
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తానా మహాసభలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన శనివారం ఉదయం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘డబ్బు ఖర్చు చేయకపోతే నేను కూడా ఓడిపోతానని తెలుసు, కానీ.. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని బాధలైనా పడాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఓటమి నాకు గొప్ప పాఠాలే నేర్పింది.
ఓడిన ప్రతీసారి విజయం దగ్గరయింది. అందుకే ఓటమి అంటే భయంలేదు. సినిమాల్లో ఖుషి తర్వాత నాకు దొరికిన సక్సెస్ గబ్బర్ సింగే. దాదాపు పదేళ్లు సక్సెస్ కోసం నిరీక్షించా’ అని అన్నారు. పాలకులు పాలకుల్లా ఉండాలి తప్ప నియంతలా ఉండకూడదన్నారు. ‘భారతదేశం నాయకుడిని ప్రేమించే దేశం తప్ప, నాయకుడిని చూసి భయపడే దేశం కాదు. నాయకులను చూసి భయపడుతున్నారంటే కచ్చితంగా ఏదో ఒకరోజు ఆ నాయకుడు పతనమవ్వడం ఖాయం’ అని ఆయనన్నారు.