స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడుతున్న సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈనెల 15న ఖమ్మం వస్తున్న నేపథ్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, జిల్లా నేతలతో కలిసి శుక్రవారం ఆయన ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, పక్కనే ఉన్న ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ మైదానాలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షా మొదటిసారి ఖమ్మంలో పర్యటిస్తుండటంతో జనం పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని, అందుకే సువిశాల ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ మైదానాన్ని ఎంపిక చేశామని చెప్పారు. సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలో పిల్లలతో బండి సంజయ్ సరదగా ఫుట్‌బాల్ ఆడారు. స్టేడియం పక్కనే ఉన్న కేఫ్‌లో కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు.
బీజేపీ సింగిల్‌గా పోటీ చేస్తుంది..
అంతకుముందు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నేతలతో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కమ్యూనిస్టులను కేసీఆర్ విమర్శించినా.. వారు మాత్రం బీఆర్‌ఎస్ పంచనే చేరుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేస్తుందని, అందరూ కష్టపడి పనిచేసి కాషాయ రాజ్య స్థాపనకు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో పార్టీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎం.ధర్మారావు, కొండేటి శ్రీధర్, కుంజా సత్యవతి, నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, సినీనటి కవిత, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు చిన్ని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment