
సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అమిత్ షాకు ఓ లేఖ రాశారు.
సీఆర్‌పీఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కోరారు. కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడంతో తీవ్ర వివక్ష ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవని లేదా హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత 2020 నవంబర్ 18న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయమై లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకుల పట్ల ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా వారికి సమాన అవకాశాలు దక్కేలా సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment