లక్ష గొంతుల దేశభక్తి గానం
ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఒకే సారి లక్ష మంది కలిసి గానం చేయనున్నారు. అది కూడా ఏదో మామూలు పాట కాదు. పలువురు సైనికులకు స్ఫూర్తినిచ్చేలా, సామాన్యులలో కూడా దేశభక్తి పురిగొల్పేలా చేసిన 'ఏ మేరే వతన్కే లోగో' పాట. జనవరి 27వ తేదీన ఈ పాట స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని లక్షమందితో ముంబై మహానగరంలో ఈ పాట పాడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్సులో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని షహీద్ గౌరవ్ సమితి (ఎస్జీఎస్) నిర్వహించనుంది.
తొలిసారిగా 1963 జనవరి 27వ తేదీన ఈ పాట పాడిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత చైనా యుద్ధంలో అమరులైన సైనికుల గౌరవార్థం ఈ పాట అప్పట్లో పాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ సందర్భంగా లతా మంగేష్కర్తో పాటు ఇతర యుద్ధవీరులు, వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తారని ఎస్జీఎస్ అధికార ప్రతినిధి వైభవ్ లోధా తెలిపారు. దాదాపు వంద మంది పరమ వీర చక్ర, మహావీర చక్ర, ఇతర సాహస అవార్డులు పొందినవారు, అమరుల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.