ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘసేవకురాలు రాధిక మంగిపూడికి 'తెలుగు భాషా దినోత్సవ' సందర్భంగా అంతర్జాతీయ "ప్రవాస తెలుగు పురస్కారం-2021" దక్కనుంది. దక్షిణాఫ్రికా నుంచి "సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ" యూరప్‌లోని నార్వే నుంచి "వీధి అరుగు" సంస్థల సంయుక్త అధ్వర్యములో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో అంతర్జాల వేదికపై వైభవంగా, ఆగస్టు 28 29 తేదీలలో, రెండు రోజులపాటు జరగనున్న "తెలుగు భాషా దినోత్సవం-2021" కార్యక్రమంలో భాగంగా... విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి "ప్రవాస తెలుగు పురస్కారాలు-2021" అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాధికా మంగిపూడి ఎంపికయ్యారు.
చదవండి: వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు
2020 వరకు సింగపూర్ లో నివసిస్తూ రాధిక, సింగపూర్ నుంచి తొలి తెలుగు రచయిత్రిగా రెండు పుస్తకాలను ప్రచురించి 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో చోటు సంపాదించుకోవడం, 'గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' ఫేస్బుక్ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతులపై పలు వ్యాసాలను అందించడం, సింగపూర్ లో ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా సింగపూర్‌లోని "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలిగా అందించిన సేవలకుగాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. అనేక అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళికారచన, సుమారు 45 అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాన నిర్వహణ, 30కి పైగా సాహిత్య సదస్సులలో వక్తగా, అతిథిగా ప్రసంగాలు, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా పేరును తెచ్చి పెట్టాయి.
"తెలుగు భాషా దినోత్సవ" సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారానికి ఎంపికైన కేవలం 12 మంది తెలుగు భాషాసేవకులలో తాను కూడా ఉండటం, తన కృషికి ఇంతటి చక్కటి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని" రాధిక కార్యక్రమ నిర్వాహకులకు, తనను నిత్యం ప్రోత్సహిస్తున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. "ప్రపంచ నలుమూలలలోని పలు దేశాల నుంచి ఈ పురస్కారాల కోసం వచ్చిన నామినేషన్లను నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేయటం జరిగిందని, ఈ పురస్కారాలను ఆగష్టు 𝟐𝟖వ తేదీ తెలుగు భాషా దినోత్సవ మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులచే ప్రధానం చేయటం జరుగుతుంద’’ని నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా రాధికకు సింగపూర్ నుంచి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ఇతర సభ్యులు, అన్ని దేశాల నుంచి శ్రేయోభిలాషులు శుభాకాంక్షలను తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment