మన ఇంట్లో భాష ఎలా ఉంది? | Telugu Language Day Celebrated On Birthday Of Gidugu Venkata Ramamurthy | Sakshi
Sakshi News home page

మన ఇంట్లో భాష ఎలా ఉంది?

Published Fri, Aug 27 2021 11:36 PM | Last Updated on Sat, Aug 28 2021 12:31 AM

Telugu Language Day Celebrated On Birthday Of Gidugu Venkata Ramamurthy - Sakshi

అమ్మ కడుపు నుంచి శిశువు మాతృభాషను వింటుంది. బడిలో చదువుతుంది. కాని ఆ భాషను తన భాషగా ఎప్పుడు చేసుకుంటుంది? ఎలా ఆస్వాదిస్తుంది? ఇంట్లో అమ్మమ్మలు సామెతలు చెబుతారు చలోక్తులు విసురుతారు. నానమ్మలు కథలు చెబుతారు. కథల పుస్తకాలు భాష ద్వారా ఊహను పంచుతాయి. సాహిత్యం మెల్లగా సంస్కారం అలవరుస్తుంది. బతకడానికి ఇంగ్లిష్‌. జీవించడానికి తెలుగు. పిల్లల తెలుగు కోసం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి?

ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసి, కేబుల్‌ కనెక్షన్‌... ఇవి అవసరమే. కాని పిల్లల కళ్లకు రోజూ తెలుగును కనిపించేలా చేసే ఒక దినపత్రిక అవసరం అని చాలామందిమి అనుకోము. ఇంటి అల్మారాలో ఒక తెలుగు పుస్తకం అన్నా ఉంటే వారికి తెలుగు భాష పట్ల ఆసక్తి ఏర్పడుతుందని అనుకోము. ఇంగ్లిష్‌ మీడియంలో చేర్పించడం, ఇంగ్లిష్‌ భాష ప్రావీణ్యం ఎలా ఉందో గమనించడం... ఇవి అవసరమే. భవిష్యత్తులో ఉపాధి వేదికలను పెంచుకోవడానికి ఆ పని చేయాల్సిందే. కాని అలాగని ఇంటి భాషను, తల్లిభాషను ఇంటి వేదికగా పిల్లల్లో పాదుకునేలా ఏ మాత్రం చేయగలుగుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు తప్పక ప్రశ్నించుకోవాలి.

అమ్మ అన్న పిలుపు
ప్రతి తెలుగు శిశువు పలికే తొలి తెలుగు శబ్దం ‘అమ్మ’. అక్షర మాలలో అ అంటే అమ్మ అనే కదా నేర్పిస్తారు. శిశువుకు అమ్మ ద్వారా తెలుగును నేర్చుకునే హక్కు ఉంది. తల్లికి తన ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన బాధ్యత ఉంది. పిల్లలకు ఏ భాష అయినా నాలుగు విధాలుగా వస్తుంది. 1.మాట్లాడటం 2.వినడం 3. చదవడం 4.రాయడం... ఈ నాలుగింటిలో పిల్లలు ఏవి ఎంత బాగా అభ్యాసం చేస్తున్నారో గమనించుకోవాలి. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి చేయకపోయినా భాష పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఈ నాలుగు జరగడంలో ఇంటి బాధ్యత విస్మరించి ‘మా పిల్లలకు తెలుగే రావడం లేదని’ అనుకోవడం నింద ఎవరో ఒకరి మీద వేయాలనుకోవడం సరి కాదు. ‘సబ్జెక్ట్స్‌’ స్కూల్‌లో నేర్పిస్తారు. తెలుగు కూడా ఒక ‘సబ్జెక్ట్‌’గా స్కూల్‌లో నేర్పుతారు. కాని భాష దాని జీవంతో అనుభూతితో అందంతో పిల్లలకు రావాలంటే ఇంటి మనుషులు, ఇంటి పరిసరాల వల్లే ఎక్కువగా సాధ్యం.

పదం... పద్యం..
తెలుగు పదం.. తెలుగు పద్యం పిల్లలకు ఇంట్లో అలవాటు చేయడం గతంలో ఉండేది. వేమన పద్యాలు, సుమతి శతకం, పెద్దబాలశిక్ష చదివించడం, దేశభక్తి గేయాలు నేర్పించడం, పొడుపు కతలు, సామెతలు, పిల్లల పాటలు... ఇవి భాషను వారిలో గాఢంగా పాదుకునేలా చేసి ‘మన తెలుగు’ అనిపిస్తాయి. ఇవాళ్టి పిల్లలు ‘చందమామ రావే’ వినడం లేదు... ‘వీరి వీరి గుమ్మడిపండు’ ఆడటం లేదు. ప్లేస్కూల్‌లో ‘జానీ జానీ ఎస్‌ పాపా’ నేరుస్తున్నారు కాని ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ చెవిన వేసుకోవడం లేదు. చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టిందో లేదోగానీ తెలుగు భాష మీద పిల్లలకు ఉండాల్సిన ఇచ్ఛను అమ్మ (నాన్న) కొట్టకుండా చూసుకోవాలి. 

పత్రికలను పట్టించుకోని నిర్లక్ష్యం
గతంలో నాన్నలు పిల్లల కోసం మిఠాయి కొనుక్కుని దాంతో పాటు మార్కెట్‌లోకి తాజాగా వచ్చిన ‘చందమామ’ సంచికను కొనుక్కొని వచ్చేవారు. ఆ స్తోమత లేకపోతే పక్కనే ఉన్న అద్దె పుస్తకాల షాపు నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటివి తెచ్చి పిల్లలకు ఇచ్చేది అమ్మ . ‘రాకుమారుడు’, ‘మాంత్రికుడు’, ‘ముసలవ్వ’, ‘యోజనం’, ‘క్రోసు’, ‘పురం’, ‘బాటసారి’, ‘సత్రం’... ఇలాంటి పదాలతో కథలు చదువుతూ పిల్లలు భాషలోకి అడుగుపెట్టేవారు. భాష అంటే ఏమిటి? అది ఒక విలువను పాదుకునేలా చేసే మాధ్యమం. కథ చదివితే భాష వస్తుంది. బోనస్‌గా ఆ భాషతో పాటు జీవన విలువ, పాటించాల్సిన నీతి అలవడుతుంది. కాని తెలుగు సమాజం పిల్లల పత్రికల పట్ల చాలా నిర్లక్ష్యం వహించి నేడు అవి దాదాపుగా లేకుండా చేసే స్థితికి తెచ్చింది. పిల్లలు కథ ‘వింటే’ కథ ‘చెప్తారు’. కథ ‘చదివితే’ కథ ‘రాస్తారు’. ఈ విని, చెప్పి, చదివి, రాసే విధానాలను అలవర్చే పత్రికలు నేడు లేవు. దినపత్రికలు కొంతలో కొంత ఆ లోటును పూడుస్తున్నాయి. పిల్లలకు అందుకోసమని పత్రికలను చదవడం అలవాటు చేయాలి. కొన్ని తెలుగు భాషకు సంబంధించిన వెబ్‌సైట్లు బాల సాహిత్యాన్ని ఇస్తున్నాయి. అవి చదివించాలి.

ఏ భాష చెవిన పడుతోంది?
ఇంట్లో పిల్లలు వింటున్నది టీవీ భాష, సినిమా భాష మాత్రమే. తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటల నుంచి నేర్చే పద సంపద పెద్దగా ఉండదు. ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటే భాషకు ఉండే ధ్వని, రుచి పిల్లలకు తెలుస్తుంది కాని ఇవాళ చాలా ఇళ్లల్లో పెద్దలు ఉండటం లేదు. కనుక సీరియల్స్‌ భాష, వెకిలి కామెడీ షోల భాష పిల్లలకు వస్తోంది. ఈ భాష వ్యక్తిత్వ పతనానికి తప్ప నిర్మాణానికి పనికి రాదు. భాషా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే మాతృభాష సరిగా వచ్చినవారికే అన్య భాషలు సరిగా వస్తాయి అని. మాతృభాషను బాగా నేర్చుకున్న పిల్లలు ఇంగ్లిష్‌ కూడా బాగా నేర్చుకోగలుగుతారు. 
తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. ఆ గొప్పదనం ఇచ్చే ఆత్మవిశ్వాసం వేరు. మాతృభాష నుంచి అందే గొప్ప బలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది.    

తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం లేదా దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement