telugu lanaguage day
-
Telugu Language Day 2024 : తేనె పలుకుల తెలుగు భాషను కాపాడుకుందాం!
‘దేశ భాషలందు తెలుగు లెస్స’అన్న శ్రీకృష్ణదేవరాయలు పొగడ్తలు, ‘‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’’ అని వేనోళ్ల కీర్తించిన వైనం ప్రతి తెలుగు గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము. తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) జయంతి సందర్భంగా, తెలుగు భాషకు ఆయన చేసిన అమూల్యమైన కృషిని, సేవలను గుర్తు చేసుకుని, గౌరవించుకునేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించారు. గ్రాంథిక భాషకు ప్రత్యామ్నాయంగా తెలుగు యాసను ప్రాచుర్యంలోకి తెచ్చి, వ్యావహారిక భాష ప్రాచుర్యాన్ని ఒక ఉద్యమంలా నడిపించిన గిడుగు వెంకట రామమూర్తికి యావత్ తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు. భారతదేశంలోని పురాతన, అత్యంత శక్తివంతమైన భాషలలో ఒకటి తెలుగు భాష. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడుకొనే భాష తెలుగు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉండటం విశేషం.నన్నయ, తిక్కన, ఎఱ్ఱన లాంటి ఉద్దండ కవులు, సుమతీ, వేమన లాంటి శతకకారులు తమ భాషా పాండిత్యంతో తెలుగు ఖ్యాతిని విస్తరింపజేసిన మహానుభావులు. గిడుగు రామ్మూర్తితో పాటు గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, కాళోజీ, డా. సి.నారాయణరెడ్డి లాంటి ఎందరెందరో కవులు రచయితలు తెలుగు భాషోన్నతి కోసం పాటు పడినవారే.చక్కని పలుకుబడులకు, నుడికారాలు, అనేక చమత్కారాలతో నిండి ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని కాపాడుకోవాలి. తెలుగుభాష కనుమరుగైపోతోందన్న ఆందోళన నేపథ్యంలో తెలుగు భాషను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉంది. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు మన తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రతిష్ఠను నిలుపుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా - కాళోజీ“తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగుపునుగు జివ్వాజీ! ఆమని పూల వలపుమురళి రవాళులు! కస్తూరి పరిమళములుకలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” -నండూరి“మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” - కొమర్రాజు లక్ష్మణరావు క్రీ.శ. 1400-1500 మధ్య నికోలో డి కాంటీ అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ మన భారతదేశానికి వచ్చాడు.క్రమంలో తెలుగు ప్రజలని కలిశాడు. వారి భాష, ఉఛ్చారణ తీరు చూసి ముగ్దుడైనాడు. తెలుగు భాష ఉచ్ఛరణ అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఉన్నట్లు గుర్తించాడు. ఒక ఇటాలియన్ భాషలో మాత్రమే ఇలాంటి సంప్రదాయం ఉన్నట్లు గుర్తించాడు. అందుకే తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేర్కొన్నాడు. -
భాష వెలగాలి... సంస్కృతి గెలవాలి!
వ్యావహారిక భాషోద్యమ పితామహులలో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు, తెలుగు భాషకు చేసిన సేవల వల్లనే భాష సామాన్య తెలుగువాడికి అందుబాటులోకి వచ్చింది. మనం ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అలా అని తెలుగు సంస్కృతీ మహార్ణవంలో భాగమైన సొంతభాష ప్రత్యేక ప్రతిపత్తిని తగ్గించుకోకూడదు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటి నుంచి ఏదైనా భాషను నేర్చుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పకూడదు! మాతృభాషకు సంబంధించి ధనిక, పేద బహుజన వర్గాల భేదం ఉండరాదు. వివక్షను పాటించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పేదసాదలు సంపన్న వర్గాల నుంచి నానా దుర్భర స్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అదే అక్షరాస్యతలోనూ, విద్యారంగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ అసమాన సామాజిక, ఆర్థిక నీతిని కూకటివేళ్లతో పెకిలించగల పటిçష్ఠమైన రాజకీయ వ్యవస్థకు దేశంలో సరైన అంకురార్పణ జరగాల్సి ఉంది. ‘ఇంతకూ మన ఇంట్లో భాష ఎలా ఉంది? బతకడానికి ఇంగ్లిషు కాని, చిరకాలం జీవించడానికి తెలుగుకోసం, పిల్లల తెలుగు కోసం ఇంతకూ మనం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? కాని ఇంటి భాషను, తల్లి భాషను, ఇల్లు వేదికగా పిల్లల్లో పాడుకునేలా మనం ఏ మాత్రం చేయగల్గుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు ప్రశ్నించు కోవలసిన సమయం వచ్చింది. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోదిచేసిన సారస్వతం వారికి అందకపోవడం, దూరం కావడం, నన్నయ, తిక్కనలనుంచి శ్రీశ్రీ వరకూ తమజాతి సాహితీ ఔన్నత్యం, తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. అది ఇచ్చే ఆత్మవిశ్వాసమే వేరు. మాతృభాషనుంచి అందే గొప్పబలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది.’ సాక్షి పత్రికలో సాధికారికంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా (28.08.2021) వెలువడిన ప్రత్యేక వ్యాసంలోని భాగమిది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి ఆదిమూలం సురేష్ తెలుగు భాషను, దాని ప్రాచీన హోదా ప్రతిపత్తిని రాష్ట్రప్రభుత్వం పరిరక్షిస్తుందని, పాఠశాల స్థాయిలో తెలుగు విధిగా నేర్చుకోవలసిన భాషగా చేస్తామనీ, వచ్చే ఏడాది నుంచీ, తెలుగు భాషోత్సవాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నామనీ ప్రకటించారు. అదే సంద ర్భంగా మహాభాషావేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహు లలో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు, తెలుగు భాషకు చేసిన సేవల వల్లనే భాష సామాన్య తెలుగువాడికి అందుబాటులోకి వచ్చిందనీ మంత్రి పేర్కొన్నారు. గిడుగు వారి జయంతిని ప్రతియేటా తెలుగు భాషా పరిరక్షణ దినోత్సవంగా కూడా తెలుగు భాషా ప్రియులు జరుపుకోవడం ఆనవాయితీ. విద్యార్థులకు కేవలం మార్కులకోసం ప్రత్యేకభాషగా ఉన్న ‘సంస్కృతం’ ప్రతిష్ఠను దిగజార్చడం తప్పు. మార్కుల స్కోర్ కోసం ఆ భాష అక్షరాలు తెలియకపోయినా వాటిని ఆన్సర్షీట్లలో చేర్చుకునే సంకర సంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మొట్ట మొదటి ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగింది. ఈ ‘సంకర న్యాయాన్ని’ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తీవ్రంగా ఎదుర్కొంది. ఇంటర్లో కేవలం మార్కుల స్కోర్ కోసం సంస్కృతం అక్షరాలను విద్యార్థులు చేరుకునే సంప్రదాయాన్ని తీవ్రంగా నిరసించి, మాన్పించవలసి వచ్చింది. మనం ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అలా అని తెలుగు సంస్కృతీ మహార్ణవంలో భాగమైన సొంతభాష ప్రత్యేక ప్రతిపత్తిని చేజేతులా తగ్గించుకోకూడదు. జాతికి జీవగర్రలు ప్రజాహృదయాలే అయినప్పుడు ఆ హృదయాల్ని గెలుచుకోవలసింది ఆ జాతి మాతృభాషలోనే. కనుకనే ‘తెలుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి ‘డుము వులు’ నేర్చినంతనే పుటుక్కున ముక్కులు గిల్లినంతనే/ సమకూరునా తెనుంగుసిరి సంస్కృత వాణికిన్’ అని ఎద్దేవా చేయవలసి వచ్చింది! అలాగే ‘‘మూడేండ్ల కుర్రాడు ‘ఏబీసీడీ’లను దిద్దు తెల్గుసీమలో అయ్యారే/ వీడు తన నేలనే పెరవాడై’’ పోవడం ‘జాతికెంత ప్రమా దమో సుమా’ అన్నాడాయన! మాతృభాషకు సంబంధించి ధనిక, పేద బహుజన వర్గాల భేదం ఉండరాదు. వివక్షను పాటించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పేదసాదలు ఆరోజు నుంచి ఈ రోజుదాకా సంపన్న వర్గాల నుంచి నానా దుర్భర స్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అదే అక్షరాస్యతలోనూ, విద్యారంగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ దుర్మార్గపు సామాజిక, ఆర్థిక నీతిని కూకటి వేళ్లతో పెకిలించగల పటిçష్ఠమైన రాజకీయ వ్యవస్థకు ఇంకా దేశంలో సరైన అంకురార్పణ జరగలేదు. కనుకనే విద్యారంగంలో పేద సాదల, బహుజనుల పురోగతికి ఈ రోజుకీ పెక్కు ఆటంకాలు ఎదురవుతూ, వారి అభ్యున్నతి అక్కడే ఉండిపోయింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యంతా మాతృభాషా పునాదులుగా సాగుతూ ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా మాత్రమే కొనసాగించడమే విద్యార్థుల విద్యాభివృద్ధికి మార్గమని, ఇంగ్లిషువాడే అయిన ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ వలస భారత దేశ గవర్నర్ జనరల్‌గా పట్టుబట్టాడు. ఎందుకంటే పరాయిభాష అయిన ఇంగ్లిషు, విద్యార్థికి ఒంటబట్టాలన్నా ముందు ప్రాథమిక విద్యాదశ అంతా మాతృభాషలోనే కొనసాగాలన్నవాడు బెంటిక్! కానీ, ప్రభు త్వానికి విద్యాబోధనా మాధ్యమం పాఠశాల విద్యనుంచే పూర్తిగా తమ ఇంగ్లిషు భాషలోనే కొనసాగాలని హఠం వేసి కూర్చున్నవాడు, విద్యారంగంపై ప్రత్యేక పత్రాన్ని (ది మినిట్) పోటీగా సమర్పించి నెగ్గించుకోడానికి ప్రయత్నించినవాడు– లార్డ్ బాబింగ్టన్ మెకాలే! ఈ ‘మినిట్’ (ప్రత్యేక పత్రం)లో తన అసలు లక్ష్యాన్ని మెకాలే ఇలా నిర్వ చించాడు. ‘మన భాషకు, ఇంగ్లిషువాళ్ల తిండికి, మన దుస్తులకు, మన రుచులకు, మన ప్రవర్తనకు, మన వేషధారణకు అలవాటుపడిన భార తీయులు మనకు శాశ్వతంగా బానిసలై పడి ఉంటారు’ అని చాటు మాటున కాకుండా ముక్కుమీద గుద్దినట్టుగా ముక్కుసూటిగానే చెప్పే శాడు. కాని విలియం బెంటిక్ మాటే (ప్రాథమిక విద్యాదశ– నాటి స్కూల్ ఫైనల్ దాకా స్థానిక మాతృభాషల్లోనే కొనసాగుతూ ఇంగ్లిషు ఒక సబ్జెక్టుగా మాత్రం ఉంచుకోవాలి) నెగ్గింది. కానీ, దీర్ఘకాలంలో మెకాలే లక్ష్యమైన ‘ఇంగ్లిషు అలవాట్లకు మనసావాచా అలవాటు పడిన భారతీయులు మనకు బానిసలయిపోతారు’ అన్న తెల్లవాడి అహంకారపు మాటలు మరపురానివిగా మిగిలిపోయాయి. ఒక్కభాష కాదు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటి నుంచి ఏది కావాల నుకుంటే ఆ భాషను నేర్చుకోవడానికి ఎవరూ అడ్డుచెప్పరు. చెప్పకూ డదు! కాని దేవనాగరి లిపిలో కేవలం మార్కుల కోసం గిలికే అక్షరాలుగా ‘సంస్కృతాన్ని’ దిగజార్చారు. అంతేగాదు, హాల చక్రవర్తి ప్రాకృతానికి అంటే ప్రకృతులయిన ప్రజలు నిత్యవ్యవహారంలో నేడు మాట్లాడుకున్న పునాది భాష ప్రాకృతం. అందుకనే మహా పండిత మ్మన్యులు అంతా ‘ప్రాచీన భారతంబు ప్రాకృతంబు’ అన్నారే గాని ‘సంస్కృతం’ అనలేదు! సంస్కృతం, ఇండోయూరోపియన్ భాషల కలగాపులగం అన్నారందుకే! పలు భాషలు తెలిసిన మహా పండితుడు తిరుమల రామచంద్ర, తెలుగు సహా ద్రావిడ భాషా పునాదులన్నీ ‘బ్రాహ్మీ’ నుంచే ఎదిగాయని ఆంధ్రప్రదేశ్‌లో ఐ.ఎ.ఎస్. హోదాలో కలెక్టర్‌గా పనిచేసిన ప్రసిద్ధ భాషాశాస్త్ర పరిశోధకుడు తమిళుడైన కాశ్యపాండ్యన్ అయితే ‘బ్రాహ్మీ’కి మూలం తెలుగేనని కూడా సిద్ధాంతీకరించేంతవరకు వెళ్ళాడు! ఆ మాటకొస్తే ఆదివాసీల (సవర, జాతాపు వగైరా) భాషలన్నీ సంస్కృతానికి లొంగిరాని, లిపి ఏర్పడని భాషలేనని ఏనాడో తేల్చిచెప్పి ‘సవర’ భాషకు లిపిని, తేలిక వ్యాకరణాన్ని సమకూర్చిపెట్టిన మహనీయుడు ‘గిడుగు’. అందుకే వివేకానందుడు– మన ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని క్రీ.శ. 500 నాటికే అందించిన ఆర్యభట్ట, భాస్కరలను పక్కన పెట్టేసి, మన ఖగోళ శాస్త్రాన్ని (అసస్టా్రనమీ) గ్రీకులకు ధారాదత్తం చేసి, గ్రీకుల పురాణ కల్పనలను మనం అరువు తెచ్చుకోడంతోనే భారతీయ వైజ్ఞానిక శాస్త్ర దృక్ప«థానికి మనం దూరమయ్యామని చెప్పాడు! తెలుగు వెలగాలనే ఆశయం నిండుగా నెరవేరడానికి ముందు, కనీసం ఒక్క సంవత్సరం పాటైనా తల్లిదండ్రులను మమ్మీ, డాడీ అని పిలువకుండా ‘అమ్మా నాన్నా’ అని పిల్లలకు అలవాటు చేయాలి. వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’కు ఎంపికైన రాధికా మంగిపూడి
ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘసేవకురాలు రాధిక మంగిపూడికి 'తెలుగు భాషా దినోత్సవ' సందర్భంగా అంతర్జాతీయ "ప్రవాస తెలుగు పురస్కారం-2021" దక్కనుంది. దక్షిణాఫ్రికా నుంచి "సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ" యూరప్‌లోని నార్వే నుంచి "వీధి అరుగు" సంస్థల సంయుక్త అధ్వర్యములో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో అంతర్జాల వేదికపై వైభవంగా, ఆగస్టు 28 29 తేదీలలో, రెండు రోజులపాటు జరగనున్న "తెలుగు భాషా దినోత్సవం-2021" కార్యక్రమంలో భాగంగా... విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి "ప్రవాస తెలుగు పురస్కారాలు-2021" అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాధికా మంగిపూడి ఎంపికయ్యారు. చదవండి: వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు 2020 వరకు సింగపూర్ లో నివసిస్తూ రాధిక, సింగపూర్ నుంచి తొలి తెలుగు రచయిత్రిగా రెండు పుస్తకాలను ప్రచురించి 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో చోటు సంపాదించుకోవడం, 'గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' ఫేస్బుక్ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతులపై పలు వ్యాసాలను అందించడం, సింగపూర్ లో ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా సింగపూర్‌లోని "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలిగా అందించిన సేవలకుగాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. అనేక అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళికారచన, సుమారు 45 అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాన నిర్వహణ, 30కి పైగా సాహిత్య సదస్సులలో వక్తగా, అతిథిగా ప్రసంగాలు, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా పేరును తెచ్చి పెట్టాయి. "తెలుగు భాషా దినోత్సవ" సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారానికి ఎంపికైన కేవలం 12 మంది తెలుగు భాషాసేవకులలో తాను కూడా ఉండటం, తన కృషికి ఇంతటి చక్కటి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని" రాధిక కార్యక్రమ నిర్వాహకులకు, తనను నిత్యం ప్రోత్సహిస్తున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. "ప్రపంచ నలుమూలలలోని పలు దేశాల నుంచి ఈ పురస్కారాల కోసం వచ్చిన నామినేషన్లను నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేయటం జరిగిందని, ఈ పురస్కారాలను ఆగష్టు 𝟐𝟖వ తేదీ తెలుగు భాషా దినోత్సవ మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులచే ప్రధానం చేయటం జరుగుతుంద’’ని నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా రాధికకు సింగపూర్ నుంచి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ఇతర సభ్యులు, అన్ని దేశాల నుంచి శ్రేయోభిలాషులు శుభాకాంక్షలను తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. చదవండి : సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు -
ధిక్కారస్వరం ‘కాళోజీ’
ఓరుగల్లులో ప్రభవించిన విశ్వనరుడు కవితలతో అన్యాయాన్ని ఎదిరించిన కాళన్న తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో చురుకైన పాత్ర నేడు కాళోజీ నారాయణరావు జయంతి కాళోజీ నారాయణరావు జీవితం ఎంతో విశాలమైంది. బతికున్నంత కాలం ఆయన ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మరణాంతరం కూడా ఆయన భావాలు అదే స్థాయిలో వేదికగా నిలిచి ప్రజాస్వామ్యవాదులకు, కళాకారులకు స్ఫూర్తినిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో కూడా ఆయన జీవితం పెనవేసుకుపోయింది. అందుకే ‘‘లొల్లికి లొల్లిSజతకట్టి.. లొల్లికెల్ల.. పెద్ద దిక్కైన నీపేరు పృథ్వీలోనా.. ఎల్లకాలము గుర్తుండు చల్లనయ్య.. కరిగి పోతివా కాళన్న.. కరుణ హృదయ..’’ అంటూ ప్రముఖ కవి నల్ల ఉపేందర్ కాళోజీ జీవితాన్ని శతకంగా రాశారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమం, తర్వాత కొనసాగిన ప్రత్యేక తెలంగాణ తొలిదశ, మలి దశఉద్యమాలతోనూ ఆయన జీవితం ముడిపడి ఉంది. కాళోజీ తన భావాలకే కాదు.. శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి. నేడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. –హన్మకొండ కల్చరల్ కవితలే ఆయుధాలు.. ఉద్యమ కార్యాచరణలో స్పందించే అవసరం ఏర్పడినప్పుడు కాళోజీ తన కవితలనే ఆయుధాలుగా మలుచుకుని విజృంభించేవారు. కాళోజీ ఎక్కడ ఉన్నా ఆయన కవితలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఉంటాయి. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగుభాషపై నిరాదరణ కొనసాగుతుండడంపై కాళోజీ స్పందించారు. ఏ భాషరా.. నీది యేమి వేషమురా..? ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా..? ఆంగ్లమందున మాటలాడ గలుగగనే.. ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా..? ...అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు.. సకిలించు ఆంధ్రుడా.. ! చావవెందుకురా? అంటూ తెలుగును వ్యతిరేకించే వారిని అపహస్యం చేశారు. 1944లో జనగామ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ.. నవయుగంబున నాజీవృత్తుల నగ్న నృత్య మింకెన్నాళ్లు..? పోలీసు అండను దౌర్జన్యాలు.. పోషణబొందె దెన్నాళ్లు..? దమననీతి లో దౌర్జన్యాలకు.. దాగిలిమూతలు ఎన్నాళ్లు..? కంచెయె చేనును మేయుచుండగా.. కాంచకుండుటింకెన్నాళ్లు.. ? అంటూ ప్రశ్నించారు. 1946 లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ప్రజా సంస్థపై పగ సాధించిన.. ఫలితం తప్పక బయటపడున్.. నిక్కుచునీల్గే నిరంకుశత్వము.. నిల్వలేక నేలను గూలున్.. చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను.. స్థిరమగు కట్టయు శిథిలగున్.. అంటూ హెచ్చరించారు. మీర్జా ఇస్మాయిల్‌కు ప్రశ్నల వర్షం.. 1946లో వరంగల్ కోటలో మొగిలయ్య అనే వ్యక్తిని హతమార్చారు. మరో చోట పసిబాలుడిని దారుణంగా పొడిచారు. అయితే ఆ కాలంలో చంపిన వారికి శిక్ష వేయాల్సింది పోయి.. జాతీయ జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలల పాటు దేశ బహిష్కరణ శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఇక్కడి సంఘటనలపై విచారణ చేసేందుకు వచ్చిన నిజాం ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్‌ను కాళోజీ నారాయణరావు తన కవిత ద్వారా ప్రశ్నించారు. ఇది అందరికి చిరపరిచితమే ఎన్నాళ్ల నుండియో ఇదిగో.. అదిగో.. అనుచూ.. ఈ నాటికైనను ఏగివచ్చితివా..? కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట.. గుండాల గుర్తులు గోచరించినవా.. బాజారులో బాలకుని బల్లెంబుతో పోడుచు.. బద్మాషునేమైనా పనిబట్టినావా.. మొగిలయ్య భార్యతో, మొగిలయ్య తల్లితో.. మొగమాటము లేక ముచ్చటించితివా..? కాలానుగుణ్యమగు కాళోజీ ప్రశ్నలకు.. కన్నులెర్రగా చేసి ఖామూషి అంటావా..? అంటూ సర్ మీర్జాఇస్మాయిల్‌ను కాళోజీ ప్రశ్నించారు. ఇది ఇంగ్లిష్‌లో వార్డు బె స్టరు ఫీల్డుకు డాక్టర్ జాన్సన్ రాసిన లేఖ వంటిదని.. ఇప్పటికి లేఖ సాహిత్యంలో ఉత్తమ శ్రేణికి చెందిందిగా గుర్తిస్తారు. కాళోజీ కేవలం ఇక్కడి పోరాటాలకు మాత్రమే కాదు జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో జరిగిన ఘటనలకు కూడా స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారత నావికాదళ సిబ్బందికి తెల్లవారితో సహా సమాన హోదాలు, జీతభత్యాలు ఇస్తానని చెప్పి మాటతప్పింది. దీంతో భారత నావికులు తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో కాళోజీ వారికి మద్దతుగా నిలిచి కవిత రాశారు. యుద్ధ కాలమునందు ఉబ్బించి ఉబ్బించి ఉత్సాహ పరిచారురా..! పాలకుల పాలితుల భేదాలికుండవని ప్రకటనలు చేశారురా..! ఫాసిస్టు వ్యతిరేక పాటలతో.. ఆటలతో బా నిసల రేపారురా..! వర్ణభేదము మాట పౌరస్వత్వములందు వర్తించదన్నారురా..! యుద్ధంబు ముగిసినను బానిసత్వము మిగిలి ఉండనే ఉన్నాదిరా..! పాలకుల యుద్ధంబు జేసింది యెందుకో బట్ట బయలైనాదిరా..! అంటూ వారిపై మండిపడ్డారు. స్ఫూర్తిదాయకంగా సెప్టెంబర్ 9 కాళోజీని, ఆయన ప్రజాస్వామిక విలువలను, ధిక్కారస్వరాన్ని అభిమానించే, అనుసరించేవారికి ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 9 స్ఫూర్తిదాయకమైన తేదీగా నిలిచింది. కాళోజీ నారాయణరావు చనిపోయిన తర్వాత కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్ పేరుతో పాటు జిల్లా లోని అన్ని సాహిత్యసంస్థలు కలిసి ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహించేవారు. ఈ సమయంలో ప్రభుత్వం, జిల్లాలోని రాజకీయనాయకులు వారికి కనీస సహకారం ఇవ్వనిపరిస్థితి ఉండేది. ఆయినప్పటికీ ప్రతియేటా కాళోజీ జయంతిని తెలుగు మాండలిక భాషాదినోత్సవంగా జరుపుతూ వచ్చారు. 2013లో కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు అధ్యక్షుడిగా వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, జీవన్‌కుమార్ సమస్వయకర్తగా, ప్రముఖన్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్ సలహాదారులుగా.. కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటై ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2013 సెప్టెంబర్ 9న హన్మకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో జరిగిన శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభ చారిత్రాత్మకమైంది. ఇది తెలంగాణ ఉద్యమం చివరి మలుపులో ఉన్నప్పుడు జరిగిన కీలకమైన సభగా నిలిచింది. విశ్వవ్యాప్తం కానున్న కాళోజీ.. దురదృష్టవశాత్తు కాళోజీకి సంబంధించిన ఆనవాళ్లుగాని.. ఆయన ఉపన్యాసాలుగాని భద్రపరచలేదు. కానీ.. కాళోజీ బతికున్న కాలంలో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్ హంటర్‌రోడ్డులో ఏర్పాటు చేసిన జానపదగిరిజన విజ్ఞానపీఠం కాళోజీ సంభాషణలను రికార్డుచేసి భద్రపరిచింది. ఇవి చాలా కీలకమైనవి. కాళోజీ రాసిన ప్రతి కవితకు సంబంధించిన చరిత్రను నాగిళ్ల రామశాస్త్రి అడుగుతుండగా.. కాళోజీ వివరించేవారు. అలాగే ఆయన ఫొటోలను కూడా భద్రపరిచారు. వీటి సహకారంతో బి. నర్సింగరావు దర్శక త్వంలో ‘మన కాళోజీ డాక్యుమెంటరీ’ నిర్మాణం చేశారు. బడి పలుకుల భాషకాదు.. పలుకుబడుల భాష.. కావాలని కాశోజీ నినందించేవారు. ఎవరి భాషలో.. మాండలికంలోనే వారు మాట్లాడుకోవాలని కాళోజీ చెప్పుడు చెప్పేవారు. మాండలికభాషకు పెద్దపీట వేయాలని, కాళోజీ జయంతిని మాండలిక భాషా దినోత్సవంగా ప్రకటించాలని కాళోజీ అభిమానులు, అనుచరులు చాలా కాలంగా కోరుతూవచ్చారు. కానీ.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదీ కూడా పట్టించుకోలేదు. కాళోజీ శతజయంతి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. జైజై జయహో అంటూ తెలంగాణ నినాదాలు మిన్నుముట్టాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా ప్రకటించారు. కాళోజీ పేరిట హన్మకొండ బాలసముద్రంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది. కాళోజీ జీవితాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఆశయంతో కాళోజీ బయోగ్రఫీని రూపొందిస్తున్నారు. -
‘మా తెలుగు తల్లికి’ లక్ష గళార్చన
బాపులపాడు (పెదపాడు), న్యూస్‌లైన్ : బాపులపాడు హైస్కూల్లో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత లక్షగళార్చన నిర్వహించారు. మండలంలోని అప్పనవీడు, ఏపూరు, బాపులపాడు, వీరవల్లి గ్రామాలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు పదిసార్లు గీతాన్ని ఆలపించి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారు. అనంతరం విశాలాంధ్ర మహాసభ నాయకుడు వాసిరెడ్డి వెంకటకృష్టారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగేనని, ఒకే భాష.. ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంఈవో లూథర్‌పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల తెలుగుతల్లి నృత్యరూపకం ఆకట్టుకుంది.