Telugu literary
-
అత్యున్నత ఐదువేలు
దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్ వేసేవాడు పెద్ద కిట్ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్ డిజైనర్ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్ కనిపిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్ వచ్చి వాష్బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం! -
తెలుగు భాష అజరామరం
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాష అజరామరమైందని, మరెన్ని శతాబ్దాలు గడిచినా నవనవోన్మేషితంగా వెలుగొందుతూనే ఉంటుందని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు భాషకు మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, ఆస్ట్రేలియాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ వేదికగా జరిగిన రెండవ తెలుగు సాహిత్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుమల్లి వ్యవస్థాపకులు మల్లికేశ్వర్రావు కొంచాడ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీలత మగతల ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. గోల్కొండ కుతుబ్షాహీలు, ఆ తరువాత వచ్చిన అసఫ్జాహీల కాలంలో అధికార భాషలుగా పర్షియా, ఉర్ధూ వంటివి కొనసాగినప్పటికీ ప్రజల భాషగా తెలుగు వర్ధిల్లిందన్నారు. కాకతీయుల కాలం నాటికే తెలంగాణలో గొప్ప సాహిత్యం వెలువడిందని పేర్కొన్నారు. ఎంతోమంది కవులు, కవయిత్రులు తెలుగు భాషలో సాహితీ సృజన చేశారన్నారు. బసవపురాణం రాసిన పాల్కురికి సోమనాథుడు తన ద్విపద కావ్యాలతో తెలుగును సుసంపన్నం చేశారని అన్నారు. ప్రముఖ అధ్యాపకులు,వ్యక్తిత్వ వికాసనిపుణులు ఆకేళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ, నిరంతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మూర్తిమత్వం వికసిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కోవిడ్ మమ్మారి సృష్టించిన పరిణామాలపై న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రచురించిన రెప్పవాల్చని కాలం పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సింగపూర్ నుంచి రత్నకుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి,తదితరులు పాల్గొన్నారు. అలాగే న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,మలేసియా, సింగపూర్, తదితర దేశాలకు చెందిన తెలుగు కవులు, రచయితలు పాల్గొన్నారు. -
పాత్రో స్మృతి చిహ్నం నిర్మిద్దాం
ఉత్తరాంధ్ర మాండలికానికి విశేష గుర్తింపు తెచ్చిన ప్రముఖ నాటక, చలనచిత్ర రచయిత బి. ఎన్. గణేశ్పాత్రో మరణం తెలుగు సాహిత్య, కళారంగాలకే తీరనిలోటు. తెలుగునాట మాండలికాలకు సాహిత్య, సాంస్కృతిక గౌరవం కల్పించడంలో పాత్రో కృషి అనన్య సామాన్యం. రావిశాస్త్రి, చాసో, కారా, పతంజలి వంటి వారు మాండలికంలో గొప్ప సాహిత్యాన్ని సృజించారు. కాగా, పాత్రో రంగస్థలంపై అదే పని చేశా రు. తెలుగు రంగస్థలిపై ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టంగట్టారు. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘అసురసంధ్య’, ‘త్రివేణి’ తదితర నాటి కలు, నాటకాలు అలాంటివే. సినిమారంగంలోనూ పాత్రో మాట తూ టాలా పేలింది. ‘మరోచరిత్ర’, ‘ఇది కథకాదు’. ‘ఆకలిరాజ్యం’, ‘చిల కమ్మ చెప్పింది’ తదితర చిత్రాల సంభాషణలు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఔత్సాహిక సాంఘిక నాటక రంగం బతికి బట్టకట్టడానికి ఒక ముఖ్య కారణం పాత్రోయే. తెలుగు నాటక, సినీ రంగాలకు విశిష్ట సేవలను అందించిన గణేశ్ పాత్రో పుట్టింది విజ యనగరం జిల్లా మార్కొండ పుట్టిలోనే అయినా, ఆయన సాహితీ, రంగస్థల ప్రస్థానం ప్రారంభమైనది విశాఖపట్టణంలోనే. కాబట్టి విశా ఖలో గణేశ్పాత్రో స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి రెండు రాష్ట్రాలలోని రంగస్థల, సినీ ప్రముఖులంతా పూనుకోవాలని విజ్ఞప్తి. - వి. కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా -
కొత్త విమర్శకులు తయారవుతున్నారు...
రాచపాళెం ‘తెలుగు సాహితీ విమర్శ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది’ అనే విమర్శలు వినిపిస్తున్న కాలంలో సాహిత్య అకాడెమీ వరుసగా రెండేళ్ల పాటు విమర్శకే పట్టం కట్టి అది ఏమాత్రం బలహీనంగా లేదని లోకానికి వెల్లడి చేసింది. విమర్శలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి 2014 సంవత్సరానికిగాను తనకు ప్రకటించిన అకాడెమీ పురస్కారాన్ని సగౌరవంగా స్వీకరిస్తూనే ఆ ఉత్సాహంలో చేయవలసిన పనిని విస్మరించకుండా మరింత ముందుకు వెళ్ల సంకల్పించారు. ఆయనతో మాటామంతీ..... అవార్డు వస్తుందని ఊహించారా? విమర్శకు పురస్కారాలివ్వడం తక్కువ. ఇతర భాషలను చూసినా విమర్శారంగంలో సాహిత్య అకాడెమీ నుంచి పురస్కారాలు అందుకున్నవారు వారు తక్కువగా ఉన్నారు. కనుక ఈ అవార్డు రావడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇందుకోసం రేసులో ఉన్నట్టు ఊహించలేదు. నా పుస్తకం పరిశీలనలో ఉన్నట్టు కూడా నాకు తెలియదు. తెలుగులో సాహిత్య విమర్శ తక్కువగా ఉందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో గత రెండేళ్లుగా విమర్శకులకే ఈ అవార్డు దక్కడాన్ని ఎలా చూస్తారు? తెలుగు సాహిత్య విమర్శ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని చాలా రోజులుగా వింటున్నాం. ఆ మాటను రచయితలు ఎక్కువగా అంటుంటారు (నవ్వుతూ). కాని కొత్త విమర్శకులు ఎప్పుడూ వస్తూనే ఉన్నారు. మా తర్వాతి తరంలో విమర్శను బాగా రాస్తున్నవారిలో సంగిశెట్టి శ్రీనివాస్, జిలుకర శ్రీనివాస్, పగడాల నాగేందర్, మేడిపల్లి రవి కుమార్ తదితరులు ఉన్నారు. మాతరం వాళ్లలో రెంటాల శ్రీవెంకటేశ్వరరావు బాగా విమర్శ రాస్తున్నారు. విమర్శ రాసే వారిలో స్పష్టమైన భావజాలం ఉండటం ముఖ్యం. ఒక కమిట్మెంట్ ఒక దృక్పథం ఉండాలి. విశ్వనాథ మీద ఎంత ఆవేశంతో విమర్శ చేస్తారో శ్రీశ్రీ మీద అంతే ఆవేశంగా ప్రశంస చేస్తారు. అక్కడ వస్తుంది సమస్య. విమర్శకుడిగా రాణించాలంటే? కేవలం సాహిత్యం మాత్రం చదువుకుంటే సరిపోదు. సామాజిక శాస్త్రాలను కూడా సమగ్రంగా సంపూర్ణంగా చదువుకోవాలి. ఒక రచనను అంచనా వేయాలంటే దేశ కాలమాన పరిస్థితుల్లో ఎక్కడ ఉంచి అంచనా వేయాలో తెలియాలి. వర్తమాన కథ గురించి చెబుతారా వస్తుబలం బాగా కనిపిస్తోంది. కొత్తకొత్త వస్తువులను కథాంశాలుగా చూపించ గలుగుతున్నారు. అయితే వస్తువుని కథగా మలచడానికి శిల్పపరంగా యిబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం తమకు ముందునాటి కథా సాహిత్యాన్ని విస్తృతంగా చదవకపోవటం. ఇతర భాషల కథల్ని కూడా చదవాలన్న స్పృహ లేకపోవటం. గోర్కి ఒకసారి యువ రచయితలను ఉద్దేశించి అంటాడు- మీకిష్టమున్నా లేకపోయినా ముందుతరాల సాహిత్యం చదవాలి. అప్పుడే భిన్నంగా మెరుగ్గా రాయగలరు అని. మిగిలిన భాషల్లో విమర్శ ప్రక్రియ ఎలా ఉంది? కన్నడంలో బాగా ఉందని విన్నాను. కన్నడ, తమిళ భాషాల్లో వెస్ట్రనైజ్డ్ క్రిటిసిజమ్ ఉందని అంటారు. వడలి మందేశ్వరరావు గారు దీన్ని ‘నియో క్రిటిసిజమ్’ లేదా ‘నవ్య విమర్శ’ అంటుండేవారు. మీకు అవార్డు తెచ్చిపెట్టిన ‘మన నవలలు- మన కథానికలు’ గురించి చెప్పాలంటే? తెలుగులో కవిత్వం ఎక్కువ. కవిత్వంపై విమర్శ ఎక్కువ. కల్పనా సాహిత్యం మీద విమర్శ తక్కువ. ఆ వెలితిని పూడ్చటానికి కాత్యాయనీ విద్మహే, ఓల్గా, ఎన్.వేణుగోపాల్, గుడిపాటి, కె.శ్రీదేవి, పాపినేని శివశంకర్ వంటి వారు దృష్టి పెడుతున్నారు. నేను కూడా కవిత్వ విమర్శ ఎక్కువ చేశాను. నా పుస్తకం ‘మన నవలలు- మన కథానికలు’లో సగం నవలా విమర్శ సగం కథావిమర్శ ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాల్లో ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానిక’, ‘తెలుగు దళిత కథానిక’ అనే రెండు నాకిష్టమైనవి. మీకిష్టమైన విమర్శ గ్రంథాలు అంటే ఏం చెబుతారు? రాచమల్లు రామచంద్రారెడ్డి ‘సారస్వత వివేచన’, త్రిపురనేని మధుసూదనరావు ‘సాహిత్యంలో వస్తుశిల్పాలు’, కొడవటిగంటి కుటుంబరావు ‘సాహిత్య వ్యాసాలూ’. చెయ్యాలనుకుంటున్న పనులు? ‘సాహిత్య సిద్ధాంతాలు- సాహిత్య విమర్శ సూత్రాలు’ పేరుతో ఒక పుస్తకం రాద్దామను కుంటున్నాను. అలాగే ‘తెలుగు సాహిత్య విమర్శ చరిత్ర’ రాస్తాను. ఆ దిశలో ఎస్.వి.రామారావుగారు కొంత కృషి చేశారు. దాన్ని సమగ్రంగా చేద్దామనుకుంటున్నాను. తెలుగు సాహిత్యం ఎలా ఉండబోతోంది. ప్రపంచీకరణ అన్ని రంగాలను తాకుతోంది. ఇది పాఠకులను దృష్టి మళ్లించే అవకాశం ఉంది. సీరియస్ సాహిత్యం నుంచి పక్కకు లాగేసే పరిస్థితి ఉంది. టెలివిజన్ సీరియళ్లు, ఇతర కాలక్షేప రచనలు పాఠకుడి సంస్కారం మీద తీవ్రమైన దెబ్బ కొడుతున్నాయి. ఈ దశలో సాహిత్యం పాఠకుణ్ణి తనవైపు తిప్పుకోవడం కష్టమైన పనే. కాని నేను ఆశావాదిని. ప్రజల వైపు నిలిచే సాహిత్యమే నిలుస్తుంది. తుది విజయం దానిదే. - సి.ఎస్.రాంబాబు, 94904 01005