దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.
‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్ వేసేవాడు పెద్ద కిట్ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్ డిజైనర్ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్ కనిపిస్తుంది.
మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.
తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు?
ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?
లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.
ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది.
తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్.ఐ వితరణశీలత ఏమని చెప్పుట?
ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్– ఐదు వేలు!
140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం!
Comments
Please login to add a commentAdd a comment