
‘ఆదివాసుల ఆత్మాబంధువు యాడికెళ్ళెనే... అడవి బిడ్డల తోడు నీడ ఏమైపోయనే... జనప్రియుడేడమ్మా... జనార్ధనేడమ్మా... తన గుండెలాగిపోయినా... మన గుండె చప్పుడాయన!’ ఈ పాట ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ (biyyala janardhan rao) సార్ జీవనశైలినీ, ఆయన ఆదివాసీల కోసం తపించిన తీరునూ మన కళ్ళకు కడుతుంది.
1955 అక్టోబర్ 12న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు (Nellikuduru) మండలంలోని ముని గలవీడు గ్రామంలో జన్మించిన జనార్దన్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘గిరిజన భూముల పరాయీకరణ’ అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్‌డీ పట్టాపొందారు. అటవీ సంపదంతా ఆదివాసీలకే దక్కాలని, అది పరాయీకరణ కాకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పోరాడారు.
తెలంగాణ నీళ్ళు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే దక్కాలనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం అనాడే పోరాటం చేయమన్నారు. తాను సైతం అందులో భాగమయ్యారు. అధ్యాపకుడిగా ఉంటూనే ఆదివాసీలపై అత్యంత మమకారాన్ని పెంచుకున్నారు. కాకతీయలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆదివాసీల భూసమస్యలు, స్వయంపాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) సార్‌తో కలిసి అమెరికాలో జరి గిన ‘తానా’ సభల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ అవశ్యకతను వివరించారు. మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండాలని ఆ దిశగా ప్రయత్నం చేశారు. తెలంగాణపై వివక్ష, అణచివేతలపై అనేక రచనలు చేశారు. 1999లో కన్నబిరాన్, ఎస్.ఆర్. శంకరన్ తదితరులతో ప్రభుత్వం తరఫున నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని ఎజెండాను ముందుకు తెచ్చారు.
చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. చివరకు 2002 ఫిబ్రవరి 27న జనార్దన్ సార్ కన్నుమూశారు. ఆయనకు స్వరాష్ట్రంలో ఇప్పటివరకు సముచిత స్థానం దక్కలేదు. ఆయన స్మృత్యర్థం ప్రభుత్వం ఒక గ్రంథాలయాన్నో, విగ్రహాన్నో నెలకొల్పి, గౌరవించాలి.
– కలువకొలను హరీష్‌రాజు, జర్నలిస్టు
(ఫిబ్రవరి 27న ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్‌రావు వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment