75వ స్వాతంత్య్ర దినోత్సవం.. పాడవోయి భారతీయుడా | Freedom movement in patriotic songs in movie industry | Sakshi
Sakshi News home page

75వ స్వాతంత్య్ర దినోత్సవం.. పాడవోయి భారతీయుడా

Published Sun, Aug 15 2021 1:00 AM | Last Updated on Sun, Aug 15 2021 1:00 AM

Freedom movement in patriotic songs in movie industry - Sakshi

పాటకు పదిమందిని కూడగట్టే శక్తి ఉంది. ‘రఘుపతి రాఘవ రాజారామ్‌’... పాటతోనే గాంధీజీ ప్రజలను ఒక చోటకు చేర్చారు. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’... వందేమాతర గేయం రేపిన స్వేచ్ఛాకాంక్ష సామాన్యం కాదు. ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితా హమారా’ లక్షలాది మంది ముక్తకంఠంతో గానం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాట యుద్ధభేరి. స్వాతంత్య్రం సిద్ధించాక అదే విజయనాదం. ఆ పాట కొనసాగింది. సినిమా ఆ స్ఫూర్తిని కొనసాగించింది. సినీ దేశభక్తి గేయం జాతిని ఉత్సాహపరుస్తూనే ఉంది.

స్వాతంత్య్రం వచ్చింది. ఆసేతు హిమాచలం పులకరించింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది మంది యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు... వీరందరినీ సమాయత్తపరిచిన నాయకులు... త్యాగాలు, బలిదానాలు, లాఠీదెబ్బలు, చెరసాలలు, ఉరికొయ్యలు... ఓహ్‌... ఒక గొప్ప పోరాటంతో భరతజాతి తనకు కావలసింది పొందింది. తెల్లవాళ్లు నిష్క్రమించారు. జనులెల్ల కొలుచువారు పాలనను అందుకున్నారు. ఇప్పుడు మన దేశాన్ని మనం కీర్తించుకోవాల్సిన సమయం. మన దేశాన్ని మనం స్తుతించుకోవాల్సిన సమయం.
నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం

నేడే నవోదయం నేడే ఆనందం...
‘పాడవోయి భారతీయుడా... ఆడిపాడవోయి విజయగీతిక’ అని శ్రీశ్రీ ‘వెలుగు నీడలు’లో రాసి తెలుగువారిని ఉత్తేజపరిచారు. ఇప్పుడు మన పాలన మనం చేసుకుంటున్నాం కనుక శ్రీశ్రీయే ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా’ అని ‘రాముడు భీముడు’లో సామాన్యుణ్ణి రాజును చేసే భవిష్యత్తును కాంక్షించారు. ఆ సమయంలో సినిమావారికి బాధ్యత ఎలా ఉండేదంటే కథకు సంబంధం లేకపోయినా ఒక నృత్యప్రదర్శన పెట్టి స్టేజ్‌ మీద దేశభక్తి గీతాన్ని చిత్రించేవారు. ‘అందరి కోసం ఒక్కరు నిలిచి ఒక్కరి కోసం అందరూ నిలిచే’ విధంగా ఈ దేశం ఉండాలని హితబోధ చేసేవారు. హీరోలూ దేశం గొప్పతనాన్ని పాడుకోవడాన్ని ఒక ఆదర్శంగా భావించేవారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ‘సిపాయి చిన్నయ్య’లో అక్కినేని, ‘నేను నా దేశం పవిత్ర భారతదేశం’ అంటూ ‘నేను నా దేశం’లో రామకృష్ణ, ‘మన జన్మభూమి బంగారు భూమి’ అని ‘పాడిపంటలు’లో కృష్ణ, ‘జననీ జన్మభూమిశ్చ’ అంటూ ‘బొబ్బిలిపులి’లో ఎన్‌.టి.ఆర్‌... పాడుతూ దేశభక్తిని కలిగి ఉండటం ఒక ధీరోదాత్త లక్షణంగా చూపించారు. ఎన్‌.టి.ఆర్‌ తన చివరి సినిమా ‘మేజర్‌ చంద్రకాంత్‌’లో కూడా ‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’ అంటూ ఉర్రూతలూగించారు.

భారతమాతకు జేజేలు
అయితే పిల్లలే కదా భవిష్యత్‌ నిర్మాతలు. దేశభక్తి పాదుకొనాల్సింది వారిలోనే. దేశం కోసం పని చేయాలనే లక్ష్యం ఏర్పడాల్సింది వారికే. అందుకే తెలుగు సినిమా పిల్లల కోసం ప్రత్యేకం పాటలు చేసింది. ‘భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ అని ఆత్రేయ ‘బడిపంతులు’ కోసం, ‘భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ’ అని సీనియర్‌ సముద్రాల ‘దొంగరాముడు’లో ‘చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు... ఇది బాపూజీ పిలుపు’ అని ‘మేలుకొలుపు’లో సి.నారాయణ రెడ్డి పిల్లలు పాడుకునే పాటలు రాశారు. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ (గాంధీ పుట్టిన దేశం), ‘నీ సంఘం నీ ధర్మం మరువద్దు’ (కోడలు దిద్దిన కాపురం) పాటలు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇక ప్రయివేటు గేయాలుగా ఉన్న కృష్ణశాస్త్రి ‘జయజయహే ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి’ (రాక్షసుడు), శంకరంబాడి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ (బుల్లెట్, లీడర్‌), రాయప్రోలు సుబ్బారావు ‘శ్రీలు పొంగిన జీవగడ్డయి’ (లీడర్‌)... సినిమాల్లో కూడా వినిపించాయి.

తెలుగువీర లేవరా
దేశం అంటే మట్టి కాదు. మనుషులు. ఆ మనుషులు ప్రాదేశిక జాతులుగా కూడా తమను తాము కూడదీసుకోవాల్సిన సమయం అది. భరతజాతి, తెలుగుజాతి రెండూ వెలగాల్సిందే. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అని ‘తల్లా పెళ్లామా’లో సినారె రాశారు. నేడు ‘తెలుగుజాతి మనది రెండుగ వెలుగుజాతి మనది’ అని రెండు రాష్ట్రాల ప్రగతిని ఆశించేలా ఆ పాట మారింది. శ్రీశ్రీ ‘తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా’ అని ‘అల్లూరి సీతారామరాజు’లో ఉత్తేజం నింపుతారు. ‘కలసి పాడుదాం తెలుగుపాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అదే శ్రీశ్రీ ‘బలిపీఠం’లో వెలుగుబాటను చూపిస్తారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ రాయప్రోలు గీతాన్ని పల్లవిగా తీసుకొని ‘అమెరికా అబ్బాయి’ లో సినారె తెలుగువారు నిలబెట్టుకోవాల్సిన నిండు గౌరవం గురించి మాట్లాడారు.

తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
అయితే స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే తెల్ల పాలకులకు తీసి పోని రీతిలో మన పాలకులు కూడా తయారయ్యారన్న ఆశాభంగం ప్రజలకు కలిగింది. సినిమా ఆ నిరసనను పట్టుకుంది. ‘గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది’ (పవిత్ర బంధం), ‘భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను’ (నేటి భారతం), ‘వందేమాతర గీతం వరస మారుతున్నది’ (వందే మాతరం)..లాంటి పాటలు వచ్చాయి. కుర్రాళ్లు ‘సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్‌’ అని నిరుద్యోగ దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజులను చూపాయి. చివరకు ‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది’ అని విప్లవ మార్గాన్ని ఎంచుకునే వరకూ తీసుకెళ్లాయి.

వినరా వినరా దేశం మనదేరా
అయితే ఆ రోజులను దేశం దాట గలిగింది. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిలో సాగింది. విద్య, ఉపాధి, అన్ని వర్గాల వారికి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగింది. లోపాలు, కొరతలు ఎన్ని ఉన్నా ఇది మన దేశం. దీని తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగాలనే సంకల్పం కొత్తతరంలో ఏర్పడింది. ‘దేశమ్ము మారిందిరోయ్‌... కాలమ్ము మారిందిరోయ్‌’ అని గతంలో కవి రాస్తే ‘ఏ మేరా జహా ఏ మేరా ఆషియా’ అని ఇప్పటి కవి రాశాడు. కొత్తతరం దర్శకులు, నిర్మాతలు కూడా దేశభక్తి గీతాలను సినిమాల్లో కొనసాగిస్తూనే వచ్చారు. ‘దేశం మనదే తేజం మనదే’ (జై), ‘మేమే ఇండియన్స్‌ మేమే ఇండియన్స్‌’ (ఖడ్గం), ‘ఈ జెండా పసిబోసి నవ్వురా’ (బాబీ), ‘వందేమాతరం గాంధీ ఓంకారం’ (శంకర్‌దాదా జిందాబాద్‌), ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ (పరదేశి), ‘దేశమంటే మట్టికాదోయ్‌’ (ఝుమ్మంది నాదం).... ఇలా ఎన్నో పాటలు ఆగస్టు 15 వచ్చిన ప్రతిసారీ చౌరాస్తాలో మార్మోగుతున్నాయి.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. తెలుగు సినిమా మరి కొన్నేళ్లలో 100 ఏళ్ల వయసుకు చేరనుంది. స్వాతంత్య్రం కంటే సీనియర్‌ అయిన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీగా దేశ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటూనే దేశాన్ని, యువతను ఉత్తేజపరిచే సినిమాలను, గీతాలను అందిస్తూనే ఉంటుందని, ఉండాలని కోరుకుందాం.

ఎక్కువమందికి తెలియని పేరు కనక్‌లత బారువా. అస్సాంకు చెందిన ఈ స్వాతంత్య్ర సమరయోధురాలిని ‘బీర్బలా’ (గుండెధైర్యం ఉన్న మహిళ) అని పిలుచుకునేవారు. పదిహేడు సంవత్సరాల వయసులో పోలీసు కాల్పుల్లో మరణించింది. ఆమె మరణం అస్సాంను అట్టుడికించింది. బారువా పై 2017లో ‘పూరబ్‌ కి అవాజ్‌’ అని హిందీలో ఒక సినిమా వచ్చింది.

బాలీవుడ్‌ హీరో మనోజ్‌కుమార్‌ షాహీద్‌ (1965) సినిమా  క్లాసిక్‌. ఈ సినిమా తీయడానికి ముందు మనోజ్‌కుమార్‌ నిర్మాత కెవల్‌ కశ్యప్‌తో కలిసి చండీఘడ్‌లోని ఒక ఆస్పత్రిలో ఉన్న భగత్‌సింగ్‌ తల్లి విద్యావతిని కలుసుకున్నాడు. మనోజ్‌ కుమార్‌ను ఆమె పరిశీలించడం ప్రారంభించింది. ‘ఒప్పుకుంటారో లేదో’ అనే సందేహం మనోజ్‌కుమార్‌కు కలిగింది. విద్యావతి నిర్మాత కశ్యప్‌ను దగ్గరకు పిలిచి ‘ఈయన మా అబ్బాయిలాగే ఉన్నాడు’ అని మనోజ్‌కుమార్‌ను ఉద్దేశించి  చెప్పింది.

బెంగాలి నాటకరంగ దిగ్గజం గిరిష్‌చంద్రఘోష్‌  చారిత్రక నేపథ్యం ఉన్న నాటకాలు రాసేవారు. అయితే అవి పేరుకు చారిత్రక నాటకాలే అయినప్పటికీ అంతర్లీనంగా వాటిలో బ్రిటీష్‌ వారి దుర్మార్గాలను చీల్చిచెండాడే పదునైన డైలాగులు ఉండేవి. గిరీష్‌ రాసిన ‘సిరాజ్‌–వుద్‌–దౌలా’ నాటకాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.
1945లో వచ్చిన హిందీ సినిమా ‘హమ్‌రహీ’ లో ‘జనగణమన’ కోరస్‌సాంగ్‌గా వినిపిస్తుంది. బిమల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు  రాయ్‌చంద్‌ బరోల్‌ సంగీతం సమకూర్చారు.

పట్నా(బిహార్‌)లో షాహీద్‌ పీర్‌ అలీ ఖాన్‌ పార్క్‌ చాలా ఫేమస్‌. ఎవరీ పీర్‌ అలీ? సామాన్య బుక్‌బైండర్‌ అయిన పీర్‌ అలీ కరపత్రాలు పంచడం, కోడ్‌ మెసేజ్‌లు ఇవ్వడంలాంటి

పనులతో స్వాతంత్య్ర సమరయోధులకు సహాయపడేవాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పీర్‌ ఆలిఖాన్‌ను బ్రిటిష్‌వారు బహిరంగంగా ఉరి తీశారు.
స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భావజాల ప్రచారం లో అండర్‌గ్రౌండ్‌ కాంగ్రెస్‌ రేడియో బలమైన పాత్ర నిర్వహించింది. బ్రిటీష్‌ కంట్రోల్డ్‌ ఏఐఆర్‌కు కౌంటర్‌గా వచ్చిన ఈ రేడియోను 22 సంవత్సరాల ఉషా మెహతా నిర్వహించేవారు.

‘ఆజాద్‌’గా ప్రసిద్ధుడైన చంద్రశేఖర్‌ తివారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్‌ అయ్యాడు. అప్పుడు అతని వయసు 15 సంవత్సరాలు.
 ‘నీ పేరు ఏమిటి?’ అని జడ్జి అడిగితే ‘ఆజాద్‌’ అని; ‘తండ్రి పేరు ఏమిటి?’ అని అడిగితే ‘స్వతంత్రత’ అని చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement