పుంగనూరు శాఖాగ్రంథాలయంలో గురజాడ చిత్రపటానికి అంజలి ఘటిస్తున్న తెలుగు భాషాభిమానులు
తెలుగు వారి అడుగుజాడ గురజాడ
Published Thu, Sep 22 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
పుంగనూరు టౌన్ : తెలుగువారి అడుగుజాడ గురజాడ అని వక్తలు కొనియాడారు. గురజాడ అప్పారావు జయంతిని పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జయచంద్రనాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు భాషాభిమానులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని సుసంపన్నం చేసి, చరిత్ర సృష్టించిన గురజాడ జయంతి తెలుగుజాతికి పండుగగా అభివర్ణించారు. సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘిక నాటకాన్ని రచించిన గురజాడ తెలుగు వాడవటం జాతి చేసుకున్న అదృష్టమన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని దేశభక్తిని జాతి జనులలో రగిల్చిన యుగకర్తగా అభివర్ణించారు. కన్యాశుల్కం, వరకట్నం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, అస్పృశ్యతను ఇతివృత్తాలుగా చేసుకొని కవితలు రచించి సాంఘిక మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ గ్రంథాలయాధికారిణి నసీబ్‌జాన్, తెలుగు భాషాభిమానులు వెంకటపతి, సీతాపతిరాజు, గండికోటరవీంద్ర, రామలింగప్ప, గురుమూర్తి, ఇట్టాభానుప్రకాష్, గిరిధర్, ఇంతియాజ్, హరి పాల్గొన్నారు.
Advertisement