TANA Conference
-
తానా ప్రపంచ సాహిత్య వేదిక
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూ పాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్న సాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు. .తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యం కలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయవలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి. ఎచ్.డి పట్టా అందుకుని, అదే విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపుకథలకు ప్రత్యేక స్థానం ఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపుకథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీ ముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు. ప్రత్యకఅతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలు మొదలైన సాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగవీక్షణంగా ప్రతిభావంతంగా స్పృశించారు.విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వ తెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు) – ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) – ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన మరియు పరిశోధనా విభాగంలో సహాయాచార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనే అంశంపై పి.ఎచ్.డి చేస్తున్న బుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
అట్టహాసంగా ముగిసిన తానా 23వ మహాసభలు
ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు తానా 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి. జులై 7-9వరకు ఆటపాటలు, ప్రముఖుల ప్రసంగాలతో ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతనపాటి వెంకట రమణలతో నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజయ్యారు. వేదిక మొత్తం తెలుగు వారితో సందడి వాతావరణం కనిపించింది. తొలిరోజు.. బాంకెట్ డిన్నర్ వేదికపై 23వ మహాసభల సావనీర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో వెంకయ్యనాయుడికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, చైర్మన్ శ్రీనివాస్ లావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, ఓవర్సీస్ డైరెక్టర్ వంశి కోట తదితరులు చిరుసత్కారం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు.ఆయన చేతుల మీదుగా పలువురికి తానా మెరిటోరియస్ అవార్డులను అందజేశారు. నిర్మాణ దిల్‌రాజు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సీతక్క, శ్రీలీల, నిఖిల్ తదితరులను కూడా సత్కరించారు. రెండో రోజు..కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తానా నాయకులంతా పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఎస్, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి తదితరులకు తానా నాయకులు సన్మానం చేశారు. అనంతరం ఆధ్యాత్మిక జీవితం గురించి, మనం చేసే పొరపాట్ల గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ అద్భుతంగా వివరించారు. మూడో రోజు స్థానిక సాంస్కృతిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలు, కళానైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ధీంతానా బృందాన్ని తానా నేతలు సత్కరించారు. అనంతరం వేదమంత్రాల నడుమ సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణకు ఘనసత్కారం చేశారు.సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్‌ను సత్కరించారు. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.అనంతరం బాలకృష్ణ దంపతులను తానా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా తానా సేవలను బాలకృష్ణ కొనియాడారు. ఇదిలా ఉంటే తానా మహాసభల చివరి రోజున అధ్యక్షులు అంజయ్య చౌదరి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ వేదికపైనే ప్రమాణం చేశారు. ఆయన 2023-2025 వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. -
పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 23వ తానా మహాసభలు
పెన్సిల్వేనియా: 23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7వ తేదీనుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. తానా సైట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అనిల్ యలమంచిలి, సభ్యులు పూర్ణ వీరపనేని, రామ్ మద్ది బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్ సెంటర్స్ తో చర్చించిన తర్వాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ ను 2023 తానా మహాసభల వేదికగా సిఫార్సు చేయడం జరిగిందని తానా సైట్ సెలక్షన్ కమిటీ సిఫార్సు కు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపిందని అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల కోఆర్డినేటర్ గా రవి పొట్లూరిని నియమించినట్లు తెలిపారు. తానాలో రీజినల్ కోఆర్డినేటర్ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభవమున్నరవి పొట్లూరి కోఆర్డినేటర్‌గా తానా సభ్యులు, నాయకత్వం, దాతల సహకారంతో 23వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుపునున్నట్లు అంజయ్య చౌదరి వెల్లడించారు. తానా కోఆర్డినేటర్ గా నియమించినందుకు అధ్యక్షులు అంజయ్య చౌదరికి తానా కార్యవర్గానికి తానా మహాసభల కోఆర్డినేటర్ రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. -
తానా ఆధ్వర్యంలో ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు'
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు' జరిగాయి. ఆగస్ట్ 30న అట్లాంటా, జార్జియా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో శ్రీ గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” ఆగస్ట్ 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయి వర్చువల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య తన ప్రసంగంలో గిడుగు వేంకట రామమూర్తి కృషిని, ఆయనకు ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్రముఖులకు సాదరంగా ఆహ్వానం పలికారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య మాధవపెద్ది సీతాదేవి దంపతుల కుమార్తె,ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి- సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా. శశి పంజాను సభకు పరిచయం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వారే అయినా కలకత్తాలో స్థిరపడి రాజకీయాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ఓ వైపు డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా డా. శశి పంజా మాట్లాడుతూ..ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తాలో స్థిరపడడం వల్ల తెలుగు నేలకు దూరమే అయినా...ఇంట్లో కుటుంబసభ్యులు తెలుగులోనే మాట్లాడుకుంటామని అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని పునరుద్ఘాటించారు. తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేసారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను, వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు. ఈ సభలో అతిధిగా పాల్గొన్న ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన చెందారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెనుంచి ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందిస్తున్న సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తి గా పుట్టడం తన అదృష్టం అని, మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి గారితో సహా మొత్తం 17 మంది సాహితీవేత్తలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని, పాల్గొన్నవారందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. పాల్గొన్న ప్రముఖులు తుమ్మల శ్రీనివాసమూర్తి, మనోరమ (రాయప్రోలు) కానూరి, డా. కొండవీటి విజయలక్ష్మి, వర ముళ్ళపూడి, గొల్లపూడి రామకృష్ణ, డా. ఉమర్ ఆలీ షా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా మునిమనవడు గుర్రం పవన్ కుమార్, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు శ్రీమతి రేవతి అదితం, గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న సతీమణి హైమవతీ భీమన్న, గురజాడ అప్పారావు మునిమనవరాలు అరుణ గురజాడ, గుంటూరు శేషేంద్రశర్మ కుమారుడు గుంటూరు సాత్యకి, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని,పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ మనవడు విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు కోడలు లక్ష్మి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి -
New York : తానా సాహిత్య సదస్సు విజయవంతం
న్యూయార్క్, జూన్ 27 తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జూన్ 27న జరిగిన వర్చువల్ సమావేశంలో “ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా విజ్ఞాన సదస్సు విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షలు జయశేఖర్ తాళ్లూరి తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి తానా ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “విద్యాలయాలలో విద్య ‘లయ’ తప్పుతోందని, పలు రాష్ట్రాలలో పాలకుల విద్యా విధానాలు శ్రుతి మించి ‘రోగాన’ పడుతున్నాయని, చాలా విశ్వవిద్యాలయాలలో తరచూ సిబ్బందిలో వచ్చే ఖాళీలను భర్తీ చేయకుండా, విద్యార్దులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, భర్తీ చేసినా మొక్కుబడిగా వారిని తాత్కాలికంగా నియమిస్తూ, అరకొరా వేతనాలు ఇస్తూ భోదించే అధ్యాపకులే లేని అధ్వాన్న పరిస్థితులలోకి నెడుతున్నానారని, విద్యాలయాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వ విద్యాలయాలతో విశ్వానికే దిశానిర్దేశం చేసి మార్గదర్శకంగా నిలచిన మన భారతదేశంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. విశాఖపట్నానికి చెందిన, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో చదువుకున్న ఆచార్య డా. నీలి బెండపూడిఅమెరికా దేశంలో కెంటకీ రాష్ట్రంలో 223 సంవత్సరాల చరిత్ర, 120 కోట్ల రూపాయల వార్షిక ఆదాయ వ్యయం,3,000 కు పైగా సిబ్బంది, 22,000 మంది విద్యార్ధులకు నిలయమైన లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి)గా ఎన్నికగావడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమంటూ డా. ప్రసాద్ తోటకూర ఆమెను ఈ సభకు ప్రత్యేక అతిధిగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి) ఆచార్య డా. నీలి బెండపూడి తెలుగు భాష మాధుర్యాన్ని, సాహిత్యపు విలువలని, ఎంతోమంది సాహితీవేత్తల కృషిని,అమెరికా దేశంలో గత 40 సంవత్సరాలుగా తానా చేస్తున్న కృషిని కొనియాడుతూ తాను ఏదేశంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, భారతీయురాలిగా, తెలుగు వ్యక్తిగా గుర్తించబడడం తనకు గర్వకారణం అంటూ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. తంగెడ కిషన్‌రావు ఈ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖాధ్యక్షులతో వేదిక పంచుకోవడం ఆనందదాయకంగా ఉందని, వివిధ సాహితీ సంస్థలు, సాహితీ ప్రియులు, తానా లాంటి పలు సంస్థలతో కలిసి పనిచేస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ తెలుగు సమావేశాలు నిర్వహించాలనే ఆసక్తి ఉన్నట్లుగా తెలియపరిచారు. తెలుగు భాష, సాహిత్యం, కళల అభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం విశేషంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించారు. మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు పూర్వ తెలుగు శాఖాసంచాలకులు ఆచార్య డా. ఆర్.వి.ఎస్. సుందరం; ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు యోజన నిర్దేశకులు ఆచార్య డా. దిగుమర్తి మునిరత్నం నాయుడు;మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకర్ రావు; ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆలిఘర్ తెలుగు శాఖాధ్యక్షులు సహాయ ఆచార్యులు డా. పటాన్ ఖాసిం ఖాన్; మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మధురై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. జొన్నలగడ్డ వెంకట రమణ; బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య డా. కొలకలూరి ఆశాజ్యోతి; ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. గంప వెంకట రామయ్య; కర్ణాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు తెలుగు శాఖాధిపతి ఆచార్య డా. మొగరాల రామనాథం నాయుడు; బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి తెలుగు శాఖాచార్యులు ఆచార్య డా. భమిడిపాటి విశ్వనాథ్ లు తమ తమ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖ ఆవిర్భావం, జరుగుతున్న అభివృద్ధి, తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలను, ప్రభుత్వాల నుండి ఇంకా అందవలసిన సహాయ సహకారాల అవసరాలను సోదాహరణంగా వివరించారు. హాస్యావధాని, ప్రముఖ పాత్రికేయులు హాస్య బ్రహ్మ డా. టి. శంకర నారాయణ తన హాస్య ప్రసంగంలో విశ్వనాధ సత్యనారాయణ, గుర్రం జాషువా, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీశ్రీ, ఆరుద్ర, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి లాంటి సాహితీవేత్తల జీవితాల్లోని హాస్య సంఘటలను వివరించి సభను నవ్వులతో ముంచెత్తారు. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా తానా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలతో పోల్చుకుంటే ఇదొక ప్రత్యేక సాహిత్య సమావేశమని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేయడంలో సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సాగువీరుడా ! సాహిత్యాభివందనం
వాష్టింగ్టన్ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా “సాగువీరుడా!-సాహిత్యాభివందనం’ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన స్వాగతోపన్యాసంలో రైతుగా తన అనుభవాలను, తానా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను పంచుకుంటూ రైతు పాత్ర, ప్రాముఖ్యం అతివిలువైనది ప్రశంసించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ రైతుల కష్టాలను, సమాజంలో రైతు యొక్క అద్వీతీయమైన పాత్రను కవిత్వ రూపంలో పంచుకున్నారు. రైతు ప్రత్యక్ష దైవం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మానవాళి మొత్తం జీవించడానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్న రైతును అనునిత్యం స్మరించుకోవలసిన భాద్యత అందరిదీ అన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సేద్యం చేస్తున్న రైతు ప్రత్యక్ష దైవం అన్నారు. గ్రామీణ జీవితాలను, రైతుల కృషిని పాఠ్యాంశాలలో చేర్చి యువతను మేలుకోల్పవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మరచిపోతున్న కొన్ని పదాలు ఎలాపట, దాపట; చ్చో చ్చో, హహయి; తాబేటికాయ, ఏతాము, బల్లకట్టు, బుంగపోత లాంటి వ్యవసాయ పారిభాషిక పదాలను ఆసక్తికరంగా వివరించారు. ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం రైతు కోసం తానా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని అవసరమైన పరికరాలను అందించడంలో తానా చేస్తన్న కృషిని, తానా రైతు విభాగపు సమన్వయకర్త డా. కోట జానయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం, రైతు నేస్తం ఫౌండేషన్, ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం అనే మొబైల్ వ్యాన్ ద్వారా లక్షలాది మంది రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నది, సిరి ధాన్యాలను, మిద్దె తోటల సాగులో ఉన్న మెలకువలతో తగిన శిక్షణ ఇస్తున్నది సోదాహరణంగా వివరించారు. బి.టెక్ రవిగా, హైబ్రిడ్ సీడ్స్ రవిగా అందరికి సుపరిచుతులైన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వాస్తవ్యులు తన రెండు వందెల ఎకరాల సేద్యంలో రెండు వందల కోట్ల రూపాయిల వ్యాపారాన్ని, పది మంది పి.హెచ్.డి విద్యావేత్తలకు, ఐదు వందల మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న వైనాన్ని కొన్ని వేల రకాల కూరగాయల విత్తన్నాలను సృష్టిస్తున్న తీరును, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని తాను చేస్తున్న పరిశోధనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్య మహిళల కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలో ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పిన కళ్ళెం ఉపేందర్ రెడ్డి అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ రైతు రాజ్యం అనే లాభాపేక్షరహిత సంస్థ ద్వారా ఖమ్మం లో రైతు కుటుంబాల, రైతు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కెనడా దేశంలో సన్‌డైన్ ప్రొడ్యూస్ సంస్థను స్థాపించి కర్రేబియా, మెక్సికో, హోన్దోరాస్, నికరాగ్వా, ఫ్లోరిడా ల నుండి వివిధ రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని కెనడా దేశంలో వివిధ వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్న విషయాలను, దాంట్లో ఉన్న సాధకభాధాలను సంక్షిప్తంగా శ్రీధర్ మున్డ్లురు వివరించారు. కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు తాను చేస్తున్న నూట డెబ్బైఐదు ఎకరాల వ్యవసాయాన్ని అవలంబిస్తున్న పద్ధతులను, రెండు వందెల గేదలను, ఆవులను ద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న విషయాలను వివరంగా తెలియజేశారు. తెలంగాణా రాష్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రసాదరావు చేస్తున్న ఎద వ్యవసాయం, వాడుతున్న యంత్రపరికరాల గురించి పదిహేను నిమిషాల పాటు మాట్లాడి ప్రసాదరావును స్వయంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు ఆహ్వానించి, మరిన్ని మెలకువలను తెలియజేయవలసిందిగా కోరడం విశేషం. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గీతరచయితలు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మారెన్న (అనంతపురం), మానుకోట ప్రసాద్(హైదరాబాద్), నూజిళ్ళ శ్రీనివాస్(రాజమండ్రి), కృష్ణవేణి(తిరుపతి), లెనిన్ బాబు (అనంతపురం), రత్నం(చిత్తూరు), డా.అరుణ సుబ్బారావు(హైదరాబాద్), నగమల్లేశ్వరరావు (అమరావతి), లక్ష్మణ మూర్తి (తూముకుంట), గిద్దె రామనరసయ్య (వరంగల్)లు పాల్గొని రైతు నేపథ్య సాహిత్యంతో కూడిన అనేక అద్భుత గీతాలను మధురంగా పాడి ఈ కార్యక్రమానికి నూతన శోభ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, సాంకేతిక సహకారం అందించిన వారికి, విశిష్ట అతిథులకు, గాయనీ గాయకులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఇంటర్నెట్లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’
‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ను ఈ ఏడాది ఇంటర్నెట్లో ప్రారంభిస్తున్నామని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి వెల్లడించారు. మే 31నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని సాహితీ ప్రియులంతా పాల్గొనాలని సూచించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తానా మరో ముందడుగు వేస్తోందని అన్నారు. ఇకపై ప్రతి నెల చివరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (వలస కూలీలకు ఎన్ఆర్ఐల బస్సు ఏర్పాటు) మొదటి సమావేశం ఈ ఆదివారం (మే 31) నాడు రాత్రి 9.30 నిమిషాలకు (అమెరికా సమయం ఉదయం11:00) ప్రసారం కానుందని తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ అన్నారు. ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిధిగా ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద రావు తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేయనున్నారని పేర్కొన్నారు. (చిక్కినట్టే చిక్కి పంజా విసిరింది.. ) ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫోటో కవితలు, పద్యాలు, పాటలు, బాల సాహిత్యం లాంటి వివిధ అంశాలలో ప్రపంచ వ్యాప్తం గా పోటీలు నిర్వహిస్తామని, మే నెల నుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం జరుపుతామని ప్రకటించారు. (ఆమె లేకుండా ‘పని’ అవుతుందా! ) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ దృశ్య సమావేశంలో ఈ క్రింది ఏ మాధ్యమాల ద్వారా నైనా పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు. 1. Webex Link: https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40 2. Facebook: 3. Join by phone: USA: 1-408-418-9388 Access code: 798 876 407 -
అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌కు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఖండించింది. సామాజికమాధ్యమాలతో పాటూ పలు మీడియాల్లో రాం మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైందంటూ వార్తలు రావడం బాధాకరమని తానా 2019 సదస్సు కోఆర్డినేటర్ డా.వెంకట రావు ముల్పురి అన్నారు. తానా సభల్లో రాం మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారని తెలిపారు. అన్ని ముఖ్యమైన రాజకీయపార్టీల నాయకులు తానా సభలకు వచ్చారని చెప్పారు. సభలకు విచ్చేసిన రాం మాధవ్‌ను తానా కార్యవర్గం మర్యాదపూర్వకంగా ఆహ్వానించిందని, తర్వాత స్టేజీపైకి వెళ్లే సమయంలో 10 మంది డ్రమ్స్‌తో తీసుకువెళ్లారని వెంకట రావు ముల్పురి తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించామన్నారు. రాం మాధవ్ ప్రసంగించే సమయంలో అక్కడ 14 వేల మంది హాల్లో ఉన్నరన్నారు. దాదాపు రాం మాధవ్ ప్రసంగం ఆసాంతం ప్రశాంతంగా సాగిందని, చివర్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ పేరు రావడంతో కొందరు ప్రత్యేక హోదా విషయమై అరిచారన్నారు. ముందు 30 వరుసల్లో కూర్చున్న తానా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తానా సభ్యులు మిగతావారు ఎలాంటి నినాదాలు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం జనరల్ టికెట్ తీసుకుని వచ్చిన అతిథులు కూర్చున్న దగ్గర నుంచే కొందరు నినాదాలు చేశారన్నారు. రాం మాధవ్‌ను ముఖ్య అతిథిగా పిలిచి ఆయన్ని తానా ఎందుకు అవమానిస్తుందన్నారు. తానా వేడుకలకు అపఖ్యాతి తీసుకొచ్చేందుకే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
ఓటమి నుంచి 15 నిమిషాల్లో కోలుకున్నా: పవన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తానా మహాసభలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన శనివారం ఉదయం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘డబ్బు ఖర్చు చేయకపోతే నేను కూడా ఓడిపోతానని తెలుసు, కానీ.. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని బాధలైనా పడాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఓటమి నాకు గొప్ప పాఠాలే నేర్పింది. ఓడిన ప్రతీసారి విజయం దగ్గరయింది. అందుకే ఓటమి అంటే భయంలేదు. సినిమాల్లో ఖుషి తర్వాత నాకు దొరికిన సక్సెస్ గబ్బర్ సింగే. దాదాపు పదేళ్లు సక్సెస్ కోసం నిరీక్షించా’ అని అన్నారు. పాలకులు పాలకుల్లా ఉండాలి తప్ప నియంతలా ఉండకూడదన్నారు. ‘భారతదేశం నాయకుడిని ప్రేమించే దేశం తప్ప, నాయకుడిని చూసి భయపడే దేశం కాదు. నాయకులను చూసి భయపడుతున్నారంటే కచ్చితంగా ఏదో ఒకరోజు ఆ నాయకుడు పతనమవ్వడం ఖాయం’ అని ఆయనన్నారు. -
తానా మహాసభలకు రాంమాధవ్‌కు ఆహ్వానం
వాషింగ్టన్ : జూలై 5,6 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని వాల్టార్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబవుతోంది. తానా అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో జరుగనున్న 22వ తానా మహాసభలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గోనున్నారు. అంతే కాకుండా ఆరో తేదీన జరగబోయే ఇండియా పొలిటికల్ ఫోరంలో కూడా పాల్గోనున్నారని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభ్యులు డా. ఆడప ప్రసాద్ తెలిపారు. తానా మహాసభల ముగింపు కార్యక్రమంలో రాంమాధవ్ ప్రసంగించనున్నారని చెప్పారు. తానా అధ్యక్షులు సతీష్ వేమన, కన్వెన్షన్ కన్వీనర్ డా. వెంకట రావు ముల్పూరిలు రామ్ మాధవ్‌తోపాటూ, ముఖ్య అతిథులకు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
తానా మహాసభలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
సాక్షి, తిరుమల : తానా అధ్యక్షుడు వేమన సతీష్ శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 3, 4, 5వ తేదీలలో వాషింగ్టన్లో 42వ తానా మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తానా మహాసభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పారు. తానా వేదికపై మొట్ట మొదటిసారిగా శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నట్టు సతీష్ వెల్లడించారు. -
తానా సదస్సులో ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్పో
లబ్బీపేట : వేలాది మంది ప్రవాస భారతీయులను, ఇండియాలో రియల్ ఎస్టేట్ సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి చేర్చేలా వినూత్న, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్పో’ను నిర్వహించనున్నట్లు తానా ఇండియా కో-ఆర్డినేటర్ గారపాటి ప్రసాద్ చెప్పారు. డెట్రాయిట్లో జూలై 2 నుంచి జరిగే తానా సదస్సులో ఈ ఎక్స్పోను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎక్స్‌పోకు సంబంధించిన లోగోను ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఎలక్ట్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ ఆవిష్కరించారు. వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఐఇఎక్స్పీఓ.ఇన్ కూడా ఆయన ప్రారంభించారు. గారపాటి ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఒకప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారని, రాష్ట్ర విభజన నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. ఈ ప్రదర్శనలో వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అబివృద్ధి చెందేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకంటుందని, అందుకు ఇలాంటి ఎక్స్‌పోలు దోహదపడతాయన్నారు. స్విచ్ మిడియా అండ్ ట్రేడ్ ఫెయిర్ వ్యవస్థాపక ఛీప్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ సుకమంచి మాట్లాడుతూ సుమారు పదివేల మంది వరకూ ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగస్వాములు కావాలనుకునే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విమాన టికెట్లు, వీసా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుగుతున్న కంపెనీలకు ఈ ప్రదర్శన అపూర్వ అవకాశంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.