ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు తానా 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి. జులై 7-9వరకు ఆటపాటలు, ప్రముఖుల ప్రసంగాలతో ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతనపాటి వెంకట రమణలతో నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజయ్యారు. వేదిక మొత్తం తెలుగు వారితో సందడి వాతావరణం కనిపించింది.
తొలిరోజు.. బాంకెట్ డిన్నర్ వేదికపై 23వ మహాసభల సావనీర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో వెంకయ్యనాయుడికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, చైర్మన్ శ్రీనివాస్ లావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, ఓవర్సీస్ డైరెక్టర్ వంశి కోట తదితరులు చిరుసత్కారం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు.ఆయన చేతుల మీదుగా పలువురికి తానా మెరిటోరియస్ అవార్డులను అందజేశారు. నిర్మాణ దిల్‌రాజు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సీతక్క, శ్రీలీల, నిఖిల్ తదితరులను కూడా సత్కరించారు.
రెండో రోజు..కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తానా నాయకులంతా పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఎస్, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి తదితరులకు తానా నాయకులు సన్మానం చేశారు. అనంతరం ఆధ్యాత్మిక జీవితం గురించి, మనం చేసే పొరపాట్ల గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ అద్భుతంగా వివరించారు.
మూడో రోజు స్థానిక సాంస్కృతిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలు, కళానైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ధీంతానా బృందాన్ని తానా నేతలు సత్కరించారు. అనంతరం వేదమంత్రాల నడుమ సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణకు ఘనసత్కారం చేశారు.సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్‌ను సత్కరించారు. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.అనంతరం బాలకృష్ణ దంపతులను తానా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా తానా సేవలను బాలకృష్ణ కొనియాడారు.
ఇదిలా ఉంటే తానా మహాసభల చివరి రోజున అధ్యక్షులు అంజయ్య చౌదరి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ వేదికపైనే ప్రమాణం చేశారు. ఆయన 2023-2025 వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment