patriotic song
-
దేశ‘భుక్తి’ గేయం
ఎప్పటి గురజాడ! ఎప్పటి దేశభక్తి గీతం! నూటపాతికేళ్ళ క్రితం నాటి ఆ గీతం ఇన్ని కోట్ల తెలుగుప్రజల పెదాలపై ఎన్ని కోట్ల సార్లు నర్తించి ఉంటుంది! ‘దేశమును ప్రేమించుమన్నా’ అని చెప్పే ఆ గీతం నిత్యస్మరణనే కాదు, నిరంతరాచరణను ఉద్బోధించడం లేదా? అది కాలభేదాలను దాటి నూతనత్వాన్ని తెచ్చుకునే సముజ్వలపాఠం కాదా? దాని సారమూ, సందేశమూ జాతి జనులలో ఇప్పటికైనా ఇంకాయా? మనదేశం లాంటి జనతంత్ర వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికాది అన్ని రంగాలకూ ఎప్పటికీ దిశానిర్దేశం చేసే మహిమాన్విత మంత్రం ఆ గీతం! అరవై అయిదు పంక్తుల ఆ గీతంలో మనకు ఎంత చటుక్కున గుర్తొస్తాయో, అంతే అలవోకగా మరచిపోయే పంక్తులు రెండే; అవి, ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’! ఆ కవితాహారంలో అవే మణిపూసలైన మహావాక్యాలు. దేశాన్ని మట్టిగానూ, భూభాగంగానూ చూడడమే పరిపాటి కాగా, మనుషులుగా గుర్తించిన గురజాడ తన కాలానికి ఎన్నో మన్వంతరాలు ముందున్నాడు. దేశమంటే మనుషులని ఎలుగెత్తి చాటడంలో వేల సంవత్సరాల వెనక్కీ వెళ్లగలిగిన విలక్షణ క్రాంతదర్శి ఆయన. దేశమూ, రాజ్యమూ అనే భావనే అంకురించని గణసమాజంలో అస్తిత్వానికి మనిషే మణిదీపమూ, కొలమానమూనూ... గురజాడ గీతోపదేశానికి పూర్తి వ్యతిరేకదిశలో నేటి మన ప్రజాస్వామికగమనం సాగుతున్న వైనాన్ని ఆ గీతంలోని ప్రతి చరణమూ ఛెళ్ళున చరచి చెబుతుంది. వొట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టమంటాడాయన. మంచి గతమున కొంచెమే, మందగించక ముందుకడుగేయమంటాడు. వ్యర్థకలహం వద్దనీ, కత్తి వైరం కాల్చమనీ హితవు చెబుతాడు. దేశాభిమానపు గొప్పలు మానేసి జనానికి నికరంగా పనికొచ్చేది చేసి చూపమంటాడు. దేశస్థులంతా చెట్టపట్టాలు వేసుకు నడవాలనీ, అన్ని జాతులూ, మతాలూ అన్నదమ్ముల్లా మెలగాలనీ సందేశిస్తాడు. మతం వేరైనా మనసులొకటై మనుషులుండాలంటాడు. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తాలనీ, ఆ చెట్టు మూలం నరుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలనీ స్వప్నిస్తాడు... మరో రెండురోజుల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న భారత జనతంత్ర ప్రస్థానం గురజాడ చూపిన జాడకు ఏ కొంచెమైనా దగ్గరగా ఉందా? వొట్టి మాటల వరదలో గట్టి మేలు గడ్డిపరక అయింది. మంచి అంతా గతంలోనే ఉందని చెప్పి జనాన్ని వెనకడుగు పట్టించడమే రాజకీయమైంది. దేశం వ్యర్థకలహాలు, కత్తివైరాలతో సంకుల సమరాంగణమైంది. జనాన్ని చీల్చి పాలించడమే అధికార పరమపదానికి సోపానమైంది. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తడం లేదు; వైర, విద్వేషాల విరితావులు వీస్తోంది. ఆ చెట్టు మూలం మనుషుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలన్న కవి ఆశాభావం, ఇప్పటికీ గట్టిగా వేటుపడని నిరుద్యోగపు జడలమర్రి కింద నిలువునా సమాధి అయే ఉంది. దేశమంటే మనుషులనే కాదు, ఆ మనుషులకు ఏది అత్యవసరమో గురజాడ ఉద్ఘాటిస్తాడు. తిండి కలిగితె కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయని, మనిషిని నిర్వచిస్తాడు; ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుందంటాడు; మనిషి సంపూర్ణ జవసత్త్వాలతో హుందాగా శిరసెత్తుకు జీవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామి అవడానికీ, తిండిపుష్టికీ ఉన్న అన్యోన్య సంబంధాన్ని ఆనాడే నొక్కిచెబుతాడు. అటువంటిది, యావత్ప్రజలకూ పుష్టికరమైన ఆహారాన్ని సమకూర్చే లక్ష్యానికి ఇప్పటికీ యోజనాల దూరంలోనే ఉన్నాం. పోషకాహార లోపంతో ఉసూరుమంటున్న ప్రపంచ బాలల్లో 50 శాతం భారత్‌లోనే ఉన్నారనీ, కేవలం పదిశాతం మందికే పోషకాహారం అందుతోందనీ గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, అయిదేళ్ళ లోపు వయసు పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల లోపించినవారు 35 శాతానికి పైగా, బలహీనులు దాదాపు 20 శాతమూ ఉన్నారు. రక్తహీనతను ఎదుర్కొంటున్న పురుషులు, మహిళలు, పిల్లల శాతం గరిష్ఠంగా 67 నుంచి కనిష్ఠంగా 25 వరకూ ఉంది. 2023 లెక్కల ప్రకారమే మన దేశంలో 74 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం ఆందోళన గొలుపుతూ 28.7 దగ్గర ఉంది. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ల ఆర్థికత అవుతుందనీ, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికతలలో మూడవది కాబోతోందనీ పాలకులు అరచేతి స్వర్గాలు ఆవిష్కరిస్తుంటే అసలు నిజాలు ఇలా నిలువునా వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో సగానికి పైగా, 81 కోట్లమంది నెలకు అయిదు కిలోల రేషన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ మాత్రానికీ నోచుకోని వలస, అసంఘటిత రంగ శ్రామికులు 8 కోట్లమంది ఉన్నారు. జనాభా లెక్కల సేకరణ సకాలంలో జరిగి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదంటున్నారు. కోవిడ్ దరిమిలా వీరిని కూడా ఆహార భద్రతా చట్టం కిందికి తేవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పైగా తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీపై ఇంకా కోత పడింది. పోషకాహార లోపం వల్ల భారత్ తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 4 శాతం నష్టపోతోంది. తిండికి, కండకు, మనిషికి; దేశాభివృద్ధిలో మనిషి పాత్రకు ఉన్న అన్యోన్యాన్ని ఆనాడే చెప్పిన గురజాడది ఎంత గొప్ప ముందుచూపు! దేశభక్తిని, దేశభుక్తితో మేళవించిన గురజాడ గీతం అంతర్జాతీయ గీతమే కాగలిగినదైనా రాష్ట్రీయ గీతం కూడా కాకపోవడం విషాదం కాదూ!? -
దేశభక్తి గీతాన్ని ఆలపించిన మమత!: వీడియో వైరల్
గురువారం 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని అన్ని చోట్ల చాలా ఘనంగా వేడుకలు జరిగాయి. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా చాలా వైభవంగా జరిగింది. ఐతే ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశభక్తి గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తెల్లటి కాటన్ చీరలో బెంగాల్ కవి ద్విజేంద్రలాల్ సరే రాసిన 'ధోనో ధన్నే పుష్పే భోరా' అనే పాటను ఇతర గాయకులతో కలిసి ఆలపించారు. ఈ పాట బెంగాల్లో ఉన్న వనరులను, అక్కడి వారసత్వాన్ని తెలియజేస్తుంది. మమత ఈ పాటను ఆలపించి తన దేశభక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన పశ్చిమబెంగాల్లో కోల్‌కతాలోని ప్రసిద్ధ దుర్గాపూజా ఢిల్లీలోని నిర్వహించిన కవాతులో ప్రదర్శించారు. ట్రాక్టర్ ముందు భాగంలో నారికేళంతో ఉన్న పూర్ణ కలశం దాని ముందు మాతృదేవతా ఆరాధన నమునా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ) -
ఇండియా@75: ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా
మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్న ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్ పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర మహిళా సభలోను, ఆరు గంటలకి ఆంధ్ర మహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు చేసిన స్వాతంత్య్ర రథం కార్యక్రమంలోను ఒకే రోజున అన్ని లైవ్‌లు పాడాను. ఊరంతా పండగలా అలంకరించారు. దేశమంతా వంద దీపావళులలాగ సంబరాలు చేసుకున్నారు. అలంకరించారు. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకారం అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్ క్రియేట్ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి; ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్ రిబ్బన్లు పొడవుగా కట్‌చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్కి కూడా బోర్డర్ వేసుకున్నాను. టైలర్ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్కూడా హిట్అయ్యింది. – కీ. శే. వింజమూరి అనసూయ, గాయని -
IDAY2022: ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి
పంద్రాగస్టు దేశానికి పెద్ద పండుగ. కుల, మత, జాతి, వర్గాలన్నీ కలిసి చేసుకునే సందర్భం. స్కూల్ పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరినీ.. ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్న కొన్ని దేశభక్తి సినీ గేయాలను ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేసుకుందాం. సగటు భారతీయుడి నరనరాలను కదలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేశాలు కొన్ని సినీ గేయాలు.. -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
దేశభక్తి గీతాలాపనలో రాజస్తాన్ విద్యార్థుల రికార్డు
జైపూర్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాజస్తాన్‌లోని కోటి మంది పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వందేమాతరం, సారే జహాసె అచ్చా తదితరాలను విద్యార్థులు 25 నిమిషాలపాటు ఆలపించారు. శుక్రవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన దేశభక్తి గీతాలాపన ప్రధాన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మాట్లాడారు. రికార్డు సాధనలో పాలుపంచుకున్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘కోటి మంది విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలను విని లండన్ నుంచి ప్రఖ్యాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు సర్టిఫికెట్ పంపడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
దేశమాతకు గళార్చన స్వతంత్ర గేయాలు
‘‘భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమేమందరం కలసి ఉంటె కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం...’’ హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ప్రసిద్ధ పాఠశాల. పేరు నాజర్ బాయ్స్ స్కూల్. దానికి ఎదురుగా ఓ అధునాతనమైన అపార్ట్మెంట్ లో దేశభక్తి గీతాలాపన జరుగుతుంటుంది. కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ పెద్దావిడ దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. ఆ పెద్దావిడ పేరు గుంటూరు ఈశ్వరమ్మ. పాట ఆగకూడదు! అరవై ఎనిమిదేళ్ల ఈశ్వరమ్మ కు మాటలతోపాటే పాటలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ల అమ్మ దమయంతికి పాటలు పాడడం ఇష్టం. ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలను ఆడిస్తూ పాటలు పాడుతూనే ఉండేవారామె. అలా మొదలైన ఈశ్వరమ్మ పాట నేటికీ అంతే శ్రావ్యంగా జాలువారుతూనే ఉంది. ఇంట్లో వేడుకలు ఈశ్వరమ్మ పాట లేనిదే సంపూర్ణతను సంతరించుకోవు. ఆమె స్కూలుకెళ్లే రోజుల నుంచి ఆగస్టు 15, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి... ఇలా ఏ వేడుక అయినా సరే ఈశ్వరమ్మ పాట తప్పకుండా ఉండేది. ఆమె పాడడంతోపాటు ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నారు కూడా. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాటలు పాడడానికి సిద్ధమవుతున్న పిల్లలకు ఆమె దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నారు. ‘‘నా దగ్గర ఉన్న పాటల్లో చాలా పాటలు బయట ఎక్కడా దొరకవు. అంతమంచి పాటలు నా దగ్గరే ఆగిపోతే ఎలాగ? పిల్లలకు నేర్పిస్తే మరొక తరం తయారవుతుంది. నా దగ్గర నేర్చుకున్న పిల్లల్లో ఏ నలుగురైనా దీక్షగా నేర్చుకుని మరింత మందికి నేర్పిస్తే నాకదే తృప్తి’’ అన్నారు ఈశ్వరమ్మ. పాటల పుటలు ఈశ్వరమ్మది నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ఆమె చిన్నప్పటి నుంచి ఆటగా పాటలు పాడుతుండడంతో పదేళ్లకే మాస్టార్ని పెట్టి సంగీతం నేర్పించారు. ‘‘మా మాస్టారి పేరు పెంటపాటి సర్వేశ్వరరావు. ఆయన గేయ రచయిత కూడా కావడంతో పాటలు సొంతంగా రాసి మాకు నేర్పించేవారు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నవి, నేను సేకరించినవి, మాస్టారు రాసిచ్చినవి అన్నీ కలిపి నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో పడి హార్మోనియం మీటడం మర్చిపోయాను. కానీ పాడడం మర్చిపోలేదు. నేను చదివింది ఎనిమిదవ తరగతి వరకే. కానీ మా వారు తెలుగు పండిట్ కావడంతో ఖాళీగా ఉన్నప్పుడు పద్యాలు పాడుకోవడం ఆయన అలవాటు. అలా నేనూ పద్యాలు నేర్చుకున్నాను. పాటలు, పద్యాలు పాడి పాటలు రాయడం వచ్చేసింది. పిల్లల ను ఉయ్యాలలో వేసేటప్పుడు సొంతంగా పాటలు రాసి పాడాను. సంక్రాంతి ముగ్గుల పాటలు, బతుకమ్మ పాటలు... మొత్తం 15 పాటలు రాశాను. జెండావందన గేయం మా మిర్యాలగూడలో జెండావందనానికి నాలుగు రోజుల ముందే నేను పాట పాడడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని కబురు చేసేవాళ్లు. హైదరాబాద్‌లో మా అబ్బాయి ఇంట్లో.. అపార్ట్మెంట్ జెండా ఆవిష్కరణలో దేశభక్తి గేయాలు పాడుతున్నాను. కరోనా వల్ల గతేడాది అపార్ట్మెంట్ లో ఉండే వాళ్లలో చాలామంది పతాకావిష్కరణకు రాలేదు. నేను వెళ్లి పాటలు పాడాను. కార్యవర్గ సభ్యులు నాతో గొంతు కలిపారు’’ అన్నారు ఈశ్వరమ్మ. అంతా నా బిడ్డలే! ఈ ఏడాది పిల్లలకు పాటలను జూమ్ సెషన్స్‌లో నేర్పిస్తున్నారామె. ‘‘దేశమాతను గౌరవిస్తూ పాట పాడడానికి పిల్లలు ముందుకు రావడమే గొప్ప సంతోషం. అలా ముందుకొచ్చిన పిల్లలందరూ నా మనుమళ్లు, మనుమరాళ్ల వంటి వాళ్లే’’ అంటున్న ఈశ్వరమ్మ భరతమాతకు ప్రతిరూపంగా కనిపించారు. – వాకా మంజులారెడ్డి -
75వ స్వాతంత్య్ర దినోత్సవం.. పాడవోయి భారతీయుడా
పాటకు పదిమందిని కూడగట్టే శక్తి ఉంది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’... పాటతోనే గాంధీజీ ప్రజలను ఒక చోటకు చేర్చారు. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’... వందేమాతర గేయం రేపిన స్వేచ్ఛాకాంక్ష సామాన్యం కాదు. ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితా హమారా’ లక్షలాది మంది ముక్తకంఠంతో గానం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాట యుద్ధభేరి. స్వాతంత్య్రం సిద్ధించాక అదే విజయనాదం. ఆ పాట కొనసాగింది. సినిమా ఆ స్ఫూర్తిని కొనసాగించింది. సినీ దేశభక్తి గేయం జాతిని ఉత్సాహపరుస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చింది. ఆసేతు హిమాచలం పులకరించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది మంది యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు... వీరందరినీ సమాయత్తపరిచిన నాయకులు... త్యాగాలు, బలిదానాలు, లాఠీదెబ్బలు, చెరసాలలు, ఉరికొయ్యలు... ఓహ్... ఒక గొప్ప పోరాటంతో భరతజాతి తనకు కావలసింది పొందింది. తెల్లవాళ్లు నిష్క్రమించారు. జనులెల్ల కొలుచువారు పాలనను అందుకున్నారు. ఇప్పుడు మన దేశాన్ని మనం కీర్తించుకోవాల్సిన సమయం. మన దేశాన్ని మనం స్తుతించుకోవాల్సిన సమయం. నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నేడే ఆనందం... ‘పాడవోయి భారతీయుడా... ఆడిపాడవోయి విజయగీతిక’ అని శ్రీశ్రీ ‘వెలుగు నీడలు’లో రాసి తెలుగువారిని ఉత్తేజపరిచారు. ఇప్పుడు మన పాలన మనం చేసుకుంటున్నాం కనుక శ్రీశ్రీయే ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా’ అని ‘రాముడు భీముడు’లో సామాన్యుణ్ణి రాజును చేసే భవిష్యత్తును కాంక్షించారు. ఆ సమయంలో సినిమావారికి బాధ్యత ఎలా ఉండేదంటే కథకు సంబంధం లేకపోయినా ఒక నృత్యప్రదర్శన పెట్టి స్టేజ్ మీద దేశభక్తి గీతాన్ని చిత్రించేవారు. ‘అందరి కోసం ఒక్కరు నిలిచి ఒక్కరి కోసం అందరూ నిలిచే’ విధంగా ఈ దేశం ఉండాలని హితబోధ చేసేవారు. హీరోలూ దేశం గొప్పతనాన్ని పాడుకోవడాన్ని ఒక ఆదర్శంగా భావించేవారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ‘సిపాయి చిన్నయ్య’లో అక్కినేని, ‘నేను నా దేశం పవిత్ర భారతదేశం’ అంటూ ‘నేను నా దేశం’లో రామకృష్ణ, ‘మన జన్మభూమి బంగారు భూమి’ అని ‘పాడిపంటలు’లో కృష్ణ, ‘జననీ జన్మభూమిశ్చ’ అంటూ ‘బొబ్బిలిపులి’లో ఎన్.టి.ఆర్... పాడుతూ దేశభక్తిని కలిగి ఉండటం ఒక ధీరోదాత్త లక్షణంగా చూపించారు. ఎన్.టి.ఆర్ తన చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’లో కూడా ‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’ అంటూ ఉర్రూతలూగించారు. భారతమాతకు జేజేలు అయితే పిల్లలే కదా భవిష్యత్ నిర్మాతలు. దేశభక్తి పాదుకొనాల్సింది వారిలోనే. దేశం కోసం పని చేయాలనే లక్ష్యం ఏర్పడాల్సింది వారికే. అందుకే తెలుగు సినిమా పిల్లల కోసం ప్రత్యేకం పాటలు చేసింది. ‘భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ అని ఆత్రేయ ‘బడిపంతులు’ కోసం, ‘భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ’ అని సీనియర్ సముద్రాల ‘దొంగరాముడు’లో ‘చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు... ఇది బాపూజీ పిలుపు’ అని ‘మేలుకొలుపు’లో సి.నారాయణ రెడ్డి పిల్లలు పాడుకునే పాటలు రాశారు. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ (గాంధీ పుట్టిన దేశం), ‘నీ సంఘం నీ ధర్మం మరువద్దు’ (కోడలు దిద్దిన కాపురం) పాటలు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇక ప్రయివేటు గేయాలుగా ఉన్న కృష్ణశాస్త్రి ‘జయజయహే ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి’ (రాక్షసుడు), శంకరంబాడి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ (బుల్లెట్, లీడర్), రాయప్రోలు సుబ్బారావు ‘శ్రీలు పొంగిన జీవగడ్డయి’ (లీడర్)... సినిమాల్లో కూడా వినిపించాయి. తెలుగువీర లేవరా దేశం అంటే మట్టి కాదు. మనుషులు. ఆ మనుషులు ప్రాదేశిక జాతులుగా కూడా తమను తాము కూడదీసుకోవాల్సిన సమయం అది. భరతజాతి, తెలుగుజాతి రెండూ వెలగాల్సిందే. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అని ‘తల్లా పెళ్లామా’లో సినారె రాశారు. నేడు ‘తెలుగుజాతి మనది రెండుగ వెలుగుజాతి మనది’ అని రెండు రాష్ట్రాల ప్రగతిని ఆశించేలా ఆ పాట మారింది. శ్రీశ్రీ ‘తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా’ అని ‘అల్లూరి సీతారామరాజు’లో ఉత్తేజం నింపుతారు. ‘కలసి పాడుదాం తెలుగుపాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అదే శ్రీశ్రీ ‘బలిపీఠం’లో వెలుగుబాటను చూపిస్తారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ రాయప్రోలు గీతాన్ని పల్లవిగా తీసుకొని ‘అమెరికా అబ్బాయి’ లో సినారె తెలుగువారు నిలబెట్టుకోవాల్సిన నిండు గౌరవం గురించి మాట్లాడారు. తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అయితే స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే తెల్ల పాలకులకు తీసి పోని రీతిలో మన పాలకులు కూడా తయారయ్యారన్న ఆశాభంగం ప్రజలకు కలిగింది. సినిమా ఆ నిరసనను పట్టుకుంది. ‘గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది’ (పవిత్ర బంధం), ‘భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను’ (నేటి భారతం), ‘వందేమాతర గీతం వరస మారుతున్నది’ (వందే మాతరం)..లాంటి పాటలు వచ్చాయి. కుర్రాళ్లు ‘సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్’ అని నిరుద్యోగ దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజులను చూపాయి. చివరకు ‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది’ అని విప్లవ మార్గాన్ని ఎంచుకునే వరకూ తీసుకెళ్లాయి. వినరా వినరా దేశం మనదేరా అయితే ఆ రోజులను దేశం దాట గలిగింది. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిలో సాగింది. విద్య, ఉపాధి, అన్ని వర్గాల వారికి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగింది. లోపాలు, కొరతలు ఎన్ని ఉన్నా ఇది మన దేశం. దీని తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగాలనే సంకల్పం కొత్తతరంలో ఏర్పడింది. ‘దేశమ్ము మారిందిరోయ్... కాలమ్ము మారిందిరోయ్’ అని గతంలో కవి రాస్తే ‘ఏ మేరా జహా ఏ మేరా ఆషియా’ అని ఇప్పటి కవి రాశాడు. కొత్తతరం దర్శకులు, నిర్మాతలు కూడా దేశభక్తి గీతాలను సినిమాల్లో కొనసాగిస్తూనే వచ్చారు. ‘దేశం మనదే తేజం మనదే’ (జై), ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్’ (ఖడ్గం), ‘ఈ జెండా పసిబోసి నవ్వురా’ (బాబీ), ‘వందేమాతరం గాంధీ ఓంకారం’ (శంకర్‌దాదా జిందాబాద్), ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ (పరదేశి), ‘దేశమంటే మట్టికాదోయ్’ (ఝుమ్మంది నాదం).... ఇలా ఎన్నో పాటలు ఆగస్టు 15 వచ్చిన ప్రతిసారీ చౌరాస్తాలో మార్మోగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. తెలుగు సినిమా మరి కొన్నేళ్లలో 100 ఏళ్ల వయసుకు చేరనుంది. స్వాతంత్య్రం కంటే సీనియర్ అయిన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీగా దేశ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటూనే దేశాన్ని, యువతను ఉత్తేజపరిచే సినిమాలను, గీతాలను అందిస్తూనే ఉంటుందని, ఉండాలని కోరుకుందాం. ఎక్కువమందికి తెలియని పేరు కనక్లత బారువా. అస్సాంకు చెందిన ఈ స్వాతంత్య్ర సమరయోధురాలిని ‘బీర్బలా’ (గుండెధైర్యం ఉన్న మహిళ) అని పిలుచుకునేవారు. పదిహేడు సంవత్సరాల వయసులో పోలీసు కాల్పుల్లో మరణించింది. ఆమె మరణం అస్సాంను అట్టుడికించింది. బారువా పై 2017లో ‘పూరబ్ కి అవాజ్’ అని హిందీలో ఒక సినిమా వచ్చింది. బాలీవుడ్ హీరో మనోజ్‌కుమార్ షాహీద్ (1965) సినిమా క్లాసిక్. ఈ సినిమా తీయడానికి ముందు మనోజ్‌కుమార్ నిర్మాత కెవల్ కశ్యప్‌తో కలిసి చండీఘడ్‌లోని ఒక ఆస్పత్రిలో ఉన్న భగత్‌సింగ్ తల్లి విద్యావతిని కలుసుకున్నాడు. మనోజ్ కుమార్‌ను ఆమె పరిశీలించడం ప్రారంభించింది. ‘ఒప్పుకుంటారో లేదో’ అనే సందేహం మనోజ్‌కుమార్‌కు కలిగింది. విద్యావతి నిర్మాత కశ్యప్‌ను దగ్గరకు పిలిచి ‘ఈయన మా అబ్బాయిలాగే ఉన్నాడు’ అని మనోజ్‌కుమార్‌ను ఉద్దేశించి చెప్పింది. బెంగాలి నాటకరంగ దిగ్గజం గిరిష్చంద్రఘోష్ చారిత్రక నేపథ్యం ఉన్న నాటకాలు రాసేవారు. అయితే అవి పేరుకు చారిత్రక నాటకాలే అయినప్పటికీ అంతర్లీనంగా వాటిలో బ్రిటీష్ వారి దుర్మార్గాలను చీల్చిచెండాడే పదునైన డైలాగులు ఉండేవి. గిరీష్ రాసిన ‘సిరాజ్–వుద్–దౌలా’ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1945లో వచ్చిన హిందీ సినిమా ‘హమ్రహీ’ లో ‘జనగణమన’ కోరస్సాంగ్గా వినిపిస్తుంది. బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాయ్‌చంద్ బరోల్ సంగీతం సమకూర్చారు. పట్నా(బిహార్)లో షాహీద్ పీర్ అలీ ఖాన్ పార్క్ చాలా ఫేమస్. ఎవరీ పీర్ అలీ? సామాన్య బుక్‌బైండర్ అయిన పీర్ అలీ కరపత్రాలు పంచడం, కోడ్ మెసేజ్‌లు ఇవ్వడంలాంటి పనులతో స్వాతంత్య్ర సమరయోధులకు సహాయపడేవాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పీర్ ఆలిఖాన్ను బ్రిటిష్‌వారు బహిరంగంగా ఉరి తీశారు. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భావజాల ప్రచారం లో అండర్‌గ్రౌండ్ కాంగ్రెస్ రేడియో బలమైన పాత్ర నిర్వహించింది. బ్రిటీష్ కంట్రోల్డ్ ఏఐఆర్‌కు కౌంటర్‌గా వచ్చిన ఈ రేడియోను 22 సంవత్సరాల ఉషా మెహతా నిర్వహించేవారు. ‘ఆజాద్’గా ప్రసిద్ధుడైన చంద్రశేఖర్ తివారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. అప్పుడు అతని వయసు 15 సంవత్సరాలు. ‘నీ పేరు ఏమిటి?’ అని జడ్జి అడిగితే ‘ఆజాద్’ అని; ‘తండ్రి పేరు ఏమిటి?’ అని అడిగితే ‘స్వతంత్రత’ అని చెప్పాడు. -
సల్మాన్ నోట దేశభక్తి పాట.. వైరల్
భారత దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ కళకారులు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ దేశ భక్తి పాట పాడి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రముఖ నిర్మాత అతుల్ అగ్నిహోత్రి ఈ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అయింది. ఈ వీడియోలో సల్మాన్ ‘సారే జహాసే అచ్చా’అనే గీతాన్ని ఆలపించారు. విడియో చివరల్లో సల్మాన్ రెండు చేతులు జోడించి అందరికి నమస్కారం తెలియజేస్తాడు. అనంతరం మువ్వెన్నల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (చదవండి : స్వాతంత్య్ర దినోత్సవం: ప్రముఖుల విషెస్) కాగా, డౌన్ మొదలైన నాటి నుంచి తన పాన్వెల్ ఫార్మ్ హౌస్ దాటి రాని సల్మాన్ ఖాన్, అక్కడి నుంచే అని పనులూ చెక్కబెట్టేస్తున్న వైనం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఆయన కొన్ని పాటలను విడుదల చేసి అభిమానులను అలరించాడు. ‘ప్యార్ కరోనా’,‘తెరే బినా’పాటలతో పాటు ‘భాయ్ భాయ్’అంటూ జాతి సమైక్యతకు చిహ్నంగా నిలిచే ర్యాప్ సాంగ్ పాడి అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. (చదవండి : నేను హీరోను కాదు.. కేవలం: సోనూ సూద్) గతంలో కూడా సల్మాన్ ఖాన్ పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. మై హూ హీరో తెరా, హ్యాంగోవర్ చిత్రాల కోసం పాడారు. దబంగ్3, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల్లోని జగ్ ఘూమ్ గయా, బేబీ ఖో బేస్ పసంద్ హై, యూ కుర్కే పాటలకు వాయిస్ కూడా అందించారు. -
వింజమూరి అనసూయాదేవి కన్నుమూత
సాక్షి, అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) వయోభారంతో అమెరికాలోని హ్యూస్టన్‌లో ఆదివారం కన్నుమూశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత‘ పాటకు బాణీ కట్టింది అనసూయనే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920లో మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడం, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. హార్మోనియం వాయించడంలోనూ ఆమెకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ అనే బిరుదును, గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సన్మానించింది. అనసూయాదేవి అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పారిస్‌లోనూ అనసూయాదేవికి ‘క్వీన్ ఆఫ్ ఫోక్’అనే బిరుదును ప్రదానం చేశారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. జానపద సంగీతంపై ఆమె ఏడు పుస్తకాలను రచించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్ అయ్యింది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ, సుభాస్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో అనుసూయాదేవి దేశభక్తి గీతాలు పాడారు. ఆమెకు ఐదుగురు సంతానం. అనసూయాదేవి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి సేవ చేశారని చంద్రబాబు కొనియాడారు. అనసూయదేవి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి(99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వింజమూరి అనసూయాదేవి మృతికి జగన్ సంతాపం ప్రఖ్యాత తెలుగు గాయని డాక్టర్ వింజమూరి అనసూయాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. విషాదంలో ఉన్న అనసూయాదేవి కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సంథింగ్ స్పెషల్
శ్రీ విద్యాస్ సెంటర్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్, రక్ష ఫౌండేషన్లు నిర్వహించిన ‘ఆపేక్ష 2015’ అబ్బురపరిచింది. ఇందులో బుద్ధిమాంద్యం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కదంబాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతానికి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయకులు వినోద్‌బాబు, సురేఖామూర్తి, నిత్యసంతోషిణి సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఆంధ్రాబ్యాంక్ జీఎం కృష్ణప్రసాద్ లక్ష రూపాయల చొప్పున... పెన్షనర్ వి.దామోదర్ పది వేల రూపాయలు బుద్ధిమాంద్యం పిల్లల సహాయార్థం అందించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శ్రీ విద్యాస్ ఈడీ శాంతి వెంకట్ పాల్గొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
లక్ష గొంతుల దేశభక్తి గానం
ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఒకే సారి లక్ష మంది కలిసి గానం చేయనున్నారు. అది కూడా ఏదో మామూలు పాట కాదు. పలువురు సైనికులకు స్ఫూర్తినిచ్చేలా, సామాన్యులలో కూడా దేశభక్తి పురిగొల్పేలా చేసిన 'ఏ మేరే వతన్‌కే లోగో' పాట. జనవరి 27వ తేదీన ఈ పాట స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని లక్షమందితో ముంబై మహానగరంలో ఈ పాట పాడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్సులో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని షహీద్ గౌరవ్ సమితి (ఎస్జీఎస్) నిర్వహించనుంది. తొలిసారిగా 1963 జనవరి 27వ తేదీన ఈ పాట పాడిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత చైనా యుద్ధంలో అమరులైన సైనికుల గౌరవార్థం ఈ పాట అప్పట్లో పాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ సందర్భంగా లతా మంగేష్కర్తో పాటు ఇతర యుద్ధవీరులు, వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తారని ఎస్జీఎస్ అధికార ప్రతినిధి వైభవ్ లోధా తెలిపారు. దాదాపు వంద మంది పరమ వీర చక్ర, మహావీర చక్ర, ఇతర సాహస అవార్డులు పొందినవారు, అమరుల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.