అమిత్‌ షా విమర్శలకు కేటీఆర్‌ ఘాటు కౌంటర్‌ | KTR Counter To Amit Shah Adilabad Speech | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా విమర్శలకు కేటీఆర్‌ ఘాటు కౌంటర్‌

Published Tue, Oct 10 2023 9:25 PM | Last Updated on Wed, Oct 11 2023 7:01 PM

KTR Counter To Amit Shah Adilabad Speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . ఆదిలాబాద్‌ బీజేపీ జనగర్జనలో, ఆపై హైదరాబాద్‌లో మేధావుల సదస్సుల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. షా విమర్శలకు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

‘‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు. అమిత్ షా తన అలవాటైన అబద్దాలను మరోసారి వల్లే వేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయని భారతీయ జనతా పార్టీ..  ఈరోజు అడ్డగోలు ప్రచారం చేసుకుంటోంది. ఆయన ప్రసంగాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కేవలం ఎన్నికలవేళ చేసే భారతీయ జనతా పార్టీ జూమ్లాలు, అబద్దాలను విని విని దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు.  వాటిని నమ్మే పరిస్థితి ఎమాత్రం లేదన్నారు.

దేశంలో పెరిగిన ధరల గురించి, పెరిగిన నిరుద్యోగం గురించి మాట్లాడితే మంచిదని అమిత్‌ షాకు కేటీఆర్‌ సూచించారు. అమిత్ షాకు దమ్ముంటే వ్యాపారవేత్త అదానీ గురించి మాట్లాడాలన్నారు.  ప్రధాని మోదీ, అమిత్ షాలు 100 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ అబద్ధాలకు ప్రభావితమయ్యే అవకాశం లేదని,  తెలంగాణ ప్రజలు  బీజేపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. 

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ  పచ్చి అబద్దాన్ని అమిత్ షా చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మకమైన రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ స్ఫూర్తిగా రైతుబంధు కార్యక్రమాన్ని కాపీ కొట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం తెలంగాణ గడ్డ నుంచి అబద్దాలు ఆడారన్నారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షా ఇలా అడ్డగోలుగా అబద్ధాలు ఆడడం దుర్మార్గమన్నారు. 

ఇదే అమిత్ షా ఐదు సంవత్సరాల కింద ఆదిలాబాద్ జిల్లాలో ప్రసంగిస్తూ.. అదిలాబాదులో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఐదు సంవత్సరాలు గడిచిన ఆ హామీపైన ఒక్క అడుగు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు వేయలేదు. ఇలాంటి నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ఉండడం తెలంగాణ రాష్ట్ర  దురదృష్టం అన్నారు కేటీఆర్‌.

రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల గడుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చట్టప్రకారం దక్కాల్సిన ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థను కూడా కేటాయించని కేంద్ర ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వారి ధ్వందనీతికి అద్దం పడుతుందన్నారు. చట్ట ప్రకారం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉన్నా, అటు పాఠశాల నుంచి మొదలుకొని వైద్య కళాశాల,  యూనివర్సిటీ వరకు ఇప్పటిదాకా ఒక్క విద్యాసంస్థను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. సంవత్సరాల కిందనే గిరిజన యూనివర్సిటీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినా ఇప్పటిదాకా యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదు అన్నారు. 

ఎన్నికల ముందు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ ఎన్నికల ప్రకటనలను తెలంగాణ ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న అమిత్ షాకు దమ్ముంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ కంటే గొప్పగా అభివృద్ధి చెందిన ఒక్క రాష్ట్రాన్ని అయినా చూపించాలి అన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం,  తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచిలు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందిందని, మరి బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా తెలంగాణతో పోటీ పడుతుందా చెప్పాలని,  ఈ విషయంలో తన సవాలు స్వీకరించాలన్నారు. 

కుటుంబ పాలన పైన అమిత్ షా మాట్లాడితే దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ సందర్భంలో అమిత్ షా కొడుకు జై షా ఎక్కడ క్రికెట్ ఆడారో, ఎక్కడ ఎవరికి  కోచింగ్ ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి అర్హతలు లేకున్నా బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కొడుకు విషయంలో ఉన్న పరివార్ వాద లబ్ది గురించి అమిత్ షా మాట్లాడితే మంచిదని అన్నారు. అమిత్ షా లాంటి నాయకులు పరివార్ వాద్ గురించి మాట్లాడితే ప్రజలు పరిహాసిస్తున్నారన్నారు . ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో పదేపదే తిరిగి ఎన్నికవుతున్న నాయకుల గురించి, కుటుంబ పాలన పేరుతో ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షా లాంటి వారికి లేదన్నారు. 

భారత రాష్ట్ర సమితి కారు స్టీరింగ్ ముమ్మాటికి మా చేతుల్లోనే ఉందనన్న కేటీఆర్‌,  ప్రధాని,  భారతీయ జనతా పార్టీ స్టీరింగ్ మాత్రం ముమ్మాటికి ఆదాని చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదన్నారు. సెప్టెంబర్ 17ను  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయాన్ని అమిత్ షాకు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పకుండా దాచి ఉంచారేమోనన్న కేటీఆర్‌..  ఆ విషయంలో అమిత్ షా తన వ్యాఖ్యల్ని సరిదిద్దుకోవాలని సూచించారు. 

అమిత్ షా కు భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాలు ఏం చేసిందో చెప్పి,  ప్రజలకు వివరించి వారి మద్దతు కోరాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేకపోవడంతో, అది చెప్పుకునే ధైర్యం లేక కేవలం మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ప్రజలు కచ్చితంగా  భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెబుతారని కేటీఆర్ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement