ఎప్పటి గురజాడ! ఎప్పటి దేశభక్తి గీతం! నూటపాతికేళ్ళ క్రితం నాటి ఆ గీతం ఇన్ని కోట్ల తెలుగుప్రజల పెదాలపై ఎన్ని కోట్ల సార్లు నర్తించి ఉంటుంది! ‘దేశమును ప్రేమించుమన్నా’ అని చెప్పే ఆ గీతం నిత్యస్మరణనే కాదు, నిరంతరాచరణను ఉద్బోధించడం లేదా? అది కాలభేదాలను దాటి నూతనత్వాన్ని తెచ్చుకునే సముజ్వలపాఠం కాదా? దాని సారమూ, సందేశమూ జాతి జనులలో ఇప్పటికైనా ఇంకాయా?
మనదేశం లాంటి జనతంత్ర వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికాది అన్ని రంగాలకూ ఎప్పటికీ దిశానిర్దేశం చేసే మహిమాన్విత మంత్రం ఆ గీతం! అరవై అయిదు పంక్తుల ఆ గీతంలో మనకు ఎంత చటుక్కున గుర్తొస్తాయో, అంతే అలవోకగా మరచిపోయే పంక్తులు రెండే; అవి, ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’! ఆ కవితాహారంలో అవే మణిపూసలైన మహావాక్యాలు.
దేశాన్ని మట్టిగానూ, భూభాగంగానూ చూడడమే పరిపాటి కాగా, మనుషులుగా గుర్తించిన గురజాడ తన కాలానికి ఎన్నో మన్వంతరాలు ముందున్నాడు. దేశమంటే మనుషులని ఎలుగెత్తి చాటడంలో వేల సంవత్సరాల వెనక్కీ వెళ్లగలిగిన విలక్షణ క్రాంతదర్శి ఆయన. దేశమూ, రాజ్యమూ అనే భావనే అంకురించని గణసమాజంలో అస్తిత్వానికి మనిషే మణిదీపమూ, కొలమానమూనూ...
గురజాడ గీతోపదేశానికి పూర్తి వ్యతిరేకదిశలో నేటి మన ప్రజాస్వామికగమనం సాగుతున్న వైనాన్ని ఆ గీతంలోని ప్రతి చరణమూ ఛెళ్ళున చరచి చెబుతుంది. వొట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టమంటాడాయన. మంచి గతమున కొంచెమే, మందగించక ముందుకడుగేయమంటాడు. వ్యర్థకలహం వద్దనీ, కత్తి వైరం కాల్చమనీ హితవు చెబుతాడు. దేశాభిమానపు గొప్పలు మానేసి జనానికి నికరంగా పనికొచ్చేది చేసి చూపమంటాడు. దేశస్థులంతా చెట్టపట్టాలు వేసుకు నడవాలనీ, అన్ని జాతులూ, మతాలూ అన్నదమ్ముల్లా మెలగాలనీ సందేశిస్తాడు.
మతం వేరైనా మనసులొకటై మనుషులుండాలంటాడు. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తాలనీ, ఆ చెట్టు మూలం నరుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలనీ స్వప్నిస్తాడు... మరో రెండురోజుల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న భారత జనతంత్ర ప్రస్థానం గురజాడ చూపిన జాడకు ఏ కొంచెమైనా దగ్గరగా ఉందా? వొట్టి మాటల వరదలో గట్టి మేలు గడ్డిపరక అయింది. మంచి అంతా గతంలోనే ఉందని చెప్పి జనాన్ని వెనకడుగు పట్టించడమే రాజకీయమైంది.
దేశం వ్యర్థకలహాలు, కత్తివైరాలతో సంకుల సమరాంగణమైంది. జనాన్ని చీల్చి పాలించడమే అధికార పరమపదానికి సోపానమైంది. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తడం లేదు; వైర, విద్వేషాల విరితావులు వీస్తోంది. ఆ చెట్టు మూలం మనుషుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలన్న కవి ఆశాభావం, ఇప్పటికీ గట్టిగా వేటుపడని నిరుద్యోగపు జడలమర్రి కింద నిలువునా సమాధి అయే ఉంది.
దేశమంటే మనుషులనే కాదు, ఆ మనుషులకు ఏది అత్యవసరమో గురజాడ ఉద్ఘాటిస్తాడు. తిండి కలిగితె కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయని, మనిషిని నిర్వచిస్తాడు; ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుందంటాడు; మనిషి సంపూర్ణ జవసత్త్వాలతో హుందాగా శిరసెత్తుకు జీవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామి అవడానికీ, తిండిపుష్టికీ ఉన్న అన్యోన్య సంబంధాన్ని ఆనాడే నొక్కిచెబుతాడు.
అటువంటిది, యావత్ప్రజలకూ పుష్టికరమైన ఆహారాన్ని సమకూర్చే లక్ష్యానికి ఇప్పటికీ యోజనాల దూరంలోనే ఉన్నాం. పోషకాహార లోపంతో ఉసూరుమంటున్న ప్రపంచ బాలల్లో 50 శాతం భారత్‌లోనే ఉన్నారనీ, కేవలం పదిశాతం మందికే పోషకాహారం అందుతోందనీ గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, అయిదేళ్ళ లోపు వయసు పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల లోపించినవారు 35 శాతానికి పైగా, బలహీనులు దాదాపు 20 శాతమూ ఉన్నారు.
రక్తహీనతను ఎదుర్కొంటున్న పురుషులు, మహిళలు, పిల్లల శాతం గరిష్ఠంగా 67 నుంచి కనిష్ఠంగా 25 వరకూ ఉంది. 2023 లెక్కల ప్రకారమే మన దేశంలో 74 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం ఆందోళన గొలుపుతూ 28.7 దగ్గర ఉంది.
భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ల ఆర్థికత అవుతుందనీ, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికతలలో మూడవది కాబోతోందనీ పాలకులు అరచేతి స్వర్గాలు ఆవిష్కరిస్తుంటే అసలు నిజాలు ఇలా నిలువునా వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో సగానికి పైగా, 81 కోట్లమంది నెలకు అయిదు కిలోల రేషన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ మాత్రానికీ నోచుకోని వలస, అసంఘటిత రంగ శ్రామికులు 8 కోట్లమంది ఉన్నారు.
జనాభా లెక్కల సేకరణ సకాలంలో జరిగి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదంటున్నారు. కోవిడ్ దరిమిలా వీరిని కూడా ఆహార భద్రతా చట్టం కిందికి తేవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పైగా తాజా బడ్జెట్‌లో ఆహార సబ్సిడీపై ఇంకా కోత పడింది. పోషకాహార లోపం వల్ల భారత్ తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 4 శాతం నష్టపోతోంది.
తిండికి, కండకు, మనిషికి; దేశాభివృద్ధిలో మనిషి పాత్రకు ఉన్న అన్యోన్యాన్ని ఆనాడే చెప్పిన గురజాడది ఎంత గొప్ప ముందుచూపు! దేశభక్తిని, దేశభుక్తితో మేళవించిన గురజాడ గీతం అంతర్జాతీయ గీతమే కాగలిగినదైనా రాష్ట్రీయ గీతం కూడా కాకపోవడం విషాదం కాదూ!?
దేశ‘భుక్తి’ గేయం
Published Mon, Aug 12 2024 5:27 AM | Last Updated on Mon, Aug 12 2024 5:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment