
సినిమా పాటల హక్కులు ఎవరివి అనే వివాదం చాలాకాలంగా చిత్ర పరిశ్రమలో నడుస్తోంది. సంగీతదర్శకుడు ఇళయరాజా ‘నా పాటపై హక్కు నాదే’ అంటుంటారు. కొందరు గాయనీగాయకులు తమకు రాయల్టీ రావాలంటున్నారు. కొందరైతే నిర్మాతలకే హక్కు అంటున్నారు. ఈ విషయంపై చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్ సహకారంతో క్రియాలా, ఐపీ అండ్ మ్యూజిక్ సంస్థలు శనివారం చెన్నైలో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో నిర్మాత ధనుంజయన్, థింక్ మ్యూజిక్ ఇండియా సంతోష్, గాయకుడు హరిచరణ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా సినిమా పాటలు అనేక మాధ్యమాల ద్వారా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. అసలు వీటి హక్కులు ఎవరికి చెందుతాయి? అనే విషయం గురించి క్రియాలా సంస్థ నిర్వాహకుడు, న్యాయవాది ఎంఎస్. భరత్ మీడియా సమావేశంలో వివరిస్తూ... ఒక పాట రూపొందాలంటే సంగీత దర్ళకుడు, గీత రచయిత, గాయకుడు, సౌండ్ ఇంజినీర్.. ఇలా పలువురి కృషి ఉంటుందన్నారు. అయితే వీటన్నింటికీ మూలం నిర్మాత అనీ, ఆయన పెట్టుబడితోనే పాట రూపొందుతోందనీ, పాటలకు మొదటి హక్కుదారుడు నిర్మాతనే అని అన్నారు. ఒకవేళ ఒప్పందం ఉంటే, అందులోని నిబంధనల ప్రకారం హక్కులు వర్తిస్తాయన్నారు. ఎలాంటి ఒప్పందం లేకపోతే పాటల హక్కులు నిర్మాతకే ఉంటాయన్నారు. ఒకవేళ చిత్ర నిర్మాత కన్నుమూస్తే, ఆయన కుటుంబ సభ్యులకే హక్కులు చెందుతాయని భరత్ పేర్కొన్నారు.
– ‘సాక్షి’ చెన్నై, తమిళ సినిమా