సింగపూర్: విద్య సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యంలో, శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారముతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు యూట్యూబ్ ద్వారా ఘనంగా జరిగాయి. 2021 డిసెంబర్ 19న జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను, సంగీతగురువులకు అంకితం చేస్తూ వారు రచించి, స్వరపరిచిన సంగీతాన్ని ప్రసారం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఎందరో గురువులు, కళాకారులు తెలుగు సంగీతాభిమానులు తమవంతు కృషిచేస్తూ పాటలు క్రియేట్ చేస్తున్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, మన తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ, మరిన్ని కొత్త పాటలను వెలుగులోకి తీసుకురావటానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఈ స్వరకల్పన సమారాధన.
అన్నమయ్య కీర్తనలతో, వర్ణాలతో, చక్కటి తిల్లానాతో మరిన్ని శాస్త్రీయ కృతులతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం అలరించింది. ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన గురువులు లహరి కొలచెల, డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్, తాడేపల్లి సుబ్బలక్ష్మి, మోదుమూడి సుధాకర్, ద్వారం వీ కే జీ త్యాగరాజ్, డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్ణుభట్ల రామచంద్రమూర్తి, కమలాదీప్తి పాడిన కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు. ఈ రచనలన్నీ నొటేషన్స్‌తో సహా ఒక ఈ-పుస్తక రూపంలో కూడా ప్రచురించడం జరిగింది. అంతేకాక గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11 మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని నిర్వాహకులు కార్యక్రమంలో ప్రకటించారు.
సింగపూర్, భారత దేశాల నుంచే కాక అమెరికా, యూకే, మలేషియా నుంచి కూడా వీక్షకులు చూసి ఆనందించటం ఈ కార్యక్రమానికి మంచి శోభను చేకూర్చింది. మన సంగీతం మీద, సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, విద్య సంగీతం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాపవరపు విద్యాధరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీసాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ విచ్చేసి చక్కటి సందేశమును ఇచ్చారు. ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్‌కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు, వీక్షకులకు నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: రాధిక మంగిపూడి 'భారతీయ తత్త్వ శతకము'ను ఆవిష్కరించిన డాక్టర్ మేడసాని మోహన్
Comments
Please login to add a commentAdd a comment