న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే, అర్థం చేసుకునే భాషలలో హిందీ ఒకటి. హిందీ ప్రజల భాష అని మహాత్మా గాంధీ అభివర్ణించారు. అలాగే దానిని దేశ జాతీయ భాషగా చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. 1949, సెప్టెంబర్ 14న హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. అందుకే ఈ రోజు(సెప్టెంబర్ 14)ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ సభ ఆంగ్లంతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా ఆమోదించింది. మొదటి హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14న జరుపుకున్నారు. దీనిపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
మనదేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు. నిజానికి హిందీ జాతీయ భాష కాదు. ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. నిజానికి భారత రాజ్యాంగంలో ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో భాషపై చర్చ జరిగింది. ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంత మంది కోరగా, మరికొందరు దీనిని వ్యతిరేకించారు.
రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత హిందీని అధికార భాషగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపి రూపంలో హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. 1949, సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీకి అధికార భాష హోదాను ఇచ్చింది. అధికారిక భాషకు జాతీయ భాషకు మధ్య వ్యత్యాసం ఉంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను తెలియజేసేందుకు ఉపయోగించేది జాతీయ భాష. ప్రభుత్వం తన అధికారిక పనుల కోసం ఉపయోగించేది అధికారిక భాష అవుతుంది. జాతీయ న్యాయస్థానం, పార్లమెంట్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీని అధికారికంగా వినియోగిస్తుంటారు.
ఇది కూడా చదవండి: ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
Comments
Please login to add a commentAdd a comment