ధిక్కారస్వరం ‘కాళోజీ’ | Defiant tone 'kaloji' | Sakshi
Sakshi News home page

ధిక్కారస్వరం ‘కాళోజీ’

Published Fri, Sep 9 2016 12:07 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

ధిక్కారస్వరం ‘కాళోజీ’ - Sakshi

ధిక్కారస్వరం ‘కాళోజీ’

  • ఓరుగల్లులో ప్రభవించిన విశ్వనరుడు 
  • కవితలతో అన్యాయాన్ని ఎదిరించిన కాళన్న 
  • తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో చురుకైన పాత్ర
  • నేడు కాళోజీ నారాయణరావు జయంతి
  •  

     కాళోజీ నారాయణరావు జీవితం ఎంతో విశాలమైంది. బతికున్నంత కాలం ఆయన ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మరణాంతరం కూడా ఆయన భావాలు అదే స్థాయిలో వేదికగా నిలిచి ప్రజాస్వామ్యవాదులకు, కళాకారులకు స్ఫూర్తినిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో కూడా ఆయన జీవితం పెనవేసుకుపోయింది. అందుకే ‘‘లొల్లికి లొల్లిSజతకట్టి.. లొల్లికెల్ల.. పెద్ద దిక్కైన నీపేరు పృథ్వీలోనా.. ఎల్లకాలము గుర్తుండు చల్లనయ్య.. కరిగి పోతివా కాళన్న.. కరుణ హృదయ..’’ అంటూ ప్రముఖ కవి నల్ల ఉపేందర్‌ కాళోజీ జీవితాన్ని శతకంగా రాశారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమం, తర్వాత కొనసాగిన ప్రత్యేక తెలంగాణ తొలిదశ, మలి దశఉద్యమాలతోనూ ఆయన జీవితం ముడిపడి ఉంది. కాళోజీ తన భావాలకే కాదు.. శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి. నేడు  కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. –హన్మకొండ కల్చరల్‌
     
     
    కవితలే ఆయుధాలు..
    ఉద్యమ కార్యాచరణలో స్పందించే అవసరం ఏర్పడినప్పుడు కాళోజీ తన కవితలనే ఆయుధాలుగా మలుచుకుని విజృంభించేవారు. కాళోజీ ఎక్కడ ఉన్నా ఆయన కవితలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఉంటాయి. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగుభాషపై నిరాదరణ కొనసాగుతుండడంపై కాళోజీ స్పందించారు. ఏ భాషరా.. నీది యేమి వేషమురా..? ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా..? ఆంగ్లమందున మాటలాడ గలుగగనే.. ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా..? ...అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు.. సకిలించు ఆంధ్రుడా.. ! చావవెందుకురా? అంటూ తెలుగును వ్యతిరేకించే వారిని అపహస్యం చేశారు. 1944లో జనగామ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ.. నవయుగంబున నాజీవృత్తుల నగ్న నృత్య మింకెన్నాళ్లు..? పోలీసు అండను దౌర్జన్యాలు.. పోషణబొందె దెన్నాళ్లు..?  దమననీతి లో దౌర్జన్యాలకు.. దాగిలిమూతలు ఎన్నాళ్లు..?  కంచెయె చేనును మేయుచుండగా.. కాంచకుండుటింకెన్నాళ్లు.. ? అంటూ ప్రశ్నించారు. 1946 లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ప్రజా సంస్థపై పగ సాధించిన.. ఫలితం తప్పక బయటపడున్‌.. నిక్కుచునీల్గే నిరంకుశత్వము.. నిల్వలేక నేలను గూలున్‌.. చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను.. స్థిరమగు కట్టయు శిథిలగున్‌.. అంటూ హెచ్చరించారు. 
     
    మీర్జా ఇస్మాయిల్‌కు ప్రశ్నల వర్షం..
    1946లో వరంగల్‌ కోటలో మొగిలయ్య అనే వ్యక్తిని హతమార్చారు. మరో చోట పసిబాలుడిని దారుణంగా పొడిచారు. అయితే ఆ కాలంలో చంపిన వారికి శిక్ష వేయాల్సింది పోయి.. జాతీయ జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలల పాటు దేశ బహిష్కరణ శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఇక్కడి సంఘటనలపై విచారణ చేసేందుకు వచ్చిన నిజాం ప్రధాని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ను కాళోజీ నారాయణరావు తన కవిత ద్వారా ప్రశ్నించారు. ఇది అందరికి చిరపరిచితమే ఎన్నాళ్ల నుండియో ఇదిగో.. అదిగో.. అనుచూ.. ఈ నాటికైనను ఏగివచ్చితివా..?  కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట.. గుండాల గుర్తులు గోచరించినవా.. బాజారులో బాలకుని బల్లెంబుతో పోడుచు.. బద్మాషునేమైనా పనిబట్టినావా.. మొగిలయ్య భార్యతో, మొగిలయ్య తల్లితో.. మొగమాటము లేక ముచ్చటించితివా..? కాలానుగుణ్యమగు కాళోజీ ప్రశ్నలకు.. కన్నులెర్రగా చేసి ఖామూషి అంటావా..? అంటూ సర్‌ మీర్జాఇస్మాయిల్‌ను కాళోజీ ప్రశ్నించారు. ఇది ఇంగ్లిష్‌లో వార్డు బె స్టరు ఫీల్డుకు డాక్టర్‌ జాన్సన్‌ రాసిన లేఖ వంటిదని.. ఇప్పటికి లేఖ సాహిత్యంలో ఉత్తమ శ్రేణికి చెందిందిగా గుర్తిస్తారు.
     
    కాళోజీ కేవలం ఇక్కడి పోరాటాలకు మాత్రమే కాదు జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో జరిగిన ఘటనలకు కూడా స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం భారత నావికాదళ సిబ్బందికి తెల్లవారితో సహా సమాన హోదాలు, జీతభత్యాలు ఇస్తానని చెప్పి మాటతప్పింది. దీంతో భారత నావికులు తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో కాళోజీ వారికి మద్దతుగా నిలిచి కవిత రాశారు. యుద్ధ కాలమునందు ఉబ్బించి ఉబ్బించి ఉత్సాహ పరిచారురా..! పాలకుల పాలితుల భేదాలికుండవని ప్రకటనలు చేశారురా..!  ఫాసిస్టు వ్యతిరేక పాటలతో.. ఆటలతో బా నిసల రేపారురా..! వర్ణభేదము మాట పౌరస్వత్వములందు వర్తించదన్నారురా..! యుద్ధంబు ముగిసినను బానిసత్వము మిగిలి ఉండనే ఉన్నాదిరా..! పాలకుల యుద్ధంబు జేసింది యెందుకో బట్ట బయలైనాదిరా..! అంటూ వారిపై మండిపడ్డారు. 
     
    స్ఫూర్తిదాయకంగా సెప్టెంబర్‌ 9
     
    కాళోజీని, ఆయన ప్రజాస్వామిక విలువలను, ధిక్కారస్వరాన్ని అభిమానించే, అనుసరించేవారికి ఆయన జన్మదినమైన సెప్టెంబర్‌ 9 స్ఫూర్తిదాయకమైన తేదీగా నిలిచింది. కాళోజీ నారాయణరావు చనిపోయిన తర్వాత కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్‌ పేరుతో పాటు జిల్లా లోని అన్ని సాహిత్యసంస్థలు కలిసి ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహించేవారు. ఈ సమయంలో ప్రభుత్వం, జిల్లాలోని రాజకీయనాయకులు వారికి  కనీస సహకారం ఇవ్వనిపరిస్థితి ఉండేది. ఆయినప్పటికీ ప్రతియేటా కాళోజీ జయంతిని తెలుగు మాండలిక భాషాదినోత్సవంగా జరుపుతూ వచ్చారు. 2013లో కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు అధ్యక్షుడిగా వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, జీవన్‌కుమార్‌ సమస్వయకర్తగా, ప్రముఖన్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్‌ సలహాదారులుగా.. కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటై ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2013 సెప్టెంబర్‌ 9న హన్మకొండ నక్కలగుట్టలోని  హోటల్‌ హరిత కాకతీయలో జరిగిన శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ  సభ చారిత్రాత్మకమైంది. ఇది తెలంగాణ ఉద్యమం చివరి మలుపులో ఉన్నప్పుడు జరిగిన కీలకమైన సభగా నిలిచింది. 
     
    విశ్వవ్యాప్తం కానున్న కాళోజీ..
    దురదృష్టవశాత్తు కాళోజీకి సంబంధించిన ఆనవాళ్లుగాని.. ఆయన ఉపన్యాసాలుగాని భద్రపరచలేదు. కానీ..  కాళోజీ బతికున్న కాలంలో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్‌ హంటర్‌రోడ్డులో ఏర్పాటు చేసిన జానపదగిరిజన విజ్ఞానపీఠం కాళోజీ సంభాషణలను రికార్డుచేసి భద్రపరిచింది. ఇవి చాలా కీలకమైనవి. కాళోజీ రాసిన ప్రతి కవితకు సంబంధించిన చరిత్రను నాగిళ్ల రామశాస్త్రి అడుగుతుండగా.. కాళోజీ వివరించేవారు. అలాగే ఆయన ఫొటోలను కూడా భద్రపరిచారు. వీటి సహకారంతో బి. నర్సింగరావు దర్శక త్వంలో ‘మన కాళోజీ డాక్యుమెంటరీ’ నిర్మాణం చేశారు. బడి పలుకుల భాషకాదు.. పలుకుబడుల భాష.. కావాలని కాశోజీ నినందించేవారు. ఎవరి భాషలో.. మాండలికంలోనే వారు మాట్లాడుకోవాలని కాళోజీ చెప్పుడు చెప్పేవారు.
     
    మాండలికభాషకు పెద్దపీట వేయాలని, కాళోజీ జయంతిని మాండలిక భాషా దినోత్సవంగా ప్రకటించాలని కాళోజీ అభిమానులు, అనుచరులు చాలా కాలంగా కోరుతూవచ్చారు. కానీ.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏదీ కూడా పట్టించుకోలేదు. కాళోజీ శతజయంతి సంవత్సరంలోనే  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. జైజై జయహో అంటూ తెలంగాణ నినాదాలు మిన్నుముట్టాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా ప్రకటించారు. కాళోజీ పేరిట హన్మకొండ బాలసముద్రంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది.  కాళోజీ జీవితాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ  తెలుసుకోవాలనే ఆశయంతో కాళోజీ బయోగ్రఫీని రూపొందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement