తెలుగు బతికేది యువతతోనే
-కెనడా సాహితీ సభలో యార్లగడ్డ
హైదరాబాద్: తెలుగు భాషా, సంస్కృతులు అనే మాధుర్యాన్ని భావితరాల వారికి యువత అనే వారధి ద్వారా అందిస్తేనే మనగలుగుతాయని కెనడాలో తొలి భారత సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించిన మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదివారం యార్లగడ్డ కెనడా పర్యటన సందర్భంగా టొరంటో నగరంలో తెలుగు వాహిని సంస్ధ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాహితీ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులను సాహితీ సభలకు ఆహ్వానించి, వారికి గురురత బాధ్యతలు అప్పగించి ఆకర్షించాలని, తద్వారా వారిలో భాషపై జిజ్ఞాసను పెంపొందించాలని ఆయన సూచించారు.
కెనడాలోని తెలుగు యువతీ యువకులకు సాహిత్య పోటీలు నిర్వహించాలని దానికి తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కెనడాలోని తెలుగువారు రాసే కధలు, కవితలు, రచనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా ప్రచురించి, విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. తద్వారా కెనడాలోని తెలుగువారి జీవన స్ధితిగతుల పట్ల, వారి దైనందిన విధానల పట్ల ప్రపంచానికి ఓ సానుకూల అవగాహన ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2009 నుండి ప్రతి నెల సాహితీ సమ్మేళనం నిర్వహిస్తున్న ఈ సంస్ధ తన పర్యటన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా వ్యవస్ధాపక సభ్యుడు వెలువోలు బసవయ్య, ఆచార్య కొమరవోలు రావు, కొమరవోలు సరోజ, డాక్టర్ దేశికాచారి, దగ్గుబాటి శ్రీరాం, దగ్గుబాటి అజంతా, పిళ్లారిశెట్టి కళా, భాస్కర్, ప్రయాగ రాం, సంధ్య, ఎన్.శ్రీనివాస్, కుందుర్పి ప్రభు, లతా, పోతంశెట్టి సత్య, విజయ, సోమయాజుల సాయిప్రసాద్, యాచమనేని ప్రేం, స్వర్ణ, పిల్లే నాగేశ్వర్, సుధా, నెల్లుట్ల తిరుమల రావు, రాజశ్రీ, వేమూరి బోస్, రాణి, పోతకమూరి భాను, నళిని, అర్ధం ఓంకారం, నిడుమోలు మూర్తి, తిమ్మన సుమతీ, కొమరగిరి ప్రమీళ, మోటేపల్లి రాజేంద్ర ప్రసాద్, మాధవి, దుగ్గిన శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.