telugu poets
-
ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇక తెలుగులోనే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇకపై తెలుగులో లేకపోతే నేటి నుంచి శిక్షలు అమలు చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సృజనాత్మక–సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, తెలుగు ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గతంలో అధికార భాషా సంఘానికి.. సలహాలు, సూచనలివ్వడం తప్ప శిక్షలు అమలుచేసే అధికారం లేదన్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం తెలుగును పాలనా భాషగా అమలు చేయకపోతే శిక్షలు విధించే అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రక నిర్ణయమని తెలిపారు. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే.. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. తెలుగు భాష ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలున్నంత కాలం తెలుగు భాష ఉంటుందన్నారు. తెలుగుని మరుగున పడేస్తున్నారంటూ సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఇక దేశంలో హిందీ తర్వాత చరిత్ర కలిగిన భాష తెలుగేనని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం.. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, భాషా పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ పురస్కారాలు ప్రదానంచేసి సత్కరించింది. ఈ వేడుకల్లో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ మల్లికార్జునతో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
కవులకు గుళ్లు!
సాహిత్యం.. భక్తి తత్వానికి పట్టం ఠి సముచిత స్థానంలో నిలిపిన జనం సాహిత్య ప్రక్రియలతో దేవుళ్లను కొలిచిన ఆ నాటి కవులకు జనమే గుళ్లు కట్టి వారిని దేవుళ్లను చేశారు. ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న ఆ కవుల ఆలయాలను ఓసారి ప్రదక్షిణ చేసొద్దాం. ధర్మపురిలో గుండి రాజన్న శాస్త్రి ఆలయం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నరసింహాస్వామి పుణ్య క్షేత్రానికి చెందిన కవి గుండి రాజన్న శాస్త్రి పురాణ ప్రవచనకర్త. ఆయన ప్రవచన సభలకు వేలాదిగా జనం తరలివచ్చేవారు. ఆయన ప్రవచనాలు వినేందుకు మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు సైతం ధర్మపురికి వచ్చినట్లు ప్రతీతి. బ్రహ్మశ్రీ బిరుదాంకితుడైన గుండి రాజన్న భావజాలాన్ని విశ్వనాథ సత్యనారాయణ తన ‘మ్రోయ తుమ్మెద’లో ప్రస్తావించారు. ప్రస్తుతం ధర్మపురి గోదావరి తీరంలోని రామాలయం పక్కన ఆయనకు ఆలయం నిర్మించారు. అందులో ప్రతీ ఏటా గీతా జయంతి రోజున సాహితీవేత్తలను సన్మానించడం ఆనవాయితీ. రాఘవపట్నం రామసింహాకవి ఆలయం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో రామసింహాకవికి ఆలయం కట్టించారు. ఆయన తన పద్య రచనలతో దళితజన భాంధవునిగా కీర్తిగడించారు. ఆయన రాసిన భజన కీర్తనలు, మంగళహారతి కీర్తనలు, విదర్శన రామాయణం, దుష్టప్రపంచ వర్ణన ప్రజలను చైతన్యవంతులను చేశాయి. 1962లో రామసింహాచారి మరణానంతరం ఆయన స్మారకార్థం ప్రజలు గుడి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుతోంది. గుండారెడ్డిపల్లెలో సిద్ధప్ప ఆలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన సిద్ధప్ప గోల్కొండ సంస్థానంలో తొలి ఆస్థాన కవి. సిద్ధప్ప వరకవి జ్ఞానబోధి నాలుగు భాగాలు, శివ, విష్ణు, రామస్తుతి కీర్తనలు రచించారు. నిజాం పాలన కాలంలో కులవివక్షపై ‘ఏ కులంబని నన్ను ఎరుకతోని అడిగేరూ’ రాశారు. ఆధ్యాత్మికంగా చైతన్యపరిచిన ఆయనకు గుండారెడ్డిపల్లెలో 1984లో గుడి నిర్మించారు. ప్రతీ కార్తిక పౌర్ణమి రోజున అనేక ప్రాంతంలోని ఆయన భక్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శేషప్ప కవి విగ్రహా ప్రతిష్ట ధర్మపురి రామాయణంతో పాటు అనేక యక్షగానాలు రచించి, ప్రదర్శించిన కవి ధర్మపురి శేషప్ప. ‘భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహా దురిత దూర’ అంటూ భక్తి భావాన్ని ప్రతి ఎదలో చొప్పించిన కవిపండితుడు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జనాల బాధ్యతలను గుర్తు చేస్తూ అనేక పద్యాలను రచించారు. నరహరి శతకం, నరసింçహ శతకం, నృకేసరి శతకం, కృష్ణశతకం ఆయన రచనలు. ఆయన స్మారకార్థం ధర్మపురికి చెందిన ఆయన శిష్యబృందంలోని 1976 బ్యాచ్ విద్యార్థులు ధర్మపురి నృసింహాస్వామి ఆలయం ముందు విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తున్నారు. -
'ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలి'
► తెలుగు భాష వైతాళికులను మరవకండి ► బే-ఏరియా సభలో యార్లగడ్డ విజ్ఞప్తి శాన్ ఫ్రాన్సిస్కొ: తెలుగు భాష అభ్యున్నతికి బాటలు వేసి, తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేసిన వైతాళికులను మరిచిపోకుండా గుర్తుంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శుక్రవారం బే-ఏరియాలోని రాయల్ ప్యాలెస్ సమావేశ మందిరంలో తానా, బాటా, మన-పాఠశాల సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ మాతృభాషకు సేవ చేసిన వారి గృహాలు, వాడిన వస్తువులను పదిలపరిచి వాటిని ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాయని.. కానీ మనదేశంలో ఇలా జరగకపోవటం దారుణమని యార్లగడ్డ ఆవేదన చెందారు. భాషాభివృద్ధికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో త్యాగధనులను సరైన రీతిలో గౌరవించుకొవడానికి ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 1875 నుండి 2000 కాలం మధ్య తెలుగు భాష ప్రేమికులుగా, వైతాళికులుగా వెలుగొందిన 40మంది తెలుగువారి జాబితాను సభకు విడుదల చేశారు. ప్రతి ప్రవాసుడు తమ జేబులో నుంచి కేవలం 10డాలర్లు విరాళంగా అందిస్తే అటు మహానుభావులకు గౌరవమే కాకుండా భావితరాలకు ఓ అమూల్యమైన బహుమానం అందించిన వారిగా చరిత్రలో మిగిలిపోతామని యార్లగడ్డ తెలిపారు. ఈ విధంగా పర్యాటక ప్రదేశాలుగా మారిన ఆయా గృహాలను సందర్శించే పర్యాటకులతో గ్రామాల అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన వెల్లడించారు. ఈ పిలుపుకు స్పందించిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి.. కృష్ణా జిల్లా బెజవాడలోని "కవిసామ్రాట్" విశ్వనాథ సత్యానరాయణ నివాస గృహ పరిరక్షణకు రూ.10లక్షలు ప్రకటించారు. ఈ సొమ్మును ఖర్చు చేసే బాధ్యతను అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పర్యవేక్షిస్తారని లకిరెడ్డి వెల్లడించారు. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో డాక్టరేట్లు, గ్రాడ్యుయేట్లు అందుకున్న తెలుగువారు ఇక్కడ అమెరికన్ల ఆదరాభిమానాలు చూరగొనటమే గాక భారతదేశంలో కూడా కథానాయకులుగా గౌరవం పొందడం సంతోషించదగ్గ విషయమన్నారు. 10వతరగతి కూడా పూర్తి చేయని సినీహీరోల కోసం కులాలు, ప్రాంతాల పేరిట దెబ్బలాడుకోవడం హాస్యాస్పదంగా ఉందని యార్లగడ్డ తెలిపారు. అనంతరం యార్లగడ్డను నిర్వాహకుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కోమటి జయరాం, వేమూరు సతీష్, తోట రాం, నందిపాటి హేమారావు, ఆసూరి విజయ, కుదరవల్లి యశ్వంత్, కోగంటి వెంకట్, తానా, బాటా, మనపాఠశాల సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
గడినాడు ఉత్సవాలకు ప్రజలు ఆబ్సెంట్
అనంతపురం: ప్రతి ఏటా ఘనంగా జరిగే గడినాడు ఉత్సవాలు ఈ సంవత్సరం బోసిపోయాయి. వివరాలు.. అనంతపురం జిల్లా డి.ఇరేహల్ మండలంలో ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తాయి. అయితే, ఈ ఉత్సవాల్లో కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు కవులకు ఆహ్వానం లేకపోవడం, వచ్చిన వారిని సభావేదికపైకి పిలవకపోవడంతో తెలుగు రాష్ట్రం నుంచి కవులు దూరంగా ఉన్నారు. కాగా, ఈ కార్యక్రమ నిర్వాహణకు అయ్యే ఖర్చును కర్ణాటక ప్రభుత్వం భరించడం కొసమెరుపు. (డి.ఇరేహల్)