ఉమాదేవికి గురుజాడ పురస్కారం
ఆదోని: అమెరికాకు చెందిన గురుజాడ ఫౌండేషన్ ఏటా ప్రదానం చేసే తెలుగు కవితా పురస్కారానికి కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన డాక్టర్ ఉమాదేవి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు ఫౌండేషన్ నుంచి శనివారం ఆహ్వానం అందింది. ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా 2012లో పదవీ విరమణ చేసిన ఉమాదేవి.. తన 54వ ఏట సంప్రదాయపు పాటలపై తెలుగు, కన్నడంలో అధ్యయనాన్ని విజయవంతంగా ముగించి డాక్టరేట్ పొందారు. కవితలు, పాటలు, పద్యాలు రాసి సహస్ర విభూషణ బిరుదు పొందారు. బషీరాబాగ్‌లోని ప్రెస్‌క్లబ్బులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం ఆమె ఫౌండేషన్ నిర్వాహకుల నుంచి అవార్డు అందుకుంటున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఉమాదేవి హైదరాబాదు బయలు దేరి వెళ్లారు.