సాహిత్యం.. భక్తి తత్వానికి పట్టం ఠి సముచిత స్థానంలో నిలిపిన జనం సాహిత్య ప్రక్రియలతో దేవుళ్లను కొలిచిన ఆ నాటి కవులకు జనమే గుళ్లు కట్టి వారిని దేవుళ్లను చేశారు. ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న ఆ కవుల ఆలయాలను ఓసారి ప్రదక్షిణ చేసొద్దాం.
ధర్మపురిలో గుండి రాజన్న శాస్త్రి ఆలయం
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నరసింహాస్వామి పుణ్య క్షేత్రానికి చెందిన కవి గుండి రాజన్న శాస్త్రి పురాణ ప్రవచనకర్త. ఆయన ప్రవచన సభలకు వేలాదిగా జనం తరలివచ్చేవారు. ఆయన ప్రవచనాలు వినేందుకు మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు సైతం ధర్మపురికి వచ్చినట్లు ప్రతీతి. బ్రహ్మశ్రీ బిరుదాంకితుడైన గుండి రాజన్న భావజాలాన్ని విశ్వనాథ సత్యనారాయణ తన ‘మ్రోయ తుమ్మెద’లో ప్రస్తావించారు. ప్రస్తుతం ధర్మపురి గోదావరి తీరంలోని రామాలయం పక్కన ఆయనకు ఆలయం నిర్మించారు. అందులో ప్రతీ ఏటా గీతా జయంతి రోజున సాహితీవేత్తలను సన్మానించడం ఆనవాయితీ.
రాఘవపట్నం రామసింహాకవి ఆలయం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో రామసింహాకవికి ఆలయం కట్టించారు. ఆయన తన పద్య రచనలతో దళితజన భాంధవునిగా కీర్తిగడించారు. ఆయన రాసిన భజన కీర్తనలు, మంగళహారతి కీర్తనలు, విదర్శన రామాయణం, దుష్టప్రపంచ వర్ణన ప్రజలను చైతన్యవంతులను చేశాయి. 1962లో రామసింహాచారి మరణానంతరం ఆయన స్మారకార్థం ప్రజలు గుడి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుతోంది.
గుండారెడ్డిపల్లెలో సిద్ధప్ప ఆలయం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన సిద్ధప్ప గోల్కొండ సంస్థానంలో తొలి ఆస్థాన కవి. సిద్ధప్ప వరకవి జ్ఞానబోధి నాలుగు భాగాలు, శివ, విష్ణు, రామస్తుతి కీర్తనలు రచించారు. నిజాం పాలన కాలంలో కులవివక్షపై ‘ఏ కులంబని నన్ను ఎరుకతోని అడిగేరూ’ రాశారు. ఆధ్యాత్మికంగా చైతన్యపరిచిన ఆయనకు గుండారెడ్డిపల్లెలో 1984లో గుడి నిర్మించారు. ప్రతీ కార్తిక పౌర్ణమి రోజున అనేక ప్రాంతంలోని ఆయన భక్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
శేషప్ప కవి విగ్రహా ప్రతిష్ట
ధర్మపురి రామాయణంతో పాటు అనేక యక్షగానాలు రచించి, ప్రదర్శించిన కవి ధర్మపురి శేషప్ప. ‘భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహా దురిత దూర’ అంటూ భక్తి భావాన్ని ప్రతి ఎదలో చొప్పించిన కవిపండితుడు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జనాల బాధ్యతలను గుర్తు చేస్తూ అనేక పద్యాలను రచించారు. నరహరి శతకం, నరసింçహ శతకం, నృకేసరి శతకం, కృష్ణశతకం ఆయన రచనలు. ఆయన స్మారకార్థం ధర్మపురికి చెందిన ఆయన శిష్యబృందంలోని 1976 బ్యాచ్ విద్యార్థులు ధర్మపురి నృసింహాస్వామి ఆలయం ముందు విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment