మహాకవీ.. మన్నించు | Yarlagadda Laksmiprasad speach | Sakshi
Sakshi News home page

మహాకవీ.. మన్నించు

Published Tue, May 31 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

Yarlagadda Laksmiprasad speach

* గురజాడకు ఇచ్చే గౌరవం ఇదేనా?
* చరిత్ర చాలా నిర్మొహమాటంగా ఉంటుంది.. ఎవరినీ క్షమించదు
* ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ

విజయనగరం టౌన్ : ‘చరిత్ర  అనేది చాలా నిర్మొహమాటంగా ఉంటుంది. అది ఎవరినీ క్షమించదు. గురజాడ స్వగృహాన్ని పురావస్తు శాఖకు అప్పగించి ఏడాది గడుస్తున్నా నేటికీ కనీస అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. పరిస్థితి ఇలానే ఉంటే  పాత కట్టడాలు పడిపోయే ప్రమాదముంది.

ఇప్పటికైనా పనులు ప్రారంభం కాకపోతే  ఉద్యమం మొదలవుతుంద’ని సాహితీవేత్త, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక గురజాడ స్వగృహంలో సోమవారం ‘మహాకవి మన్నించు’ పేరిట నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురజాడ భవనాన్ని స్మారకభవనంగా రూపొందించే విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయన్నారు.

అయితే మరలా తప్పు తెలుసుకున్న పాలకులు, అధికారులు ఆగస్టులో జరిగే కౌన్సెల్‌లో పెట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించిందన్నారు. 2014లో గురజాడ ప్రసాద్‌కు పనికల్పించి, పూర్తిస్థాయిలో జీతం కోరితే ఇంతవరకూ కనీస మొత్తం కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. గురజాడ సంతతికి ఇలాంటి పరిస్థితి రావడం విచారించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో సిగ్గుతో తలదించుకోవాలన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున రూ.10వేలు ప్రతి నెలా గురజాడ వారసుడు ప్రసాద్‌కు అందిస్తామని హామీనిచ్చారు.

సీనియర్ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ.. గురజాడ అడుగుజాడలు, ఇక్కడ కవులు, కళాకారులతో తనకు ఎంతో అనుబంధం ఉందని వివరించారు. కార్యక్రమానికి ముందు గురజాడ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గురజాడ స్వగృహం నుంచి  గురజాడ సెంటర్ వరకూ వెళ్లారు. అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ కమిషనరు ప్రసాదుల రామకృష్ణకు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అక్కడ నుంచి నేరుగా కలెక్టర్‌ను కలిసి వినతినందించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు, కవులు రామతీర్థ, డాక్టర్ బీఎస్‌ఆర్.మూర్తి, సన్నిధానం శాస్త్రి, చందు సుబ్బారావు, క్రొవ్విడి శారదాప్రసాద్, విజయేశ్వరరావు, జగద్దాత్రి,  చంద్రిక, చాగంటి తులసి, చీకటి దివాకర్, ధవళ సర్వేశ్వరరావు, కాశీవిశ్వనాథం, పి.వి.నరసింహరాజు (బుచ్చిబాబు), కాపుగంటి ప్రకాష్,  గురజాడ వారసులు ప్రసాద్, ఇందిర, లలిత, శ్రీకర్ పాల్గొన్నారు.
 
నవ్యాంధ్రలో గురజాడ భారతి
గురజాడ వంటి మహాకవికి గుర్తుగా నవ్యాంధ్రలో గురజాడ భారతిని ఏర్పాటుచేయాలి. సాంస్కృతిక భవనం నిర్మించాలి. గురజాడ రచనలు జాతికి వెలుగునిచ్చాయి. గురజాడ గేయం ప్రపంచ గేయంగా చెప్పుకోవచ్చు. ఆ మహాకవి పట్ల నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తే సహించేదే లేదు. ఆయన భవనం స్మారకంగా తీర్చిదిద్దే వరకూ పోరాడతాం.
 - సీహెచ్ సుబ్బారావు (విశాఖ)
 
గురజాడ గుర్తులు పదిలం కావాలి..
గురజాడ స్వగృహం పక్కన మెమోరియల్ భవనం కట్టాలి. జ్ఞాపకంలో మిగిలే మందిరంగా కాకుండా ఆ నాటి జ్ఞాపకాలను ఉంచి మందిరం నిర్మించాలి. లేకుంటే సిమెంట్ పలకలే మిగులుతాయి.  గురజాడ నాటి గుర్తులు పదిలంగా ఉంచి, భావితరాలకు అందించాలి. అధికారులు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా స్మృతి నిర్మాణానికి పూనుకోవాలి.
- గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటులు
 
13 జిల్లాల్లో సాహిత్య అకాడమీలు
నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రతి చోటా వంద కోట్లతో సాహిత్య అకాడమీలు ఏర్పాటు చేయాలి. కర్ణాటక, కేరళలో మాదిరిగా ఇక్కడా అమలు చేయాలి.  గురజాడకు అన్యాయం జరిగితే అందరికీ జరిగినట్లే. మహానాడు చేసుకుంటున్న పాలకులు  పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- రామతీర్థ (విశాఖ)
 
మహాకవిపై చిన్నచూపు తగదు
గురజాడ చివరి దశలో ఉంటూ ఇక్కడే గడిపిన ఆయన జాడల్ని మనమందరం పదిలపరుచుకోవాలి. ఆయనకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమంలో ఇక్కడకు వచ్చి మహాకవి స్వగృహాన్ని సందర్శించడం ఎంతో అదృష్టం. ఇక్కడకు వస్తే ఓ దేవాలయం గుర్తుకువస్తుంది.  అటువంటి మహానుభావుని పట్ల ప్రభుత్వం, పాలకవర్గం చిన్నచూపు చూడటం దారుణం.
- సన్నిధానం శాస్త్రి (రాజమండ్రి)
 
మహాకవికి ఇష్టమైనవాటిని పదిలపరిచాం
అప్పట్లో గురజాడ అప్పారావు వాడే  వస్తువులను, ఆయనకు నచ్చిన ర ంగులను కొంతమంది పెద్దల ద్వారా  తెలుసుకుని వాటిని పదిలపరిచాం. గురజాడ వంటి మహనీయుడు కొలువైన మందిరాన్ని  పురావస్తు శాఖకు అప్పగించి ఏడాది గడిచినా అభివృద్ధి చేపట్టకపోవడం దారుణం. ఆగస్టులోపునే అభివృద్ధి పనులు ప్రారంభించాలి.
- డాక్టర్ బీఎస్‌ఆర్ మూర్తి  (విజయనగరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement