సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ ఆదిలాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్ స్టీరింగ్ తమ చేతిలోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయాన్ని అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పకుండా దాచారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అమిత్ షా తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు.
బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు
అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలవేళ బీజేపీ అబద్ధాలు విని రాష్ట్ర ప్రజలు విసిగి పోయా రని, పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి వాళ్లు మాట్లాడాలన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారన్నారు. ఆదిలాబాద్ సీసీఐని తెరిపిస్తామని ఐదేళ్ల క్రితం అమిత్ షా ఇచ్చిన హామీ ఏమైందని, గిరిజన యూనివర్సిటీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినా ఇప్పటిదాకా వర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
కుటుంబ పాలనపై మాట్లాడితే నవ్వుకుంటున్నారు
కుటుంబ పాలన అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య లపై దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని, క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన కొడుకు జై షా ఎక్కడ క్రికెట్ ఆడారో, ఎవరికి కోచింగ్ ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో పదేపదే తిరిగి ఎన్నికవుతున్న నాయకుల గురించి, కుటుంబ పాలన పేరుతో ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షా లాంటి వారికి లేదన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేకపోవడంతో కేవలం మత రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment