మొరటుదనాన్ని దట్టించిన డిక్షన్‌ను ఆశ్రయించింది. దిగంబర కవిత్వం అవ్యవస్థీకృతంగా, విఘటిత నిర్మాణంగా ముందుకు రావడంలో, వ్యవస్థీకృతమైనదేదైనా కాలంలో ఘనీభవించిపోయి కొయ్యబొమ్మగా మారిపోతుందన్న సూచన ఉంది. దిగంబర కవిత్వ నిర్మాణంలో ప్రధానంగా గుర్తించవలసిన మరొక అంశం, దాని opin-ended స్వభావం. అది ఏ నిర్దిష్టమైన ఫలశ్రుతినీ ప్రతిపాదించదు. అలా ప్రతిపాదించకపోవడమే ప్రజాస్వామ్య తాత్వికతకు దగ్గరగా ఉన్న లక్షణం. ప్రజలందరినీ ఆర్థికంగా, తద్వారా రాజకీయంగా, సాంఘికంగా సాధికారుల్ని, స్వతంత్రుల్ని చేసేవరకు అంతిమ ఫలశ్రుతిని, చివరి వాక్యాన్ని నిర్దేశించడానికి ప్రజాస్వామ్య తాత్వికత అవకాశం ఇవ్వదు. ఇందుకు భిన్నంగా ఇంతవరకు రాజ్యమూ, మతమూ, సాహిత్యమూ, సిద్ధాంతాలూ చేసింది అదే. అవి అస్వతంత్ర, క్రియాశీల చలనరహితులుగా ఉన్న ప్రజలకు అంతిమ ఫలశ్రుతులను, చివరి వాక్యాలను బోధించే ప్రయత్నం చేశాయి. అందులో భాగంగా వారిని రకరకాల వ్యవస్థలలో బంధించాయి. ఈ ప్రక్రియ దారుణ వైఫల్యమే ఇన్నేళ్ల చరిత్ర! క్లాడ్ లెఫార్ట్ తదితర కల్చరల్ థియరిస్టులు ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తూ అది ఒక ఖాళీ సెట్టు లాంటిదంటారు. ఏదో ఒక్క వర్గంతోనో, జాతితోనో, జెండర్తోనో, మతంతోనో, సిద్ధాంతంతోనో భర్తీ చేయడానికి ఆ ఖాళీ సెట్టు అనుమతించదు. ఈ ఖాళీ సెట్టు నిండేవరకు ప్రజాస్వామిక గమనం అసంపూర్ణ ప్రక్రియగానే మిగిలిపోతుంది. శాసించే అధికారం వ్యక్తుల నుంచి సమూహానికి సంక్రమించడమే ఈ ప్రక్రియకు చివరి మొట్టు. ఆ తర్వాత ప్రజలే అంతిమ ఫలశ్రుతినీ, చివరి వాక్యాన్నీ నిర్దేశిస్తారు. అసంఖ్యాక ప్రజానీకాన్ని మార్జినలైజ్ చేసి ప్రజాస్వామ్యం పేరుతో కొందరే జాగాను ఆక్రమించుకొని ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తున్న స్థితిని దిగంబర కవిత్వం ప్రళయసదృశంగా ప్రదర్శించింది. ప్రజాస్వామిక రాజ్యాంగం సాయంతో పాతరోతనంతటినీ కడిగి శుభ్రం చేసి కొత్త వ్యవస్థా నిర్మాణం దిశగా దేశాన్ని చారిత్రకమైన మరో మలుపు తిప్పవలసిన స్వాతంత్య్రమనే నూతన సందర్భం ఒక నాన్- ఈవెంట్‌గా పరిణమించడంపట్ల తీవ్ర నైరాశ్య ఆక్రోశాలే దిగంబర కవిత్వమై ముంచెత్తాయి. ఇప్పుడు వెనుదిరిగి చూసుకొంటే ప్రజస్వామ్యాన్ని, రాజ్యాంగం ఉనికిని తెలుగు సాహిత్యంలో ప్రప్రథమంగా చర్చలోకి తీసుకువచ్చినది దిగంబర కవిత్వమేనన్న సంగతి స్పష్టమవుతుంది. ఇందుకు భిన్నంగా, శ్రీశ్రీతో మొదలైన అభ్యుదయ, విప్లవ సాహిత్య ధోరణులు స్వాతంత్య్రం ఉనికినీ, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్నీ గుర్తించని 1920ల నాటి ఐడియాలజీల ఎజెండాలనుంచి స్ఫూర్తిని పొందినవి. నిర్దిష్ట ఫలశ్రుతిని బోధించినవి. ప్రత్యామ్నాయ రాజ్య వ్యవస్థను మాత్రమే లక్ష్యం చేసుకొన్నవి. మరోవైపు, దేశం ఆధునికతకు మళ్ళే క్రమంలో కొత్తగా అవతరించిన మధ్యతరగతి అస్తిత్వ పోరాటాన్ని అక్షరబద్ధం చేసిన సాహిత్యం వామపక్ష భావజాలంలో భాగంగానూ, విడిగానూ కూడా ఈ నూరేళ్లలోనూ కొనసాగుతూ వచ్చింది. కనుక నూరేళ్లకు పైబడిన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను నిర్మించుకొనే సందర్భంలో, దానిని స్వాతంత్య్ర పూర్వ సాహిత్యంగా, స్వాతంత్య్రోత్తర సాహిత్యంగా విభజించుకోవలసిన అవసరాన్ని దిగంబర కవిత్వం స్థాపిస్తోంది. శ్రీశ్రీ ఆద్యుడుగా కొనసాగిన స్వాతంత్య్ర పూర్వ సాహిత్య దశను దిగంబర కవిత ఇర్రెలెవెంట్ చేసివేసి స్వాతంత్య్రోత్తర సాహిత్య దశను ప్రతిష్టించింది. ఆ విధంగా సాహిత్యాన్ని ఐడియాలజీల మూస నుంచి విడిపించి, స్వాతంత్య్రానంతర ప్రజాస్వామిక వాస్తవికతలోకి తీసుకువచ్చి సమకాలీనం చేయడంలో దిగంబర కవిత్వం వేగుచుక్క అయింది. అయితే, వ్యవస్థీకృత రూపాలమీద, ఐడియాలజీల మీద పనిచేసే శక్తులు అప్పటికింకా బలవత్తరంగా ఉండడంతో దిగంబర కవిత్వం ఒక నిర్దిష్ట రూపంగా అనతికాలంలోనే అదృశ్యం కావలసి వచ్చింది. తాత్విక భావ సారూప్యత తగినంతగా కుదరని ఫలితంగా దిగంబర కవులు తలోవైపుకూ చెదిరిపోయారు. వాళ్ళలో కొందరు ఐడియాలజీల చట్రంలోనే భద్రతను, లేదా ఫలసిద్ధిని వెతుక్కొంటే కొందరు పూర్తిగా అజ్ఞాతంలోకి జారిపోయారు. వారిలో ఒకరిద్దరు కవిత్వంపై పశ్చాత్తాపాన్ని ప్రకటించినప్పటికీ అది అప్పటికే సమాజపరమైపోయి చారిత్రక పరిణామంగా మారిపోయింది. వ్యవస్థ ఎంత జుగుప్సాకరంగా ఘనీభవించినప్పటికీ దానిని అభిశంసించడంలో దిగంబర కవిత్వం మరింత జుగుప్సను ఆశ్రయించి తిట్టును, ౠతును కవిత్వంగా చలామణి చేసే స్థాయికి వికటించడమూ కనిపిస్తుంది. ఫ్యూడల్ భావజాల ప్రభావంతో స్త్రీని కించపరిచే పదజాలం దిగంబర కవుల ప్రజాస్వామిక అవగాహనా పరిమితిని, లోపాన్ని సూచిస్తాయి. దిగంబర కవులు అనుసరించిన కవిత్వ నిర్మాణ పద్ధతీ, పదజాలమూ నాగరిక, సభ్య ప్రపంచాన్ని ఇక ఏ మాత్రమూ మెప్పించి ఒప్పించలేని స్థితికి చేరడం అనతికాలంలోనే దాని అదృశ్యాన్ని అనివార్యం చేసింది. కల్లూరి భాస్కరం 9703445985 ('గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం' నుండి...)