gurajada
-
‘మీగడ’కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం
విజయనగరం టౌన్: ప్రముఖ సాహితీవేత్త, నటుడు, దర్శకుడు, 28 నంది బహుమతులు అందుకున్న డాక్టర్ మీగడ రామలింగస్వావిుకి మహాకవి గురజాడ విశిష్ట పురస్కారాన్ని విజయనగరం ఆనందగజపతి కళాక్షేత్రంలో శనివారం ప్రదానం చేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ పురస్కారాన్ని అందించారు. పురస్కార గ్రహీత మీగడ మాట్లాడుతూ దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందినప్పటికీ గురజాడ విశిష్ట పురస్కారం ఎప్పుడు వరిస్తుందా? అని ఎదురుచూశానన్నారు.మహాకవిని స్మరిస్తూ ఆయన రచనలను వర్ణించారు. ఎన్.వి.రమణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు జరగలేదని, అమరావతిలో తెలుగు భాషా సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. మీగడ రామలింగస్వామిని ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, సాయి ఫౌండేషన్ తరఫున డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి రూ.30వేల బహుమతి అందజేశారు. సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఎ.గోపాలరావు, తదితరులు ముఖ్యఅతిథి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులను సత్కరించారు. -
దేశ‘భుక్తి’ గేయం
ఎప్పటి గురజాడ! ఎప్పటి దేశభక్తి గీతం! నూటపాతికేళ్ళ క్రితం నాటి ఆ గీతం ఇన్ని కోట్ల తెలుగుప్రజల పెదాలపై ఎన్ని కోట్ల సార్లు నర్తించి ఉంటుంది! ‘దేశమును ప్రేమించుమన్నా’ అని చెప్పే ఆ గీతం నిత్యస్మరణనే కాదు, నిరంతరాచరణను ఉద్బోధించడం లేదా? అది కాలభేదాలను దాటి నూతనత్వాన్ని తెచ్చుకునే సముజ్వలపాఠం కాదా? దాని సారమూ, సందేశమూ జాతి జనులలో ఇప్పటికైనా ఇంకాయా? మనదేశం లాంటి జనతంత్ర వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికాది అన్ని రంగాలకూ ఎప్పటికీ దిశానిర్దేశం చేసే మహిమాన్విత మంత్రం ఆ గీతం! అరవై అయిదు పంక్తుల ఆ గీతంలో మనకు ఎంత చటుక్కున గుర్తొస్తాయో, అంతే అలవోకగా మరచిపోయే పంక్తులు రెండే; అవి, ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’! ఆ కవితాహారంలో అవే మణిపూసలైన మహావాక్యాలు. దేశాన్ని మట్టిగానూ, భూభాగంగానూ చూడడమే పరిపాటి కాగా, మనుషులుగా గుర్తించిన గురజాడ తన కాలానికి ఎన్నో మన్వంతరాలు ముందున్నాడు. దేశమంటే మనుషులని ఎలుగెత్తి చాటడంలో వేల సంవత్సరాల వెనక్కీ వెళ్లగలిగిన విలక్షణ క్రాంతదర్శి ఆయన. దేశమూ, రాజ్యమూ అనే భావనే అంకురించని గణసమాజంలో అస్తిత్వానికి మనిషే మణిదీపమూ, కొలమానమూనూ... గురజాడ గీతోపదేశానికి పూర్తి వ్యతిరేకదిశలో నేటి మన ప్రజాస్వామికగమనం సాగుతున్న వైనాన్ని ఆ గీతంలోని ప్రతి చరణమూ ఛెళ్ళున చరచి చెబుతుంది. వొట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టమంటాడాయన. మంచి గతమున కొంచెమే, మందగించక ముందుకడుగేయమంటాడు. వ్యర్థకలహం వద్దనీ, కత్తి వైరం కాల్చమనీ హితవు చెబుతాడు. దేశాభిమానపు గొప్పలు మానేసి జనానికి నికరంగా పనికొచ్చేది చేసి చూపమంటాడు. దేశస్థులంతా చెట్టపట్టాలు వేసుకు నడవాలనీ, అన్ని జాతులూ, మతాలూ అన్నదమ్ముల్లా మెలగాలనీ సందేశిస్తాడు. మతం వేరైనా మనసులొకటై మనుషులుండాలంటాడు. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తాలనీ, ఆ చెట్టు మూలం నరుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలనీ స్వప్నిస్తాడు... మరో రెండురోజుల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న భారత జనతంత్ర ప్రస్థానం గురజాడ చూపిన జాడకు ఏ కొంచెమైనా దగ్గరగా ఉందా? వొట్టి మాటల వరదలో గట్టి మేలు గడ్డిపరక అయింది. మంచి అంతా గతంలోనే ఉందని చెప్పి జనాన్ని వెనకడుగు పట్టించడమే రాజకీయమైంది. దేశం వ్యర్థకలహాలు, కత్తివైరాలతో సంకుల సమరాంగణమైంది. జనాన్ని చీల్చి పాలించడమే అధికార పరమపదానికి సోపానమైంది. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తడం లేదు; వైర, విద్వేషాల విరితావులు వీస్తోంది. ఆ చెట్టు మూలం మనుషుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలన్న కవి ఆశాభావం, ఇప్పటికీ గట్టిగా వేటుపడని నిరుద్యోగపు జడలమర్రి కింద నిలువునా సమాధి అయే ఉంది. దేశమంటే మనుషులనే కాదు, ఆ మనుషులకు ఏది అత్యవసరమో గురజాడ ఉద్ఘాటిస్తాడు. తిండి కలిగితె కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయని, మనిషిని నిర్వచిస్తాడు; ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుందంటాడు; మనిషి సంపూర్ణ జవసత్త్వాలతో హుందాగా శిరసెత్తుకు జీవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామి అవడానికీ, తిండిపుష్టికీ ఉన్న అన్యోన్య సంబంధాన్ని ఆనాడే నొక్కిచెబుతాడు. అటువంటిది, యావత్ప్రజలకూ పుష్టికరమైన ఆహారాన్ని సమకూర్చే లక్ష్యానికి ఇప్పటికీ యోజనాల దూరంలోనే ఉన్నాం. పోషకాహార లోపంతో ఉసూరుమంటున్న ప్రపంచ బాలల్లో 50 శాతం భారత్‌లోనే ఉన్నారనీ, కేవలం పదిశాతం మందికే పోషకాహారం అందుతోందనీ గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, అయిదేళ్ళ లోపు వయసు పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల లోపించినవారు 35 శాతానికి పైగా, బలహీనులు దాదాపు 20 శాతమూ ఉన్నారు. రక్తహీనతను ఎదుర్కొంటున్న పురుషులు, మహిళలు, పిల్లల శాతం గరిష్ఠంగా 67 నుంచి కనిష్ఠంగా 25 వరకూ ఉంది. 2023 లెక్కల ప్రకారమే మన దేశంలో 74 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం ఆందోళన గొలుపుతూ 28.7 దగ్గర ఉంది. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ల ఆర్థికత అవుతుందనీ, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికతలలో మూడవది కాబోతోందనీ పాలకులు అరచేతి స్వర్గాలు ఆవిష్కరిస్తుంటే అసలు నిజాలు ఇలా నిలువునా వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో సగానికి పైగా, 81 కోట్లమంది నెలకు అయిదు కిలోల రేషన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ మాత్రానికీ నోచుకోని వలస, అసంఘటిత రంగ శ్రామికులు 8 కోట్లమంది ఉన్నారు. జనాభా లెక్కల సేకరణ సకాలంలో జరిగి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదంటున్నారు. కోవిడ్ దరిమిలా వీరిని కూడా ఆహార భద్రతా చట్టం కిందికి తేవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పైగా తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీపై ఇంకా కోత పడింది. పోషకాహార లోపం వల్ల భారత్ తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 4 శాతం నష్టపోతోంది. తిండికి, కండకు, మనిషికి; దేశాభివృద్ధిలో మనిషి పాత్రకు ఉన్న అన్యోన్యాన్ని ఆనాడే చెప్పిన గురజాడది ఎంత గొప్ప ముందుచూపు! దేశభక్తిని, దేశభుక్తితో మేళవించిన గురజాడ గీతం అంతర్జాతీయ గీతమే కాగలిగినదైనా రాష్ట్రీయ గీతం కూడా కాకపోవడం విషాదం కాదూ!? -
గురజాడ పురస్కారానికి జిల్లా కవుల ఎంపిక
– ఈనెల 8న తిరుపతిలో పురస్కారం అందుకోనున్న కర్నూలు కవులు కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): గురజాడ వేంకట అప్పారావు అంతర్జాతీయ ఫౌండేషన్ ఏటా నిర్వహించే గురజాడ స్ఫూర్తి ఉత్సవాలు–2017కు జిల్లాకు చెందిన 10 మంది కవులు ఎంపికైనట్లు ఫౌండేషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పుల్లా రామాంజనేయులు గురువారం తెలిపారు. జిల్లాకు 10 మంది చొప్పున రాయలసీమ జిల్లాల్లో 40 మందిని ఎంపిక చేశామన్నారు. కర్నూలు సిల్వర్ డిగ్రీ కళాశాల తెలుగుశాఖాధిపతి డాక్టర్ విజయ్‌కుమార్, విశ్వవాణి కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్.కే. మద్దిలేటి, రాయలసీమ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ పేరం ఇందిరాదేవి, నంద్యాల దంతవైద్యుడు డాక్టర్ కిశోర్‌కుమార్, కర్నూలు జిల్లా సాహితీ స్రవంతి అధ్యక్ష, కార్యదర్శులు జంధ్యాల రఘుబాబు, కెంగార మోహన్, మద్దికెర జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కే.సురేష్‌బాబు, కొలిమిగుండ్ల కళాస్రవంతి వ్యవస్థాపక కార్యదర్శి పల్లోలి శేఖర్‌బాబు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా నాయకుడు కే.సీ మల్లికార్జున, రచయిత సోమభూపాల్‌కు ఈ పురస్కారాలను జ్యూరీ కమిటీ ప్రకటించిందన్నారు. ఈనెల 8న తిరుపతిలోని కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రంలో జరిగే సాహిత్య సభలో వీరికి పురస్కారాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
తెలుగు వారి అడుగుజాడ గురజాడ
పుంగనూరు టౌన్ : తెలుగువారి అడుగుజాడ గురజాడ అని వక్తలు కొనియాడారు. గురజాడ అప్పారావు జయంతిని పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జయచంద్రనాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు భాషాభిమానులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని సుసంపన్నం చేసి, చరిత్ర సృష్టించిన గురజాడ జయంతి తెలుగుజాతికి పండుగగా అభివర్ణించారు. సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘిక నాటకాన్ని రచించిన గురజాడ తెలుగు వాడవటం జాతి చేసుకున్న అదృష్టమన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని దేశభక్తిని జాతి జనులలో రగిల్చిన యుగకర్తగా అభివర్ణించారు. కన్యాశుల్కం, వరకట్నం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, అస్పృశ్యతను ఇతివృత్తాలుగా చేసుకొని కవితలు రచించి సాంఘిక మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ గ్రంథాలయాధికారిణి నసీబ్జాన్, తెలుగు భాషాభిమానులు వెంకటపతి, సీతాపతిరాజు, గండికోటరవీంద్ర, రామలింగప్ప, గురుమూర్తి, ఇట్టాభానుప్రకాష్, గిరిధర్, ఇంతియాజ్, హరి పాల్గొన్నారు. -
ఉమాదేవికి గురుజాడ పురస్కారం
ఆదోని: అమెరికాకు చెందిన గురుజాడ ఫౌండేషన్ ఏటా ప్రదానం చేసే తెలుగు కవితా పురస్కారానికి కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన డాక్టర్ ఉమాదేవి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు ఫౌండేషన్ నుంచి శనివారం ఆహ్వానం అందింది. ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా 2012లో పదవీ విరమణ చేసిన ఉమాదేవి.. తన 54వ ఏట సంప్రదాయపు పాటలపై తెలుగు, కన్నడంలో అధ్యయనాన్ని విజయవంతంగా ముగించి డాక్టరేట్ పొందారు. కవితలు, పాటలు, పద్యాలు రాసి సహస్ర విభూషణ బిరుదు పొందారు. బషీరాబాగ్‌లోని ప్రెస్‌క్లబ్బులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం ఆమె ఫౌండేషన్ నిర్వాహకుల నుంచి అవార్డు అందుకుంటున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఉమాదేవి హైదరాబాదు బయలు దేరి వెళ్లారు. -
గురుజాడ పురస్కారానికి పుల్లా రామాంజి
మద్దికెర (పెరవలి): గురుజాడ ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో ప్రదానం చేసే రాష్ట్రస్థాయి తెలుగు పురస్కారం – 2016కు మద్దికెర మండలం పెరవలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడి పుల్లా రామాంజి ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో పద్యాలు రాయడంతో పాటు భాష అభివద్ధికి చేసిన కషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈనెల 18న హైదరాబాద్‌లో గురుజాడ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్ చేతులమీదుగా పురస్కారం అందుకోనున్నట్లు పుల్లారామాంజి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. -
గురజాడ ఫౌండేషన్ కవితల పోటీ
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): మహాకవి గురజాడ వేంకట అప్పారావు 153వ జయంత్యుత్సవాల సందర్భంగా కవితల పోటీలు నిర్వహించనున్నామని గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఇండియా శాఖ అధ్యక్షుడు, గురజాడ మనుమడు జీవీ రవీం ద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు తమ రచనలను ‘గురజాడ ఫౌండేషన్ (అమెరికా రిజిస్ట్రేషన్) ఇండియా శాఖ, విశాఖపట్నం, కేరాఫ్ రామకష్ణా పాఠశాల, ఎన్ఏడీ కొత్తరోడ్డు, విశాఖపట్నం’ చిరునామాకు పంపాలన్నారు. కవితతోపాటు ఈ కవిత తన స్వంతమని, దేనికి అనువాదం, అనుకరణ కాదని స్వదస్తూరితో హామీపత్రం జత చేసి పంపాలని కోరా రు. ఈనెల 22లోగా కవితలు పంపాలన్నారు. విజేతల వివరాలు సెప్టెంబరు 11న జరుగబోయే జయంత్యుత్సవాల్లో ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 98668 67610, 98492 74738 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
మహాకవీ.. మన్నించు
* గురజాడకు ఇచ్చే గౌరవం ఇదేనా? * చరిత్ర చాలా నిర్మొహమాటంగా ఉంటుంది.. ఎవరినీ క్షమించదు * ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ విజయనగరం టౌన్ : ‘చరిత్ర అనేది చాలా నిర్మొహమాటంగా ఉంటుంది. అది ఎవరినీ క్షమించదు. గురజాడ స్వగృహాన్ని పురావస్తు శాఖకు అప్పగించి ఏడాది గడుస్తున్నా నేటికీ కనీస అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. పరిస్థితి ఇలానే ఉంటే పాత కట్టడాలు పడిపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా పనులు ప్రారంభం కాకపోతే ఉద్యమం మొదలవుతుంద’ని సాహితీవేత్త, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక గురజాడ స్వగృహంలో సోమవారం ‘మహాకవి మన్నించు’ పేరిట నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురజాడ భవనాన్ని స్మారకభవనంగా రూపొందించే విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయన్నారు. అయితే మరలా తప్పు తెలుసుకున్న పాలకులు, అధికారులు ఆగస్టులో జరిగే కౌన్సెల్లో పెట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించిందన్నారు. 2014లో గురజాడ ప్రసాద్‌కు పనికల్పించి, పూర్తిస్థాయిలో జీతం కోరితే ఇంతవరకూ కనీస మొత్తం కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. గురజాడ సంతతికి ఇలాంటి పరిస్థితి రావడం విచారించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో సిగ్గుతో తలదించుకోవాలన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున రూ.10వేలు ప్రతి నెలా గురజాడ వారసుడు ప్రసాద్‌కు అందిస్తామని హామీనిచ్చారు. సీనియర్ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ.. గురజాడ అడుగుజాడలు, ఇక్కడ కవులు, కళాకారులతో తనకు ఎంతో అనుబంధం ఉందని వివరించారు. కార్యక్రమానికి ముందు గురజాడ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గురజాడ స్వగృహం నుంచి గురజాడ సెంటర్ వరకూ వెళ్లారు. అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ కమిషనరు ప్రసాదుల రామకృష్ణకు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అక్కడ నుంచి నేరుగా కలెక్టర్‌ను కలిసి వినతినందించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు, కవులు రామతీర్థ, డాక్టర్ బీఎస్ఆర్.మూర్తి, సన్నిధానం శాస్త్రి, చందు సుబ్బారావు, క్రొవ్విడి శారదాప్రసాద్, విజయేశ్వరరావు, జగద్దాత్రి, చంద్రిక, చాగంటి తులసి, చీకటి దివాకర్, ధవళ సర్వేశ్వరరావు, కాశీవిశ్వనాథం, పి.వి.నరసింహరాజు (బుచ్చిబాబు), కాపుగంటి ప్రకాష్, గురజాడ వారసులు ప్రసాద్, ఇందిర, లలిత, శ్రీకర్ పాల్గొన్నారు. నవ్యాంధ్రలో గురజాడ భారతి గురజాడ వంటి మహాకవికి గుర్తుగా నవ్యాంధ్రలో గురజాడ భారతిని ఏర్పాటుచేయాలి. సాంస్కృతిక భవనం నిర్మించాలి. గురజాడ రచనలు జాతికి వెలుగునిచ్చాయి. గురజాడ గేయం ప్రపంచ గేయంగా చెప్పుకోవచ్చు. ఆ మహాకవి పట్ల నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తే సహించేదే లేదు. ఆయన భవనం స్మారకంగా తీర్చిదిద్దే వరకూ పోరాడతాం. - సీహెచ్ సుబ్బారావు (విశాఖ) గురజాడ గుర్తులు పదిలం కావాలి.. గురజాడ స్వగృహం పక్కన మెమోరియల్ భవనం కట్టాలి. జ్ఞాపకంలో మిగిలే మందిరంగా కాకుండా ఆ నాటి జ్ఞాపకాలను ఉంచి మందిరం నిర్మించాలి. లేకుంటే సిమెంట్ పలకలే మిగులుతాయి. గురజాడ నాటి గుర్తులు పదిలంగా ఉంచి, భావితరాలకు అందించాలి. అధికారులు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా స్మృతి నిర్మాణానికి పూనుకోవాలి. - గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటులు 13 జిల్లాల్లో సాహిత్య అకాడమీలు నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రతి చోటా వంద కోట్లతో సాహిత్య అకాడమీలు ఏర్పాటు చేయాలి. కర్ణాటక, కేరళలో మాదిరిగా ఇక్కడా అమలు చేయాలి. గురజాడకు అన్యాయం జరిగితే అందరికీ జరిగినట్లే. మహానాడు చేసుకుంటున్న పాలకులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - రామతీర్థ (విశాఖ) మహాకవిపై చిన్నచూపు తగదు గురజాడ చివరి దశలో ఉంటూ ఇక్కడే గడిపిన ఆయన జాడల్ని మనమందరం పదిలపరుచుకోవాలి. ఆయనకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమంలో ఇక్కడకు వచ్చి మహాకవి స్వగృహాన్ని సందర్శించడం ఎంతో అదృష్టం. ఇక్కడకు వస్తే ఓ దేవాలయం గుర్తుకువస్తుంది. అటువంటి మహానుభావుని పట్ల ప్రభుత్వం, పాలకవర్గం చిన్నచూపు చూడటం దారుణం. - సన్నిధానం శాస్త్రి (రాజమండ్రి) మహాకవికి ఇష్టమైనవాటిని పదిలపరిచాం అప్పట్లో గురజాడ అప్పారావు వాడే వస్తువులను, ఆయనకు నచ్చిన ర ంగులను కొంతమంది పెద్దల ద్వారా తెలుసుకుని వాటిని పదిలపరిచాం. గురజాడ వంటి మహనీయుడు కొలువైన మందిరాన్ని పురావస్తు శాఖకు అప్పగించి ఏడాది గడిచినా అభివృద్ధి చేపట్టకపోవడం దారుణం. ఆగస్టులోపునే అభివృద్ధి పనులు ప్రారంభించాలి. - డాక్టర్ బీఎస్ఆర్ మూర్తి (విజయనగరం) -
నేడు గురజాడ శత వర్ధంతి
బహుశా తల్లి కడుపులో ఉన్నప్పుడే గురజాడకి తాను జన్మించి ఎన్నో పనులు చేయాలని అనిపించిందేమో నన్నట్టు గురజాడ ఏడవ నెలలోనే జన్మించారు. అందుకే ఆయన ఆరోగ్యం చిన్నప్పటి నుంచే అంతంతమాత్రంగా ఉండేది. కానీ గురజాడ చిన్నప్పటి నుంచి ఎంతో మనోధైర్యంతో ఉండేవారు. ఎంతో తెలివిగా ఉండేవారు. 'లా' మీద అతనికి ఉన్న ఉత్సాహంతోనే విజయనగర సంస్థానంలోని పెద్ద దావా జరుగుతున్నకాలంలో కలకత్తా, చెన్నై, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో సీనియర్ న్యాయవాదులతో ముచ్చటించి దావాకు సంబంధించిన విశేషాల్ని సరిగ్గా సేకరించి, ఆఖరికి విజయనగర రాజవంశానికి సంబంధిం చిన వాళ్లే దావా గెలిచేటట్లు చేశారు. అప్పారావుగారు రాసిన కన్యాశుల్కం నాటకం బహుళజనాదరణ పొందడంతో రెచ్చిపోయిన గ్రాంథికవాదులు 'ఇది సాంఘిక నాటకం కాబట్టి మాట్లాడుకునే భాషలో రాయగలిగావు కానీ, ఇదే ఏ చారిత్రక నాటకం అయితే మాట్లాడుకునే భాషలో రాయగలవా?' అనే సవాలుని విసిరారు. దానికి జవాబుగా అప్పారావుగారు 'బిల్హణీయం' అనే నాటకాన్ని మాట్లాడుకునే భాషలో రాశారు. కొండుభట్టీయం నాటకరచనకు పూనుకున్నారు. 'చందోబద్ధమైన కవిత్వం రాయలేకే నువ్వు ఇలాంటి రచనలు చేస్తున్నావు' అని గ్రాంధికవాదులు విసిరిన మరో సవాలుకి జవాబుగా అప్పారావు గారు సుభద్ర అనే కావ్యాన్ని, సత్యవతి శతకాన్ని రాసి చూపించారు. 'ఇలాంటి సాహిత్యానెన్నంతటినో సృష్టించగలను. కానీ అందరికీ అర్థమయ్యే విధంగా ఏది రాసినా బాగుంటుంది కానీ కొందరి కోసమే సాహిత్యం కాదు' అని వాళ్లకి జవాబుచ్చాడు. 1987లో కన్యాశుల్కం మొదటి ప్రతి తక్కువ కాలంలోనే పూర్తిగా అమ్ముడైపోయింది. కానీ కొద్దిపాటి మార్పులు చేయదల్చుకున్న ఆయనకి నాటకాన్ని పూర్తిగా తిరిగి రాయాలనిపించింది. దాంతో నాటకాన్ని తిరిగి రాసి ద్వితీయ కూర్పుని 1909లో ప్రచురించారు. తర్వాత ఆయన దృష్టి మాట్లాడే భాషలో గ్రంథ రచనకి ఓ ఉద్యమ స్ఫూర్తినివ్వాలనే విషయం వైపు మళ్లింది. 'విశ్రాంతి అనేది నా జీవితంలో కల్ల. ఒక వేళ ఏ పనీ చేయజాలని స్థితి వస్తే ఇంత కన్నా మరణం మేలు' అంటూ కృషి చేసిన అప్పారావుగారు 'నాది ప్రజల ఉద్యమం. దానిని ఒకరిని సంతోషపెట్టడానికి వదులుకోలేను' అంటూ చిత్తశుద్ధితో చివరి వరకు మాట్లాడుకునే తెలుగు భాషా సాహిత్యాలకే అంకితమైపోయారు. (నేడు గురజాడ శత వర్థంతి సందర్భంగా త్యాగరాయ గానసభలో నివాళి) - వేదగిరి రాంబాబు మొబైల్ : 9391343916 -
గురజాడ శతవర్ధంతి కార్యక్రమాలు
ఈ రోజంతా విశాఖ పట్నంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం అసెంబ్లీ హాల్లో గురజాడ శతవర్ధంతిని శతాధిక సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. ‘గురజాడ-ఆధునిక భావాలు’, ‘గురజాడ-మహిళలు’, ‘గురజాడ రచనలు - సమకాలీనత’, ‘భావ ప్రకటనాస్వేచ్ఛ- సవాళ్లు’ అంశాలపై ప్రసంగాలుంటాయి. ‘భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము’ ఆధ్వర్యంలో నేడు, రేపు విజయనగరంలో ‘గురజాడ శత వర్ధంతి సారస్వత నీరాజనం’ పేరిట వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. డైరీ: నేడు ఉదయం 9:30కి గురజాడ స్వగృహంలో ‘జ్యోతి ప్రదీపనం’, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తైలవర్ణ చిత్ర ప్రదర్శన. 10:30కి ఆనందగజపతి కళాక్షేత్రంలో ‘మహాకవి గురజాడ’, ‘గురజాడ-మహిళ’ నృత్యరూపకాలు. 2 గంటలకు నవయుగ ఆర్ట్స్ వారిచే 8 గంటల సంపూర్ణ ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన. నవంబర్ 30న ఉదయం 9:30కు ‘సాంస్కృతిక పాదయాత్ర’. 11:30కు ‘ప్రముఖ వక్తలతో సాహితీ సదస్సు’. 3 గంటలకు ‘కవి సమ్మేళనం’. 6 గంటలకు ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’, ‘దేశమును ప్రేమించుమన్న’ నృత్యరూపకాలు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ‘గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం’. మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు ‘మహాకవి గురజాడ అప్పారావు 100వ వర్ధంతి జాతీయ సదస్సు’ జరగనుంది. గురజాడ జీవితప్రస్థానం, లేఖలు, డైరీలు, కథానికలు, కవిత్వం, కన్యాశుల్కం అంశాలపై ప్రసంగాలుంటాయి. ‘మొజాయిక్ సాహిత్య సంస్థ’, మరికొన్ని కలిసి ‘గురజాడ నూరో వర్ధంతి’ని నవంబర్ 30న మధ్యాహ్నం 2:30కు ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్లో నిర్వహిస్తున్నాయి. ఇందులో, ‘గురజాడ- నేటి అవసరం’ చర్చ, రామతీర్థ సంక్షిప్తీకరించిన ‘కన్యాశుల్కం’ ఆవిష్కరణ, ‘జెండాపై గురజాడ’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఉంటాయి. ‘తెలుగు రథం’, ‘శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్’ ఆధ్వర్యంలో నవంబర్ 30 సాయంత్రం 5:30కు త్యాగరాయ గానసభలో జరిగే ‘గురజాడ శతవర్ధంతి నివాళి’ సభలో ‘అక్షర’(నివాళి కవిత్వం), ‘తప్పక చదవాల్సిన వంద కథానికల మాలిక’ పుస్తకావిష్కరణలు జరగనున్నాయి. -
సత్యాగ్ని కథలు
మైనారిటీ సాహిత్యానికి మొదటి చేర్పు తెలుగు కథలో గురజాడ ‘పెద్ద మసీదు’ ఉంది. శ్రీపాద ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ ఉంది. రాయలసీమ తొలితరం కథల్లో ఒక ముస్లిం వైద్యుని చేత కొడుకుకు వైద్యం నిరాకరించే చాందస అత్తగారిని ఎదిరించే కోడలి కథ ఉంది. నెల్లూరు కేశవస్వామి కథల నిండా ముస్లిములే. ముస్లింల జీవితాలు, పాత్రలు తెలుగు కథల్లో ఆది నుంచీ ఉన్నాయి. అయితే అవి ముస్లిమేతరులు రాసినవి. ఒక ముస్లిం అయి ఉండి ముస్లింల జీవితాల గురించి రాయవచ్చని మొదటగా ప్రయత్నించింది షేక్ హుసేన్. ‘సత్యాగ్ని’ కలం పేరుతో ఈ ఒరవడిని దిద్దింది ఒక రాయలసీమ రచయిత కావడం ఆ ప్రాంతానికి గర్వకారణం. 1980వ దశకంలో ఆయన మొదలుపెట్టిన ఈ పరంపర ఆ తర్వాత తెలుగులో కొనసాగింది. ముఖ్యంగా ‘బా’ రహమతుల్లా (ప్రకాశం జిల్లా) వంటి రచయితలు తెలుగు ముస్లిం కథను ఒక మెట్టు పైన చేర్చారు. సలీం (ప్రకాశం జిల్లా) తొలి ముస్లిం జీవన నవల- ‘వెండి మేఘం’ రాసి తెలుగు నవలను సంపద్వంతం చేశారు. వీరిని మినహాయించి కోస్తా ప్రాంతంలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోయినా రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో ముస్లిం కథ విస్తృతంగా వికసించింది. రాయలసీమలో దాదాహయత్, శశిశ్రీ (బేపారి రహంతుల్లా), మహమూద్, ఎన్నెస్ ఖలందర్, అక్కంపేట ఇబ్రహీం, ఇనయతుల్లా తదితరులతో పాటు షేక్ హుసేన్ స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన కథాధోరణికి నిజమైన వారసుడిగా వేంపల్లి షరీఫ్ ఆవిర్భవించారు. ఇక తెలంగాణలో ఖాజా ముస్లిం కథల పతాకనెత్తారు. ఆ వరుసలో అఫ్సర్, దిలావర్, షాజహానా, హనీఫ్, ఇక్బాల్ చంద్, అన్వర్, పానమరక అలీ, యూసఫ్ బాబా, కవి యాకూబ్, యాకూబ్ పాషా తదితరులు తెలంగాణ ముస్లిం జీవనాన్ని విస్తారంగా కథా సాహిత్యంలో నమోదు చేశారు. ఇన్ని కథలు, పుస్తకాలు వచ్చినా మొదటి మెట్టు వేసింది షేక్ హుసేన్ అనేది చరిత్రలో నమోదైన సత్యం. హుసేన్ కథలు సూటిగా సరళంగా ఉంటాయి. సమస్యను తీసుకుని క్లుప్తంగా చర్చిస్తాయి. ఒకరికి లొంగని పరిష్కారాలు చూపిస్తాయి. తొలి రోజులలో షేక్ హుసేన్ కథలు దాదాపు ఎఫ్.ఐ.ఆర్‌లను తలపించినా రాను రాను వాటి పరిధి, లోతు విస్తారమైంది. ముస్లింల కథలు రాయడం మొదలుపెట్టే సమయానికి ఆయన సంయమనం పాటించడం చూస్తాం. అంతర్గత సంస్కరణ కోసం ముస్లిం సమాజానికి ఆయన చెప్పిన హితవు వంటి కథలు ఈ సంపుటిలో అనేకం ఉన్నాయి. ‘యంత్రం’, ‘ముతా’, ‘పాచికలు’, ‘ఖులా’, ‘హలాలా’... ఇవన్నీ హుసేన్ కథల్లోనే కాదు తెలుగు కథల్లో కూడా ముఖ్యమైనవి. ముస్లిం సమాజం ఎలా వంచనకు గురి అవుతున్నదో పెత్తందార్ల చేతుల్లో ముస్లింలు ఎలా పావులవుతున్నారో హుసేన్ రాస్తారు. అలాగే స్త్రీల తరఫున, స్త్రీల కొరకు వకాల్తా పుచ్చుకోవడమే కాదు ఇస్లాంలో స్త్రీల అణచివేత ఉందనే దురభిప్రాయాన్ని తొలగిస్తూ వారికి ఉన్న హక్కులను కూడా కథలుగా మలిచారు. మగాడి తరఫున ‘తలాక్’ మాత్రమే అందరికీ తెలుసు. కాని వివాహ బంధం నుంచి బయటపడటానికి స్త్రీకి ’ఖులా’ హక్కు ఇస్లాం ఇచ్చిందని ఎందరికి తెలుసు? ‘ముతా’ పేరుతో పేద ఆడపిల్లలను నెలకూ రెండు నెల్లకూ (దుబాయ్ షేకులు) పెళ్లి చేసుకునే ఆచారం ఉందని నమ్మించేవారిని అదసలు ఇస్లాంలో సమ్మతం కాదనే కథ వీటిలో ఉంది. స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలనుకోవడం హుసేన్ కథల్లో బలమైన స్టాండ్. లోపలి రచయితలు ముస్లిం సమాజాన్ని దుమ్మెత్తి పోయడం కన్నా ముందు వారికి అవసరమైన సాహిత్యం అందించాలనే ధోరణి హుసేన్‌ది. ఇది అభిలషణీయమైన ధోరణి. ఇందులో ఒకటి రెండు జ్ఞాపకాల వంటి కథలు ఉన్నాయి. అవి లేకపోయినా పర్వాలేదు. ఒక కథ- ‘ఖబరా ఖోదువ్’ (గోరి తవ్వేవాడు) మీద ప్రేమ్‌చంద్ ‘కఫన్’ ప్రభావం ఉంది. కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ ముందుమాటలు పుస్తకం విలువను పెంచాయి. తెలుగులో మొదటి ముస్లిం కథలున్న ఈ సంపుటి ప్రతి ఒక్కరూ చదవతగ్గది. - నెటిజన్ కిశోర్ సత్యాగ్ని కథలు- షేక్ హుసేన్ సత్యాగ్ని వెల: రూ.120 ప్రతులకు: 9866040810 -
పాఠాల్లోంచి ప్రకృతిలో కి
ఐదేళ్ల ప్రత్యేక కృషితో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఔపోసన పట్టిన ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్ శ్యాం సుందర్‌రెడ్డి ప్రకృతిపై ఆధిపత్యం కాదు.. అనుసరణే మేలని నిశ్చితాభిప్రాయం రసాయనిక సేద్యం విధ్వంసకరం.. పూర్తి సేంద్రియ సాగు సాధ్యమే.. వాణిజ్య సరళి సాగులో నిపుణుల పర్యవేక్షణ, మితంగా రసాయనిక ఎరువుల వాడకం తప్పదు ప్రొఫెషనల్ ‘ప్లాంట్ డాక్టర్’గా మారి బత్తాయి రైతులకు బాసట ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయ్! పూని యేదైనాను, వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్..’ అని గురజాడ చెప్పిన మాటలను అక్షరాలా పాటించి చూపిస్తున్నారు ఈ ‘ప్లాంట్ డాక్టర్’. వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయంలో డాక్టరేట్ పుచ్చుకొని వృత్తిరీత్యా ఉన్నత శిఖరాలను చుంబించినా.. ఈ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి తాను ఇన్నాళ్లూ చదువుకున్న చదువు దారి చూపలేకపోతోందన్న వెలితి ఆయనను నిద్రపోనివ్వలేదు. అగ్రశ్రేణి విద్యా సంస్థ ట్రిపుల్‌ఐటీలో చీకూచింతా లేని అధ్యాపక ఉద్యోగానికి చెల్లుచీటీ ఇచ్చారు. అడ్డపంచె కట్టుకొని ముందు ప్రకృతి మనసెరిగిన రైతుగా, ఆనక ప్రొఫెషనల్ ప్లాంట్ డాక్టర్‌గా మారిపోయారు ప్రొఫెసర్ గున్నంరెడ్డి శ్యాం సుందర్ రెడ్డి(39). వ్యవసాయం సర్వోన్నతమైనదని చాటుతున్నారు. కనెక్టివిటీ ఉంది.. కంటెంట్ లేదు! శ్యాం సుందర్ రెడ్డి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా పొందారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీలో అధ్యాపకునిగా చేరి వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ‘ఈసాగు’ ఐటీ ప్రాజెక్టులో ప్రొ. కృష్ణారెడ్డి సారథ్యంలో పనిచేశారు. ఉన్న రసాయనిక పురుగుమందులన్నీ వాడినా చీడపీడల బెడద అంతకంతకూ పెచ్చరిల్లుతుండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా రైతులతో కనెక్టివిటీని పెంచి సలహాలు అందించే వ్యవస్థలను రూపొందించారు. రైతులతో కనెక్టివిటీకి టెక్నాలజీ సిద్ధమైంది.. కానీ వాళ్లకు అందించడానికి తగిన ‘విషయం’ (కంటెంట్) లోపించింది. ఈ గ్రహింపు క్షేత్రస్థాయిలో సునిశిత పరిశోధన చేపట్టాల్సిన కర్తవ్యాన్ని ముందుకు తెచ్చింది. అప్పట్లో ట్రిపుల్ఐటీ డెరైక్టర్‌గా ఉన్న ప్రొ.రాజీవ్ సంగాల్, ప్రస్తుత డెరైక్టర్ పీజీ నారాయణ్‌ల ప్రోత్సాహంతో డా. శ్యాంసుందర్‌రెడ్డి తాను చదివిన చదువు చట్రాన్ని దాటి వ్యవసాయ సమస్యలపై క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధన చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వందలాది పంటల గురించి పుస్తకాల్లో చదువుకుంటామని, అంతమాత్రానే సాగుపై పట్టు రాదన్నారు. ఎంపిక చేసుకున్న పంటలపై క్షేత్రస్థాయిలో మక్కువతో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే వాస్తవాలు బోధపడతాయని, పరిష్కారమార్గాలు కనిపిస్తాయని ఆయన అంటారు. ప్రకృతి వ్యవసాయంపై ఐదేళ్ల అధ్యయనం సాగు సంక్షోభం మూలాలను శోధించారు శ్యాం సుందర్ రెడ్డి. ఫుకువొక, డా.చొహన్క్యూ, బిల్ మాల్సన్, పాలేకర్.. తదితర దేశవిదేశీ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తల బోధనలను క్షేత్రస్థాయి ఆచరణతో మేళవించి ఐదేళ్లుగా మక్కువతో అధ్యయనం చేస్తున్నారు. పంట పొలంలో ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలనుకోవడం వృథా ప్రయాసేనని, ప్రకృతి సూత్రాలను తలదాల్చి.. అందుకు అనుగుణంగానే పంటలు పండించుకోవడమే మేలని నిర్ధారణకొచ్చారు. పంట భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములతోపాటు పక్షులు, తేనెటీగలు.. తమ ధర్మాలను నిర్విఘ్నంగా నిర్వర్తించగిలిగేలా ప్రకృతి వ్యవస్థను కాపాడుకోవడం అవసరమని గుర్తించారు. ‘గడ్డి పరకతో విప్లవం’ సృష్తికర్త ఫుకువొకను ఆరాధించే ఆయన.. వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేయదలచిన వాళ్లు మొదట అనుభవరీత్యా రైతై ఉండాలంటారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని నాలుగు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో చక్కని ఫలితాలు సాధిస్తూ.. ప్రొఫెషనల్ ప్లాంట్ డాక్టర్‌గా మారి రైతుల ఆశలను పునరుజ్జీవింపజేస్తున్నారు. మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఎండిపోతున్న బత్తాయి తోటలకు జవజీవాలు కల్పిస్తూ రైతుల ఆదరణ పొందుతున్నారు. మెరుగైన నీటి యాజమాన్యంతోపాటు మల్చింగ్, జీవన ఎరువులు, జీవామృతం, జీవనియంత్రణ శిలీంద్రాలను వినియోగిస్తున్నారు. రైతులతో క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు తెలిసివచ్చిన వాస్తవాలు, యూనివర్సిటీలో కూర్చొని ఉంటే తెలిసేవి కావని ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి అంటారు. వ్యవసాయ సమస్యల మూలాలను పసిగట్టడంలోనే 90% పరిష్కారం దాగి ఉందంటారాయన. ఆచ్ఛాదన.. పంటకు రక్షణ ఆవు పేడ, మూత్రంతోపాటు ఆకులు అలములతో కూడిన ఆచ్ఛాదన(మల్చింగ్) పంట భూమికి జవజీవాలనివ్వడంతోపాటు కలుపు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయంటారు ప్రొ. శ్యాంసుందర్‌రెడ్డి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు నూటికి నూరు శాతం అనుసరణీయమైనవేనని, అయితే రైతు పూర్తి అవగాహనతో చేయాల్సి ఉంటుందని, అందుకు తగిన సేంద్రియ వనరులను సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. కచ్చితమైన ఫలసాయం పొందే విషయంలో ఈ పద్ధతులకు పరిమితులున్నాయన్నారు. చిన్న కమతాలలో జీవనాధారం కోసం, పెరటి తోటల్లో ప్రకృతి, సేంద్రియ సాగు చేయవచ్చన్నారు. అయితే, విస్తారమైన పొలాల్లో చేపట్టే వాణిజ్య సరళి వ్యవసాయంలో మాత్రం పరిమిత మోతాదులో రసాయనిక ఎరువులను నిపుణుల సలహా మేరకు విజ్ఞతతో వాడుకోవడం సమర్థనీయమేనంటూ.. అనుభవపూర్వకంగా మధ్యే మార్గాన్ని సూచిస్తున్నారు. కానీ, రసాయన పురుగు మందులు, కలుపు మందులు, మిడిమిడి జ్ఞానంతో తయారైన జన్యుమార్పిడి పంటలు ప్రకృతికి ఎక్కువగా హాని చేస్తాయని, వీటికి ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలంటారు. ఎరువుల మోతాదే ముఖ్యం! రసాయనిక ఎరువులు చెడ్డవి కాదని, వాటిని వాడిన తీరే సంక్షోభానికి కారణమైందని ఆయన అంటారు. చారెడు సేంద్రియ ఎరువుతో చిటికెడు రసాయనిక ఎరువు కలిపి వేసి అద్భుత ఫలితం పొందాల్సిన చోట.. వట్టిగా వీసెడు రసాయనిక ఎరువు వేసి వినాశనాన్ని కొని తెచ్చుకున్నామంటారాయన. ఔషధమైనా అధిక మోతాదులో ఇస్తే విషంగా మారుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతుకు ఆవు లేదా బర్రె ఉండాలనేది ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి అభిప్రాయం. ఒకటే పంట వేయకుండా అనేక పంటలను కలిపి సాగు చేయాలని, మార్కెట్ కోసం పత్తి వంటి పంటలు పండిస్తే.. తిండికి కావాల్సినవన్నీ కొనుక్కోవాల్సి రావడం బడుగు రైతుకు కష్టమైపోతున్నదన్నారు. సహకార సంఘాలుగా ఏర్పడితే మేలన్నారు. శాస్త్రం, కళల మేళవింపే వ్యవసాయమని, ఈ మర్మం గ్రహిస్తే వ్యవసాయం పండగే అవుతుందన్నారాయన. - పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్ ఫొటోలు: ఆర్.లావణ్య కుమార్ తెలివితోపాటు సాగుపై మక్కువ కావాలి! వ్యవసాయం నిలబడాలంటే.. మనం తెలివిగా వ్యవహరించడం ఒక్కటే చాలదు. ఈ వృత్తిపై మమకారం పెంచుకోవాలి. ప్రకృతి నియమాలను గౌరవించాలి. పశువుల పెంపకాన్ని అనుసంధానం చేయాలి. పక్షులు, సూక్ష్మజీవులు, వానపాములు తమ పనులను తాము నిర్వర్తించేందుకు అనువైన పరిస్థితిని కల్పించాలి. వ్యవసాయ పట్టభద్రులు పుస్తకాలు, పరిశోధనా పత్రాలతో పాటు క్షేత్రస్థాయి అనుభవాలను ఔపోసన పట్టాలి. వినియోగదారులు రైతుల పట్ల గౌరవ మర్యాదలతో నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచే పొందే వ్యవస్థలను రూపొందించుకోవాలి. సాంకేతిక విప్లవం వ్యవసాయంలో కూడా అద్భుతాలు చేయగలదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో వాణిజ్య సరళి ఉద్యాన పంటల యాజమాన్యం, రుణాలు, బీమా, మార్కెట్ అనుసంధానంతో ఏకీకృత వ్యవస్థ ద్వారా రైతుకు స్వావలంబన, స్వాభిమానం కల్పించేందుకు దోహదపడడమే నా లక్ష్యం. - ప్రొ. గున్నంరెడ్డి శ్యాం సుందర్‌రెడ్డి(99082 24649), ట్రిపుల్ఐటీ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500032 మా తోటలు తిప్పుకున్నాయి..! మాది ఆరేళ్ల బత్తాయి తోట. 9 ఎకరాలు. 8 నెలల క్రితం నుంచి ముగ్గురు రైతులం శ్యాంసుందర్‌రెడ్డి సారును పిలిపించి సలహాలు తీసుకుంటున్నాం. ఆయన సలహాతో పశువుల ఎరువు, వేపపిండి, వర్మీకంపోస్టు, ట్రైకోడెర్మావిరిడి, జీవామృతం, కొన్ని అవసరమైన ఇతర మందులు వాడుతూ మల్చింగ్ చేస్తున్నాం. ఈ పద్ధతిలో రైతు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. పని పెరిగింది. ఓపిగ్గా చేస్తుంటే.. ఫలితాలు బాగున్నాయి. వేరుకుళ్లుతో దెబ్బతిన్న మా తోట తిప్పుకుంది. ఇంతకు ముందు చెప్పే వాళ్లు లేక ఇబ్బందిపడ్డాం. ఇప్పుడు ధైర్యం వచ్చింది. నా స్నేహితుడు అర్జునయ్య 14 ఎకరాల తోటలో మూడేళ్లుగా రాబడి సరిగ్గా లేదు. ఈ ఏడాది రూ.10 లక్షల ఆదాయం వస్తుందనుకుంటున్నాం. - పకీరయ్య(97053 53165), రైతు, అడవిదేవులపల్లి, దామరచర్ల మం., నల్లగొండ జిల్లా -
అమ్మ ఒడి కమ్మదనం
నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం సుసంపన్నమైన తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని తమ అమూల్యమైన రచనలతో పరిపుష్టం చేసిన మహానుభావులెందరో...ప్రాచీన సాహిత్యంలో నాటి నన్నయ్య, తిక్కనల నుంచి ఆధునిక సాహిత్యంలో విశ్వనాథ, జాషువా, గురజాడ, శ్రీశ్రీ వరకు ఎందరో కవులు తెలుగు భాషామతల్లికి సేవలందించి, కన్నతల్లి రుణం తీర్చుకున్నారు. తెలుగుభాష మాట్లాడడమంటేనే చిన్నచూపుగా భావిస్తున్న నేటి సమాజంలో తెలుగు టెంగ్లిష్‌గా మారిపోతోంది. రానురాను అంతర్ధాన మైపోయే ప్రమాదం ముంచుకొస్తోందని తెలుగు భాషాభిమానులు పడుతున్న ఆందోళనలో నిజం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి జాతి తమతమ మాతృభాషలకు పెద్దపీట వేసి గౌరవిస్తుంటే మనం మాత్రం ఇలా...మన భాషను మనమే చంపుకోవడం బాధాకరం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నైనా మాతృభాషా పరిరక్షణకు కంకణబద్ధులమవుదాం... గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ అమ్మ మనసంత కమ్మనౌ మాతృభాష ... స్నేహపుష్ఫంకంబౌచును చెలగుబాష మాతృభాష అని కొనియాడారు కవులు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని తెగలు, వర్గాలు ఉన్నాయో అన్ని భాషలు పుట్టాయి.విదేశాల్లో పుట్టి పెరిగినా జన్మభూమి మాతృభాష, కన్న తల్లిదండ్రులు పూజ్యనీయులే. మాతృభాషను తప్పక ఎందుకు మాట్లాడాలి అనే విషయమై పరిశోధన చేసిన భాషా శాస్త్రజ్ఞులు కొన్ని కారణాలు నిర్ధారించారు. మనిషిలో జన్యుపరంగా వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు ప్రభావితం చేస్తాయి. మాతృభాష చిన్నప్పటి నుంచి చదవడం, వినడం వల్ల మనోవికాసం కలుగుతుంది. మాతృభాషలో పిల్లలు మాట్లాడితే పరిసరాల పరిజ్ఞానం త్వరగా పొందగలరు. మనస్సులో భావాలను సులభంగా పిల్లలు మాతృభాషలో వ్యక్తం చేయగలుగుతారు. పిల్లలు సాంఘికంగా కొన్ని ప్రత్యేక అంశాలను సులభంగా మాతృభాషలో నేర్చుకుని సృజనాత్మక రచనలు చేయడానికి ఉద్యుక్తులవుతారు. సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలు తెలుగు భాష అనగానే కొందరు పౌరాణిక పద్యాలు, పాటలు, గేయాలు గ్రాంథిక భాష వరకే పరిమితం అనుకుంటారు. వాటివలన మనకు ఉపయోగం ఏమిటంటూ విమర్శిస్తుంటారు. ప్రాచీన కాలం నుంచి తెలుగులో ఎన్నో భాషోద్యమాలు, సాహిత్యోద్యమాలు జరిగాయి. సమాజాన్ని కదిలించాయి. గురజాడ, శ్రీశ్రీ వంటి వారి రచనలు సాంఘిక దురాచారాలపై దండెత్తాయి. పాఠకుడికి జీవితం పట్ల నూతన విశ్వాసం కలిగించేలా వేలాది రచనలు సాగాయి. సాంఘిక దురాచారాలు, దురలవాట్లు పారదోలేలా ఉద్యమాలకు మన తెలుగు సాహిత్యం స్ఫూర్తినిచ్చింది. సమకాలీన ప్రజల జీవితాన్ని వస్తువుగా తీసుకుని నాటకం, కథ, సామెతలు వంటి ఎన్నో ప్రక్రియలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. మాతృభాషను స్వచ్ఛంగా భావితరాలకు అందించాలి తేనెలొలుకు తెలుగు భాష టెంగ్లిష్‌గా మారడం భవిష్యత్తులో ప్రపంచంలో అంతరించే భాషల వరుసలోకి ఎక్కడం తెలుగు జాతివారమని గర్వపడే అందరి మనసులను కలిచివేస్తోంది. దీనివల్ల నేటి యువత హావభావాలు, సామాజిక నడవడికలోనూ ఎన్నో వింత పోకడలు పెరిగాయని పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఈ పరిణామాలు నేటి తరం, భవిష్యత్తు తరాలకు నష్టం తెస్తుందనడంలో సందేహం లేదు. మన తెలుగు భాషను కాపాడుకోవడంతో పాటు స్వచ్ఛత నిలుపుకొని భావితరాలకు అందిస్తేనే మన జాతి మనుగడకు శుభదాయకమంటున్నారు సాహితీవేత్తలు, సామాజిక స్పృహ ఉన్న విద్యావేత్తలు. అవి వారి మాటల్లోనే...