బహుశా తల్లి కడుపులో ఉన్నప్పుడే గురజాడకి తాను జన్మించి ఎన్నో పనులు చేయాలని అనిపించిందేమో నన్నట్టు గురజాడ ఏడవ నెలలోనే జన్మించారు. అందుకే ఆయన ఆరోగ్యం చిన్నప్పటి నుంచే అంతంతమాత్రంగా ఉండేది. కానీ గురజాడ చిన్నప్పటి నుంచి ఎంతో మనోధైర్యంతో ఉండేవారు. ఎంతో తెలివిగా ఉండేవారు.
'లా' మీద అతనికి ఉన్న ఉత్సాహంతోనే విజయనగర సంస్థానంలోని పెద్ద దావా జరుగుతున్నకాలంలో కలకత్తా, చెన్నై, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో సీనియర్ న్యాయవాదులతో ముచ్చటించి దావాకు సంబంధించిన విశేషాల్ని సరిగ్గా సేకరించి, ఆఖరికి విజయనగర రాజవంశానికి సంబంధిం చిన వాళ్లే దావా గెలిచేటట్లు చేశారు.
అప్పారావుగారు రాసిన కన్యాశుల్కం నాటకం బహుళజనాదరణ పొందడంతో రెచ్చిపోయిన గ్రాంథికవాదులు 'ఇది సాంఘిక నాటకం కాబట్టి మాట్లాడుకునే భాషలో రాయగలిగావు కానీ, ఇదే ఏ చారిత్రక నాటకం అయితే మాట్లాడుకునే భాషలో రాయగలవా?' అనే సవాలుని విసిరారు. దానికి జవాబుగా అప్పారావుగారు 'బిల్హణీయం' అనే నాటకాన్ని మాట్లాడుకునే భాషలో రాశారు. కొండుభట్టీయం నాటకరచనకు పూనుకున్నారు.
'చందోబద్ధమైన కవిత్వం రాయలేకే నువ్వు ఇలాంటి రచనలు చేస్తున్నావు' అని గ్రాంధికవాదులు విసిరిన మరో సవాలుకి జవాబుగా అప్పారావు గారు సుభద్ర అనే కావ్యాన్ని, సత్యవతి శతకాన్ని రాసి చూపించారు. 'ఇలాంటి సాహిత్యానెన్నంతటినో సృష్టించగలను. కానీ అందరికీ అర్థమయ్యే విధంగా ఏది రాసినా బాగుంటుంది కానీ కొందరి కోసమే సాహిత్యం కాదు' అని వాళ్లకి జవాబుచ్చాడు.
1987లో కన్యాశుల్కం మొదటి ప్రతి తక్కువ కాలంలోనే పూర్తిగా అమ్ముడైపోయింది. కానీ కొద్దిపాటి మార్పులు చేయదల్చుకున్న ఆయనకి నాటకాన్ని పూర్తిగా తిరిగి రాయాలనిపించింది. దాంతో నాటకాన్ని తిరిగి రాసి ద్వితీయ కూర్పుని 1909లో ప్రచురించారు. తర్వాత ఆయన దృష్టి మాట్లాడే భాషలో గ్రంథ రచనకి ఓ ఉద్యమ స్ఫూర్తినివ్వాలనే విషయం వైపు మళ్లింది.
'విశ్రాంతి అనేది నా జీవితంలో కల్ల. ఒక వేళ ఏ పనీ చేయజాలని స్థితి వస్తే ఇంత కన్నా మరణం మేలు' అంటూ కృషి చేసిన అప్పారావుగారు 'నాది ప్రజల ఉద్యమం. దానిని ఒకరిని సంతోషపెట్టడానికి వదులుకోలేను' అంటూ చిత్తశుద్ధితో చివరి వరకు మాట్లాడుకునే తెలుగు భాషా సాహిత్యాలకే అంకితమైపోయారు.
(నేడు గురజాడ శత వర్థంతి సందర్భంగా త్యాగరాయ గానసభలో నివాళి)
- వేదగిరి రాంబాబు మొబైల్ : 9391343916
నేడు గురజాడ శత వర్ధంతి
Published Mon, Nov 30 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement