రాజభాష ప్రహసనం ఇంకానా? | english dominating the Hindi as the official language | Sakshi
Sakshi News home page

రాజభాష ప్రహసనం ఇంకానా?

Published Thu, Apr 20 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

రాజభాష ప్రహసనం ఇంకానా?

రాజభాష ప్రహసనం ఇంకానా?

హిందీని అధికారభాషగా చేయాలని చేసిన కృషి సాధించినది ఏదైనా ఉందంటే అది.. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద భాషగా ఉన్న దానిని అంతరించిపోతున్న భాష స్థాయికి దిగజార్చడమే. హిందీ చుట్టూ ఉన్న అధికారిక పటాటోపమంతా కలసి దాన్ని ఇంగ్లిష్‌కు దాసోహం చేసింది. హిందీ ప్రత్యేక హోదా ఆ భాషకు మిగతా భాషలతో ఉన్న సంబంధా లను దెబ్బతీసింది. హిందీ మాట్లాడనివారంతా బడిలో అంతో ఇంతో హిందీని నేర్చుకోవా ల్సిందే. కానీ హిందీ మాట్లాడేవారు ఏదో ఒక ఇతర భారతీయ భాషను నేర్చుకోరు.

మరో అధికారభాషా కమిటీ తన నివేదికను సమర్పించింది. అది సైతం మరిన్ని పవిత్ర సూచనలను చేసింది, వాటిని ఆమోదించారు కూడా. ఈ అంశంపై నిద్రాణంగా ఉన్న బహిరంగ చర్చ తిరిగి మొదలైంది. మొత్తంగా ఈ వ్యవహారమంతా మరోసారి అవే పాత ఫలితాల దిశగా సాగుతోంది. ఆ నివేదిక నిరపాయకరంగా కాగితాలకే పరిమితమూ కావచ్చు లేదా హిందీ, దానికి  విరుద్ధంగా ఇతర భారతీయ భాషలు అనే రీతిలో చర్చను పెడదోవ పట్టించనూవచ్చు. హిందీని అధికార భాష(రాజభాష)గా అభివృద్ధి చేయాలనుకోవడం నిరర్థకమైనది, హానికరమైనది అని ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను. హిందీ స్థాయిని పెంపొందింపజేయడంపై మన అధికారిక వైఖరిని సమీక్షించు కోవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్‌ 14వ తేదీని హిందీ దివస్‌గా జరుపు కోవడాన్ని మానాలని కొన్నేళ్ల క్రితమే నేను కోరాను.

తప్పుల కుప్పకు సంకేతం హిందీ దివస్‌: హిందీని అధికార భాషగా అభివృద్ధిపరచాలన్న భారత ప్రభుత్వ కృషి సాధిం చిన అసాధారణ విజయం ఏదైనా ఉందంటే అది... ప్రపంచంలో నాలుగో అతి పెద్ద భాషగా (మాండ్రైన్, స్పానిష్, ఇంగ్లిష్‌ తర్వాత) ఉన్న దానిని అంతరించిపోతున్న జాతులలో ఒక దాని స్థాయికి దిగజార్చడమే. హిందీ దివస్‌లు మన దేశ భాషావిధానంలో ఉన్న తప్పులన్నిటికీ సంకేతంగా నిలుస్తాయి. ఈ పరిస్థితి మారి తీరాల్సిందే. హిందీ దివస్‌ అనే జాతీయ స్థాయి తంతుకు స్వస్తి పలకడంతో మనం ఈ మార్పునకు శ్రీకారం చుట్ట గలుగుతాం.

నా సూచన విడ్డూరంగా అనిపించొచ్చు. హిందీవాలా అని ∙పిలిపించు కుంటూ తిరిగే నేనే ఇలా అనడం వల్ల ప్రత్యేకించి అలా అనిపించొచ్చు. ఇందుకు నా మిత్రులు సైతం అభ్యంతరం తెలుపవచ్చు. ఈ తంతుకు మరింతగా జవసత్వాలను చేకూర్చాల్సిన అవసరం ఉందని, అధికార భాషగా హిందీకి ఉన్న నామమాత్రమైన అ«ధికారిక గుర్తింపునకు బదులుగా దాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సి ఉన్నదని వారు వాదించవచ్చు. నేను వారితో విభేదిస్తాను. హిందీ చుట్టూ ఉన్న అధికారిక  పటాటోప మంతా కలసి దాన్ని ఇంగ్లిష్‌కు దాసోహం చేసిందని అనుకుంటాను. అంత కంటే అధ్వానంగా అది హిందీకి ఇతర భారతీయ భాషలతో ఉన్న సంబంధ   బాంధవ్యాలను తెంచేయడానికి తోడ్పడింది. ఆ భాషలన్నీ తమ సొంత మాండలికాలతో, శక్తులతో, సృజనాత్మకతతో ప్రవర్ధిల్లడం కొనసాగుతూనే ఉంది. మనం ముందుకు సాగాలీ అంటే ఈ వారసత్వంతో పూర్తిగా తెగ తెంపులు చేసుకోవడం అవసరం. అది ఎందుకో ఎలాగో వివరిస్తాను.

ఇంగ్లిషుకు దాసోహమైన ‘రాజభాష’: అధికారికమైన రాజభాష అనే ముద్ర దేశంలో హిందీకి ఉన్న నిజమైన హోదాను కప్పిపెట్టేస్తుంది. నిజాన్ని గ్రహించడానికి మీరు ఒక్కసారి మీ చుట్టూ పరికించి చూస్తే సరిపోతుంది. సర్వవ్యాప్తమైన రాపిడ్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ కోర్సుల ప్రకటనలు, సదా తామరతెంపరగా పుట్టుకొస్తూనే ఉండే ఇంగ్లిష్‌ మీడియం  ‘కాన్వెంట్‌’ స్కూళ్లు, అరకొర అధ్వానపు ఇంగ్లిష్‌లో తమ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగించాలని చేసే దయనీయమైన ప్రయత్నాలు కనిపిస్తాయి. ఇవన్నీ భాషల విషయంలో  కొట్టొచ్చినట్టుగా కనిపించే ఆధిప త్యాన్ని సూచిస్తాయి. ఇంగ్లిష్‌ అంతా ఆకాంక్షించే భాష. మరే గత్యంతరం లేని వారికే హిందీ. యూపీఎస్‌సీకి సంబంధించి అతి ముఖ్యమైన సివిల్‌ సర్వీసు పరీక్షల్లోని సీ–సాట్‌ (C-SAT)పేపర్‌పై వివాదం ఇంగ్లిష్‌దే ఆధిపత్యమని మరోమారు రుజువు చేసింది. భావి సివిల్‌ సర్వీసు అధికారుల భాషాపరమైన శక్తియుక్తులను... ఇంగ్లిష్‌ మూలం నుంచి అనువదించడం ద్వారానే నిర్ధారి స్తామనడం వలసవాద ఆలోచనా విధానం. అది ఒక జాతీ యస్థాయి కుంభ కోణానికి తక్కువదేమీ కాదు. అయినా ప్రభుత్వం ఆ పరీక్ష విషయంలో ముందుకే సాగింది. అధికారం భాష ఇంగ్లిషే.

ఇతర భారతీయ భాషలతో సంబంధాలకు దెబ్బ: దీనికి సంబంధించి, హిందీకి పట్టిన గతి ఇతర భారతీయ భాషలకు పట్టిన గతికంటే భిన్నమైనదేం కాదు. అయినా హిందీకి ఉన్న ప్రత్యేక హోదా ఆ భాషకు మిగతా భాషలతో ఉన్న సంబంధాలను దెబ్బతీసింది. మన రాజ్యాంగం ఎక్కడా ‘‘జాతీయ భాష’’ అన్న ప్రస్తావనే లేదు. అయినా హిందీ మాట్లాడేవారు తమ మాతృభాషకు ఆ హోదా కావాలని భావిస్తుంటారు. ఇతరులు దీనిపట్ల నిరసనను వ్యక్తం చేస్తారు. హిందీ దేశంలోని అతి పెద్ద భాషే కావచ్చు. కానీ అది అతి పురాతనమైనదీ కాదు, ఆధునిక భారతీయ భాషల్లోకెల్లా అత్యంత సుసంపన్నమైనదీ కాదు. హిందీ మాట్లాడని ప్రతి ఒక్కరూ బడిలో అంతో ఇంతో హిందీని నేర్చుకోవాల్సిందే. కానీ హిందీ మాట్లాడేవారు మాత్రం ఇతర ఆధునిక భారతీయ భాషలను నేర్చుకోవడం నుంచి తప్పించుకుంటారు. నిజానికి సర్కారీ హిందీ, హిందీని దాని మూల భాషల, పదుల కొలదీ ఉన్న దాని ‘మాండలీకాల’ భాషాపరమైన, సాంస్కృతికపరమైన వారసత్వా నికి దూరం చేసింది. ఇక హిందీ, ఉర్దూ భాషల మధ్య  అగాధాన్ని అది నిర్వి రామ కృషితో శ్రద్ధగా పెంపొందింపజేసింది.

హిందీ చనిపోయింది లేదా చనిపోతోంది అని కాదు. తద్విరుద్ధంగా, అది ప్రవర్ధిల్లుతోంది, చాలా రంగాలకు వ్యాపిస్తోంది. ముంబై సినిమా, క్రికెట్‌ కామెంటరీ, వేగంగా వృద్ధి చెందుతున్న హిందీ మీడియా హిందీ భాషను సజీవంగా ఉంచాయి. వర్తమాన హిందీ సాహిత్యంలోని అత్యుత్తమ రచనలు మరే ఆధునిక భాషా సాహిత్యంతోనైనా సరితూగుతాయి. హిందీ భాషకు చక్కటి సాంప్రదాయక సాహిత్య విమర్శ, సామాజిక శాస్త్రాలపై పెంపొం దుతున్న విజ్ఞాన సంపదా ఉంది. ఇవన్నీ హిందీని అ«ధికారిక భాషగా పెంపొం దింపచేయడం వల్ల కాదు, చేసినా సమకూరినవి.
 
అందువల్లనే ‘హిందీ దివస్‌’ను రద్దు చేయాలని నా ప్రతిపాదన. మన దేశ భాషా వైవిధ్యాన్ని, సంపదను సూచించే విధంగా వివిధ భారతీయ భాషల మధ్య అనుసంధానాలను బలవత్తరం చేసుకోవడం కోసం హిందీ దివస్‌ స్థానే ‘భాషా దివస్‌’ను జరుపుకోవాలి. అధికార వ్యవస్థ ఆ పని చేయ డానికి విముఖంగా ఉంటుంది. కాబట్టి హిందీ భాషను ప్రేమించేవారు ఈ ప్రహసనానికి తెరదించడానికి చొరవ చెయ్యాలి.

హిందీని పూజించకండి వాడుకునేలా సంస్కరించండి: అందుకు బదులుగా వారు ఏం చెయ్యాలి? హిందీని పూజించడానికి బదు లుగా, ఆ భాషను వాడటమే దానికి చేయగల అత్యుత్తమమైన సేవ. మొద టగా మనం చేయాల్సినది, ఏమాత్రం అంతుబట్టనిదిగా అతిగా సంస్కృ తీకరించిన అధికారిక హిందీ స్థానంలో... ఉపయుక్తమైన, వాడుకోగలిగిన నిఘంటువులను తయారుచేయాలి. హిందీ తన పద కోశాన్ని సుసంపన్నం చేసుకోడానికి వీలుగా భాషా ‘మాండలీకాల’కు, ఇంగ్లిష్‌ సహా ఇతర భాష లకు తలుపులను తెరిచి ఉంచాలి. మోటారు మెకానిక్‌లు, వివిధ సేవలను అందించేవారు ఈ విషయంలో మార్గదర్శకులు కాగలుగుతారు. రెండు, మనం కొత్త తరం ఈ కృషిలో పాల్గొనేలా చేయాలంటే పిల్లల కోసం, పెద్ద పిల్లల కోసం సాహిత్యాన్ని సృష్టించాలి. గుల్జార్‌  ‘బోసీ కా పంచతంత్ర’ లేదా సుకుమార్‌ రే  ‘అబోల్‌–తబోల్‌’ వంటిని అందుకు నమూనాలుగా ఉపయోగ పడతాయి. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయికి చెందిన మంచి నాణ్యమైన పాఠ్యగ్రంథాలను రచించాల్సిన అవసరం ఉంది.

మూడు, చీనీ, జపానీ భాషల్లా హిందీని కూడా ఇంటర్నెట్‌కు అను వైనదిగా మార్చాలి. నాలుగు, ఇంగ్లిష్‌ తదితర భాషల్లోంచి హిందీలోకి భారీ ఎత్తున అనువాదాలను చేసే కార్యక్రమాన్ని, ఒక జాతీయ ఉద్యమం స్థాయిలో చేపట్టడం అవసరం. ఇతర భారతీయ భాషల సాహిత్య వనరులు హిందీలో అందుబాటులో ఉండేలా చేయాలి. హిందీ కేవలం షాయరీలనేగాక  న్యాయ పరిభాషను కూడా ఉర్దూ నుంచి స్వీకరించాలి. తమిళ సంప్రదాయ వార సత్వాన్ని, మలయాళ అచ్చు సంస్కృతిని, వర్తమాన కన్నడ సాహిత్యాన్ని, మరాఠీ ధిక్కార సాహిత్యాన్ని బెంగాలీ విద్యాసంబంధ రచనాశైలిని హిందీ స్వీకరించాలి.

హిందీని ప్రచారం చే సే అత్యుత్తమ మార్గం దాన్ని ప్రచారం చేయడాన్ని ఆపేయడమే. దాని మానానికి దాన్ని వదిలేయడమే. అంటే నిశ్శబ్దంగా అది వివిధ ప్రజా సముదాయాలతో, భాషలతో అనుసంధానాలను పెంపొందిం చుకోనివ్వడమే.


యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986

Twitter : @_YogendraYadav

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement