పాఠాల్లోంచి ప్రకృతిలో కి | n g ranga university Professor says about agriculture | Sakshi
Sakshi News home page

పాఠాల్లోంచి ప్రకృతిలో కి

Published Sun, Feb 23 2014 11:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పాఠాల్లోంచి  ప్రకృతిలో కి - Sakshi

పాఠాల్లోంచి ప్రకృతిలో కి

ఐదేళ్ల ప్రత్యేక కృషితో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఔపోసన పట్టిన ట్రిపుల్‌ఐటీ ప్రొఫెసర్ శ్యాం సుందర్‌రెడ్డి
 
 ప్రకృతిపై ఆధిపత్యం కాదు.. అనుసరణే మేలని నిశ్చితాభిప్రాయం
 
 రసాయనిక సేద్యం విధ్వంసకరం.. పూర్తి సేంద్రియ సాగు సాధ్యమే.. వాణిజ్య సరళి సాగులో నిపుణుల పర్యవేక్షణ, మితంగా రసాయనిక ఎరువుల వాడకం తప్పదు
 
 ప్రొఫెషనల్ ‘ప్లాంట్ డాక్టర్’గా మారి బత్తాయి రైతులకు బాసట

 
 ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయ్! పూని యేదైనాను, వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్..’ అని గురజాడ చెప్పిన మాటలను అక్షరాలా పాటించి చూపిస్తున్నారు ఈ ‘ప్లాంట్ డాక్టర్’. వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయంలో డాక్టరేట్ పుచ్చుకొని వృత్తిరీత్యా ఉన్నత శిఖరాలను చుంబించినా.. ఈ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి తాను ఇన్నాళ్లూ చదువుకున్న చదువు దారి చూపలేకపోతోందన్న వెలితి ఆయనను నిద్రపోనివ్వలేదు. అగ్రశ్రేణి విద్యా సంస్థ ట్రిపుల్‌ఐటీలో చీకూచింతా లేని అధ్యాపక ఉద్యోగానికి చెల్లుచీటీ ఇచ్చారు. అడ్డపంచె కట్టుకొని ముందు ప్రకృతి మనసెరిగిన రైతుగా, ఆనక ప్రొఫెషనల్ ప్లాంట్ డాక్టర్‌గా మారిపోయారు ప్రొఫెసర్ గున్నంరెడ్డి శ్యాం సుందర్ రెడ్డి(39). వ్యవసాయం సర్వోన్నతమైనదని చాటుతున్నారు.
 
 కనెక్టివిటీ ఉంది.. కంటెంట్ లేదు!
 శ్యాం సుందర్ రెడ్డి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీలో అధ్యాపకునిగా చేరి వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ‘ఈసాగు’ ఐటీ ప్రాజెక్టులో ప్రొ. కృష్ణారెడ్డి సారథ్యంలో పనిచేశారు. ఉన్న రసాయనిక పురుగుమందులన్నీ వాడినా చీడపీడల బెడద అంతకంతకూ పెచ్చరిల్లుతుండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా రైతులతో కనెక్టివిటీని పెంచి సలహాలు అందించే వ్యవస్థలను రూపొందించారు. రైతులతో కనెక్టివిటీకి టెక్నాలజీ సిద్ధమైంది.. కానీ వాళ్లకు అందించడానికి తగిన ‘విషయం’ (కంటెంట్) లోపించింది. ఈ గ్రహింపు క్షేత్రస్థాయిలో సునిశిత పరిశోధన చేపట్టాల్సిన కర్తవ్యాన్ని ముందుకు తెచ్చింది. అప్పట్లో ట్రిపుల్‌ఐటీ డెరైక్టర్‌గా ఉన్న ప్రొ.రాజీవ్ సంగాల్, ప్రస్తుత డెరైక్టర్ పీజీ నారాయణ్‌ల ప్రోత్సాహంతో డా. శ్యాంసుందర్‌రెడ్డి తాను చదివిన చదువు చట్రాన్ని దాటి వ్యవసాయ సమస్యలపై క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధన చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వందలాది పంటల గురించి పుస్తకాల్లో చదువుకుంటామని, అంతమాత్రానే సాగుపై పట్టు రాదన్నారు. ఎంపిక చేసుకున్న పంటలపై క్షేత్రస్థాయిలో మక్కువతో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే వాస్తవాలు బోధపడతాయని, పరిష్కారమార్గాలు కనిపిస్తాయని ఆయన అంటారు.
 
 ప్రకృతి వ్యవసాయంపై ఐదేళ్ల అధ్యయనం
 సాగు సంక్షోభం మూలాలను శోధించారు శ్యాం సుందర్ రెడ్డి. ఫుకువొక, డా.చొహన్‌క్యూ, బిల్ మాల్‌సన్, పాలేకర్.. తదితర దేశవిదేశీ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తల బోధనలను క్షేత్రస్థాయి ఆచరణతో మేళవించి ఐదేళ్లుగా మక్కువతో అధ్యయనం చేస్తున్నారు. పంట పొలంలో ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలనుకోవడం వృథా ప్రయాసేనని, ప్రకృతి సూత్రాలను తలదాల్చి.. అందుకు అనుగుణంగానే పంటలు పండించుకోవడమే మేలని నిర్ధారణకొచ్చారు. పంట భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములతోపాటు పక్షులు, తేనెటీగలు.. తమ ధర్మాలను నిర్విఘ్నంగా నిర్వర్తించగిలిగేలా ప్రకృతి వ్యవస్థను కాపాడుకోవడం అవసరమని గుర్తించారు.  ‘గడ్డి పరకతో విప్లవం’ సృష్తికర్త ఫుకువొకను ఆరాధించే ఆయన.. వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేయదలచిన వాళ్లు మొదట అనుభవరీత్యా రైతై ఉండాలంటారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని నాలుగు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో చక్కని ఫలితాలు సాధిస్తూ.. ప్రొఫెషనల్ ప్లాంట్ డాక్టర్‌గా మారి రైతుల ఆశలను పునరుజ్జీవింపజేస్తున్నారు.  మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఎండిపోతున్న బత్తాయి తోటలకు  జవజీవాలు కల్పిస్తూ రైతుల ఆదరణ పొందుతున్నారు. మెరుగైన నీటి యాజమాన్యంతోపాటు మల్చింగ్, జీవన ఎరువులు, జీవామృతం, జీవనియంత్రణ శిలీంద్రాలను వినియోగిస్తున్నారు. రైతులతో క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు తెలిసివచ్చిన వాస్తవాలు, యూనివర్సిటీలో కూర్చొని ఉంటే తెలిసేవి కావని ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి అంటారు.  వ్యవసాయ సమస్యల మూలాలను పసిగట్టడంలోనే 90% పరిష్కారం దాగి ఉందంటారాయన.
 
 ఆచ్ఛాదన.. పంటకు రక్షణ
 ఆవు పేడ, మూత్రంతోపాటు ఆకులు అలములతో కూడిన ఆచ్ఛాదన(మల్చింగ్) పంట భూమికి జవజీవాలనివ్వడంతోపాటు కలుపు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయంటారు ప్రొ. శ్యాంసుందర్‌రెడ్డి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు నూటికి నూరు శాతం అనుసరణీయమైనవేనని, అయితే రైతు పూర్తి అవగాహనతో చేయాల్సి ఉంటుందని, అందుకు తగిన సేంద్రియ వనరులను సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. కచ్చితమైన ఫలసాయం పొందే విషయంలో ఈ పద్ధతులకు పరిమితులున్నాయన్నారు. చిన్న కమతాలలో జీవనాధారం కోసం, పెరటి తోటల్లో ప్రకృతి, సేంద్రియ సాగు చేయవచ్చన్నారు. అయితే, విస్తారమైన పొలాల్లో చేపట్టే వాణిజ్య సరళి వ్యవసాయంలో మాత్రం పరిమిత మోతాదులో రసాయనిక ఎరువులను నిపుణుల సలహా మేరకు విజ్ఞతతో వాడుకోవడం సమర్థనీయమేనంటూ.. అనుభవపూర్వకంగా మధ్యే మార్గాన్ని సూచిస్తున్నారు. కానీ, రసాయన పురుగు మందులు, కలుపు మందులు, మిడిమిడి జ్ఞానంతో తయారైన జన్యుమార్పిడి పంటలు ప్రకృతికి ఎక్కువగా హాని చేస్తాయని, వీటికి ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలంటారు.
 
 ఎరువుల మోతాదే ముఖ్యం!
 రసాయనిక ఎరువులు చెడ్డవి కాదని, వాటిని వాడిన తీరే సంక్షోభానికి కారణమైందని ఆయన అంటారు. చారెడు సేంద్రియ ఎరువుతో చిటికెడు రసాయనిక ఎరువు కలిపి వేసి అద్భుత ఫలితం పొందాల్సిన చోట.. వట్టిగా వీసెడు రసాయనిక ఎరువు వేసి వినాశనాన్ని కొని తెచ్చుకున్నామంటారాయన. ఔషధమైనా అధిక మోతాదులో ఇస్తే విషంగా మారుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతుకు ఆవు లేదా బర్రె ఉండాలనేది ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి అభిప్రాయం. ఒకటే పంట వేయకుండా అనేక పంటలను కలిపి సాగు చేయాలని, మార్కెట్ కోసం పత్తి వంటి పంటలు పండిస్తే.. తిండికి కావాల్సినవన్నీ కొనుక్కోవాల్సి రావడం బడుగు రైతుకు కష్టమైపోతున్నదన్నారు. సహకార సంఘాలుగా ఏర్పడితే మేలన్నారు. శాస్త్రం, కళల మేళవింపే వ్యవసాయమని, ఈ మర్మం గ్రహిస్తే వ్యవసాయం పండగే అవుతుందన్నారాయన.     - పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్
     ఫొటోలు: ఆర్.లావణ్య కుమార్
 
 తెలివితోపాటు సాగుపై మక్కువ కావాలి!
 వ్యవసాయం నిలబడాలంటే.. మనం తెలివిగా వ్యవహరించడం ఒక్కటే చాలదు. ఈ వృత్తిపై మమకారం పెంచుకోవాలి. ప్రకృతి నియమాలను గౌరవించాలి. పశువుల పెంపకాన్ని అనుసంధానం చేయాలి. పక్షులు, సూక్ష్మజీవులు, వానపాములు తమ పనులను తాము నిర్వర్తించేందుకు అనువైన పరిస్థితిని కల్పించాలి. వ్యవసాయ పట్టభద్రులు పుస్తకాలు, పరిశోధనా పత్రాలతో పాటు క్షేత్రస్థాయి అనుభవాలను ఔపోసన పట్టాలి. వినియోగదారులు రైతుల పట్ల గౌరవ మర్యాదలతో నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచే పొందే వ్యవస్థలను రూపొందించుకోవాలి. సాంకేతిక విప్లవం వ్యవసాయంలో కూడా అద్భుతాలు చేయగలదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో వాణిజ్య సరళి ఉద్యాన పంటల యాజమాన్యం, రుణాలు, బీమా, మార్కెట్ అనుసంధానంతో ఏకీకృత వ్యవస్థ ద్వారా రైతుకు స్వావలంబన, స్వాభిమానం కల్పించేందుకు దోహదపడడమే నా లక్ష్యం.
             - ప్రొ. గున్నంరెడ్డి శ్యాం సుందర్‌రెడ్డి(99082 24649),
 ట్రిపుల్‌ఐటీ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500032
 
 
 మా తోటలు తిప్పుకున్నాయి..!

 మాది ఆరేళ్ల బత్తాయి తోట. 9 ఎకరాలు. 8 నెలల క్రితం నుంచి ముగ్గురు రైతులం శ్యాంసుందర్‌రెడ్డి సారును పిలిపించి సలహాలు తీసుకుంటున్నాం. ఆయన సలహాతో పశువుల ఎరువు, వేపపిండి, వర్మీకంపోస్టు, ట్రైకోడెర్మావిరిడి, జీవామృతం, కొన్ని అవసరమైన ఇతర మందులు వాడుతూ మల్చింగ్ చేస్తున్నాం. ఈ పద్ధతిలో రైతు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. పని పెరిగింది. ఓపిగ్గా చేస్తుంటే.. ఫలితాలు బాగున్నాయి. వేరుకుళ్లుతో దెబ్బతిన్న మా తోట తిప్పుకుంది. ఇంతకు ముందు చెప్పే వాళ్లు లేక ఇబ్బందిపడ్డాం. ఇప్పుడు ధైర్యం వచ్చింది. నా స్నేహితుడు అర్జునయ్య 14 ఎకరాల తోటలో మూడేళ్లుగా రాబడి సరిగ్గా లేదు. ఈ ఏడాది రూ.10 లక్షల ఆదాయం వస్తుందనుకుంటున్నాం.
 - పకీరయ్య(97053 53165), రైతు, అడవిదేవులపల్లి, దామరచర్ల మం., నల్లగొండ జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement