కొత్త విమర్శకులు తయారవుతున్నారు...
రాచపాళెం
‘తెలుగు సాహితీ విమర్శ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది’ అనే విమర్శలు వినిపిస్తున్న కాలంలో సాహిత్య అకాడెమీ వరుసగా రెండేళ్ల పాటు విమర్శకే పట్టం కట్టి అది ఏమాత్రం బలహీనంగా లేదని లోకానికి వెల్లడి చేసింది. విమర్శలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి 2014 సంవత్సరానికిగాను తనకు ప్రకటించిన అకాడెమీ పురస్కారాన్ని సగౌరవంగా స్వీకరిస్తూనే ఆ ఉత్సాహంలో చేయవలసిన పనిని విస్మరించకుండా మరింత ముందుకు వెళ్ల సంకల్పించారు. ఆయనతో మాటామంతీ.....
అవార్డు వస్తుందని ఊహించారా?
విమర్శకు పురస్కారాలివ్వడం తక్కువ. ఇతర భాషలను చూసినా విమర్శారంగంలో సాహిత్య అకాడెమీ నుంచి పురస్కారాలు అందుకున్నవారు వారు తక్కువగా ఉన్నారు. కనుక ఈ అవార్డు రావడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇందుకోసం రేసులో ఉన్నట్టు ఊహించలేదు. నా పుస్తకం పరిశీలనలో ఉన్నట్టు కూడా నాకు తెలియదు. తెలుగులో సాహిత్య విమర్శ తక్కువగా ఉందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో గత రెండేళ్లుగా విమర్శకులకే ఈ అవార్డు దక్కడాన్ని ఎలా చూస్తారు?
తెలుగు సాహిత్య విమర్శ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉందని చాలా రోజులుగా వింటున్నాం. ఆ మాటను రచయితలు ఎక్కువగా అంటుంటారు (నవ్వుతూ). కాని కొత్త విమర్శకులు ఎప్పుడూ వస్తూనే ఉన్నారు. మా తర్వాతి తరంలో విమర్శను బాగా రాస్తున్నవారిలో సంగిశెట్టి శ్రీనివాస్, జిలుకర శ్రీనివాస్, పగడాల నాగేందర్, మేడిపల్లి రవి కుమార్ తదితరులు ఉన్నారు. మాతరం వాళ్లలో రెంటాల శ్రీవెంకటేశ్వరరావు బాగా విమర్శ రాస్తున్నారు. విమర్శ రాసే వారిలో స్పష్టమైన భావజాలం ఉండటం ముఖ్యం. ఒక కమిట్‌మెంట్ ఒక దృక్పథం ఉండాలి. విశ్వనాథ మీద ఎంత ఆవేశంతో విమర్శ చేస్తారో శ్రీశ్రీ మీద అంతే ఆవేశంగా ప్రశంస చేస్తారు. అక్కడ వస్తుంది సమస్య.
విమర్శకుడిగా రాణించాలంటే?
కేవలం సాహిత్యం మాత్రం చదువుకుంటే సరిపోదు. సామాజిక శాస్త్రాలను కూడా సమగ్రంగా సంపూర్ణంగా చదువుకోవాలి. ఒక రచనను అంచనా వేయాలంటే దేశ కాలమాన పరిస్థితుల్లో ఎక్కడ ఉంచి అంచనా వేయాలో తెలియాలి.
వర్తమాన కథ గురించి చెబుతారా
వస్తుబలం బాగా కనిపిస్తోంది. కొత్తకొత్త వస్తువులను కథాంశాలుగా చూపించ గలుగుతున్నారు. అయితే వస్తువుని కథగా మలచడానికి శిల్పపరంగా యిబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం తమకు ముందునాటి కథా సాహిత్యాన్ని విస్తృతంగా చదవకపోవటం. ఇతర భాషల కథల్ని కూడా చదవాలన్న స్పృహ లేకపోవటం. గోర్కి ఒకసారి యువ రచయితలను ఉద్దేశించి అంటాడు- మీకిష్టమున్నా లేకపోయినా ముందుతరాల సాహిత్యం చదవాలి. అప్పుడే భిన్నంగా మెరుగ్గా రాయగలరు అని.
మిగిలిన భాషల్లో విమర్శ ప్రక్రియ ఎలా ఉంది?
కన్నడంలో బాగా ఉందని విన్నాను. కన్నడ, తమిళ భాషాల్లో వెస్ట్రనైజ్డ్ క్రిటిసిజమ్ ఉందని అంటారు. వడలి మందేశ్వరరావు గారు దీన్ని ‘నియో క్రిటిసిజమ్’ లేదా ‘నవ్య విమర్శ’ అంటుండేవారు.
మీకు అవార్డు తెచ్చిపెట్టిన ‘మన నవలలు- మన కథానికలు’ గురించి చెప్పాలంటే?
తెలుగులో కవిత్వం ఎక్కువ. కవిత్వంపై విమర్శ ఎక్కువ. కల్పనా సాహిత్యం మీద విమర్శ తక్కువ. ఆ వెలితిని పూడ్చటానికి కాత్యాయనీ విద్మహే, ఓల్గా, ఎన్.వేణుగోపాల్, గుడిపాటి, కె.శ్రీదేవి, పాపినేని శివశంకర్ వంటి వారు దృష్టి పెడుతున్నారు. నేను కూడా కవిత్వ విమర్శ ఎక్కువ చేశాను. నా పుస్తకం ‘మన నవలలు- మన కథానికలు’లో సగం నవలా విమర్శ సగం కథావిమర్శ ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాల్లో ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానిక’, ‘తెలుగు దళిత కథానిక’ అనే రెండు నాకిష్టమైనవి.
మీకిష్టమైన విమర్శ గ్రంథాలు అంటే ఏం చెబుతారు?
రాచమల్లు రామచంద్రారెడ్డి ‘సారస్వత వివేచన’, త్రిపురనేని మధుసూదనరావు ‘సాహిత్యంలో వస్తుశిల్పాలు’, కొడవటిగంటి కుటుంబరావు ‘సాహిత్య వ్యాసాలూ’.
చెయ్యాలనుకుంటున్న పనులు?
‘సాహిత్య సిద్ధాంతాలు- సాహిత్య విమర్శ సూత్రాలు’ పేరుతో ఒక పుస్తకం రాద్దామను కుంటున్నాను. అలాగే ‘తెలుగు సాహిత్య విమర్శ చరిత్ర’ రాస్తాను. ఆ దిశలో ఎస్.వి.రామారావుగారు కొంత కృషి చేశారు. దాన్ని సమగ్రంగా చేద్దామనుకుంటున్నాను.
తెలుగు సాహిత్యం ఎలా ఉండబోతోంది.
ప్రపంచీకరణ అన్ని రంగాలను తాకుతోంది. ఇది పాఠకులను దృష్టి మళ్లించే అవకాశం ఉంది. సీరియస్ సాహిత్యం నుంచి పక్కకు లాగేసే పరిస్థితి ఉంది. టెలివిజన్ సీరియళ్లు, ఇతర కాలక్షేప రచనలు పాఠకుడి సంస్కారం మీద తీవ్రమైన దెబ్బ కొడుతున్నాయి. ఈ దశలో సాహిత్యం పాఠకుణ్ణి తనవైపు తిప్పుకోవడం కష్టమైన పనే. కాని నేను ఆశావాదిని. ప్రజల వైపు నిలిచే సాహిత్యమే నిలుస్తుంది. తుది విజయం దానిదే.
- సి.ఎస్.రాంబాబు, 94904 01005