వ్యావహారిక భాషోద్యమ పితామహులలో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు, తెలుగు భాషకు చేసిన సేవల వల్లనే భాష సామాన్య తెలుగువాడికి అందుబాటులోకి వచ్చింది. మనం ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అలా అని తెలుగు సంస్కృతీ మహార్ణవంలో భాగమైన సొంతభాష ప్రత్యేక ప్రతిపత్తిని తగ్గించుకోకూడదు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటి నుంచి ఏదైనా భాషను నేర్చుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పకూడదు! మాతృభాషకు సంబంధించి ధనిక, పేద బహుజన వర్గాల భేదం ఉండరాదు. వివక్షను పాటించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పేదసాదలు సంపన్న వర్గాల నుంచి నానా దుర్భర స్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అదే అక్షరాస్యతలోనూ, విద్యారంగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ అసమాన సామాజిక, ఆర్థిక నీతిని కూకటివేళ్లతో పెకిలించగల పటిçష్ఠమైన రాజకీయ వ్యవస్థకు దేశంలో సరైన అంకురార్పణ జరగాల్సి ఉంది.
‘ఇంతకూ మన ఇంట్లో భాష ఎలా ఉంది? బతకడానికి ఇంగ్లిషు కాని, చిరకాలం జీవించడానికి తెలుగుకోసం, పిల్లల తెలుగు కోసం ఇంతకూ మనం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? కాని ఇంటి భాషను, తల్లి భాషను, ఇల్లు వేదికగా పిల్లల్లో పాడుకునేలా మనం ఏ మాత్రం చేయగల్గుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు ప్రశ్నించు కోవలసిన సమయం వచ్చింది. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోదిచేసిన సారస్వతం వారికి అందకపోవడం, దూరం కావడం, నన్నయ, తిక్కనలనుంచి శ్రీశ్రీ వరకూ తమజాతి సాహితీ ఔన్నత్యం, తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. అది ఇచ్చే ఆత్మవిశ్వాసమే వేరు. మాతృభాషనుంచి అందే గొప్పబలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది.’
సాక్షి పత్రికలో సాధికారికంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా (28.08.2021) వెలువడిన ప్రత్యేక వ్యాసంలోని భాగమిది.
అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి ఆదిమూలం సురేష్ తెలుగు భాషను, దాని ప్రాచీన హోదా ప్రతిపత్తిని రాష్ట్రప్రభుత్వం పరిరక్షిస్తుందని, పాఠశాల స్థాయిలో తెలుగు విధిగా నేర్చుకోవలసిన భాషగా చేస్తామనీ, వచ్చే ఏడాది నుంచీ, తెలుగు భాషోత్సవాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నామనీ ప్రకటించారు. అదే సంద ర్భంగా మహాభాషావేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహు లలో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు, తెలుగు భాషకు చేసిన సేవల వల్లనే భాష సామాన్య తెలుగువాడికి అందుబాటులోకి వచ్చిందనీ మంత్రి పేర్కొన్నారు. గిడుగు వారి జయంతిని ప్రతియేటా తెలుగు భాషా పరిరక్షణ దినోత్సవంగా కూడా తెలుగు భాషా ప్రియులు జరుపుకోవడం ఆనవాయితీ.
విద్యార్థులకు కేవలం మార్కులకోసం ప్రత్యేకభాషగా ఉన్న ‘సంస్కృతం’ ప్రతిష్ఠను దిగజార్చడం తప్పు. మార్కుల స్కోర్ కోసం ఆ భాష అక్షరాలు తెలియకపోయినా వాటిని ఆన్సర్‌షీట్లలో చేర్చుకునే సంకర సంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మొట్ట మొదటి ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగింది. ఈ ‘సంకర న్యాయాన్ని’ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తీవ్రంగా ఎదుర్కొంది. ఇంటర్‌లో కేవలం మార్కుల స్కోర్ కోసం సంస్కృతం అక్షరాలను విద్యార్థులు చేరుకునే సంప్రదాయాన్ని తీవ్రంగా నిరసించి, మాన్పించవలసి వచ్చింది.
మనం ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అలా అని తెలుగు సంస్కృతీ మహార్ణవంలో భాగమైన సొంతభాష ప్రత్యేక ప్రతిపత్తిని చేజేతులా తగ్గించుకోకూడదు. జాతికి జీవగర్రలు ప్రజాహృదయాలే అయినప్పుడు ఆ హృదయాల్ని గెలుచుకోవలసింది ఆ జాతి మాతృభాషలోనే. కనుకనే ‘తెలుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి ‘డుము వులు’ నేర్చినంతనే పుటుక్కున ముక్కులు గిల్లినంతనే/ సమకూరునా తెనుంగుసిరి సంస్కృత వాణికిన్’ అని ఎద్దేవా చేయవలసి వచ్చింది! అలాగే ‘‘మూడేండ్ల కుర్రాడు ‘ఏబీసీడీ’లను దిద్దు తెల్గుసీమలో అయ్యారే/ వీడు తన నేలనే పెరవాడై’’ పోవడం ‘జాతికెంత ప్రమా దమో సుమా’ అన్నాడాయన! మాతృభాషకు సంబంధించి ధనిక, పేద బహుజన వర్గాల భేదం ఉండరాదు. వివక్షను పాటించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పేదసాదలు ఆరోజు నుంచి ఈ రోజుదాకా సంపన్న వర్గాల నుంచి నానా దుర్భర స్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అదే అక్షరాస్యతలోనూ, విద్యారంగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ దుర్మార్గపు సామాజిక, ఆర్థిక నీతిని కూకటి వేళ్లతో పెకిలించగల పటిçష్ఠమైన రాజకీయ వ్యవస్థకు ఇంకా దేశంలో సరైన అంకురార్పణ జరగలేదు. కనుకనే విద్యారంగంలో పేద సాదల, బహుజనుల పురోగతికి ఈ రోజుకీ పెక్కు ఆటంకాలు ఎదురవుతూ, వారి అభ్యున్నతి అక్కడే ఉండిపోయింది.
ఈ సందర్భంగా పాఠశాల విద్యంతా మాతృభాషా పునాదులుగా సాగుతూ ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా మాత్రమే కొనసాగించడమే విద్యార్థుల విద్యాభివృద్ధికి మార్గమని, ఇంగ్లిషువాడే అయిన ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ వలస భారత దేశ గవర్నర్ జనరల్‌గా పట్టుబట్టాడు. ఎందుకంటే పరాయిభాష అయిన ఇంగ్లిషు, విద్యార్థికి ఒంటబట్టాలన్నా ముందు ప్రాథమిక విద్యాదశ అంతా మాతృభాషలోనే కొనసాగాలన్నవాడు బెంటిక్! కానీ, ప్రభు త్వానికి విద్యాబోధనా మాధ్యమం పాఠశాల విద్యనుంచే పూర్తిగా తమ ఇంగ్లిషు భాషలోనే కొనసాగాలని హఠం వేసి కూర్చున్నవాడు, విద్యారంగంపై ప్రత్యేక పత్రాన్ని (ది మినిట్) పోటీగా సమర్పించి నెగ్గించుకోడానికి ప్రయత్నించినవాడు– లార్డ్ బాబింగ్టన్ మెకాలే! ఈ ‘మినిట్’ (ప్రత్యేక పత్రం)లో తన అసలు లక్ష్యాన్ని మెకాలే ఇలా నిర్వ చించాడు. ‘మన భాషకు, ఇంగ్లిషువాళ్ల తిండికి, మన దుస్తులకు, మన రుచులకు, మన ప్రవర్తనకు, మన వేషధారణకు అలవాటుపడిన భార తీయులు మనకు శాశ్వతంగా బానిసలై పడి ఉంటారు’ అని చాటు మాటున కాకుండా ముక్కుమీద గుద్దినట్టుగా ముక్కుసూటిగానే చెప్పే శాడు. కాని విలియం బెంటిక్ మాటే (ప్రాథమిక విద్యాదశ– నాటి స్కూల్ ఫైనల్ దాకా స్థానిక మాతృభాషల్లోనే కొనసాగుతూ ఇంగ్లిషు ఒక సబ్జెక్టుగా మాత్రం ఉంచుకోవాలి) నెగ్గింది. కానీ, దీర్ఘకాలంలో మెకాలే లక్ష్యమైన ‘ఇంగ్లిషు అలవాట్లకు మనసావాచా అలవాటు పడిన భారతీయులు మనకు బానిసలయిపోతారు’ అన్న తెల్లవాడి అహంకారపు మాటలు మరపురానివిగా మిగిలిపోయాయి. ఒక్కభాష కాదు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటి నుంచి ఏది కావాల నుకుంటే ఆ భాషను నేర్చుకోవడానికి ఎవరూ అడ్డుచెప్పరు. చెప్పకూ డదు! కాని దేవనాగరి లిపిలో కేవలం మార్కుల కోసం గిలికే అక్షరాలుగా ‘సంస్కృతాన్ని’ దిగజార్చారు. అంతేగాదు, హాల చక్రవర్తి ప్రాకృతానికి అంటే ప్రకృతులయిన ప్రజలు నిత్యవ్యవహారంలో నేడు మాట్లాడుకున్న పునాది భాష ప్రాకృతం. అందుకనే మహా పండిత మ్మన్యులు అంతా ‘ప్రాచీన భారతంబు ప్రాకృతంబు’ అన్నారే గాని ‘సంస్కృతం’ అనలేదు! సంస్కృతం, ఇండోయూరోపియన్ భాషల కలగాపులగం అన్నారందుకే! పలు భాషలు తెలిసిన మహా పండితుడు తిరుమల రామచంద్ర, తెలుగు సహా ద్రావిడ భాషా పునాదులన్నీ ‘బ్రాహ్మీ’ నుంచే ఎదిగాయని ఆంధ్రప్రదేశ్‌లో ఐ.ఎ.ఎస్. హోదాలో కలెక్టర్‌గా పనిచేసిన ప్రసిద్ధ భాషాశాస్త్ర పరిశోధకుడు తమిళుడైన కాశ్యపాండ్యన్ అయితే ‘బ్రాహ్మీ’కి మూలం తెలుగేనని కూడా సిద్ధాంతీకరించేంతవరకు వెళ్ళాడు! ఆ మాటకొస్తే ఆదివాసీల (సవర, జాతాపు వగైరా) భాషలన్నీ సంస్కృతానికి లొంగిరాని, లిపి ఏర్పడని భాషలేనని ఏనాడో తేల్చిచెప్పి ‘సవర’ భాషకు లిపిని, తేలిక వ్యాకరణాన్ని సమకూర్చిపెట్టిన మహనీయుడు ‘గిడుగు’. అందుకే వివేకానందుడు– మన ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని క్రీ.శ. 500 నాటికే అందించిన ఆర్యభట్ట, భాస్కరలను పక్కన పెట్టేసి, మన ఖగోళ శాస్త్రాన్ని (అసస్టా్రనమీ) గ్రీకులకు ధారాదత్తం చేసి, గ్రీకుల పురాణ కల్పనలను మనం అరువు తెచ్చుకోడంతోనే భారతీయ వైజ్ఞానిక శాస్త్ర దృక్ప«థానికి మనం దూరమయ్యామని చెప్పాడు! తెలుగు వెలగాలనే ఆశయం నిండుగా నెరవేరడానికి ముందు, కనీసం ఒక్క సంవత్సరం పాటైనా తల్లిదండ్రులను మమ్మీ, డాడీ అని పిలువకుండా ‘అమ్మా నాన్నా’ అని పిల్లలకు అలవాటు చేయాలి.
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
భాష వెలగాలి... సంస్కృతి గెలవాలి!
Published Tue, Aug 31 2021 1:48 AM | Last Updated on Tue, Aug 31 2021 1:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment