సాగువీరుడా ! సాహిత్యాభివందనం | TANA sankranthi Special Event On Farmers | Sakshi
Sakshi News home page

సాగువీరుడా ! సాహిత్యాభివందనం

Published Wed, Jan 20 2021 10:20 AM | Last Updated on Wed, Jan 20 2021 10:37 AM

TANA sankranthi Special Event On Farmers - Sakshi

వాష్టింగ్టన్‌ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా “సాగువీరుడా!-సాహిత్యాభివందనం’ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన స్వాగతోపన్యాసంలో రైతుగా తన అనుభవాలను, తానా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను పంచుకుంటూ రైతు పాత్ర, ప్రాముఖ్యం అతివిలువైనది ప్రశంసించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ రైతుల కష్టాలను, సమాజంలో రైతు యొక్క అద్వీతీయమైన పాత్రను కవిత్వ రూపంలో పంచుకున్నారు.  
రైతు ప్రత్యక్ష దైవం
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మానవాళి మొత్తం జీవించడానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్న రైతును అనునిత్యం స్మరించుకోవలసిన భాద్యత అందరిదీ అన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సేద్యం చేస్తున్న రైతు ప్రత్యక్ష దైవం అన్నారు. గ్రామీణ జీవితాలను, రైతుల కృషిని పాఠ్యాంశాలలో చేర్చి యువతను మేలుకోల్పవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మరచిపోతున్న కొన్ని పదాలు  ఎలాపట, దాపట; చ్చో చ్చో, హహయి; తాబేటికాయ, ఏతాము, బల్లకట్టు, బుంగపోత లాంటి వ్యవసాయ పారిభాషిక పదాలను ఆసక్తికరంగా వివరించారు. 

ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం
రైతు కోసం తానా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని అవసరమైన పరికరాలను అందించడంలో తానా చేస్తన్న కృషిని, తానా రైతు విభాగపు సమన్వయకర్త డా. కోట జానయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం, రైతు నేస్తం ఫౌండేషన్, ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం అనే మొబైల్ వ్యాన్ ద్వారా లక్షలాది మంది రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నది, సిరి ధాన్యాలను, మిద్దె తోటల సాగులో ఉన్న మెలకువలతో తగిన శిక్షణ ఇస్తున్నది సోదాహరణంగా వివరించారు. బి.టెక్ రవిగా, హైబ్రిడ్ సీడ్స్ రవిగా అందరికి సుపరిచుతులైన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వాస్తవ్యులు తన రెండు వందెల ఎకరాల సేద్యంలో రెండు వందల కోట్ల రూపాయిల వ్యాపారాన్ని, పది మంది పి.హెచ్.డి విద్యావేత్తలకు, ఐదు వందల మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి  కల్పిస్తున్న వైనాన్ని కొన్ని వేల రకాల కూరగాయల విత్తన్నాలను సృష్టిస్తున్న తీరును, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని తాను చేస్తున్న పరిశోధనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఉచిత విద్య
మహిళల కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలో ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పిన కళ్ళెం ఉపేందర్ రెడ్డి అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ రైతు రాజ్యం అనే లాభాపేక్షరహిత సంస్థ ద్వారా ఖమ్మం లో రైతు కుటుంబాల, రైతు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కెనడా దేశంలో సన్డైన్  ప్రొడ్యూస్  సంస్థను స్థాపించి కర్రేబియా, మెక్సికో, హోన్దోరాస్, నికరాగ్వా, ఫ్లోరిడా ల నుండి వివిధ రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని కెనడా దేశంలో వివిధ వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్న విషయాలను, దాంట్లో ఉన్న సాధకభాధాలను సంక్షిప్తంగా శ్రీధర్ మున్డ్లురు వివరించారు. కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు తాను చేస్తున్న నూట డెబ్బైఐదు  ఎకరాల వ్యవసాయాన్ని అవలంబిస్తున్న పద్ధతులను, రెండు వందెల గేదలను, ఆవులను ద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న విషయాలను వివరంగా తెలియజేశారు. తెలంగాణా రాష్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ఫోన్ చేసి  ప్రసాదరావు చేస్తున్న ఎద వ్యవసాయం, వాడుతున్న యంత్రపరికరాల గురించి పదిహేను నిమిషాల పాటు మాట్లాడి ప్రసాదరావును స్వయంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు ఆహ్వానించి, మరిన్ని మెలకువలను తెలియజేయవలసిందిగా కోరడం విశేషం.

ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గీతరచయితలు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మారెన్న (అనంతపురం), మానుకోట ప్రసాద్(హైదరాబాద్), నూజిళ్ళ శ్రీనివాస్(రాజమండ్రి), కృష్ణవేణి(తిరుపతి), లెనిన్ బాబు (అనంతపురం), రత్నం(చిత్తూరు), డా.అరుణ సుబ్బారావు(హైదరాబాద్), నగమల్లేశ్వరరావు (అమరావతి), లక్ష్మణ మూర్తి (తూముకుంట), గిద్దె రామనరసయ్య (వరంగల్)లు పాల్గొని రైతు నేపథ్య సాహిత్యంతో కూడిన అనేక అద్భుత గీతాలను మధురంగా పాడి ఈ కార్యక్రమానికి నూతన శోభ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, సాంకేతిక సహకారం అందించిన వారికి, విశిష్ట అతిథులకు, గాయనీ గాయకులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement