పురస్కారాలు అందుకున్న 43 మంది తెలుగు కవులు, పండితులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇకపై తెలుగులో లేకపోతే నేటి నుంచి శిక్షలు అమలు చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సృజనాత్మక–సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, తెలుగు ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ థియేటర్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గతంలో అధికార భాషా సంఘానికి.. సలహాలు, సూచనలివ్వడం తప్ప శిక్షలు అమలుచేసే అధికారం లేదన్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం తెలుగును పాలనా భాషగా అమలు చేయకపోతే శిక్షలు విధించే అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రక నిర్ణయమని తెలిపారు.
తెలుగు భాష ఎప్పటికీ మనతోనే..
రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలున్నంత కాలం తెలుగు భాష ఉంటుందన్నారు. తెలుగుని మరుగున పడేస్తున్నారంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు.
ఇక దేశంలో హిందీ తర్వాత చరిత్ర కలిగిన భాష తెలుగేనని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం.. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, భాషా పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ పురస్కారాలు ప్రదానంచేసి సత్కరించింది. ఈ వేడుకల్లో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ మల్లికార్జునతో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment