yarlagadda lakshmiprasad
-
ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇక తెలుగులోనే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇకపై తెలుగులో లేకపోతే నేటి నుంచి శిక్షలు అమలు చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సృజనాత్మక–సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, తెలుగు ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గతంలో అధికార భాషా సంఘానికి.. సలహాలు, సూచనలివ్వడం తప్ప శిక్షలు అమలుచేసే అధికారం లేదన్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం తెలుగును పాలనా భాషగా అమలు చేయకపోతే శిక్షలు విధించే అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రక నిర్ణయమని తెలిపారు. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే.. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలున్నంత కాలం తెలుగు భాష ఉంటుందన్నారు. తెలుగుని మరుగున పడేస్తున్నారంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఇక దేశంలో హిందీ తర్వాత చరిత్ర కలిగిన భాష తెలుగేనని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం.. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, భాషా పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ పురస్కారాలు ప్రదానంచేసి సత్కరించింది. ఈ వేడుకల్లో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ మల్లికార్జునతో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఇది తెలుగు భాషకు ‘దగాది’ : యార్లగడ్డ
రాజమహేంద్రవరం కల్చరల్: ‘‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదిది.. తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో శుక్రవారం ఆయన మండుటెండలో ‘ఆవేదన దీక్ష’ చేశారు. కవులు, కళాకారుల కోసం తన ఎన్నికల ప్రణాళిలో టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాని అమలుకూ అడుగు పడలేదన్నారు. చెన్నైలో పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ చేసిన భవనంలో సాహిత్య కార్యక్రమాలకుసీఎంగా ఎన్టీ రామారావు ఏడాదికి రూ.లక్ష మంజూరు చేస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిని రూ.2 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని ప్రస్తుత మంత్రులు హామీ ఇచ్చినా మూడేళ్లుగా బకాయిలే విడుదల కాలేదన్నారు. -
తెలుగు బతికేది యువతతోనే
-కెనడా సాహితీ సభలో యార్లగడ్డ హైదరాబాద్: తెలుగు భాషా, సంస్కృతులు అనే మాధుర్యాన్ని భావితరాల వారికి యువత అనే వారధి ద్వారా అందిస్తేనే మనగలుగుతాయని కెనడాలో తొలి భారత సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించిన మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదివారం యార్లగడ్డ కెనడా పర్యటన సందర్భంగా టొరంటో నగరంలో తెలుగు వాహిని సంస్ధ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాహితీ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులను సాహితీ సభలకు ఆహ్వానించి, వారికి గురురత బాధ్యతలు అప్పగించి ఆకర్షించాలని, తద్వారా వారిలో భాషపై జిజ్ఞాసను పెంపొందించాలని ఆయన సూచించారు. కెనడాలోని తెలుగు యువతీ యువకులకు సాహిత్య పోటీలు నిర్వహించాలని దానికి తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కెనడాలోని తెలుగువారు రాసే కధలు, కవితలు, రచనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా ప్రచురించి, విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. తద్వారా కెనడాలోని తెలుగువారి జీవన స్ధితిగతుల పట్ల, వారి దైనందిన విధానల పట్ల ప్రపంచానికి ఓ సానుకూల అవగాహన ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2009 నుండి ప్రతి నెల సాహితీ సమ్మేళనం నిర్వహిస్తున్న ఈ సంస్ధ తన పర్యటన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా వ్యవస్ధాపక సభ్యుడు వెలువోలు బసవయ్య, ఆచార్య కొమరవోలు రావు, కొమరవోలు సరోజ, డాక్టర్ దేశికాచారి, దగ్గుబాటి శ్రీరాం, దగ్గుబాటి అజంతా, పిళ్లారిశెట్టి కళా, భాస్కర్, ప్రయాగ రాం, సంధ్య, ఎన్.శ్రీనివాస్, కుందుర్పి ప్రభు, లతా, పోతంశెట్టి సత్య, విజయ, సోమయాజుల సాయిప్రసాద్, యాచమనేని ప్రేం, స్వర్ణ, పిల్లే నాగేశ్వర్, సుధా, నెల్లుట్ల తిరుమల రావు, రాజశ్రీ, వేమూరి బోస్, రాణి, పోతకమూరి భాను, నళిని, అర్ధం ఓంకారం, నిడుమోలు మూర్తి, తిమ్మన సుమతీ, కొమరగిరి ప్రమీళ, మోటేపల్లి రాజేంద్ర ప్రసాద్, మాధవి, దుగ్గిన శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.