అమ్మ ఒడి కమ్మదనం | today mother tongue day | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి కమ్మదనం

Published Fri, Feb 21 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

today mother tongue day

నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం
 
 సుసంపన్నమైన తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని తమ అమూల్యమైన రచనలతో పరిపుష్టం చేసిన మహానుభావులెందరో...ప్రాచీన సాహిత్యంలో నాటి నన్నయ్య, తిక్కనల నుంచి ఆధునిక సాహిత్యంలో విశ్వనాథ, జాషువా, గురజాడ, శ్రీశ్రీ వరకు ఎందరో కవులు తెలుగు భాషామతల్లికి సేవలందించి, కన్నతల్లి రుణం తీర్చుకున్నారు. తెలుగుభాష మాట్లాడడమంటేనే చిన్నచూపుగా భావిస్తున్న నేటి సమాజంలో తెలుగు టెంగ్లిష్‌గా మారిపోతోంది. రానురాను అంతర్ధాన మైపోయే ప్రమాదం ముంచుకొస్తోందని తెలుగు భాషాభిమానులు పడుతున్న ఆందోళనలో నిజం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి జాతి తమతమ మాతృభాషలకు పెద్దపీట వేసి గౌరవిస్తుంటే మనం మాత్రం ఇలా...మన భాషను మనమే చంపుకోవడం బాధాకరం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నైనా మాతృభాషా పరిరక్షణకు కంకణబద్ధులమవుదాం...
 
 
 గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్
 అమ్మ మనసంత కమ్మనౌ మాతృభాష ... స్నేహపుష్ఫంకంబౌచును చెలగుబాష మాతృభాష అని కొనియాడారు కవులు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని తెగలు, వర్గాలు ఉన్నాయో అన్ని భాషలు పుట్టాయి.విదేశాల్లో పుట్టి పెరిగినా జన్మభూమి మాతృభాష, కన్న తల్లిదండ్రులు పూజ్యనీయులే. మాతృభాషను తప్పక ఎందుకు మాట్లాడాలి అనే విషయమై పరిశోధన చేసిన భాషా శాస్త్రజ్ఞులు కొన్ని కారణాలు నిర్ధారించారు. మనిషిలో జన్యుపరంగా వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు ప్రభావితం చేస్తాయి. మాతృభాష చిన్నప్పటి నుంచి చదవడం, వినడం వల్ల మనోవికాసం కలుగుతుంది. మాతృభాషలో పిల్లలు మాట్లాడితే పరిసరాల పరిజ్ఞానం త్వరగా పొందగలరు. మనస్సులో భావాలను సులభంగా పిల్లలు మాతృభాషలో వ్యక్తం చేయగలుగుతారు. పిల్లలు సాంఘికంగా కొన్ని ప్రత్యేక అంశాలను సులభంగా మాతృభాషలో నేర్చుకుని సృజనాత్మక రచనలు చేయడానికి ఉద్యుక్తులవుతారు.
 
 సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలు
 తెలుగు భాష అనగానే కొందరు పౌరాణిక పద్యాలు, పాటలు, గేయాలు గ్రాంథిక భాష వరకే పరిమితం అనుకుంటారు. వాటివలన మనకు ఉపయోగం ఏమిటంటూ విమర్శిస్తుంటారు. ప్రాచీన కాలం నుంచి తెలుగులో ఎన్నో భాషోద్యమాలు, సాహిత్యోద్యమాలు జరిగాయి. సమాజాన్ని కదిలించాయి. గురజాడ, శ్రీశ్రీ వంటి వారి రచనలు సాంఘిక దురాచారాలపై దండెత్తాయి. పాఠకుడికి జీవితం పట్ల నూతన విశ్వాసం కలిగించేలా వేలాది రచనలు సాగాయి. సాంఘిక దురాచారాలు, దురలవాట్లు పారదోలేలా ఉద్యమాలకు మన తెలుగు సాహిత్యం స్ఫూర్తినిచ్చింది. సమకాలీన ప్రజల జీవితాన్ని వస్తువుగా తీసుకుని నాటకం, కథ, సామెతలు వంటి ఎన్నో ప్రక్రియలు సమాజాన్ని ప్రభావితం చేశాయి.
 
 మాతృభాషను స్వచ్ఛంగా భావితరాలకు అందించాలి
 తేనెలొలుకు తెలుగు భాష  టెంగ్లిష్‌గా మారడం భవిష్యత్తులో ప్రపంచంలో అంతరించే భాషల వరుసలోకి ఎక్కడం తెలుగు జాతివారమని గర్వపడే అందరి మనసులను కలిచివేస్తోంది. దీనివల్ల నేటి యువత హావభావాలు, సామాజిక నడవడికలోనూ ఎన్నో వింత పోకడలు పెరిగాయని పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఈ పరిణామాలు నేటి తరం, భవిష్యత్తు తరాలకు నష్టం తెస్తుందనడంలో సందేహం లేదు. మన తెలుగు భాషను కాపాడుకోవడంతో పాటు స్వచ్ఛత నిలుపుకొని భావితరాలకు అందిస్తేనే మన జాతి మనుగడకు శుభదాయకమంటున్నారు సాహితీవేత్తలు, సామాజిక స్పృహ ఉన్న విద్యావేత్తలు. అవి వారి మాటల్లోనే...
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement