తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు' జరిగాయి. ఆగస్ట్ 30న అట్లాంటా, జార్జియా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో శ్రీ గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” ఆగస్ట్ 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయి వర్చువల్ సమావేశాలు ఘనంగా జరిగాయి.
సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య తన ప్రసంగంలో గిడుగు వేంకట రామమూర్తి కృషిని, ఆయనకు ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్రముఖులకు సాదరంగా ఆహ్వానం పలికారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య మాధవపెద్ది సీతాదేవి దంపతుల కుమార్తె,ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి- సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా. శశి పంజాను సభకు పరిచయం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వారే అయినా కలకత్తాలో స్థిరపడి రాజకీయాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ఓ వైపు డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా డా. శశి పంజా మాట్లాడుతూ..ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తాలో స్థిరపడడం వల్ల తెలుగు నేలకు దూరమే అయినా...ఇంట్లో కుటుంబసభ్యులు తెలుగులోనే మాట్లాడుకుంటామని అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని పునరుద్ఘాటించారు.
తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేసారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను, వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు.
ఈ సభలో అతిధిగా పాల్గొన్న ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన చెందారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు.
మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెనుంచి ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందిస్తున్న సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తి గా పుట్టడం తన అదృష్టం అని, మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి గారితో సహా మొత్తం 17 మంది సాహితీవేత్తలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని, పాల్గొన్నవారందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.
పాల్గొన్న ప్రముఖులు
తుమ్మల శ్రీనివాసమూర్తి, మనోరమ (రాయప్రోలు) కానూరి, డా. కొండవీటి విజయలక్ష్మి, వర ముళ్ళపూడి, గొల్లపూడి రామకృష్ణ, డా. ఉమర్ ఆలీ షా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా మునిమనవడు గుర్రం పవన్ కుమార్, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు శ్రీమతి రేవతి అదితం, గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న సతీమణి హైమవతీ భీమన్న, గురజాడ అప్పారావు మునిమనవరాలు అరుణ గురజాడ, గుంటూరు శేషేంద్రశర్మ కుమారుడు గుంటూరు సాత్యకి, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని,పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ మనవడు విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు కోడలు లక్ష్మి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి
Comments
Please login to add a commentAdd a comment