‘దేశ భాషలందు తెలుగు లెస్స’అన్న శ్రీకృష్ణదేవరాయలు పొగడ్తలు, ‘‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’’ అని వేనోళ్ల కీర్తించిన వైనం ప్రతి తెలుగు గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము. తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) జయంతి సందర్భంగా, తెలుగు భాషకు ఆయన చేసిన అమూల్యమైన కృషిని, సేవలను గుర్తు చేసుకుని, గౌరవించుకునేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించారు.
గ్రాంథిక భాషకు ప్రత్యామ్నాయంగా తెలుగు యాసను ప్రాచుర్యంలోకి తెచ్చి, వ్యావహారిక భాష ప్రాచుర్యాన్ని ఒక ఉద్యమంలా నడిపించిన గిడుగు వెంకట రామమూర్తికి యావత్ తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు. భారతదేశంలోని పురాతన, అత్యంత శక్తివంతమైన భాషలలో ఒకటి తెలుగు భాష. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడుకొనే భాష తెలుగు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉండటం విశేషం.
నన్నయ, తిక్కన, ఎఱ్ఱన లాంటి ఉద్దండ కవులు, సుమతీ, వేమన లాంటి శతకకారులు తమ భాషా పాండిత్యంతో తెలుగు ఖ్యాతిని విస్తరింపజేసిన మహానుభావులు. గిడుగు రామ్మూర్తితో పాటు గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, కాళోజీ, డా. సి.నారాయణరెడ్డి లాంటి ఎందరెందరో కవులు రచయితలు తెలుగు భాషోన్నతి కోసం పాటు పడినవారే.
చక్కని పలుకుబడులకు, నుడికారాలు, అనేక చమత్కారాలతో నిండి ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని కాపాడుకోవాలి. తెలుగుభాష కనుమరుగైపోతోందన్న ఆందోళన నేపథ్యంలో తెలుగు భాషను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉంది. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు మన తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రతిష్ఠను నిలుపుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా - కాళోజీ
“తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” -నండూరి
“మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” - కొమర్రాజు లక్ష్మణరావు
క్రీ.శ. 1400-1500 మధ్య నికోలో డి కాంటీ అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ మన భారతదేశానికి వచ్చాడు.క్రమంలో తెలుగు ప్రజలని కలిశాడు. వారి భాష, ఉఛ్చారణ తీరు చూసి ముగ్దుడైనాడు. తెలుగు భాష ఉచ్ఛరణ అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఉన్నట్లు గుర్తించాడు. ఒక ఇటాలియన్ భాషలో మాత్రమే ఇలాంటి సంప్రదాయం ఉన్నట్లు గుర్తించాడు. అందుకే తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment