
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020.
వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి.
మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్‌డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది.
కశ్మీరీ, డోంగ్రీ, హిందీ..
జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది.
బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్
వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్‌డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్‌సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment