Official language
-
Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది?
న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే, అర్థం చేసుకునే భాషలలో హిందీ ఒకటి. హిందీ ప్రజల భాష అని మహాత్మా గాంధీ అభివర్ణించారు. అలాగే దానిని దేశ జాతీయ భాషగా చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. 1949, సెప్టెంబర్ 14న హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. అందుకే ఈ రోజు(సెప్టెంబర్ 14)ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ సభ ఆంగ్లంతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా ఆమోదించింది. మొదటి హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14న జరుపుకున్నారు. దీనిపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.మనదేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు. నిజానికి హిందీ జాతీయ భాష కాదు. ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. నిజానికి భారత రాజ్యాంగంలో ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో భాషపై చర్చ జరిగింది. ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంత మంది కోరగా, మరికొందరు దీనిని వ్యతిరేకించారు.రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత హిందీని అధికార భాషగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపి రూపంలో హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. 1949, సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీకి అధికార భాష హోదాను ఇచ్చింది. అధికారిక భాషకు జాతీయ భాషకు మధ్య వ్యత్యాసం ఉంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను తెలియజేసేందుకు ఉపయోగించేది జాతీయ భాష. ప్రభుత్వం తన అధికారిక పనుల కోసం ఉపయోగించేది అధికారిక భాష అవుతుంది. జాతీయ న్యాయస్థానం, పార్లమెంట్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీని అధికారికంగా వినియోగిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ? -
అన్ని భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశమివ్వాలి
సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అమిత్ షాకు ఓ లేఖ రాశారు. సీఆర్పీఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కోరారు. కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడంతో తీవ్ర వివక్ష ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవని లేదా హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 2020 నవంబర్ 18న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయమై లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకుల పట్ల ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా వారికి సమాన అవకాశాలు దక్కేలా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. -
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు
సాక్షి, అమరావతి: అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో అధికారిక, పరిపాలన కార్యకలాపాలు తెలుగు భాషలో కొనసాగే విధంగా పర్యవేక్షించడంతో పాటు తెలుగు భాషా ప్రగతికి సిఫారసులు, సూచనలు చేయాల్సి ఉంటుంది. చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ -
ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇక తెలుగులోనే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇకపై తెలుగులో లేకపోతే నేటి నుంచి శిక్షలు అమలు చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సృజనాత్మక–సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, తెలుగు ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గతంలో అధికార భాషా సంఘానికి.. సలహాలు, సూచనలివ్వడం తప్ప శిక్షలు అమలుచేసే అధికారం లేదన్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం తెలుగును పాలనా భాషగా అమలు చేయకపోతే శిక్షలు విధించే అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రక నిర్ణయమని తెలిపారు. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే.. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలున్నంత కాలం తెలుగు భాష ఉంటుందన్నారు. తెలుగుని మరుగున పడేస్తున్నారంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఇక దేశంలో హిందీ తర్వాత చరిత్ర కలిగిన భాష తెలుగేనని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం.. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, భాషా పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ పురస్కారాలు ప్రదానంచేసి సత్కరించింది. ఈ వేడుకల్లో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ మల్లికార్జునతో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్! మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దీన్ని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది. -
అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?
జాతీయోద్యమ కాలం నుంచీ ఒక ఉమ్మడి భాషగా హిందీ వ్యాపించిన వాస్తవాన్ని కాదనలేం. మరీ ముఖ్యంగా హిందీ సినిమాల జనాదరణ (పాటలతో పాటు) మూలంగా దేశం నలుమూలలా హిందీ భాషను అర్థం చేసుకోగల వాతావరణం ఏర్పడింది. సాహిత్యపరంగా ప్రేమ్‌చంద్, రాహుల్ సాంకృత్యాయన్, జయశంకర్ ప్రసాద్, దిన్కర్ నిరాలా వంటి రచయితలు – కవులు, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పాఠకుల ఆదరణ పొందారు. ప్రస్తుతం హిందీ దేశవ్యాప్తంగా ఒక అధికార భాషగా లేదా అనుసంధాన భాషగా వాడుకలో ఉన్నప్పటికీ... హిందీయేతర ప్రాంతీయులకు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలకు అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇంగ్లిష్ ప్రాబల్యం పెరిగిన తర్వాత, హిందీ వెనుకబడిపోయింది. ఇక అసలు వివాదమెక్కడంటే భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన (ఇంగ్లిష్తో సహా) 23 భాషలన్నీ జాతీయ భాషలే అనే యథార్థాన్ని హిందీవాదులు విస్మరించడం! ఫలితంగా హిందీ భాష ఆధిపత్యమనే ప్రమాదమున్నదని... ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేకత పెరిగింది. అయినా అక్కడే చెన్నైలో ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ చేసిన భాషా సేవను తక్కువగా అంచనా వేయలేం. జాతీయ సమైక్యతకు హిందీ ఒక వాహికగా ఉండగలదనే నమ్మకమే ఆ ప్రచారానికి దోహదపడింది. ఇక ప్రాంతాల పరస్పర సంబంధాల రీత్యా, మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం దక్షిణాది వారంతా మాతృభాషతోపాటు హిందీ –ఇంగ్లిష్ నేర్చుకొంటే... ఉత్తరాది వాళ్లు మాత్రం తమ హిందీతో పాటు ఇంగ్లిష్తో సరిపెట్టుకొన్నారు. ప్రయోగ రీత్యా హరియాణా– పంజాబ్, బిహార్–ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో దక్షిణాది భాష లను అక్కడి కొన్ని విద్యాలయాల్లో బోధించినా ప్రోత్సాహం లభించలేదు. ఈ వైరుద్ధ్యం వల్ల ఈనాటికీ దక్షిణాది–ఉత్తరాది ప్రజల మధ్య భాషాపరంగా ఒక అగాథం మిగిలిపోయింది. బహుభాషా రాష్ట్రాలుగా ఉన్న ఈ దేశంలో... ప్రాంతీయంగా అక్కడి భాష అధి కార భాషగా ఉన్నప్పటికీ చాలావరకు ఇంగ్లిష్‌లోనే పరిపాలన సాగుతున్న యథార్థాన్ని కాదనగలమా? తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలు తప్ప ఇతరత్రా అక్కడి ప్రజల భాషలో అధికార తతంగ మంతా ఇంగ్లిష్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు హిందీని కేంద్ర ప్రభుత్వం రైల్వే విభాగాల్లో, బ్యాంకు, పోస్టల్ సర్వీసుల్లో సమాంతరంగా ప్రవేశపెట్టి అధికార భాషగా చాలాకాలం కిందటే అమలు చేసింది. ఇక్కడే ఒక ఆచరణా త్మక వాస్తవాన్ని గుర్తించక తప్పదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో, కేంద్ర పాలనలో మిగతా 22 భాషలను అధికార భాషలుగా అమలు చేయడం ఆచరణలో అసాధ్యం. అందువల్ల ఉమ్మడి భాషలుగా ఇంగ్లిష్–హిందీ భాషలు మన వ్యవహారంలో అనుసంధానంగా కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాన్ని తిరస్కరించి, హిందీ పట్ల ద్వేషం పెంచుకోవడం భారతీయ భాషల పట్ల అపచారమే! బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి ద్వారా ఇంగ్లిష్ (మనదేశంలో వలస పాలన) ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత ఆ భాషను మనం సామ్రాజ్యవాద భాష అని తిరస్కరించామా? ఒకప్పుడు లోహియా సోషలిస్టులు ‘అంగ్రేజీ హఠావో’ (ఇంగ్లిష్‌ను తొలగించండి) అని ఉద్యమించినా, ఉపాధి రీత్యా, సాంకేతిక తదితర విద్యాబోధనా మాధ్యమంగా ఇంగ్లిష్ అనివార్యమై ప్రాథమిక స్థాయి నుంచే దానిని నేర్చుకోవాలనే స్థితికి చేరుకున్నాం. మరో అతి ముఖ్యమైన అంశం– అనుసంధాన భాషగా హిందీ ఈ దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న భాష. భాషా పరంగా అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఒక రచయితగా నేను ఈరోజు హిందీలో కూడా రచనలు చేయగలుగుతున్నాను. హైస్కూలు స్థాయి నుంచి ‘త్రిభాషా సూత్రం’లో భాగంగా హిందీ రెండో భాషగా నేర్చు కోవడం వల్ల అది సాధ్యమైంది. గతంలో ఉర్దూ పదాల కలయికతో ‘హిందూస్తానీ’ భాషగా ప్రజల్లోకి వెళ్లిన హిందీని, ఉత్తరాది భాషా దురభిమానులు పనిగట్టుకుని సంస్కృతభూయిష్టంగా, పరిమితు ల్లోకి నెట్టివేశారు. అందువల్లే హిందుత్వ ఛాదస్తుల ప్రమాదం మరిం తగా భాషాపరంగా ఉందని చాలామంది భయపడుతున్నారు. ఇతరత్రా హిందీ మెజారిటీ ప్రజల భాష అనే వాదన పట్ల కొన్ని అభ్యంతరాలున్న మాట కూడా వాస్తవం. ‘ది పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన సంపాదకుడు, ప్రముఖ భాషావేత్త, జీఎన్ దెవీ వివరణ ప్రకారం– 2011లో నమోదైన (సంఖ్యాపరంగా) హిందీ భాషీయులు 52.83 కోట్లు. అయితే ఈ హిందీ అనే ప్రాంతా లలోనే భోజ్‌పురి, మైథిలి, ఛత్తీస్‌గఢ్, రాజస్థానీ, పవాడీ మొదలైన స్థానిక భాషలు కలిసి ఉన్నాయి. వీటిని తీసివేస్తే, హిందీ అనేది 32 శాతానికి దిగి వస్తున్నదని దెవీ వాదన. (క్లిక్: ఆంగ్లంతోనే అనుసంధానం) హిందీ ఆధునికమైన భాష. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నదే. దెవీ భావిస్తున్నట్టు హిందీ అందమైన భాష. సాహిత్యపరంగా గౌరవ స్థానాన్ని సాధించుకున్నది. హిందీ సినిమా జనామోదం వల్ల దేశానికి ఎంతో ఖ్యాతిని, విదేశీ మారకాన్ని సంతరించి పెట్టింది. భౌగోళికంగా, చారిత్రక కారణాల వల్ల, పాలనా సౌలభ్య రీత్యా హిందీని అనుసంధాన భాషగా గౌరవించాలి. ఇంగ్లి ష్‌తో పాటు హిందీ అవసరాన్ని గత వందేళ్ల చరిత్ర నిరూపించింది. (చదవండి: ఒక్క భాషకు పెత్తనమా?) - నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత -
అధికార భాషా చట్టం అమలుకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ 70 నుంచి 80 శాతం వరకు తెలుగులోనే సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అధికార భాషా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. చట్టం తీసుకొచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా అధికార భాష అమలుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామంది. తగిన సమయంలో చట్ట ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపింది. అధికార భాష అమలుకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లు అమలుకు నోచుకోలేదని, ఈ నేపథ్యంలో 2020లో అధికార భాష కమిషన్‌ను ఏర్పాటు చేశారని వివరించింది. అధికార భాషా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కౌంటర్ దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
హిందీ కన్నా అంబేడ్కర్‌కు సంస్కృతమే ఇష్టం
నాగపూర్: సంస్కృత భాషను భారతదేశ అధికార జాతీయ భాషగా ప్రకటించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకు తెలుసని అన్నారు. అలాగే రాజకీయ, సామాజిక పరిస్థితులు కూడా అంబేడ్కర్ బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే ఆ ప్రతిపాదన తెచ్చారని వెల్లడించారు. జస్టిస్ బాబ్డే బుధవారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ఎంఎన్‌ఎల్‌యూ) అకడమిక్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. మన ప్రాచీన మేధావులు న్యాయశాస్త్రం గురించి సమగ్రంగా బోధించారని గుర్తుచేశారు. అరిస్టాలిట్ వంటి పాశ్చాత్యుల బోధనకంటే ఇవి ఎందులోనూ తీసుపోవని అన్నారు. మన మేధావులు చెప్పిన విషయాలను పక్కనపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో ఏ భాష వాడాలన్నదానిపై సుప్రీంకోర్టుకు చాలా విజ్ఞాపనలు వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అంబేడ్కర్ ముందే ఊహించారని, అందుకే సంస్కృతాన్ని దేశ అధికార జాతీయ భాషగా మార్చాలని ప్రతిపాదించారని తెలిపారు. ‘‘ఉత్తర భారతదేశంలో తమిళ భాషను అంగీకరించరన్నది అంబేడ్కర్ అభిప్రాయం. అలాగే దక్షిణ భారతదేశంలో హిందీని ఒప్పుకోరని ఆయన నిర్ణయానికొచ్చారు. అందుకే సంస్కృతాన్ని దేశ అధికార భాషగా ప్రకటిస్తే ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవని భావించారు. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు’’ అని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో చేరేవారికి లా స్కూల్ ఒక నర్సరీలాంటిదన్నారు. - జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది. కశ్మీరీ, డోంగ్రీ, హిందీ.. జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్ వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
మరి..వారు ఆంగ్లంలో ఎందుకు మాట్లాడరు!
సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ డీఎంకే నేత కనిమొళి ‘హిందీ రాకపోతే భారతీయులం కాదా’ అని ప్రశ్నించిన క్రమంలో ఈ ఘటనపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం సోమవారం స్పందించారు. చెన్నై విమానాశ్రయంలో కనిమొళికి ఎదురైన అనుభవం అసాధారణమైనది కాదని ఆయన చెప్పుకొచ్చారు. తనకూ ఇదే తరహాలో గతంలో ఫోన్లో మాట్లాడే సందర్భాల్లో, ముఖాముఖిల్లోనూ హిందీలో మాట్లాడాలని పలువురు కోరారని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి సాధారణ పౌరుల నుంచీ తనకు ఇలాంటి అనుభవాలు పలుమార్లు ఎదురయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ రెండూ అధికార భాషలైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ రెండు భాషల్లో మాట్లాడేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన హిందీయేతరులు సత్వరమే హిందీలో నైపుణ్యం సాధిస్తుంటే హిందీ మాట్లాడే ఉద్యోగులు ఆంగ్లంలో పట్టుసాధించి ఎందుకు మాట్లాడలేరని ఆయన మరో ట్వీట్లో ప్రశ్నించారు. కాగా కనిమొళికి ఎదురైన అనుభవంపై కాంగ్రెస్ నేత, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరన్ విస్మయం వ్యక్తం చేశారు. పౌరులకు భాషా పరీక్ష భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని తనకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది. చదవండి : రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా! -
‘ప్రాంతీయ భాషలకు అందలం’
చెన్నై : తమిళం సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన భాషలను అధికార భాషలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కోరారు. తమిళ భాష అత్యంత ప్రాచీన భాషని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ స్వాగతించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన తమిళ భాషను అధికార భాషగా అభివృద్ధి చేయాలని ప్రధానిని కోరారు. శ్రీలంక, సింగపూర్ దేశాల్లో అధికార భాషగా వెలుగొందుతున్న తమిళ భాషకు భారత్‌లో ఆ హోదా లేదని గుర్తుచేశారు. హిందీ, సంస్కృతాన్ని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్న ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల పేర్లకు హిందీలో పేర్లు పెడుతున్నారని, వాటిని తమిళంలోకి తర్జుమా చేయడం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన చెన్నై పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళ భాషపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తమిళం అత్యంత ప్రాచీన భాషగా ఆయన అభివర్ణించారు. -
బోధనాభాష–పాలనాభాషగా తెలుగు
ప్రపంచ తెలుగు మహాసభల పేరిట హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా అధికారి కంగా జరిగిన అపూర్వ సాంస్కృతిక ఉత్సవం ఇది. తెలంగాణ గ్రామీణ ప్రజానీకం గుండె గొంతుకలో తెలుగు భాష ఇప్పటికీ సజీవంగా ఉండటం వల్లే ఈ సభలు ఇంతగా విజయవంతమయ్యాయి. తిరుపతిలో 2012లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలని నిర్ణయించిన తీర్మానం కనీస అమలుకు కూడా నోచుకోకపోవడం అప్పటి పాలకుల చిత్తుశుద్ధిని చెబుతుంది. ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తేనే పాలనాభాషగా తెలుగు గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యాసంస్థలు న్యాయస్థానాల ద్వారా ఏవో లొసుగులతో ఈ యజ్ఞానికి గండి కొట్టే ప్రయత్నం చేయకుండా ఆపాలి. మున్ముందుగా పాలనా భాషను పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా తక్షణం అమలు చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులన్నీ తెలుగులో వెలువరిస్తామని చెప్పినప్పటికీ అది నిరంతర ప్రక్రియ కావాలి. అందుకు అవసరమయ్యే భాషా నిఘంటువును అత్యాధునికంగా తయారు చేయించాలి. తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటాను ప్రకటించినప్పటికీ ఈ అంశాన్ని స్పష్టంగా ఏయే రకాలుగా అమలు చేస్తారో ఉత్తర్వులు ఇవ్వాలి. హైదరాబాద్, వరంగల్‌లో ఉన్న ప్రభుత్వ తెలుగు భాషా పండిత శిక్షణా కళాశాలను పునరుద్ధరించాలి. లబ్ధ ప్రతి ష్టులైన ఆచార్యులను అక్కడ నియమించాలి. ఐదు రోజుల సభలకు తండోపతండాలుగా వచ్చిన జనాల కోసం నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగేలా రవీంద్రభారతి లాంటి మరొక విశాల భవనాన్ని (కనీసం 5 వేల మంది ఒకేసారి పాల్గొనేలా) నిర్మించాలి. ఈసారి జరిగిన నిరంతర కవి సమ్మేళన ప్రక్రియ ఒక అపూర్వ ప్రయోగంలా నిలిచిపోతుంది. ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి దాకా కొనసాగిన కవి సమ్మేళనాలు కొత్త ప్రక్రియకు తెరలేపాయి. 42 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపే విధంగా తెలుగు విశ్వ విద్యాలయం, సాహిత్య అకాడమీల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థ పేర్లను తెలుగులోనే రాయాలనే ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి. తమిళనాడు తరహాలో న్యాయస్థానాల తీర్పులన్నీ ఇక నుంచి తెలుగులోనే వెలువడాలి. ప్రతి యేటా తెలుగు భాషా అభివృద్ధి కోసం పురస్కారాలు ప్రోత్సాహకాలు ఇస్తూ తెలుగు మహాసభలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తే తెలుగు వెలుగు నూరు వసంతాల పాటు గుబాళిస్తుంది. – డా‘‘ కె. రామదాస్, అఖిల భారత బీఎడ్, డీఎడ్ కళాశాలల ప్రధానాచార్యుల సంఘ ప్రధాన కార్యదర్శి -
హిందీ.. హమారీ రాష్ట్ర భాష హై క్యా?
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భాష హిందీని ఎలాగైనా సరే దేశప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. అయితే కొన్ని చోట్ల హిందీకి వ్యతిరేకంగా.. ముఖ్యంగా దక్షిణ భారతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గింది. హమారీ మాతృభాష హిందీ హమారీ.. పెహ్చాన్ హై హమేఁ ఇస్పే గర్వ్ కర్నా చాహియే అంటూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు ఓ మీటింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు. అదే సమయంలో పార్లమెంటులో కూడా సభ్యులు హిందీలోనే మాట్లాడాలనే ప్యానెల్ విధించిన రూల్ ఆయన గుర్తుచేసారు. కట్ చేస్తే... ఇప్పుడు మన మంత్రులు ఎంత సాధించారు? పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. కేబినెట్ లో ఇప్పుడున్న ఎక్కువ మంది మంత్రులు పూర్తి స్థాయిలో హిందీ భాషను అధికారికంగా ఉపయోగించటం లేదని విషయం తెలుస్తోంది. హోం శాఖ, నీతి ఆయోగ్, ఐబీ మంత్రిత్వ శాఖ ఇలా 20 శాఖల్లో నిర్వహించిన సమీక్షతో ఈ విషయం వెలుగు చూసింది. ఇక శాఖల వారీగా పరిశీలిస్తే... ఉమా భారతి జలవనరుల శాఖ ఒక్కటి మాత్రమే గరిష్టంగా హిందీ భాషను ఉపయోగిస్తోంది. ఫైల్ నోటింగ్‌లు దాదాపు 58 శాతం హిందీలోనే అవుతుండగా... ఆ శాఖకు సంబంధించి 44 మంది అధికారుల్లో 40 మంది పని వేళలో హిందీలోనే మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆమె ఎక్కువగా హిందీలోనే మాట్లాడుతుండటంతో.. అధికారులు కూడా ఉమా భారతి బాటలోనే పయనిస్తున్నారని అర్థమౌతోంది. కీలకమైన హోం శాఖ విషయానికొస్తే... 112 సీనియర్ అధకారులు తమకు హిందీ వచ్చనే గతంలో చెప్పగా.. 49 మంది 30 శాతం కంటే తక్కువగా ఆ భాషను వినియోగించటం గమనార్హం. ఇక మిగిలిన వారిలో మరో 38 మంది 30 నుంచి 70 శాతం మాత్రమే హిందీ భాషను వినియోగిస్తున్నారని తేలింది. 55 శాతం ఫైల్ నోటింగ్స్ హిందీలోనే జరుగుతున్నప్పటికీ.. వాటికి బదులు ఆంగ్లంలోనే ఇస్తున్నారన్నది వెల్లడైంది. నీతి ఆయోగ్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. 59 మంది అధికారుల్లో ఒక్కరు కూడా హిందీలో మాట్లాడకపోవటం విశేషం. అదే సమయంలో 39 శాతం.. అది కూడా ఫైల్ నోటింగ్ కోసం హిందీని వినియోగిస్తున్నారు. ఇక తమ విభాగంలో సాంకేతిక సేవలకు చెందిన అధికారులు ఎక్కువగా ఉండటంతోనే హిందీని వినియోగించటం కష్టతరంగా ఉందని ఐబీ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైల్ నోటింగ్ కోసం 35 శాతం వినియోగిస్తుండగా.. 98 మంది అధికారుల్లో 36 మంది 70 శాతం మేర హిందీని వినియోగిస్తున్నారు. పర్యావరణ శాఖ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కావటంతో ఆ శాఖలోనూ హిందీయేతర కార్యకలాపాలే ఎక్కువ దర్శనమిస్తున్నాయి. మిగతా మంత్రిత్వ శాఖల్లోనూ, పైగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. మొత్తానికి మంత్రులకు తగ్గట్లే ఆయా శాఖలు.. అందులోని అధికారులు కూడా హిందీ భాషను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రజలకు మాత్రం స్పీచులు ఇస్తున్నారన్న మాట. -
రాజభాష ప్రహసనం ఇంకానా?
హిందీని అధికారభాషగా చేయాలని చేసిన కృషి సాధించినది ఏదైనా ఉందంటే అది.. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద భాషగా ఉన్న దానిని అంతరించిపోతున్న భాష స్థాయికి దిగజార్చడమే. హిందీ చుట్టూ ఉన్న అధికారిక పటాటోపమంతా కలసి దాన్ని ఇంగ్లిష్‌కు దాసోహం చేసింది. హిందీ ప్రత్యేక హోదా ఆ భాషకు మిగతా భాషలతో ఉన్న సంబంధా లను దెబ్బతీసింది. హిందీ మాట్లాడనివారంతా బడిలో అంతో ఇంతో హిందీని నేర్చుకోవా ల్సిందే. కానీ హిందీ మాట్లాడేవారు ఏదో ఒక ఇతర భారతీయ భాషను నేర్చుకోరు. మరో అధికారభాషా కమిటీ తన నివేదికను సమర్పించింది. అది సైతం మరిన్ని పవిత్ర సూచనలను చేసింది, వాటిని ఆమోదించారు కూడా. ఈ అంశంపై నిద్రాణంగా ఉన్న బహిరంగ చర్చ తిరిగి మొదలైంది. మొత్తంగా ఈ వ్యవహారమంతా మరోసారి అవే పాత ఫలితాల దిశగా సాగుతోంది. ఆ నివేదిక నిరపాయకరంగా కాగితాలకే పరిమితమూ కావచ్చు లేదా హిందీ, దానికి విరుద్ధంగా ఇతర భారతీయ భాషలు అనే రీతిలో చర్చను పెడదోవ పట్టించనూవచ్చు. హిందీని అధికార భాష(రాజభాష)గా అభివృద్ధి చేయాలనుకోవడం నిరర్థకమైనది, హానికరమైనది అని ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను. హిందీ స్థాయిని పెంపొందింపజేయడంపై మన అధికారిక వైఖరిని సమీక్షించు కోవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దివస్‌గా జరుపు కోవడాన్ని మానాలని కొన్నేళ్ల క్రితమే నేను కోరాను. తప్పుల కుప్పకు సంకేతం హిందీ దివస్: హిందీని అధికార భాషగా అభివృద్ధిపరచాలన్న భారత ప్రభుత్వ కృషి సాధిం చిన అసాధారణ విజయం ఏదైనా ఉందంటే అది... ప్రపంచంలో నాలుగో అతి పెద్ద భాషగా (మాండ్రైన్, స్పానిష్, ఇంగ్లిష్ తర్వాత) ఉన్న దానిని అంతరించిపోతున్న జాతులలో ఒక దాని స్థాయికి దిగజార్చడమే. హిందీ దివస్‌లు మన దేశ భాషావిధానంలో ఉన్న తప్పులన్నిటికీ సంకేతంగా నిలుస్తాయి. ఈ పరిస్థితి మారి తీరాల్సిందే. హిందీ దివస్ అనే జాతీయ స్థాయి తంతుకు స్వస్తి పలకడంతో మనం ఈ మార్పునకు శ్రీకారం చుట్ట గలుగుతాం. నా సూచన విడ్డూరంగా అనిపించొచ్చు. హిందీవాలా అని ∙పిలిపించు కుంటూ తిరిగే నేనే ఇలా అనడం వల్ల ప్రత్యేకించి అలా అనిపించొచ్చు. ఇందుకు నా మిత్రులు సైతం అభ్యంతరం తెలుపవచ్చు. ఈ తంతుకు మరింతగా జవసత్వాలను చేకూర్చాల్సిన అవసరం ఉందని, అధికార భాషగా హిందీకి ఉన్న నామమాత్రమైన అ«ధికారిక గుర్తింపునకు బదులుగా దాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సి ఉన్నదని వారు వాదించవచ్చు. నేను వారితో విభేదిస్తాను. హిందీ చుట్టూ ఉన్న అధికారిక పటాటోప మంతా కలసి దాన్ని ఇంగ్లిష్‌కు దాసోహం చేసిందని అనుకుంటాను. అంత కంటే అధ్వానంగా అది హిందీకి ఇతర భారతీయ భాషలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను తెంచేయడానికి తోడ్పడింది. ఆ భాషలన్నీ తమ సొంత మాండలికాలతో, శక్తులతో, సృజనాత్మకతతో ప్రవర్ధిల్లడం కొనసాగుతూనే ఉంది. మనం ముందుకు సాగాలీ అంటే ఈ వారసత్వంతో పూర్తిగా తెగ తెంపులు చేసుకోవడం అవసరం. అది ఎందుకో ఎలాగో వివరిస్తాను. ఇంగ్లిషుకు దాసోహమైన ‘రాజభాష’: అధికారికమైన రాజభాష అనే ముద్ర దేశంలో హిందీకి ఉన్న నిజమైన హోదాను కప్పిపెట్టేస్తుంది. నిజాన్ని గ్రహించడానికి మీరు ఒక్కసారి మీ చుట్టూ పరికించి చూస్తే సరిపోతుంది. సర్వవ్యాప్తమైన రాపిడ్ ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సుల ప్రకటనలు, సదా తామరతెంపరగా పుట్టుకొస్తూనే ఉండే ఇంగ్లిష్ మీడియం ‘కాన్వెంట్’ స్కూళ్లు, అరకొర అధ్వానపు ఇంగ్లిష్‌లో తమ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగించాలని చేసే దయనీయమైన ప్రయత్నాలు కనిపిస్తాయి. ఇవన్నీ భాషల విషయంలో కొట్టొచ్చినట్టుగా కనిపించే ఆధిప త్యాన్ని సూచిస్తాయి. ఇంగ్లిష్ అంతా ఆకాంక్షించే భాష. మరే గత్యంతరం లేని వారికే హిందీ. యూపీఎస్సీకి సంబంధించి అతి ముఖ్యమైన సివిల్ సర్వీసు పరీక్షల్లోని సీ–సాట్ (C-SAT)పేపర్‌పై వివాదం ఇంగ్లిష్‌దే ఆధిపత్యమని మరోమారు రుజువు చేసింది. భావి సివిల్ సర్వీసు అధికారుల భాషాపరమైన శక్తియుక్తులను... ఇంగ్లిష్ మూలం నుంచి అనువదించడం ద్వారానే నిర్ధారి స్తామనడం వలసవాద ఆలోచనా విధానం. అది ఒక జాతీ యస్థాయి కుంభ కోణానికి తక్కువదేమీ కాదు. అయినా ప్రభుత్వం ఆ పరీక్ష విషయంలో ముందుకే సాగింది. అధికారం భాష ఇంగ్లిషే. ఇతర భారతీయ భాషలతో సంబంధాలకు దెబ్బ: దీనికి సంబంధించి, హిందీకి పట్టిన గతి ఇతర భారతీయ భాషలకు పట్టిన గతికంటే భిన్నమైనదేం కాదు. అయినా హిందీకి ఉన్న ప్రత్యేక హోదా ఆ భాషకు మిగతా భాషలతో ఉన్న సంబంధాలను దెబ్బతీసింది. మన రాజ్యాంగం ఎక్కడా ‘‘జాతీయ భాష’’ అన్న ప్రస్తావనే లేదు. అయినా హిందీ మాట్లాడేవారు తమ మాతృభాషకు ఆ హోదా కావాలని భావిస్తుంటారు. ఇతరులు దీనిపట్ల నిరసనను వ్యక్తం చేస్తారు. హిందీ దేశంలోని అతి పెద్ద భాషే కావచ్చు. కానీ అది అతి పురాతనమైనదీ కాదు, ఆధునిక భారతీయ భాషల్లోకెల్లా అత్యంత సుసంపన్నమైనదీ కాదు. హిందీ మాట్లాడని ప్రతి ఒక్కరూ బడిలో అంతో ఇంతో హిందీని నేర్చుకోవాల్సిందే. కానీ హిందీ మాట్లాడేవారు మాత్రం ఇతర ఆధునిక భారతీయ భాషలను నేర్చుకోవడం నుంచి తప్పించుకుంటారు. నిజానికి సర్కారీ హిందీ, హిందీని దాని మూల భాషల, పదుల కొలదీ ఉన్న దాని ‘మాండలీకాల’ భాషాపరమైన, సాంస్కృతికపరమైన వారసత్వా నికి దూరం చేసింది. ఇక హిందీ, ఉర్దూ భాషల మధ్య అగాధాన్ని అది నిర్వి రామ కృషితో శ్రద్ధగా పెంపొందింపజేసింది. హిందీ చనిపోయింది లేదా చనిపోతోంది అని కాదు. తద్విరుద్ధంగా, అది ప్రవర్ధిల్లుతోంది, చాలా రంగాలకు వ్యాపిస్తోంది. ముంబై సినిమా, క్రికెట్ కామెంటరీ, వేగంగా వృద్ధి చెందుతున్న హిందీ మీడియా హిందీ భాషను సజీవంగా ఉంచాయి. వర్తమాన హిందీ సాహిత్యంలోని అత్యుత్తమ రచనలు మరే ఆధునిక భాషా సాహిత్యంతోనైనా సరితూగుతాయి. హిందీ భాషకు చక్కటి సాంప్రదాయక సాహిత్య విమర్శ, సామాజిక శాస్త్రాలపై పెంపొం దుతున్న విజ్ఞాన సంపదా ఉంది. ఇవన్నీ హిందీని అ«ధికారిక భాషగా పెంపొం దింపచేయడం వల్ల కాదు, చేసినా సమకూరినవి. అందువల్లనే ‘హిందీ దివస్’ను రద్దు చేయాలని నా ప్రతిపాదన. మన దేశ భాషా వైవిధ్యాన్ని, సంపదను సూచించే విధంగా వివిధ భారతీయ భాషల మధ్య అనుసంధానాలను బలవత్తరం చేసుకోవడం కోసం హిందీ దివస్ స్థానే ‘భాషా దివస్’ను జరుపుకోవాలి. అధికార వ్యవస్థ ఆ పని చేయ డానికి విముఖంగా ఉంటుంది. కాబట్టి హిందీ భాషను ప్రేమించేవారు ఈ ప్రహసనానికి తెరదించడానికి చొరవ చెయ్యాలి. హిందీని పూజించకండి వాడుకునేలా సంస్కరించండి: అందుకు బదులుగా వారు ఏం చెయ్యాలి? హిందీని పూజించడానికి బదు లుగా, ఆ భాషను వాడటమే దానికి చేయగల అత్యుత్తమమైన సేవ. మొద టగా మనం చేయాల్సినది, ఏమాత్రం అంతుబట్టనిదిగా అతిగా సంస్కృ తీకరించిన అధికారిక హిందీ స్థానంలో... ఉపయుక్తమైన, వాడుకోగలిగిన నిఘంటువులను తయారుచేయాలి. హిందీ తన పద కోశాన్ని సుసంపన్నం చేసుకోడానికి వీలుగా భాషా ‘మాండలీకాల’కు, ఇంగ్లిష్ సహా ఇతర భాష లకు తలుపులను తెరిచి ఉంచాలి. మోటారు మెకానిక్‌లు, వివిధ సేవలను అందించేవారు ఈ విషయంలో మార్గదర్శకులు కాగలుగుతారు. రెండు, మనం కొత్త తరం ఈ కృషిలో పాల్గొనేలా చేయాలంటే పిల్లల కోసం, పెద్ద పిల్లల కోసం సాహిత్యాన్ని సృష్టించాలి. గుల్జార్ ‘బోసీ కా పంచతంత్ర’ లేదా సుకుమార్ రే ‘అబోల్–తబోల్’ వంటిని అందుకు నమూనాలుగా ఉపయోగ పడతాయి. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయికి చెందిన మంచి నాణ్యమైన పాఠ్యగ్రంథాలను రచించాల్సిన అవసరం ఉంది. మూడు, చీనీ, జపానీ భాషల్లా హిందీని కూడా ఇంటర్నెట్కు అను వైనదిగా మార్చాలి. నాలుగు, ఇంగ్లిష్ తదితర భాషల్లోంచి హిందీలోకి భారీ ఎత్తున అనువాదాలను చేసే కార్యక్రమాన్ని, ఒక జాతీయ ఉద్యమం స్థాయిలో చేపట్టడం అవసరం. ఇతర భారతీయ భాషల సాహిత్య వనరులు హిందీలో అందుబాటులో ఉండేలా చేయాలి. హిందీ కేవలం షాయరీలనేగాక న్యాయ పరిభాషను కూడా ఉర్దూ నుంచి స్వీకరించాలి. తమిళ సంప్రదాయ వార సత్వాన్ని, మలయాళ అచ్చు సంస్కృతిని, వర్తమాన కన్నడ సాహిత్యాన్ని, మరాఠీ ధిక్కార సాహిత్యాన్ని బెంగాలీ విద్యాసంబంధ రచనాశైలిని హిందీ స్వీకరించాలి. హిందీని ప్రచారం చే సే అత్యుత్తమ మార్గం దాన్ని ప్రచారం చేయడాన్ని ఆపేయడమే. దాని మానానికి దాన్ని వదిలేయడమే. అంటే నిశ్శబ్దంగా అది వివిధ ప్రజా సముదాయాలతో, భాషలతో అనుసంధానాలను పెంపొందిం చుకోనివ్వడమే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav