Kiccha Sudeep and Ajay Devgn Fight over hindi language: War OF Words - Sakshi
Sakshi News home page

Ajay Vs Kiccha Sudeep: భాష భాస్వరమైన వేళ..

Published Fri, Apr 29 2022 4:54 AM | Last Updated on Fri, Apr 29 2022 10:40 AM

War of Words between Kiccha Sudeep and Ajay Devgan over hindi language  - Sakshi

హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్‌ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి.  

చరిత్రలోకి తొంగి చూస్తే..  
హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్‌ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్‌ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్‌ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు.

చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది.  

హిందీ ఎంతమంది మాట్లాడతారు ?  
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్‌లో బంపర్‌ హిట్‌ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్‌–2 సూపర్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర           ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్‌ రాజకీయ    రంగు పులుముకుంది.  

మూడు భాషల ఫార్ములా  
ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్‌ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్‌ సెకండ్‌ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి        

స్థానిక భాషే సుప్రీం
కేజీఎఫ్‌–2 సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్‌ సుదీప్, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది.  హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్‌ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు.

మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్‌ చేసిన ట్వీట్‌ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్‌) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్‌ మంత్రి డాక్టర్‌ సిఎన్‌ అశ్వంత్‌ నారాయణ్‌ కమ్యూనికేషన్‌ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement