సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రజల అభీ ష్టం మేరకు ప్రభుత్వాలు, పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే వాటిని ప్రజలే సాగనంపుతారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి.
‘‘గతంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఎన్నో ప్రభుత్వాలను ప్రజలు సాగనంపారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సున్నిత అంశంపై తెలుగువారి మనస్సులో ఆశిస్తున్న నిర్ణయమే తాము తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులు ఇష్టమైనా, కష్టమైనా సహనం కోల్పోకుండా క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకునే శక్తిని ప్రసాదించాలని తెలుగుతల్లిని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చాలా సున్నిత వాతావరణం ఉందని, ఇరు ప్రాం తాల్లో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
సమ్మెలు, ఉద్యమాలు చట్టపరిధికి లోబడి, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని, ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల మేలు కోసమే కృషి చేయాలని, వారి మనసులోని ఆలోచనలను అనుసరించి నిర్ణయాలు ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారని, పార్టీలు, ప్రభుత్వాలు కాదని స్పష్టంచేశారు. పార్టీలు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనన్నారు. ప్రజల మనస్సులోని ఆకాంక్షలను అనుసరించి, వారు మనస్సులో ఎలాంటి నిర్ణయం ఆశిస్తున్నారో అలాంటి నిర్ణయమే తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి: సీఎం
పిల్లలకు బాల్యదశ నుంచే తెలుగు నేర్పించాలని, ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడి పిల్లలకు తెలుగు భాషపై ఆసక్తి కలిగించాలని తల్లిదండ్రులను సీఎం కోరారు. ఇంగ్లిష్ భాష మాత్రమే ముఖ్యమనే భావన తొలగాలన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువల్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో సీఎం మాట్లాడారు.
ప్రజలే సాగనంపుతారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
Published Fri, Aug 30 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement